దశాబ్దాలుగా వెంటాడిన మహమ్మారి కనుమరుగైపోయింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. మనుషులను జీవచ్ఛవాలుగా మార్చే ఆ మహమ్మారికి సమాధి కట్టినట్టయింది. కేందప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఈ ప్రకటన చేసింది. దీంతో ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పండుగ వాతావరణం అలుముకుంది. గడిచిన తరాల చేదు అనుభవాలకు ముగింపు లభించిందన్న సంతోషం ఆయా ప్రాంతాల్లో కనిపిస్తోంది. తెలంగాణతో పాటు దేశంలోని మరో రెండు రాష్ట్రాలు కూడా ఫ్లోరైడ్ రహితంగా మారిపోయాయి. ఉత్తరాఖండ్, గుజరాత్‌లోనూ ఫ్లోరైడ్ అనవాళ్లు పూర్తిగా సమసిపోయాయని కేంద్రం ప్రకటించింది.
ఫ్లోరైడ్ – ఒక రకమైన భూతం. శరీరాన్ని పీల్చి పిప్పిచేసే భయంకర మహమ్మారి. ఏ జన్మలో చేసిన పాపమో వెంటాడుతోందని తమకు తామే సర్దిచెప్పుకొని, దాని బారి నుంచి బయటపడే దారి అసలే లేక క్షణక్షణం కుమిలి కృశించిపోయేలా చేసే భయంకరమైన వ్యాధి. దీని బారిన పడ్డవాళ్ల కాళ్లు, చేతులు వంకర్లు పోతాయి. చాలామందిలో ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అంగవైకల్యం బాధిస్తుంది. అంతుపట్టని అనారోగ్యం వెంటాడు తుంది. మరుగుజ్జుతనం మానసికంగా దెబ్బతీస్తుంది. బుద్ధిమాంద్యం కుటుంబసభ్యులను కోలుకోలేని విధంగా బాధపెడుతుంది. వయసుకు తగ్గట్టుగా శరీరం ఎదగకపోవడం జీవితాలను నరకప్రాయం చేస్తుంది. ఫ్లోరోసిస్ బారినపడ్డ చాలామంది ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వృద్ధుల్లా మారిపోతారు. చివరకు జీవచ్ఛవాల్లా బతికినన్ని రోజులు కాలం వెళ్లదీస్తారు. కొందరైతే మరొకరి ఆసరా లేకుండా ఏ పని చేసుకోలేని పరిస్థితి. మరికొందరు జీవితాంతం మంచానికే పరిమితమై పోతారు. ఇలాంటి పరిస్థితులు చూసిన వాళ్లెవరికైనా కన్నీళ్లు ఆగవు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో అలాంటి శాపగ్రస్తమైన జీవితం అనుభవించాయి కొన్ని తరాలు. ఈ రక్కసి కాటుకు ఎన్నో కుటుంబాలు బలైపోయాయి. తరాల నాటి ఆ ఆవేదనకు పూర్తిగా ముగింపు దొరికింది. దశాబ్దాలుగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ ప్రభావం పూర్తిగా తొలగిపోయింది.
తెలంగాణ, ఆంధప్రదేశ్ సహా.. దేశంలోని కొన్ని రాష్ట్రాలను ఫ్లోరైడ్ ప్రభావం దశాబ్దాలుగా పట్టి పీడించింది. తాజాగా పార్లమెంటులో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం ఐదేళ్లక్రితం నాటి లెక్కలు, తాజా లెక్కలను వెల్లడించింది. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో నమోదైన ఫ్లోరైడ్ ప్రభావిత, ఆర్సెనిక్ జలాలు కలిగిన ప్రాంతాల వివరాలను, 2020 ఆగస్టు 1 నాటి గణాంకాలను పార్లమెంటుకు సమర్పించింది. కేంద్ర తాగునీటిశాఖ ఈ గణాంకాలను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావం పూర్తిగా సమసిపోయింది. ఆ గణాంకాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొదటినుంచి ఆర్సెనిక్ (కఠిన) జలాలున్న ప్రాంతాలు లేవు. ఐదేళ్ల క్రితం, అంటే 2015 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 967 చోట్లలో ఫ్లోరైడ్ ప్రభావమున్నట్లు గుర్తించగా, తాజాగా ఈ గ్రామాలన్నింటిలోనూ ఫ్లోరైడ్ ప్రభావం కనుమరుగై నట్లు ప్రస్తుత నివేదిక పేర్కొంది. ఆంధప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం 402 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావ ముండగా ఇప్పుడు 111 ప్రాంతాలకు ఆ ప్రభావం తగ్గిపోయినట్లు తెలిపింది. అలాగే, ఉత్తరాఖండ్‌లోని రెండు, గుజరాత్‌లోని ఆరు చోట్లలో ఫ్లోరైడ్ కనుమరుగైనట్లు తాజా నివేదిక పేర్కొంది.
ఐదేళ్ల క్రితం రాజస్తాన్‌లో 7,056 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుండగా.. 2020 ఆగస్టు 1 నాటికి వాటి సంఖ్య 3,095కు తగ్గింది. అలాగే, కర్ణాటకలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య 2015లో 1,225 నుంచి 2020 ఆగస్టు 1 నాటికి 177కు తగ్గిపోయింది. ఇక, కేరళలో 95 నుంచి 15కు, మధ్యప్రదేశ్‌లో 405 నుంచి 280కి, మహారాష్ట్రలో 191 నుంచి 30కి, ఒడిశాలో 252 నుంచి 69కి, పంజాబ్‌లో 257 నుంచి 211కు, ఉత్తరప్రదేశ్‌లో 145 ప్రాంతాల నుంచి 72కి తగ్గిపోయాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రభావాన్ని స్వాతంత్య్రానికి పూర్వమే గుర్తించారు. అప్పటి నిజాం పాలనా కాలంలోనే వీటి ఆనవాళ్లు కనిపించాయి. ప్రకాశం జిల్లా దర్శిలో 1937లో ఫ్లోరైడ్‌ను గుర్తించగా, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని భట్లపల్లి ప్రాంతంలో 1945లో నాటి నిజాం ప్రభుత్వంలోని డాక్టర్ ఎంకె దేవర్‌తొలిసారిగా ఈ ఆనవాళ్లు గుర్తించారు. భయంకరమైన ఈ ఫ్లోరైడ్ ప్రభావం వల్ల చెప్పుకోలేని నష్టం వాటిల్లుతుందని, ప్రధానంగా భూగర్భ జలాల వాడకాన్ని తగ్గించి, ఉపరితల నీటి వనరులను మాత్రమే సరఫరా చేయాలని నిజాం ప్రభుత్వానికి ఆయన సూచించారు. అప్పటి తీవ్రతను గుర్తించిన నిజాం ప్రభుత్వం.. డాక్టర్ దేవర్ సూచన మేరకు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు తదితర గ్రామాలలో తాగునీటి కోసం చెరువులను తవ్వించారు. కానీ, వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం చూపలేక పోయారు. అప్పట్నించి ఫ్లోరోసిస్ ఈ జిల్లాకు ఓ పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోయింది.
ఫ్లోరైడ్ ఆనవాళ్లు గుర్తించక ముందునుంచే ఆయా ప్రాంతాలలోని జనాలు దాని బారిన పడ్డారు. ఆ తర్వాత కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే నమ్ముకున్న జనం చూస్తూ చూస్తూ ఫ్లోరోసిస్ బాధితులుగా మారిపోయారు. అయితే, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యల కోసం ప్రయత్నాలు చేసినా, అవన్నీ తాత్కాలిక ఊరటగానే మిగిలిపోయాయి. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని నాంపల్లి, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగా ఉండేది.
భారత ప్రమాణాల విభాగం – బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డస్ లెక్కల ప్రకారం ఒక లీటరు నీటిలో ఒక పీపీఎం (పార్టస్ పర్ మిలియన్) ఫ్లోరైడ్ ఉండొచ్చు. కానీ, నల్లగొండ భూగర్భ జలాల్లో సగటున 10.97 పీపీఎం ఫ్లోరైడ్ ఉందని భూగర్భ జలాల నాణ్యత గణాంకాలు తేల్చి చెప్పాయి. ఫలితంగా ఫ్లోరోసిస్ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో భట్లపల్లిలో ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. అక్కడ ఆ సమయంలో తీసుకున్న నమూన (శాంపిల్)లలో 28 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే తాగాల్సి వచ్చింది.
సుదీర్ఘకాలం పాటు శరీరంలోకి ఫ్లోరైడ్ వెళ్లడం వల్ల ఫ్లోరోసిస్ సమస్య వస్తుంది. ప్రధానంగా తాగునీరు, ఆహారం, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఫ్లోరైడ్ శరీరంలోకి చేరుతుంది. తీవ్రస్థాయిలో ఫ్లోరైడ్ ఉన్న నీటిని తరచూ తాగుతూ ఉంటే డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ సమస్యలు తలెత్తుతాయి. అది అలాగే కొనసాగితే మనిషిలో ఎదుగుదల ఆగిపోతుంది. శాశ్వత దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే, 2015 తర్వాత ఇలాంటి ఫ్లోరోసిస్ కొత్తకేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 2020 ఆగస్టు నాటికి ఫ్లోరోసిస్ పూర్తిగా నిర్మూలన దిశకు చేరుకుంది.
దశాబ్దాలుగా వెంటాడిన ఈ సమస్య తెలంగాణ ప్రాంతానికి ఓ శాపంలా పరిణమించింది. అయితే.. కేంద్రం ప్రకటించిన తాజా గణాంకాలకు తెలంగాణ ప్రాంతంలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలన్నింట్లోనూ ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు సరఫరా అవుతోందని, ఈ కారణంగానే ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా అంతరించిందని పలువురు రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. అయితే, ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా సమసిపోవడం వెనుక పలు ప్రాజెక్టులు, చర్యలు ఉన్నాయి. నల్లగొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో 436 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించారు. ఈ ప్లాంట్ నుంచి 585 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండలో ఐక్యరాజ్యసమితి బాలల నిధి – యునిసెఫ్ సమకూర్చిన నిధులతో 2013లో జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి క్రమంగా ఫ్లోరైడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. ఈ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడింది. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2007-2012 మధ్య కాలంలో అమలైన 11వ పంచవర్ష ప్రణాళికలో ‘జాతీయ ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణ కార్యక్రమం (ఎన్‌పీపీసీఎఫ్)’ చేపట్టింది. నీతి ఆయోగ్ సిఫార్సుతో దేశంలోని 12,014 ఫ్లోరైడ్ ప్రభావిత, 1,327 ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన మంచి నీటి శుద్ధి ప్లాంట్ల నిమిత్తం కేందప్రభుత్వం 800కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ప్రయత్నాలు, చర్యలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమివేసేందుకు దోహదపడ్డాయనే చెప్పాలి.
– సుజాత గోపగోని, 6302164068 : సీనియర్ జర్నలిస్ట్