సెప్టెంబర్ 17, 1948. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు. ఈ విలీనం అంత సులభంగా జరగలేదని మనకు చరిత్ర చెబుతుంది. చివరి వరకూ విలీనం చేయకుండా మొండికేశాడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. చివరకు నలువైపులా చుట్టుముట్టిన భారత సైన్యం కేవలం ఐదు రోజులు, 108 గంటల్లోనే పని పూర్తి చేసింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలించింది. అయితే ఈ తతంగం వెనుక ఓ చదరంగ క్రీడ నడిచింది. ఆ క్రీడలో మూడు పావులు.. హైదరాబాద్, కశ్మీర్, జునాగఢ్ సంస్థానాలు.. చదరంగ సమరాంగాలు భారత్, పాకిస్తాన్.. ఆడినవారు సర్ధార్ వల్లభాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా.. చివరకు జన్నాను పటేల్ చిత్తు చేసి సంస్థానాలు భారత్‌కే దక్కేలా చేశారు.
భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వచ్చింది. దీంతో పాటు దేశ విభజన కూడా జరిగిపోయింది. మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడింది. బ్రిటిష్ వారు దేశాన్ని విడిచిపోతూ 565 స్వదేశీ సంస్థానాల చిక్కుముడి పెట్టారు. ఇండియన్ ఇండిపెండెన్స్-1947తో పాటు ‘లాప్స్ ఆఫ్ పారామౌంట్’ అనే ప్రత్యామ్నాయం కూడా ఇచ్చారు. దీని ప్రకారం దేశంలో అప్పటి వరకూ ఉన్న సంస్థానాలు భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం అయ్యేందుకు నిర్ణయం తీసుకోవచ్చు. లేదా స్వతంత్రంగా కొనసాగవచ్చు. సువిశాల భారత దేశం నడిబొడ్డున ఉన్న ఈ సంస్థానాలన్నీ అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంత రాజ్యాలుగా పరిమితి అధికారాలతో కొనసాగాయి. ఈ వెసులుబాటుతో సైన్యం, రైల్వేలు, విమానయానం, కరెన్సీ, విదేశీ సంబంధాలు ఏవైనా సొంతంగా నిర్వహించుకోలేవు. అంతేకాకుండా ప్రతి సంస్థానంతో ప్రత్యేకంగా సంబంధాలు కొనసాగించడం కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వానికి కూడా చాలా కష్టమైన పనే.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మొదటి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. సంస్థానాధీశులందరితో చర్చించి భారతదేశంలో విలీనం చేసేలా ఒప్పించారు. దీనికి సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగించారు పటేల్. ఈ సందర్భంగా జర్మనీ ఏకీకరణ కోసం కృషి చేసిన ఒట్టోవాన్ బిస్మార్క్‌ను గుర్తు చేసుకోవాలి. బిస్మార్క్ ఇందుకోసం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కానీ సర్ధార్ పటేల్ మాత్రం ఎలాంటి యుద్ధాలు చేయకుండా, రాజులను ఓడించకుండా రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 565 సంస్థానాల్లో 562 విలీనం అయ్యాయి. మిగిలినవి.. హైదరాబాద్, జమ్ముకశ్మీర్, జునాగఢ్.
మూడు రాజ్యాలపై కన్నేసిన పాకిస్తాన్
భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తే ముస్లింలకు ప్రత్యేక దేశం ఇవ్వాలంటూ ద్విజాతి సిద్ధాంతం, ప్రత్యక్ష చర్య అనే హింసాత్మక మార్గాలను ఉపయోగించి పాకిస్తాన్ సాధించారు మహమ్మద్ అలీ జిన్నా. కానీ అంతటితో ఆయన దాహం తీరలేదు. స్వదేశీ సంస్థానాలు దాదాపుగా అన్నీ భారత్‌లో విలీనం అయ్యాయి. మిగతా మూడు సంస్థానాలపై జిన్నా కన్నేశాడు. ఇందులో హైదరాబాద్‌కు చాలా ప్రత్యేకత ఉంది. భారత్ నడి బొడ్డున 215 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న సంస్థానం ఇది. 1.60 కోట్ల జనాభా. అందులో 85 శాతం హిందువులే ఉన్నారు. బ్రిటిష్ పాలనలో సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత రైల్వేలతో దాదాపు స్వతంత్ర దేశ హోదాను అనుభవించింది. బ్రిటిష్ పాలన అంతం అయిన తర్వాత ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. సంస్థానం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను స్వతంత్రంగా ఉంటానని మొదట ప్రకటన చేయగా సర్ధార్ పటేల్ అంగీకరించలేదు. దీంతో కొంత సమయం కావాలని అడిగాడు. ఈలోపు పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించాడు.
జమ్ముకశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ తన సంస్థాన విలీనం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి చాలా ఒత్తిడి ఉంది. రాజ్య సంక్షేమం కోసం పాక్‌లో చేరడం మహారాజాకు ఇష్టంలేదు. కాగా జునాగఢ్ సంస్థానాధీషుడు నవాబ్ మహాబత్‌ఖాన్-3 ముందుగానే పాకిస్తాన్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ సందేశాన్ని ఆగస్టు 15, 1947 నాడే పాక్ పాలకులకు అందించాడు. ఈ విషయం తెలిసి అక్కడి ప్రజలు నవాబు మీద ఆగ్రహంతో ఊగిపోయారు. జునాగఢ్ ఎలాగైనా తమకు దక్కుతుందని అంచనాకు వచ్చిన మహమ్మద్ అలీ జిన్నా హైదరాబాద్, జమ్ముకశ్మీర్‌లపై ఎక్కువగా దృష్టిపెట్టారు.
హైదరాబాద్, జమ్ముకశ్మీర్, జునాగఢ్ సంస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు దక్కనీయకూడదని సర్ధార్ పటేల్ మొదటి నుంచి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందుకు తగ్గట్లే తన వ్మూహాలకు పదను పెట్టారు. జునాగఢ్ తన సొంత ప్రాంతం గుజరాత్ (బాంబే స్టేట్)లో ఉన్నప్పటికీ పటేల్ హైదరాబాద్ విషయంలోనే ఎక్కువగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ కోసం పాకిస్తాన్ గట్టిగా పట్టుపట్టకపోతే సర్ధార్ పటేల్ జమ్ముకశ్మీర్‌ను వదలుకునే వారని సైఫుద్దీన్ సోజ్, హయత్ ఖాన్, ఏ.జీ. నూరానీ తాము రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ‘కేవలం బండరాళ్లు ఉన్న కశ్మీర్ కోసం పంజాబ్ కన్నా సువిశాలమైన హైదరాబాద్‌ను వదులుకోవడానికి నేను పిచ్చివాన్ని కాదు.’ అన్నారు. పాకిస్తాన్ నుంచి కనీసం రోడ్డు, రైలు, నౌకా మార్గాలు లేకున్నా హైదరాబాద్ విషయంలో అక్కడి పాలకుల ప్రత్యేక ఆసక్తులను అర్థం చేసుకోవచ్చు. అయితే నిజంగా పటేల్ కశ్మీర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అది వ్యూహాత్మక నిర్ణయం అని తర్వాత జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
జమ్ముకశ్మీర్ విలీనం విషయంలో ఎటూ తేల్చకపోవడంతో విసిగిపోయిన పాకిస్తాన్, ఆ సంస్థానం మీదకు కిరాయి సైన్యాన్ని పంపింది. అప్పుడు భారత సైన్యం సాయం కోసం తమ ప్రధానమంత్రి మెహర్‌చంద్ మహాజన్ (తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు)ను దూతగా ఢిల్లీకి పంపారు మహారాజా హరిసింగ్. మహారాజా వెంటనే అధికారాన్ని తన స్నేహితుడు షేక్ అబ్ధుల్లాకు అప్పగించాలని నెహ్రూ కోరిక. అందుకే జమ్ముకశ్మీర్ అంశాన్ని ఎటూ తేల్చకుండా నానుస్తూ వచ్చారు. మెహర్‌చంద్ భారత ప్రధాని నెహ్రూను కలుసుకోవడానికి వచ్చినప్పుడు పటేల్ అక్కడే ఉన్నారు. తమ డిమాండ్‌కు భారత్ స్పందించకుంటే తాను ఢిల్లీ నుంచి నేరుగా కరాచీ వెళ్లి పాకిస్తాన్ సాయం కోరుతామని మహాజన్ అన్నారు. దీంతో అగ్రహించిన నెహ్రూ తక్షణం వెళ్లిపో అంటూ ఆదేశించారు. అంతలో పటేల్ జోక్యం చేసుకొని ‘మీరు పాకిస్తాన్‌తో కలవడంలేదు’అని మహాజన్‌కు హామీ ఇచ్చారు. అప్పుడు నెహ్రూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోక తప్పలేదు. జమ్ముకశ్మీర్ విషయంలో పటేల్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
తిరగబడిన జునాగఢ్ ప్రజలు
దేశ ప్రజలంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుంటే జునాగఢ్ ప్రజలు చాలా దుఃఖంతో ఉన్నారు. ఇందుకు కారణం సరిగ్గా ఆగస్టు 15, 1947 నాడే తన సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసేందుకు సంసిద్ధత ప్రకటిస్తూ జునాగఢ్ నవాబు మహాబత్‌ఖాన్-3 కరాచీకి వర్తమానం పంపారు. కానీ పాకిస్తాన్ చాలా రోజుల పాటు స్పందించలేదు. చివరకు సెప్టెంబర్ 13న ఒక టెలిగ్రాం ద్వారా జునాగఢ్‌ను విలీనం చేసుకునేందుకు అంగీకరించింది. నవాబు తీసుకున్న నిర్ణయంలో జునాగఢ్ దీవాన్ షానవాజ్ భుట్టో కీలక పాత్ర పోషించారు. ఆయన సింధ్ ప్రాంతానికి చెందిన ముస్లింలీగ్ నాయకుడు.
జునాగఢ్ ప్రజలు పాకిస్తాన్‌లో చేరేందుకు ఇష్టంగా లేరు. కాఠియావాడ్ రాజకీయ పరిషత్ నాయకుడు ఉచ్ఛరంగరాయ్ దేబర్, వ్యాపారవేత్తల ప్రతినిధి శంకర్ దవే సంస్థాన ప్రజలందరి తరఫునన నవాబు దగ్గకు వెళ్లారు. సంస్థానాన్ని భారత్‌లో కలపాలని వీరంతా కోరారు. కానీ నవాబు వీరి వినతిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత నవాబుతో మూడు సార్లు సమావేశం జరిగినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. నవాబు మాటలతో విసిగిపోయిన జునాగఢ్ ప్రజా ప్రతినిధులంతా ‘ఆర్జీ హుకుమత్’పేరుతో పోటీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా ప్రజాసైన్యం. జునాగఢ్ విషయంలో మహాత్మాగాంధీ, సర్ధార్ పటేల్ నేరుగా జోక్యం చేసుకోలేదు. కానీ అక్కడి ప్రజలే నిర్ణయం తీసుకోవాలంటూ పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఇందుకు కారణంగా హైదరాబాద్, జమ్ముకశ్మీర్ విషయంలో ఏర్పడ్డ సంక్షిష్ట పరిస్థితులే. ‘జనాభాలో హిందువులే ఎక్కువగా ఉన్న జునాగఢ్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలి’ అని ఒక ప్రార్ధనా సందేశంలో గాంధీ అన్నారు. ఆర్జీ హుకుమత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా జునాగఢ్‌లో ప్రవేశించే సరికి పరిస్థితి అర్థమైన నవాబు మహాబత్ ఖాన్ పాకిస్తాన్‌కు పారిపోయాడు. దీంతో దిక్కుతోచని సంస్థాన దివాను షానవాజ్ భుట్టో భారత ప్రభుత్వం జునాగఢ్‌ను స్వాధీనపరచుకోవాలని కోరాడు.
మూడు పావుల చదరంగం
జునాగఢ్‌లో 80 శాతం ప్రజలు హిందువులే ఉన్నారు. అక్కడి ముస్లింలకు కూడా పాకిస్తాన్‌లో చేరడం ఇష్టం లేదు. కానీ నవాబు మహాబత్ అప్పటికే పాకిస్తాన్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం, అందుకు పాకిస్తాన్ అంగీకరించడం జరిగిపోయింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజల అభిప్రా యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మౌంట్‌బాటన్ సూచించడంతో ఇరు దేశాలు అంగీక రించాయి. వాస్తవానికి ప్లెబిసట్ నిర్వహించడం సర్ధార్ పటేల్‌కు ఇష్టం లేదు. కానీ పాకిస్తాన్ ఎత్తుగడ అర్థం చేసుకొని వారి వ్యూహంతోనే చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఫిబ్రవరి 20, 1948 నాడు ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. జునాగఢ్‌లోని 2,01,457 మంది రిజిస్టర్డ్ ఓటర్లలో 1,90,870 మంది ఓటు వేశారు. ఇందులో కేవలం 91 ఓట్లు మాత్రమే పాకిస్తాన్‌కు పడ్డాయి. ఇలా జరుగుతుందని మహమ్మద్ అలీ జిన్నా ముందే ఊహించాడు. అయినా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరడం వెనుక ఓ వ్యూహం ఉంది. ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణే జమ్ము కశ్మీర్‌లో జరపాలని జిన్నా డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున వారు పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతారని జిన్నా ఎత్తుగడ. అప్పుడు పటేల్ తన పాచిక ఉపయోగించారు. జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే హైదరాబాద్‌లో కూడా అది తప్పదని తేల్చి చెప్పారు. తన వ్యూహం బెడిసి కొట్టడం జిన్నాకు మింగుడు పడలేదు.
హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాల్లో మెజారిటీ ప్రజలు హిందువులే అయినా పాలకులు ముస్లింలు. ఈ కారణంగా చాలా సులభంగా వారిని కలుపుకో వచ్చని జిన్నా భావించారు. జమ్ముకశ్మీర్ పాలకుడు హిందువు అయినా ముస్లిం ప్రజల ఆధిక్యం, పాక్ సరిహద్దును ఆనుకొని ఉందనే కారణం చూపి విలీనం చేసుకోవడం సులభం అనుకున్నారు. కానీ అనుకున్నది ఒక్కటి, జరిగింది మరొకటి.
ఈ రాజకీయ చదరంగ క్రీడలో హైదరాబాద్, జమ్ముకశ్మీర్, జునాగఢ్ పావులు.. జునాగఢ్‌ను బంటుగా ఉపయోగించి రాజులాంటి హైదరా బాద్‌ను, మంత్రిలాంటి కశ్మీర్‌లను ఆక్రమించాలని జిన్నా భావించారు. కానీ పటేల్ వ్యూహం ముందు జిన్నా ఎత్తుగడలన్నీ చిత్తయిపోయాయి. జునాగఢ్ కన్నా ముందుగానే అక్టోబర్ 26, 1947న జమ్ముకశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనమైపోయింది. జునాగఢ్ నవంబర్ 9, 1947న భారత్ స్వాధీనమై పోయింది. చివరకు సెప్టెంబర్ 17, 1948న హైదరా బాద్ కూడా భారత్‌లో సంపూర్ణ భాగమైపోయింది. జునాగఢ్ భారత్‌లో విలీనం తర్వాత నాలుగు రోజులకు అక్కడి బహిరంగ సభలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రసంగాన్ని గమనించాలి..
‘కశ్మీర్ ముందు జునాగఢ్‌ను నిలబెట్టింది పాకిస్తాన్… మేం ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యను పరిష్కరించాలనుకుంటే, కశ్మీర్ విషయలోనూ ఇదే పద్దతిని అనుసరించాలని వారు (పాక్) అంటున్నారు.. దీనికి మా సమాధానం ఒక్కటే.. మీరు హైదరాబాద్ విషయంలో కూడా ఇదే నిర్ణయానికి అంగీకరిస్తే, మేము కశ్మీర్ విషయంలో అంగీకరిస్తాం.. వాస్తవాలు అంగీకరించకపోతే హైదరాబాద్ పరిస్థితి కూడా జునాగఢ్ లాగే మారుతుంది..’ అన్నారు. చివరకు పటేల్ చెప్పినట్లే జరిగింది.
108 గంటల్లో హైదరాబాద్ విమోచనం
బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందినా దేశం నడిబొడ్డున హైదరాబాద్ ఒక క్యాన్సర్ కణితిలా మిగిలిపోయింది. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత తన సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. తాను స్వతంత్రంగా ఉండేందుకు సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత రైల్వేను ఒక సాకుగా చూపాడు. హైదరాబాద్ జనాభాలో 85 శాతం హిందువులే అయినా పాలకులు ముస్లింలు. మెజారిటీ ప్రజల భాషా సంస్కృతిని అణచి వేయడంతో పాటు పెద్ద ఎత్తున మత మార్పిడులు సాగాయి. నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లు చెలరేగిపోయారు. గ్రామాల మీద పడి ప్రజల మాన ప్రాణాలను దోచుకోవడం మొదలు పెట్టారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విడిపించేందుకు స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం, కమ్యూనిస్టు పార్టీలు తమదైన మార్గాల్లో పోరాటం సాగించాయి. సత్యాగ్రహాలు, సాయుధ పోరాటాలు, మతమార్పిడులకు వ్యతిరేకంగా శుద్ధి ఉద్యమాలు సాగాయి. నిజాం ప్రభుత్వం వేలాది మంది పోరాట యోధుల్ని జైళ్లలో పెట్టి చిత్ర హింసలు పెట్టింది.
ఢిల్లీ ఎర్రకోట మీద అసఫ్ జాహీ పతాకం (నిజాం జెండా) ఎగరేస్తామని రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ విర్రవీగాడు. ఈలోపు హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో కలిపేందుకు నిజాం ప్రయత్నాలు ప్రారంభించాడు. కరాచీలో హైదరాబాద్ ప్రతినిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ రూ.20 కోట్లు ఇచ్చాడు. విదేశాల నుంచి స్మగ్లర్ సిడ్నీ కాటన్ ద్వార పెద్దఎత్తున ఆయుధాలు సేకరించడం మొదటు పెట్టాడు. ఇవన్నీ సర్ధార్ పటేల్ దృష్టికి వెళ్లాయి. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టారు. సెప్టెంబర్ 13, 1948న హైదరాబాద్ మీద పోలీసు చర్య మొదలైంది. దీన్నే ఆపరేషన్ పోలో అంటారు. మేజర్ జనరల్ జేఎన్ చౌధురి ఆధ్వర్యంలో షోలాపూర్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ మార్గాలతో పాటు మరో రెండు మార్గాల్లో భారత సైన్యం సంస్థానంలోకి ప్రవేశించించింది. కానీ విచిత్రంగా హైదరాబాద్ సైన్యం నుంచి భారీ స్థాయి ప్రతిఘటన ఏదీ ఎదురుకాలేదు. యుద్ధం కొన్ని వారాల పాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించినా, ఆశ్చర్యంగా 5 రోజుల్లో ముగిసింది. ఇంకా చెప్పాలి అంటే 108 గంటల్లోనే అంతా అయిపోయింది. సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం సైన్యాధిపతి జనరల్ ఎల్. ఎడ్రూస్ లొంగుబాటు ప్రకటించారు. హైదరాబాద్ సంస్థానాన్ని 224 ఏళ్లపాటు పాలించిన అసఫ్ జాహీ వంశ పాలన సెప్టెంబర్ 17, 1948 నాడు ముగిసింది. హైదరాబాద్ ప్రధానమంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్లు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియోలో ప్రకటించారు. వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైన్యానికి అపూర్వ స్వాగతం లభించింది.
– క్రాంతిదేవ్ మిత్ర : సీనియర్ జర్నలిస్ట్