దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే సెప్టెంబర్‌ 5‌వ తేదీ అర్ధరాత్రి సమయంలో దివ్యరథం అగ్నికి ఆహుతయింది. కల్యాణ వేడుక అనంతరం వివాహశోభితుడైన నారాయణుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలసి తన సోదరి అశ్వరూడాంభిక (ఈ అమ్మవారినే స్థానికులు గుర్రాలక్క అని పిలుస్తారు)కు చీరెసారెలు ఇవ్వడానికి వెళ్లేది ఈ అద్భుత రథం మీదనే.  ఈ అనూహ్య సంఘటన కోనసీమ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.  అధికారుల వాదన ఎలా ఉన్నా భక్తబృందం మాత్రం ఇది విద్రోహ చర్యేనని ఆగ్రహంతో ఊగిపోతోంది. హైందవశక్తి, భజరంగదళ్‌, ‌విశ్వహిందూపరిషత్‌, ‌హిందూ చైతన్యవేదిక, ధర్మవీర్‌ ఆధ్యాత్మిక వేదిక, ఆంధప్రదేశ్‌ ‌పురోహిత బ్రాహ్మణ సమాఖ్య, భారతీయ జనతాపార్టీ, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్‌ ‌వంటి సంస్థలకు చెందిన కార్యకర్తలు స్వామివారి ఆలయం వద్ద ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.

ఇది కొత్త రథం. 1960వ సంవత్సరంలో స్వామివారి సేవకు అప్పటి అధికారులు, ధర్మకర్తల మండలి తయారుచేయించారు. నిర్మాణానికి ఆనాడు నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుత విలువ రూ. 95 లక్షలు. ఈ మేరకు రథానికి 54 లక్షలకు బీమా చేయించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.దాదాపు నలభై అడుగుల ఎత్తయిన రథమిది.

సంఘటనా క్రమాన్ని పరిశీలిస్తే- ఏటా భీష్మ ఏకాదశికి అంతర్వేది ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే ఒకరోజు స్వామి వారి ఊరేగింపునకు రథం బయటకు తీస్తారు. దాదాపు లక్ష మంది రథోత్సవాన్ని వీక్షిస్తారు. మామూలు రోజులలో ఆలయం ఎదురుగా నిర్మించిన షెడ్‌లో రథం ఉంచుతారు. సెప్టెంబర్‌ 5‌వ తేదీ అర్థరాత్రి షెడ్‌ ‌నుండి మంటలు రావడంతో స్థానికులు రాజోలు ఫైర్‌ ‌సిబ్బందికి సమాచారం అందించారు. రాత్రి ఒంటి గంటకు ఇది జరిగింది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజోలు నుండి అగ్నిమాపక వాహనం రావలసి ఉండడంతో అప్పటికే రథాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ వార్త కోనసీమ అంతా గుప్పుమనడంతో భక్తులు హతాశులయ్యారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో చక్రధరరావు సుఖినేటిపల్లి పోలీసులకు, తమ శాఖాధికారులకు సమాచారం అందించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌జిల్లా ఉన్నతాధి కారులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపట్టారు.

షెడ్‌లో విద్యుత్‌షార్ట్ ‌సర్క్యుట్‌ ‌వల్లనా, ఆకతాయిల వల్లనా, విద్రోహ చర్యా, పిచ్చివాడి పనా లేక తేనెతుట్టెను తొలగించే క్రమంలో రాలిన నిప్పురవ్వల వల్ల  ప్రమాదం జరిగిందా అనే కోణాలలో దర్యాప్తు ప్రారంభం అయ్యింది. విజయవాడ నుండి ఫోరెన్సిక్‌ ‌బృందం, డాగ్‌స్క్వాడ్‌ ‌వచ్చాయి.

6వ తేదీ ఆదివారం రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు, అమలాపురం పార్లమెంట్‌ ‌సభ్యురాలు చింతా అనూరాధ, జిల్లా కలెక్టర్‌ ‌మురళీధర్‌రెడ్డి, పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ అద్నాన్‌ ‌నయీం అస్మీ, ఎస్‌.‌సి. కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌పి. అమ్మాజీ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కలెక్టర్‌ ‌సంఘటనా విచారణకు డిపార్ట్‌మెంట్‌ ఎం‌క్వైరీ కమిటీని నియమించారు.

7వ తేదీ సోమవారం విజయవాడలోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌కార్యాలయంలో ఈ సంఘటనకై రివ్యూ పిటీషన్‌ ‌నిర్వహించి, దేవాదాయ శా• నుండి రథం తయారీకి నిధులు మంజూరు, ప్రత్యేకాధికారిగా ఎడిషినల్‌ ‌కమిషనర్‌ ‌కె.రామచంద్రమోహన్‌ను నియమిస్తూ, ఆలయం వెలుపల సి.సి.కెమెరాలు పని చేయకపోయినా పట్టించుకోని ఆలయ అసిస్టెంట్‌ ‌కమీషనర్‌ ‌చక్రధరరావును సస్పెండ్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ (ఎ.‌సి.) వై.భద్రాజీకి అంతర్వేది ఎ.సి.బాధ్యతలు అప్పగించారు.

8వ తేదీ మంగళవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ‌సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌, ‌బి.సి.సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆలయ అనువంశిక ధర్మకర్త మొగల్తూరు రాజా స్థానిక ప్రజాప్రతినిధులతో సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దశలో వివిధ ప్రజాసంఘాలకు చెందిన భక్తులు ఆలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు ఆరంభించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు ప్రజాసంఘాల నాయకులు మంత్రులతో వాగ్వావాదానికి దిగగా, కొందరు ఆకతాయిలు మంత్రి కారుపై రాళ్లు రువ్వడం, మరికొందరు ఆకతాయిలు ఆలయానికి సమీపంలో ఉన్న చర్చిపై రాళ్లు విసరడం, అంతకుముందు రోజు ఆలయం ఎ.సి.పై దాడికి పాల్పడడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దీనితో ఆలయ పరిసర ప్రాంతంలో యాక్ట్ 30 ‌విధించి, ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ కూడా ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించింది.ఘటన నేపథ్యంలో పోలీసులు 37 మందిపై వివిధ కేసులు పెట్టి  కొందరిని  అరెస్టు చేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన ‘ఛలో అంతర్వేది’కి పిలుపు నివ్వడంతో వివాదం మరో మలుపు తిరిగింది. జిల్లాకు చెందిన బీజేపీ, జనసేన నాయకులను గృహ నిర్బంధం చేసి ఛలో అంతర్వేదిని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, అనుచరణగణం లేకపోయినా సోము వీర్రాజు అంతర్వేదిని సందర్శించారు. నెల్లూరు, పిఠాపురం, భీమవరం, అంతర్వేది సంఘటనపై జ్యుడీషియల్‌ ఎం‌క్వైరీ వేయాలని డిమాండ్‌ ‌చేసారు. గృహనిర్బంధం చేయడానికి బీజేపీ, జనసేన నాయకులు  తీవ్రవాదులు కాదని అన్నారు.

రథం ఆహుతి అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కె.కిరణ్‌ ఆధ్వర్యంలో రుత్విక్కులు విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం పారమాత్రికోపనిషత్‌ ‌హోమాలను నిర్వహించారు.

జరిగన సంఘటనను సరిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల రూపాయలు మంజూరు చేసి రానున్న కల్యాణ మహోత్సవాలకు రథం సిద్ధం చేసే దిశగా చర్యలు చేపట్టింది.

రథం సెగలు ఢిల్లీ దాకా చేరుకున్నాయి. ఆంధప్రదేశ్‌లో హిందూదేవాలయాల పరిరక్షణకై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్‌ ‌నరసింహరావు, పార్టీ ఆంధప్రదేశ్‌ ఇన్‌చార్జి సునీల్‌ ‌దేవధర్‌ 10‌వ తేదీన ఢిల్లీలోనూ, జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ తదితర జిల్లాలకు చెందిన బీజేపీ, జనసేన ప్రతినిధులు వారి వారి ఇళ్లవద్ద నల్లబాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ ‌తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ప్రయాగ నరసింహమూర్తి, హిందూ ధర్మరక్షా సమితి జిల్లా కార్యదర్శి అడబాల నరసింహరావు కోరారు. ఆలయాలపై ఇటువంటి దాడులు జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేసారు. 10వ తేదీన అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.

– జి. జవహర్‌లాల్‌, ‌జర్నలిస్ట్, ‌సఖినేటిపల్లి

About Author

By editor

Twitter
YOUTUBE