విదేశీయుల దాస్యశృంఖాల నుంచి భారతావనిని విముక్తి చేసేందుకు ఎందరో యోధులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. భారత గడ్డలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర ప్రాంత మారుమూల ప్రజలు సైతం ఈ పోరులో పాలుపంచుకొన్నారు. ఎవరి బలం, ఎవరి మార్గం మేరకు వారు ముందుకు దూసుకుపోయారు. బలాలు, మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం స్వేచ్ఛ కోసమే. అయితే, స్వాతంత్య్రం సిద్ధించాక ఇలాంటి నిజమైన ధీరులకు చరిత్రపుటల్లో కాసింత స్థానం కరువైపోయింది. ఫలితంగా ఆ శూరుల పోరాటపటిమ తర్వాత తరానికి తెలియకుండా పోయింది. ఆ త్యాగధనుల్లో ఒకరు దూరి దువ్వన్న దొర! ఆయన్నే దువ్వం దొర అని కూడా పిలిచేవారు.

ఊటపల్లిలో జననం

శ్రీకాకుళం (నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, విశాఖ జిల్లా పరిధిలో ఉత్తర విశాఖగా పేరు) రెవెన్యూ డివిజన్‌లో భాగమైన చీపురుపల్లి తాలూకా మొరఖముడిదాం జమీను (జమీందార్లు పాలించే ప్రాంతం) పరిధిలోని ఊటపల్లి గ్రామంలోని ఓ పేద కుటుంబంలో దువ్వన్న జన్మించారు. తేదీ, వారం, సంవత్సరం ఇదమిత్థంగా తెలియలేదు.

అవిద్య, అనాగరికత, దారిద్య్రం, ఆహారలేమి, మూఢ నమ్మకాలు… వీటికితోడు ఆంగ్లేయుల బానిస సంకెళ్లు! ఈ రెండింటి నడుమ కాలం వెళ్లదీస్తుండే వారు ఆనాటి కళింగాంధ్ర మన్యం వాసులు. అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మరణం తర్వాత ఆదివాసీల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తమ పబ్బం గడుపుకొనేందుకు ఆంగ్లేయుల పాలనకు వత్తాసు పలికే భూస్వాముల అనాగరిక చర్యలు దూరి దువ్వన్నను ఆలోచింపజేశాయి. అంతేకాదు… ఆవేదన, ఆవేశాన్ని రగిల్చాయి.

న్యాయం కోసం దోపిడీపైనే దోపిడీ!

 మన్యం, మైదాన ప్రాంతాల కష్టజీవుల కన్నీళ్లు తుడవాలంటే, దోపిడీకి పాల్పడుతున్న ఆంగ్లేయుల భజనపరుల ‘దోపిడీ’యే పరిష్కార మార్గమని దువ్వన్న నిశ్చయించుకున్నాడు. భూస్వాముల అక్రమార్జన, ఆంగ్లేయ అధికారుల సంపదను దోచుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక రచించాడు. ఈ పథకం ఒక గ్రామానికో, ఒక జమీనుకో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర అంతటా అమలుపరచాలని సంకల్పించాడు. అనుకున్నట్టుగానే దువ్వన్న జమీందార్లు, పెత్తందారుల, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించాడు. వారి ఇళ్లను, సంస్థానాలను, సామగ్రి భద్రపరిచే గోదాంలను, పాలనా స్థావరాలను దోచుకోవడం మొదలెట్టాడు. ఆయా ప్రాంత భూస్వాములకు, రాచరికపు ప్రతినిధులకు కునుకు లేకుండా చేశాడు.

ఆంగ్లేయులకు ఫిర్యాదు

దువ్వన్న నుంచి తమను రక్షించాలని భూస్వాములు ఆంగ్లేయులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే వారికి దువ్వన్న వైఖరి తలనొప్పిగా తయారైంది. దువ్వన్నను పట్టుకోవడానికి వ్యూహాలు, ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రోజులు, నెలలు, ఏళ్లు గడుస్తున్నా చిక్కడం లేదు. అంతేకాదు దోపిడీలూ ఆగలేదు! అల్లూరిలా ఆంగ్లేయ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. విసిగెత్తిపోయిన ఆంగ్ల ప్రభుత్వం ‘దమ్ముంటే ముందే చెప్పి దోపిడీ చెయ్యి’ అని ఒక సవాల్‌ను విసిరింది. భరతమాత బిడ్డ కదా ఆంగ్లేయుల సవాల్‌ను దువ్వన్న స్వీకరించాడు. దోపిడీల పరంపర వేగవంతం చేశాడు.

 చెప్పినట్టే దోపిడీ… చెప్పిమరీ దోపిడీ

అసమానమైన ధైర్య సాహసాలు పుణికిపుచ్చుకున్న దువ్వన్న ఏ ఇంటిని దోపిడీ చేయాలన్నా ముందే వారికి తానొస్తున్నానంటూ వర్తమానం పంపి మరీ దోపిడీ చేస్తుండేవాడు. దీంతో ఆయా ప్రాంత భూస్వాములు హడలెత్తిపోతుండేవారు.

కొన్ని సందర్భాల్లో ఆయా వర్తమానాలు ఇంటి తలుపులకు అంటించి మరీ దోపిడీలకు పాల్పడేవాడు. దీంతో దువ్వన్నను పట్టుకునేందుకు సాయుధ బలగాలు కూడా ఆంగ్లేయులు ఏర్పాటు చేసేవారు. ఇదే సమయంలో చీపురుపల్లి ఠాణా ఎస్‌ఐ అప్పల నాయుడుచే మరో ప్రతిపాదనను అధికారులు అమలు చేశారు. ‘ముందుగా చెప్పి, ఆ విధంగా దోపిడీ చేసి, మా నుంచి తప్పించుకున్నట్టయితే తగు బహుమతి అందజేస్తాం’ అని ప్రకటించారు. ఈ ప్రతిపాదనను కూడా స్వీకరించిన దువ్వన్న ‘దోపిడీకి వస్తున్నాను… కాచుకోండి’ అని సవాల్‌ ‌విసిరారు.

తెల్లవారుతుండగా దోపిడీ

అప్రమత్తమైన అధికారులు, ఈసారి ఎలాగైనా దువ్వన్నను పట్టుకుని తీరాల్సిందేనని తమ సాయుధ బలగాలకు హుకుం జారీ చేశారు. సాలూరు పరిసరాల్లోని ఒక గ్రామంలో భూస్వామి ఇంటిపై దోపీడికి వస్తున్నట్టు దువ్వన్న ముందుగానే తెలిపాడు. దీంతో ఊరి పొలిమేరల్లో బలగాలు పహారా కాశాయి. రాత్రంతా కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని నిరీక్షించారు. దువ్వన్న రావడానికి సాహసించలేకపోయాడని బలగాలు భావించాయి.

కానీ, తెల్లవారుతుండగా దోపిడీ జరిగిందన్న సంగతి ఆ ఇంటి నుంచి తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. చెప్పినట్టే దువ్వన్న వచ్చి, తన పని చక్కబెట్టుకుని వెళ్లిపోవడంతో ఆలోచనల్లో పడ్డారు. ఇక దువ్వన్నతో సవాళ్లు పనిచేయవని ఆంగ్లేయ అధికారులు తెలుసుకున్నారు. నాటి ప్రభుత్వం దువ్వన్న దొరను మర్యాద పూర్వకంగా సన్మానించి, దోపిడీ చేయడానికి కారణాలు అడిగి తెలుసుకుంది.

వాస్తవాలు చూపించిన సాహసి

ఆంగ్లేయ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లిన దువ్వన్న… తాను దోపిడీ చేసిన ధనంతో ఉత్తరాంధ్రలోని ఊళ్లను అభివృద్ధి పరిచిన తీరును చూపించాడు. సాలూరు, మక్కువ, చీపురుపల్లి తాలూకాలోని గిరిజన పల్లెలు, అక్కడి ప్రజలు తన ద్వారా ఎలా సాయం పొందారో అధికారులకు తెలిపాడు. బర్మా నుంచి తెప్పించిన కత్తితో దోపిడీలకు పాల్పడేవాడినని చెప్పిన దువ్వన్న ఆ దోపిడీల ద్వారా వచ్చిన సొమ్మును పేద ప్రజలకు ఎలా పంచుతున్నాడో పూసగుచ్చినట్టు వివరించాడు. దోపిడీ ధనంతో పేదలకు కట్టించిన ఇళ్లు, గిరిజన యువతకు చేసిన పెళ్లిళ్లు, ఆహారం కోసం అలమటిస్తున్న వారికి అందించిన పౌష్టికాహార పదార్థాలు, పాఠశాలల ఏర్పాట్లకు ఇచ్చిన నిధులు వంటివి ప్రభుత్వ ప్రతినిధులకు కళ్లకు కట్టినట్టు వివరించాడు.

వీటన్నింటిని పరిశీలించిన అధికారులు దువ్వన్నను ‘దొర’గా కీర్తించారు. అప్పటినుంచి ‘దువ్వన్న దొర’గా ప్రసిద్ధిపొందాడు. ఏ కష్టం వచ్చినా దువ్వన్న దొరకు ఆయన తమ్ముడు రామన్న దొరతో ప్రజలు తమ బాధలు చెప్పుకునేవారు. దోపిడీ సంపదనంతటిని బీద జనానికి దానం చేయడం ఆ కుటుంబానికి పరిపాటి అయింది.

అడుగులపై ఆంక్షలు!

తాము సన్మానాలు ఎన్ని చేసినా దువ్వన్న దొరలో మార్పు రాలేదని భావించిన అధికారులు, ప్రజల్లో తిరగడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ‘జనజీవన స్రవంతిలోనైనా ఉండు! లేకపోతే దోపిడీలు అయినా మాను!’ అంటూ ఆదేశించారు. అయితే, పేద ప్రజల కోసమే నా జీవితం అంటూ అధికారుల ఆదేశాలను ధిక్కరించడంతో దువ్వన్నను పట్టుకుని ఉరితీశారు. దీనికి పన్నాగం ఢిల్లీస్థాయిలో జరిగిందని ఆనాడు ప్రచారంలో ఉండేది. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనకు, అణగారిన వర్గాల గళం అణిచివేతకు దువ్వన్న ఉరితీత ఒక సాక్ష్యంగా మిగిలి పోయింది. తమ కన్నీళ్లు తుడిచే దొర ఇక లేరని తెలిసిన బీదబిక్కిజనం గుండెలు బోరుమన్నాయి.

మన్యం వీరుడు అల్లూరి వారసత్వాన్ని, పౌరుషాన్ని కొనసాగించి, నాటి పోరాటపటిమకు గుర్తుగా మిగిలిన దువ్వన్న దొర వాస్తవ జీవితాన్ని, అతని దోపిడీల వెనుక ఉన్న కన్నీటి గాథలను సమాజం ముందు ఉంచడంలో చరిత్రకారులు, పరిశోధకులు, రచయితలు, స్వాతంత్రానంతర పాలకులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించి, పేదల కన్నీళ్లు తుడిచిన మానవతావాది దువ్వన్న జీవితం గజదొంగగా, దోపిడీదారునిగా చిత్రీకరణకు గురికావడం విచారకరం.

కళింగాంధ్ర నేల, ఉత్తరాంధ్ర పల్లెలో పుట్టిన దువ్వన్న జీవితగాథ రాబోవు తరాలకు తెలియాలి.  కాలగర్భంలో కలిసిపోతున్న ఆయన  సాహస చరిత్రను నేటితరం వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దువ్వన్నను స్వాతంత్య్ర యోధుడిగా ప్రకటించి, అతని జీవితగాథ, పోరాటాలకు అధికారికంగా అక్షరరూపం ఇచ్చిననాడే ఉత్తరాంధ్ర ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆదివాసీల ఆపద్బాంధవుడి జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

– గున్న కృష్ణమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE