అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
ప్రశాంతంగా సాగాల్సిన జీవిత చరమాంకం శోకమయం కావడం శోచనీయం. యాంత్రిక ప్రపంచంలో ఏ కొందరు అమ్మానాన్నాలో తప్ప పిల్లల ఆదరాభిమానాలకు నోచుకోవడంలేదు. దశరథ తనయుల లాంటి వారు తరిగిపోతుండగా ధృతరాష్ట్ర సంతతి శాతం పెరుగుతోంది. ఆర్థికస్థోమత లేనివారి సంగతి అటుంచితే వారసత్వంగా ఆస్తులు పంచుకున్న వారి కాఠిన్యం అంతుబట్టకుండా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘అంతర్జాతీయ పెద్దల దినోత్సవం’ ప్రత్యేకమైనది. అనారోగ్యం, ముఖ్యంగా ‘కోవిడ్-19’నుంచి కాపాడండి అనే ఇతి వృత్తంతో దీన్ని పాటిస్తున్నారు. వృద్ధుల పట్ల నేటి తరం వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో చర్చించేలా ఈ దినోత్సవం పాటించాలని నిర్ణయించారు.
వార్థక్యం సహజ వయోధర్మం. కానీ అది వారి పాలిట శాపం కారాదు. వయసు మీరడం అంటే అనుభవం, జ్ఞానం పెరగడం. అందుకే చాలా సమాజాలు పెద్దలను జాతి సంపదగా పరిగణిస్తాయి. ‘పెద్దల మాట చద్ది మూట’, ‘బామ్మ మాట బంగారు బాట’ లాంటి నానుడులు అలానే పుట్టి ఉంటాయి. కానీ నేటి యువతలో అత్యధిక శాతం వారిది ‘చాదస్తం’గా కొట్టి పారేస్తోంది. ‘మీ(నీ)కేం తెలియదు లే’ అనేలా వ్యవహరిస్తోంది. వయసు మళ్లినవారు వారు ‘పాత సామాను’ కింద జమ అవుతున్నారు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’లానే ‘నేటి యువతే రేపటి వృద్ధులు’ అనేది తోచనట్లు వ్యవహరిస్తున్నారు.
‘యథాగారం దృఢ స్థూణం జీర్ణం భూత్వావసీదతి
తథైవ సీదంతి నరా జరా మృత్యు వశం గతా:’ అత్యంత ధృడమైన స్తంభాలతో నిర్మితమైన ఎంతటి పటిష్ఠ భవనమైన కాలాంతరంలో శిథిలం కావడం సహజం. మానవులు కూడా ముసలివారై ఏదో ఒక రోజు మరణించడం సహజం అని శ్రీరామచంద్రుడు సోదరుడు భరతునితో అన్న మాటలు నిత్యసత్యం. అయితే ఉన్నంత కాలం భవనాన్ని కాపాడుకున్నట్లే మానవ మనుగడ సుఖంగా సాగాలన్న పరమార్థమూ ఆయన పలుకులలో దాగి ఉందని గమనించాలి. ‘భూమేర్ గరీయసీ మాతా/స్వర్గం దుచ్చతరం పితా:’ భూమి కంటే తల్లి గొప్ప, స్వర్గం కంటే తండ్రి గొప్ప అని ఆర్యోక్తి. తల్లిదండ్రులు, గురువులు అత్యున్నతమైన శిక్షణ ఇస్తే ఆ సంతానం సమర్థమైన జాతిగా తయార వుతుందని అని శతపధ బ్రాహ్మణం బోధిస్తోంది. కానీ లోకంలో వెలుగుచూస్తున్న కొందరు సంతానం తీరుతెన్నులు, అమానుష వైఖరిని బట్టి ‘మాతృదేవో భవ, పితృదేవో భవ’ శ్లోకం స్తుతికే పరిమితమవుతున్నట్లనిపిస్తోంది. ‘అపుత్రస్య గతిర్నాస్తి’ సూక్తికి కాలదోషం పడుతోంది.
తల్లిదండ్రులు నలుగురు సంతానాన్ని పోషిస్తారు. కానీ వారు కన్నవారిని పోషించలేరన్న మాట నిత్యనూతనం. కన్నవారిని ఆశ్రమాల పాలు చేయడమే కాదు, సజీవులుగానే వల్లకాటిలో వదిలేస్తున్న సంఘటనలు, ఆస్తుల కోసం, కారుణ్య నియామకాల కోసం మట్టుపెడుతున్న సంఘటనలు ఎన్నో. ఇలాంటి అకృత్యాలలో తండ్రి విషయంలో తల్లి, ఆమె విషయంలో తండ్రి సంతానానికి సహకరిస్తున్నారనే వార్తలూ ఉన్నాయి. కానీ భర్తను చంపడంలో సహక రించిన తనకు రేపటి పరిస్థితి ఏమిటనే ఆలోచనకు రాకపోవడం పెద్ద విషాదం. తాము రేపటి తల్లిదండ్రులమనే విచక్షణ లోపించడమే శోచనీయం.
‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు/పుట్టనేమి వాడు గిట్టనేమి/పుట్టలోని చెదలు పుట్టవా గిట్టదా’ అని ఈసడించాడు వేమన ఏనాడో. ‘పుత్రోత్సాహము తండ్రికి/పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా/పుత్రుని గనుగొని పొగడగ/పుత్రోత్సాహంబు నాడు పొందుర…’ అంటాడు బద్దెన కవి. ఈ రెండు శతక పద్యాల మధ్య వ్యత్యాసాన్ని గమనించిన యువతే పురాణపురుషుల వారసులవుతారు. వేమన పద్యాన్ని వల్లెవేసిన వారు కూడా జీవితంలో స్థిరపడిన తరువాత దానిని మరచిపోతున్నారు. తండ్రి మాట కోసం అడవులు బట్టిన రాముడు, అంధ తల్లిదండ్రులను కావడిలో కాచుకున్న శ్రవణకుమారుడి చరిత్ర పుక్కిటి పురాణాలుగా మారిపోతున్నాయి.
పిల్లల బాగోగుల కోసం ఎంతో ఆరాటపడి, పరుగులు తీసినా వయసు మీరిన తరువాత వారి నుంచి ప్రేమాభిమానాలు వృద్ధులకు అందడంలేదు. పిల్లలు విద్యాబుద్ధులు, ఆర్జనతో వృద్ధిలోకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కన్నవారు ఆశించడం సహజం. పిల్లలంతా వారి ఆకాంక్షలను నెరవేరుస్తున్నారా? నెవరవేర్చగలుగుతున్నారా? అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు.
జీవన ప్రమాణంతో పాటు వృద్దుల సంఖ్య పెరుగుతోంది. వారి సంఖ్య ఈ ఏడాదికి, ఐదేళ్ల వయసు గల వారి పిల్లల సంఖ్యను మించిపోతుందని, వచ్చే మూడేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ కావచ్చని, 2050 నాటికి 1.5 బిలయన్‌లకు చేరుతుందని అంచనా. ‘డబ్బులేనివాడు దమ్మిడీకి కొరగాడు’ అనే సామెత తల్లిదండ్రుల విషయంలోనూ నిజమవుతోంది. అరవై శాతం వృద్ధుల చేతిలో చిల్లిగవ్వ ఉండడంలేదని, ఫలితంగా నిరాదరణ పాలవుతున్నారని పెద్దల హక్కుల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘ఏజ్‌వెల్ ఫౌండేషన్’ జాతీయ స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో తేలింది. వృద్ధులలో దాదాపు 80 శాతం తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ‘సుమారు 71 శాతం మంది సొంత కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఏదో ఒక రకం అవమానం, బాధలు ఎదుర్కొంటుండగా, ప్రతి ఇద్దరిలో ఒకరు కన్నబిడ్డల నుంచే ఆ చేదు అనుభవాలు చవిచూస్తున్నారు. నగరాల్లో ప్రతి ఆరుగురు వృద్ధులలో ఒకరికి సరైన ఆహారం, ప్రతి ముగ్గురిలో ఒకరికి వైద్యం అందడంలేదు. పెద్దలకు దక్కుతున్న గౌరవాదరణలు అంతంత మాత్రమే. 50 శాతానికి పైగా వాటికి నోచుకోవడంలేదు’అని ఆ అధ్యయనం పేర్కొంది.
పదవీ విరమణ వయసులోని వారిలో 20 శాతం కంటే తక్కువ మందికి పింఛన్ లభిస్తోందని ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా ఆర్థిక భరోసా కానీ, ఆస్తులు కానీ లేని వారు పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితికి మానసికంగా కుంగిపోతున్నారు. 70 సంవత్సరాలు, అంతకు మించిన వయస్కులలో 66 శాతం అంతర్లీన సమస్యలతో బాధపడుతున్నారు.
సంతానానికి ఆస్తిపాస్తుల అప్పగింతలో పెద్దల అవగాహన లోపం కూడా ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఎప్పటికైనా ఆస్తి పిల్లలకు చెందేదే కదా అనే భావనతో కొందరు ముందుగానే రాసేస్తుంటే, మరికొందరు పిల్లల ఒత్తిళ్లతో ఆ పని చేస్తున్నారు. ఫలితంగా ఆర్థిక స్వేచ్ఛ, ఆలంబన కోల్పోయి, సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చినవారే పిడికెడు మెతుకుల కోసం పాట్లు పడుతున్నారంటే సామాన్యుల, పేదల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
ప్రశాంతంగా సాగాల్సిన జీవిత చరమాంకం శోకమయం కావడం శోచనీయం. యాంత్రిక ప్రపంచంలో ఏ కొందరు తల్లిదండ్రులో తప్ప పిల్లల ఆదరాభిమానాలకు నోచుకోవడంలేదు. పెద్దల పట్ల నిర్లిప్తత భావం అనేది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది వృద్ధుల ఆరోగ్యం, మానవ హక్కులను ప్రభావితం చేసే అంశం. కనుక వారి సమస్యల పట్ల శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయవలసి ఉంది. వారి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించవలసి ఉంది. ఈ నేపథ్యంలో వయోవృద్ధుల సమస్యలపై 1984లో వియత్నాంలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటైంది. ఆ సదస్సులోనే ‘సీనియర్ సిటిజన్’ అనే పదాన్ని మొదటిసారిగా వాడారు. వారి సంక్షేమం కోసం ఐరాస 1990 డిసెంబర్ 14న ప్రణాళిక రూపొందించింది. స్పెయిన్‌లో 2004లో జరిగిన సమావేశంలో వృద్ధుల సంక్షేమ కోసం 46 తీర్మానాలు చేసి ఆ మరుసటి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ పెద్దల దినోత్సవాన్ని తొలిసారిగా పాటించారు. కాగా ఈ ఏడాది, వృద్ధుల సంక్షేమం, ముఖ్యంగా ‘కోవిడ్-19’ నుంచి వృద్ధులను కాపాడండి అనే ఇతి వృత్తంతో ‘అంతర్జాతీయ పెద్దల దినోత్సవం’ పాటిస్తున్నారు. వారి సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించేలా ఈ దినోత్సవం పాటించాలని నిర్ణయించారు.
అమలు కాని చట్టం
తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే అని న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. కన్నవారిని చూసుకోవలసిన బాధ్యత సంతానానిదే అని కేందప్రభుత్వం 2007లో చట్టం (మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) తెచ్చింది. పెరుగుతున్న వృద్ధుల జనాభా, వారి పట్ల పెరుగుతున్న నిరాదరణ, వేధింపులను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు తీసుకురావాలని అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే మన దేశంలోనూ ఈ చట్టం రూపుదాల్చింది. దీని ప్రకారం కన్నవారే కాక పోషణకు ఇబ్బందిగా ఉన్న తాతాబామ్మలు కూడా వారసుల నుంచి జీవనభృతి పొందవచ్చు. చట్ట నిబంధనలు అమలు కాకపోతే బాధితులు ఫిర్యాదు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కానీ, అలా ఫిర్యాదు చేసి కడుపునపుట్టిన వారికి శిక్షపడడం ఇష్టంలేక వెనుకాడుతున్న వారు ఉన్నారు.
విదేశీయానం, ఆర్జన మోజు, ఆర్థిక సంబంధాల ముందు హార్దిక సంబంధాలు వెలవెల పోతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వృద్ధులకు ఇలాంటి సమస్యలు అంతగా ఉండేవి కావు. కొందరు బతుకు తెరువుకోసం వెళ్లినా ఇంకొందరు ఇంటిపట్టునే ఉండి ఒకరికొకరు సాయంగా ఉండేవారు. అయితే పరిణామ క్రమాన్ని ఎదిరించలేం కనుక చిన్నకుటుంబంలోనైనా చింతలేకుండా గడపగలగాలన్నదే వారి కోరిక. ఇక కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలనుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. చాలీచాలని సంపాదితుల ఇళ్లల్లోనే పెద్దలు కొంతైన మన శ్శాంతిగా ఉన్నారని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి.
కనీస ఆదరణ
కన్నబిడ్డలపై పంచప్రాణాలు నిలుపుకొన్న వారు వారి నుంచి ఆశించేది ఆత్మీయ పలకరింపే కాని పెట్టుపోతలు కావంటారు మనస్తత్వ నిపుణులు. వారి సూచనల ప్రకారం రోజూ కొద్దిసేపు వారితో ముచ్చ టించాలి. వారితో కలసి తినేందుకు కొంత సమయం కేటాయించాలి. కుటుంబ అంశాలపై సలహాలు స్వీకరించగలగాలి. వారి పద్ధతులను చూసిచూడకుండా పోవాలి తప్ప చాదస్తంగా తీసుకోకూడదు. త•ల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన జన్మ నిరర్థకం కాకూడదు. సమజానికి భారంగా, కటంకంగా మారకూడదు.
మరోవంక సంతానం పట్టించుకోని తల్లిదండ్రులు కొందరైతే వయసు మీరినా పిల్లలపై పెత్తనం చలాయించాలనుకొని భంగపడేవారు ఇంకొందరు. ‘మీకేం తెలియదు. కృష్ణా,రామా! అనుకుంటూ ఉండవచ్చు కదా’అని చెప్పించుకుంటుంటారు. సంతానం తమ కంటే చిన్నవారనుకుంటారే కానీ వాళ్లూ పెద్దవుతున్నారనే సంగతి మరిచిపోతుంటారు. అందుకే వృద్ధాప్య దశకు చేరిన వారు తాపత్రయా లను, మమకారాలను వదిలేయాలని వానప్రస్థాశ్రమ ధర్మం చెబుతోంది. తమ మాటే చెల్లాలని, పిల్లలు తమ మాటే వినాలనే ధోరణిని వదిలేయాలి. వృద్ధాప్యం అనివార్యమని తెలిసినందున ఆర్థికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ దశను ఆనందంగా ఆహ్వానించగలగాలి. అవకాశం ఉన్నంత వరకు సంపాదనలో కొంత భాగం వృద్ధాప్య అవసరాల కోసం పక్కన ఉంచుకోవడం విస్మరించ రానిదని, దీనివల్ల తృప్తిగా, గౌరవప్రదమైన జీవితం గడపవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. వృద్థులు ఒంటరితనమని భావించినా పిల్లలు అప్పటికి ఒంటరులు కారు. వారికి పెద్దలతో కాలక్షేపం చేయాలన్న ఆసక్తి, తీరిక ఉండవు. కాలానుగుణంగా అవసరాలతో పాటు వస్తువుల,మనుషుల విలువలు మారుతుంటాయి. కనుక వాటిని గతాన్ని వర్తమానంతో పోల్చుకొంటూ విచారించడం కంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి: సీనియర్ జర్నలిస్ట్