ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందని వ్యాఖ్య వినిపించింది. మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, వివిధ హోదాలలో చిరకాలం పనిచేసిన వ్యక్తి ప్రణబ్. అయినా, ఆ వ్యాఖ్య లాంఛనంగా వినిపించిందని అనుకోనక్కరలేదు. కాంగ్రెస్‌లో ఆ తరహా నాయకుల తరం సమాప్తమైపోయిన మాట మాత్రం నిజం. పదవే ధ్యేయంగా రాజకీయాలు నడపడం, అధిష్టానం మెప్పు కోసం విపక్షాల మీద విచక్షణా రహితంగా విరుచుకుపడడం వంటి సాదా సీదా కాంగ్రెస్ నాయకుల లక్షణాలు ప్రణబ్‌లో ఏనాడూ కనిపించలేదు. ఇతర ఆరోపణలు కూడా దాదాపు లేవు. బెంగాల్‌లో మరుగున పడిన జాతీయతా భావాలకు ఆయన ప్రతినిధిగా కనిపిస్తారు. వివేకానంద, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, చిత్తరంజన్‌దాస్, సుభాష్ చంద్రబోస్ వంటి వారి ఆశయాలను గౌరవించిన బెంగాలీ నేతగా, ఆచరించిన వ్యక్తిగా, భారతమాత పుత్రునిగా ఆయన కనిపించారు. వందేమాతరం, జనగణమన వంటి జాతీయగీతాలు జనించిన నేలలో పుట్టిన సంగతి ఆయన స్పృహలో మిగిలి ఉంది. అందుకే ఆయన మరణం భారతీయలందరినీ బాధించింది. అధ్యాపకునిగా, పత్రికా రచయితగా, రాజకీయవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి.
ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనది. 1969లో రాజ్యసభ సభ్యునిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం, 2012లో 13వ రాష్ట్రపతి పదవి వరకు సాగింది. ఆయన ఎప్పుడూ ‘పీఎం ఇన్ వెయిటింగ్’ (ప్రధాని పదవికి వేచి ఉన్న వ్యక్తి) అన్న మాటకే పరిమితమయ్యారని అంటూ ఉంటారు. ముగ్గురు ప్రధానుల వద్ద కీలక వ్యక్తి అనే హోదా వద్దనే ఆయన ఆగిపోయారన్నది కూడా ఉంది. ప్రధాని కావచ్చు, కాకపోవచ్చు. ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావచ్చు. అది ప్రధాని పదవంతటి ప్రాముఖ్యం ఉన్న పదవి కాకపోవచ్చు. కానీ రాజకీయాలలో వ్యక్తిత్వం నిలుపుకోవడమే ఒక రాజకీయవేత్తకు జీవిత పర్యంతం ఎదురయ్యే సమస్య. వ్యక్తి పూజకు, వెన్నుముక లేని తనానికి, కుటుంబ విధేయతకు అగ్రతాంబూలం ఇచ్చే కాంగ్రెస్ పార్టీలో అయితే వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ రాజకీయాలలో నిలబడం, ఉన్నత పదవులకు వెళ్లగలగడం అసిధారావ్రతమే. కత్తి వాదర మీద నడుస్తూనే, అస్తిత్వాన్ని కూడా నిలబెట్టుకున్నవారు కాంగ్రెస్‌లో వేళ్ల మీద కనిపిస్తారు. ఇందిర హయాంలో కూడా ఆమె కరుణకు నోచుకుంటూనే, నిలబడ గలిగిన వారు ఇంకా తక్కువ. అలాంటివారిలో ప్రణబ్ కుమార్ ముఖర్జీ (డిసెంబర్ 11, 1935 – ఆగస్టు 31, 2020) ఒకరు. కాంగ్రెస్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయినా జ్ఞానం, రాజకీయ పరిణతి, దూరదృష్టి, రాజనీతిజ్ఞత పట్ల విశ్వాసం వదలుకోని నాయకులు పీవీ, ప్రణబ్ వంటి కొందరే కనిపిస్తారు.
ప్రణబ్ వ్యక్తిత్వం, నేపథ్యం, ఆయన స్వరాష్ట్రం వంటి నేపథ్యాలతో ప్రధాని అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యం కాదు. కానీ రాష్ట్రపతి పీఠం కూడా ప్రణబ్ దాకు అంత సులభంగా ఏమీ దక్కలేదు. ఆయన 13వ రాష్ట్రపతి. నిజానికి నాడు అధికారంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ దృష్టిలో ఆ పదవికి ఉన్నవారిలో ప్రణబ్‌కు అగ్ర తాంబూలం మాత్రం లేదని చెబుతారు. నాటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఆ పదవిలో ప్రతిష్టించాలని ఆమె భావించారన్నది ఢిల్లీలో అందరికీ తెలిసిన విషయం. కానీ యూపీఏ భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఆ ప్రయత్నానికి విముఖత వ్యక్తం చేశాయన్నదీ నిజం. ఇక్కడ సోనియా అపజయం కన్నా, దేశంలోని రాజకీయ పార్టీలలో ప్రణబ్‌దాకు ఉన్న గౌరవ ప్రతిష్టలను పరిగణనలోనికి తీసుకోవాలి.
ప్రధాని పదవి కోసం ప్రణబ్ ఆశించారా? ఇందులో దాపరికం లేదు. ఆ పదవిని ఆశించినట్టు తన జ్ఞాపకాలు ‘ది కొయిలిషన్ ఇయర్స్- 1996-2012’లో ఆయన పేర్కొన్నారు. 2004లో యూపీఏ-1 సమయంలో మొదట సోనియా గాంధీ ప్రధాని అవుతారని అంతా భావించారు. కానీ అధి సాధ్యపడలేదు. అప్పుడు కూడా ప్రణబ్ పేరు వినిపించింది. కానీ మన్మోహన్ సింగ్‌ను సోనియా ఎంపిక చేశారు. ఈ అంశం మీద ప్రణబ్ ఆ పుస్తకంలో ఉదహరించారు. ‘ఆ పదవికి నా పేరు వస్తుందని ఎందుకనుకున్నానంటే, ఉన్నతాధికారిగా, ఆర్థికమంత్రిగా, ఆర్థిక సంస్కర్తగా మన్మోహన్ సింగ్ తెలుసు. ఇక నాకు ఉన్న అపార అనుభవాన్ని బట్టి భావించాను.’ అని రాశారు. నిజానికి రాజకీయాలలో తనకంటే తక్కువ అనుభవం ఉన్న సింగ్ వద్ద పనిచేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదట. ఇందులోనే మరొక ఉదాహరణ కూడా ఉంది. ‘2 జూన్ 2012 సాయంత్రం నేను సోనియా గాంధీని కలుసుకున్నాను. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్టీ పరిస్థితి గురించి మేం సమీక్షించాం. అర్హులైన అభ్యర్థుల గురించి చర్చించాం. ఎంపిక చేసిన అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ చర్చ సమయంలోనే ఆమె చాలా నిక్కచ్చిగా, ప్రణబ్ జీ! ఆ పదవికి మీరు ఎంతో తగినవారే. కానీ ప్రభుత్వ నిర్వహణలో మీరు పోషిస్తున్న కీలక పాత్రను మీరు మరచిపోకూడదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా మరొక పేరు చెబుతారా? అన్నారామె. అందుకు సమాధానంగా, మేడమ్! నేను పార్టీ విధేయుడని. నా జీవితమంతా అధినాయకత్వం చెప్పినట్టే నడుచుకున్నాను. అంచేత ఎలాంటి బాధ్యత అప్పిగించినా నేను నిర్వరిస్తాను అన్నాను. ఈ మాటకు ఆమె నన్ను అభినందించారు. మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా నిలిపే ఆలోచన ఆమెకు ఉండవచ్చునన్న ఒక అస్పష్ట ఊహతో నేను వెళ్లిపోయాను. అలాగే సోనియా కనుక సింగ్‌ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే ప్రధాని పదవికి నన్ను ఎంపిక చేయవచ్చునని కూడా నేను ఆలోచించాను’ అని రాసుకున్నారు. అర్హత, అనుభవం కలిగిన వారు పదవిని ఆశించడం అత్యాశకాబోదు. మొరార్జీదేశాయ్ నెహ్రూ, లాల్ బహదూర్, ఇందిర హయాంలలో ప్రధాని పదవిని ఆశించారు. ఆయనకు అనుభవం ఉంది. పరిణతి ఉంది. పాలనా దక్షుడు. అయినా ఆయనను కామరాజ్ నాడార్, నిజలింగప్ప వంటివారు వెనక్కి లాగారు. దేశాయ్ వారి మీద పోటీ చేసి గెలవడం సాధ్యపడేది కాకపోవచ్చు. అయినా ఒక ప్రజాస్వామిక దేశంలో ఆ పదవికి పోటీ పడే హక్కు అందరిదీ అని భావించాలి. ప్రణబ్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త కూడా సోనియా అంతరంగాన్ని సరిగా అంచనా వేయలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మార్కు రాజకీయవేత్త కాదు. 2009లోనే మన్మోహన్ గుండె శస్త్రచికిత్స కోసం వెళ్లినప్పుడు, ఆ స్థానంలో ప్రణబ్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారని అధికారికంగా ప్రకటించలేదు. సింగ్ నిర్వహిస్తున్న ఆర్థిక వ్యవహారాల శాఖను చూస్తారనే ప్రకటించారు.
1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ప్రణబ్‌కు తాత్కాలిక ప్రధాని అవకాశం వస్తుందని ఒక మాట బయటకు వచ్చింది. ఈ అంశం మీద రాజీవ్‌గాంధీ ప్రణబ్‌ను సలహా అడిగితే, మంత్రిమండలిలో అనుభవజ్ఞులకు ఆ స్థానం దక్కుతుందని చెప్పారని, అందుకు రాజీవ్ ఆగ్రహం తెచ్చుకున్నారని కూడా చెబుతారు. ఎందుకంటే రాజీవ్ అప్పటికి మంత్రి కాదు. మంత్రిమండలిలో సీనియర్ ప్రణబ్ ముఖర్జీ. ఈ మాట నచ్చకే, రాజీవ్‌గాంధీ తన మంత్రిమండలిలో ప్రణబ్‌కు స్థానం ఇవ్వలేదని చెబుతారు. మళ్లీ పీవీ నరసింహారావు ప్రధాని అయిన తరువాత ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. మొదట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా, తరువాత విదేశ వ్యవహారాల మంత్రిగా ప్రణబ్ సేవలను పీవీ తీసుకున్నారు. 23 ఏళ్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఉన్నప్పటికీ, 1982లోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుటికీ రాజీవ్ ఇచ్చిన గౌరవం అలాంటిది. అక్టోబర్, 2008లో అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందం తన రాజకీయ జీవితంలో ఎంతో సంతృప్తిని ఇచ్చిన ఘట్టమని ఆయన నిర్మొహ మాటంగా చెప్పారు. యూపీఏ హయాంలో (2004-2012) ఆయన 90 మంత్రివర్గ సంఘాలకు నాయకత్వం వహించారు. ఆయన రాష్ట్రపతిగా ఉండగానే సాధారణ ప్రజలు కూడా రాష్ట్రపతి భవన్‌ను సందర్శించే అవకాశం కల్పించారు. అజ్మల్ కసబ్, అఫ్టల్‌గురు, యాకూబ్ మెమన్ క్షమాభిక్షలను తిరస్కరించినది కూడా ప్రణబ్ ముఖర్జీయే. తను రాజకీయంగా ఎంత ఎదిగినా తన పూర్వీకుల స్వగ్రామం బీర్మూమ్ వెళ్లి నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసే సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత ఆయన పూర్తిగా పుస్తక పఠనానికే పరిమితమయ్యారు.
ప్రణబ్ కుమార్తె షర్మిష్ట కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్ వెళ్లాలన్న నిర్ణయం గురించి పునరాలోచించ వలసిందిగా ఆమె తండ్రిని కోరారని చెబుతారు. అందుకు ఆయన నిరాకరించారని వేరే చెప్పక్కర లేదు. ఆయన (జూన్ 8, 2018) నాగ్‌పూర్ వెళ్లారు. తృతీయ వర్ష శిక్షా వర్గ స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే భారతరత్న పదవి విషయంలో మరొక సంగతి ప్రస్తావించుకోవచ్చు. ఆ అత్యున్నత పౌర పుసస్కారం గురించి ప్రధాని నరేంద్రమోదీ ప్రణబ్‌ను అడిగారు. తరువాత మీ అనుమతి కోసం రాష్ట్రపతి ఎదురు చూస్తున్నారని 2019 జనవరి 25న మోదీ ఫోన్‌లో చెప్పారు. ప్రణబ్ సమ్మతించారు. అయినా ఎవరికీ చెప్పలేదు. నాక్కూడా చెప్పరా మీరు అంటూ షర్మిష్ట ముద్దుగా కోపగించారు. రాష్ట్రపతి ప్రకటన రావాలి కదా అన్నారట ప్రణబ్. సాక్షాత్తు ప్రధాని ఫోన్ చేసి చెప్పిన తరువాత ఇలాంటి ఆలోచనేమిటి మీకు అని నవ్వారట షర్మిష్ట. భారతరత్నతో పాటు ఏ నిర్ణయమైనా ప్రధాని సలహాను రాష్ట్రపతి పాటించడం ఆనవాయితీ. 2015లో నరేంద్ర మోదీ భారతరత్న గురించి ప్రణబ్ దగ్గర ప్రస్తావించారు. మాజీ ప్రధాని, బీజేపీ రాజకీయ దిగ్గజం, కవి అటల్ బిహారీ వాజపేయి పేరును మోదీ రాష్ట్రపతి ఎదుట ఉంచారు. ఆయన వెంటనే అంగీకరించినా, మరొకరికి కూడా ఇవ్వండని సలహా ఇచ్చారు. దానితో మదన్‌మోహన్ మాలవీయకు (మరణానంతర పురస్కారం) కూడా ప్రకటించారు.
ఆర్థికాంశాలలో సీడీ దేశ్‌ముఖ్‌ను ప్రణబ్ ఆదర్శంగా భావించేవారు. రోజుకు 16 గంటలు పనిచేసే అలవాటు ఉన్న వారాయన. ఇందిర హయాంలో ఒకసారి బాబూ జగ్జీవన్‌రామ్‌ను ఎవరో అడిగారట. మీ మంత్రిమండలిలో ఎవరు ఉత్తమ మంత్రి అని. అందుకు జగ్జీవన్ ప్రణబ్ పేరు చెప్పారట. ఎందుకు అని మళ్లీ అడిగితే, ఆయన ఫైళ్లు చదువుతారు అని సమాధానమిచ్చారట. ప్రణబ్‌కు అన్ని పార్టీలలోను అభిమానులు ఉండేవారు. బీజేపీలో చాలామందితో పాటు అరుణ్ జైట్లీ అన్నా ఆయనకు ఎంతో అభిమానమట. ఆయన కూడా ఆర్థికశాఖ నిర్వహించారు. ఏ మంత్రి ఫైళ్లన్నీ చదువుతాడో అతడికే శాఖ మీద పట్టు ఉంటుంది. గౌరవం ఉంటుంది అని సలహా ఇచ్చారట.
– జాగృతి డెస్క్