ఆయన పదవీవిరమణ చేసిన నౌకాదళ అధికారి.. తన నివాసం నుంచి బయటకు రాగానే కొందరు గూండాలు ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఇంతకీ దాడికి గురైన మదన్‌శర్మ చేసిన నేరం ఏమిటి? ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేపై వేసిన ఓ వ్యంగ్యచిత్రాన్ని సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేయడం. దాడి చేసిన గూండాలకు శివసైనికులు అనే ముద్దు పేరు. దేశ ఆర్థిక రాజధానిలో కొనసాగుతున్న అరాచక పరిస్థితికి ఈ ఘటన ఒక మచ్చుతునక మాత్రమే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ ‌నటి కంగనా రనౌత్‌ ‌ముంబై గురించి చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేసే బదులు అక్కడి పరిస్థితులను కూడా గమనించాలి. ముంబై డ్రగ్‌ ‌మాఫియా, పోలీసులపై కంగనా చేసిన వ్యాఖ్యాలపై కన్నెర్రచేసిన ఉద్ధవ్‌ఠాక్రే సర్కారు తప్పు మీద తప్పు చేస్తూ విమర్శల పాలవుతోంది.

బాలీవుడ్‌ ‌యువ నటుడు సుశాంత్‌సింగ్‌ ‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. దీని వెనుక గల కారణాలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు విషయంలో ముంబై పోలీసుల తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పైకి సుశాంత్‌ ‌ప్రియురాలు రియా చక్రవర్తి కనిపిస్తున్నా తెరవెనుక ఇంకా ఎంతోమంది ఉన్నారని చెబుతున్నారు. ఒక దశలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే తనయుడు ఆదిత్యఠాక్రే పేరు కూడా వినిపించింది. బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపోటిజం), డ్రగ్స్ ‌మాఫియా లింకులు కూడా తెర మీదకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనుమానంతో సుశాంత్‌ ‌కుటుంబ సభ్యులు తమ స్వస్థలం పట్నాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముంబై వచ్చిన బిహార్‌ ‌పోలీసులకు సహకరించకపోగా, వచ్చిన అధికారులను కరోనా పేరుతో క్వారంటైన్‌ ‌చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ దశలో బిహార్‌ ‌ప్రభుత్వం వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం సుశాంత్‌ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. చివరకు సుప్రీంకోర్టు కూడా సీబీఐ దర్యాప్తు కోసం ఆమోదముద్ర వేయడంతో పాటు కేసు దర్యాప్తులో సహకరించాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కంగనా కార్యాలయాన్ని కూల్చివేస్తున్న బృహన్‌ ‌ముంబై మున్సిపల్‌ అధికారులు

వాస్తవానికి సుశాంత్‌ ఆత్మహత్య కేసును మొదటి నుంచి సంక్లిష్టంగా మార్చి అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వమే. సుశాంత్‌ ‌తల్లిదండ్రుల ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దీన్ని మహారాష్ట్ర ఆత్మగౌరవ విషయంగా చిత్రీకరించింది. బిహారీలపై విద్వేషాన్ని రగిలించే ప్రయత్నం చేసింది. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఉద్ధవ్‌ ‌ప్రభుత్వం ఇదంతా కేంద్రం, బీజేపీల కుట్ర అంటూ విమర్శలకు దిగింది. ఈ విషయంలో సంజయ్‌ ‌రౌత్‌ అనవసర దూకుడు శివసేన ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. ఎవరు నోరెత్తినా ఎదురుదాడితో నోరు మూయించా లనే ప్రయత్నం తప్ప వాస్తవాలను వివరించలేదు.

సుశాంత్‌ ‌కేసులో నటి కంగనా రనౌత్‌ ‌చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపాయి. బాలీవుడ్‌ ‌మాఫియా, నెపోటిజం కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె పేర్కొనడంతో దుమారం రేగింది. నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణుల మాటల యుద్ధంతో వివాదం రాజు కుంటూ వచ్చింది. మరోవైపు సుశాంత్‌ ‌కేసు దర్యాప్తులో డ్రగ్‌ ‌మాఫియా లింకులు బయటకు రావడం, రాజకీయ నాయకుల జోక్యంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోనే తనకు మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే భయమని కంగనా ట్వీట్‌ ‌చేసింది. దీనికి బదులిచ్చిన శివసేన నాయకుడు సంజయ్‌ ‌రౌత్‌ ‘అం‌త భయం ఉంటే ముంబైకి రావొద్దు’ అని కౌంటర్‌ ఇచ్చారు. దీనికి బదులుగా ‘ముంబై ఏమైనా పీఓకేనా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. తనను ముంబై రావద్దనడానికి మీరు ఎవరు? కచ్ఛితంగా వస్తానంటూ తేదీని కూడా ప్రకటించి సవాలు విసిరారు కంగనా. ముంబై వస్తే అడ్డుకుంటామని శివసేన గట్టిగా హెచ్చరించింది. ఆ సమయంలో కంగనా తన స్వస్థలం హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో ఉన్నారు. తనకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో రక్షణ కల్పించాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం వై ప్లస్‌ ‌భద్రత కల్పించింది. కంగనా ముంబైలో అడుగుపెట్టేలోపు అక్రమ నిర్మాణం సాకుతో బాంద్రాలోని ఆమె ప్రొడక్షన్‌ ఆఫీసును బృహన్‌ ‌ముంబై అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు. దీనిపై ఆగ్రహించిన ఆమె ‘బాబర్‌ ఆర్మీ’ తన ఆఫీసును కూల్చేస్తున్నారని ట్వీట్‌ ‌చేశారు. ‘నేనెప్పుడూ తప్పు చెప్పలేదు. నా శత్రువులు నా మాటల్ని మళ్లీ మళ్లీ నిజం చేస్తున్నారు. ఇందుకే నేను ముంబైని పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)తో పోల్చా’ అంటూ అధికారులు జేసీబీతో ఉన్న ఫొటోల్ని షేర్‌ ‌చేశారు. కంగనా ముంబై చేరుకున్న తర్వాత శివసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా, ప్రత్యేక భద్రత కారణంగా ఫలించలేదు. కూల్చి వేతలపై ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. ముంబై అధికారులకు ఇంతకాలం కనిపించని అక్రమ కట్టడం హఠాత్తుగా గుర్తుకురావడం వెనుక కారణాలు బహిరంగ రహస్యమే.

కంగనా మాటల దాడి నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేపైనే జరిగింది. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్‌ ‌ముంబై మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్‌ ‌ఠాక్రే పార్టీని స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్‌ ‌చేశారు. అంతేకాదు, ఒక వీడియోలో కంగనా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘ఉద్ధవ్‌ ‌ఠాక్రే.. మీరు ఏమనుకుంటున్నారు? ఫిల్డ్ ‌మాఫియాతో కుమ్మక్కై మీరు నా ఇంటిని కూల్చివేసి నాపై పగ తీర్చుకున్నారా? ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కూలుతుంది’ అని పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే పరువు కాస్తా పోయింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు బృహన్‌ ‌ముంబై కార్పోరేషన్‌, ‌ముంబై పోలీసులు అప్రతిష్టను మూట కట్టుకోవాల్సి వచ్చింది. కంగనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్‌ ‌కోషియారి అసంతృప్తి వ్యక్తంచేశారు. హడావుడిగా ఆమె కార్యాలయాన్ని కూల్చేయడాన్ని గవర్నర్‌ ‌తప్పుబట్టారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌ ‌వెళ్లిన కంగనా, ఆమె సోదరి రంగోలి తాము ఎదుర్కొంటున్న సమస్యలను కోషియారికి వివరించారు. న్యాయం చేయాల్సిందిగా కోరారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సంకీర్ణ భాగస్వామ్య అయిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కంగనా విషయంలో అనవసర దూకుడు వద్దని ఉద్ధవ్‌ఠాక్రేను ఆయన హెచ్చరించినా పట్టించుకోలేదు. సోషల్‌ ‌మీడియాలో కంగనాకు లభించిన మద్దతు ఉద్ధవ్‌ ‌ప్రభుత్వాన్ని ఇకరాటంలో పెట్టింది. మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జైరాంఠాకూర్‌ ‌కూడా కంగనా కార్యాలయం కూల్చివేతను ఖండించారు. కంగనాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం బాసటగా నిలిచారు. బీజేపీ మిత్రపక్షమైన ఆర్‌పీఐ(ఏ) కూడా ఆమెకు మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలె స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.

కంగనా రనౌత్‌ ‌మాటల దాడిని జీర్ణించుకోలేని శివసేన ఆమె వెనుక బీజేపీ ఉందని, కేంద్రం ఆమెకు కల్పించిన వై ప్లస్‌ ‌భద్రతే ఇందుకు కారణమని విమర్శించింది. బిహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణ రాజ్‌పుత్‌, ‌క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్దతిస్తూ బిహార్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. అయితే, ఒక నటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై కక్ష సాధించడం శివసేన అపరిపక్వతను పట్టి చూపుతోంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ అసహనం, తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీపై విమర్శలకు దారితీసింది.

సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య, కంగనా రనౌత్‌ ‌వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‘‌సామ్నా’ పత్రికలో రాసిన వ్యాసంలో వాడిన పదజాలంపై కంగనా మండిపడ్డారు. మహారాష్ట్రను అవమాన పరిచిన వారికి మద్దతిస్తూ బిహార్‌లో గెలవాలను కుంటున్నదని, కంగనా వెనుక ఉన్నది కాషాయ నేతలే అని అందరికీ తెలుసని రౌత్‌ ‌పేర్కొన్నారు. కంగనా అభిప్రాయాలు సినీ పరిశ్రమ అభిప్రాయాలు కాదని బాలీవుడ్‌ ‌ప్రతినిధులు స్పష్టం చేయాలని కోరారు. కనీసం అక్షయ్‌కుమార్‌ అయినా స్పందించాలని అన్నారు. ముంబై పట్ల కృతజ్ఞత చూపేందుకు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చురకలు వేశారు. కొందరికి ముంబై ప్రాధాన్యం కేవలం డబ్బు సంపాదించేందుకేనని, ముంబైని ఎవరైనా రేప్‌ ‌చేసినా వారికి పట్టదని, ఇలాంటి తరుణంలోనే మహారాష్ట్ర ఒక్కటిగా నిలవాలని రౌత్‌ ‌కోరారు. ఈ విషయంలో కంగనా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘నిజమే. డ్రగ్‌ ‌రాకెట్‌ ‌మాఫియాను బద్దలుకొట్టిన వారికి బీజేపీ మద్దతివ్వడం అత్యంత దురదృష్టకరం. అలా మద్దతు ఇచ్చే కంటే.. శివసేన గూండాలు నాపై దాడి చేయడానికి, నన్ను రేప్‌ ‌చేయడానికి బీజేపీ మద్దతివ్వాల్సింది కదా.. అంతేనంటారా సంజయ్‌ ‌జీ?’ అని సెటైర్లు వేశారు. కంగనా మాటల దాడితో ఉక్కిరి బిక్కిరవుతున్న శివసేన కార్యకర్తలు సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను అవమానించారంటూ పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కంగనా ఇంటి లేఔట్ల అనుమతులపై ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. గతంలో ఆమె మాజీ ప్రియుడు అధ్యాయన్‌ ‌సుమన్‌ ‌చేసిన వ్యాఖ్యల ఆధారంగా డ్రగ్స్ ‌కేసులో దర్యాప్తు చేసే పనిలో పడింది. నిషేధించిన పదార్థాలు, నార్కోటిక్స్ ‌డ్రగ్స్‌ను ఆమె వాడతారనే ఆరోపణల నిగ్గు తేల్చాలని ముంబై పోలీసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.

కంగనా రనౌత్‌ ‌గతంలో తానూ డ్రగ్‌ అడిక్ట్‌నే అని చెప్పిన వీడియో ఒకటి తాజాగా సోషల్‌ ‌మీడియాలో వైరలవుతోంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని.. 16 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఫిల్మ్ ‌స్టార్‌ని అయ్యానని.. అప్పుడే మత్తు మందులకు అలవాటు పడ్డానని కంగనా అందులో తెలిపారు. ఈ నేపథ్యంలోనే కంగనాకు డ్రగ్స్ ‌మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ఆరోపించారు. దీనికి కంగనా స్పందిస్తూ ‘తాను డ్రగ్స్ ‌తీసుకున్నట్టు నిరూపించాలని.. డ్రగ్స్ ‌టెస్ట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు డ్రగ్‌ ‌మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టన’ని ట్వీట్‌ ‌చేశారు. కంగనా వీడియో గతంలో తాను చేసిన తప్పుకు స్వయంగా పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లుగానే ఉంది. అయితే దీని ఆధారంగా మాఫియాతో లింకులు కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు శివసేనను సవాల్‌ ‌చేసిన కంగనా రనౌత్‌ ‌రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె బీజేపీలో చేరతారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. శివసేన.. సోనియా సేనగా మారిందని.. బాల్‌ఠాక్రే సిద్ధాంతాలను ఉద్ధవ్‌ అధికార దాహానికి తాకట్టు పెట్టారని ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న భావన కలుగుతోంది. అయితే రాజకీయ ప్రవేశంపై ఆమె ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరాఠి ప్రజలు తనకు నైతిక మద్దతు ఇస్తున్నారని.. శివసేన ప్రభుత్వ చర్యలను సమర్థించడంలేదని తాజాగా చేసిన ట్వీట్‌లో కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్‌ ‌సర్కారు పోకడలు మరాఠీల ప్రతిష్టను ఏమాత్రం దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.  ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కంగనా రనౌత్‌ ‌పోరాటాన్ని సోషల్‌ ‌మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు. దర్శకుడు వివేక్‌ అ‌గ్రిహోత్రి కంగనాకు షేర్‌ ‌చేసిన ఒక ఎమోజీ వైరలవుతోంది. దీనిలో శివాజీ మహారాజ్‌.. ‌కంగనాకు కత్తి ఇస్తున్నట్లు ఉండగా.. వెనక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేను రావణుడితో పోల్చారు. ఈ ఎమోజీ పట్ల కంగనా ఉద్వేగానికి గురయ్యారు. ‘ధన్యవాదాలు వివేక్‌ ‌జీ. నేను లక్ష్మీబాయి, వీర్‌ ‌శివాజీ అడుగు జాడల్లో నడుస్తాను. నా పనిని కొనసాగిస్తాను. వారు నన్ను భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ధైర్యంతో ముందుకు వెళ్తాను. జై హింద్‌.. ‌జై మహారాష్ట్ర’ అంటూ కంగనా మరాఠీలో ట్వీట్‌ ‌చేశారు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE