సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి అధిక ఆశ్వయుజ శుద్ధ చవితి – 21 సెప్టెంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


చైనాతో చర్చలకు వెనుకాడం, ఆ దేశాన్ని నమ్మబోము అన్నది ఇప్పుడు భారత్‌ అ‌ప్రకటిత వ్యూహంగా కనిపిస్తున్నది. లద్ధాఖ్‌లో పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ (చైనా సైన్యం) దుశ్చర్యలు ఇలాంటి విధానం వైపు మొగ్గక తప్పని పరిస్థితిని భారత్‌కు కల్పించాయి. సైనికాధికారుల స్థాయిలో అటు చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇటు అర్ధరాత్రి  వాస్తవాధీనరేఖ వద్ద కొత్త శిబిరాలు అవతరిస్తూ ఉంటాయి. ఇటీవల రష్యాలో జరిగిన భారత్‌, ‌చైనా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశంలో కూడా సరిహద్దులలో సైన్యాలను ఉపసంహరించి, శాంతిని నెలకొల్పాలన్న విషయానికే తమ దేశం కట్టుబడి ఉందని చైనా విదేశాంగ మంత్రి మళ్లీ చెప్పారు. శాంతి మంత్రం జపిస్తూనే అశాంతి సృష్టించడం ఆ దేశ ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాంతి ఒప్పందం మీద సంతకం చేసి, ఆ సంతకం సిరా ఆరకుండానే దాడులు చేసేవాడని హిట్లర్‌కు పేరు. ఇప్పుడు చైనా అలాంటి విద్యనే ప్రదర్శిస్తున్నది. సరిహద్దులలో చైనా సేనలు వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆంగ్లపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రచురించిన పరిశోధనాత్మక వార్తా కథనం దేశాన్ని కుదిపేసింది. అదే చైనా హైబ్రీడ్‌ ‌యుద్ధక్రీడకు సంబంధించినది.

అన్ని రకాలుగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి విఫలమైన చైనా తాజాగా సైబర్‌ ‌సెక్యూరిటీ దాడులను ముమ్మరం చేసినట్టు తేలింది. దీనినే ఇప్పుడు హైబ్రీడ్‌ ‌యుద్ధ వ్యూహమని పిలుస్తున్నారు. ఇదొక ఆయుధమే. సైన్యంతో, దాడులతో, రక్తపాతంతో, హింసతో సంబంధం లేకుండా శత్రువును కుంగదీసే అప్రకటిత యుద్ధంలో ఉపయోగించే ఆయుధమిది. కరోనా వంటి జీవాయుధాలతో పాటే, ఇలాంటి సైబర్‌ ‌రక్షణను ఛేదించే ఈ తరహా ఆయుధాలు కూడా చైనా అమ్ముల పొదిలో పుష్కలంగా ఉన్నట్టు భావించవలసి వస్తున్నది.‘అన్‌రెస్ట్రిక్టెడ్‌ ‌వార్ఫేర్‌’ అనే తన పత్రంలో 1999లోనే చైనా సైన్యం హైబ్రీడ్‌ ‌యుద్ధ విన్యాసం రూపురేఖలను వివరించిందట. ఇది పైకి చాలా మామూలుగా కనిపించే పెద్ద కుట్ర. భయంకరమైన మైండ్‌ ‌గేమ్‌.

‌భారతదేశంలో రాజకీయం, వాణిజ్యం, న్యాయశాఖ, మీడియా, సినీ రంగాలకు చెందిన దాదాపు 10,000 మంది వ్యక్తిగత సమాచారం మొత్తం ఇప్పుడు చైనా సేకరించిందన్నదే ఆ ఆంగ్లపత్రిక కథనం సారాంశం. వీరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, గాంధీ కుటుంబం మొదలు ఎందరో ఉన్నారు. రాజకీయ రంగం వారే 1,350 అని తేలుతోంది. ప్రముఖులతో పాటు వారి మిత్రులు, సమీప  బంధువుల సమాచారం కూడా అది సేకరించింది. పంచాయతీ బోర్డు సభ్యుల నుంచి పార్లమెంట్‌ ‌సభ్యుల వరకు, మేయర్‌లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల సమాచారాన్ని చైనా సేకరిస్తూనే ఉంది. ఈ సమాచార సేకరణకు పార్టీలతో నిమిత్తం లేదు. బీజేపీ వారు సరే, కాంగ్రెస్‌ ‌మీద కూడా ఈ వల ఉంది. ఇంకా ఆశ్చర్యం- వామపక్ష ప్రముఖుల సమాచారం కూడా ఆ దేశం సేకరిస్తున్నది. ప్రాంతీయ పార్టీల నేతలను కూడా చైనా విడిచిపెట్టలేదు. ముఖ్యమంత్రులయితేనేమి, మాజీ ముఖ్యమంత్రులైతేనేమి! నలభయ్‌ ‌మంది మీద చైనా కన్నేసింది. రెండేళ్లు శ్రమించి ఆ పత్రిక ఈ సంచలనాత్మక కథనం ఇటీవల వెలువరించింది. సమాచార సేకరణ పని అంతకు ముందుదే అన్నమాట.

ఇంతకీ ఇదెలా సాధ్యం? ఓవర్సీస్‌ ‌కీ ఇన్ఫర్మేషన్‌ ‌డేటాబేస్‌ అనే సంస్థ ఈ నికృష్టపు పని సాగిస్తున్నది. ఇది జిన్హువా డేటా కంపెనీ కనుసన్నలలో పని చేస్తుంది. ఇక జిన్హువా చైనా ప్రభుత్వం, అక్కడి కమ్యూనిస్టు పార్టీ, సైనిక వ్యవస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, వాటి అదుపాజ్ఞలలో నడుచుకుంటుంది. ఓవర్సీస్‌ ‌డేటాబేస్‌ ‌పని అంతర్జాతీయంగా ఇలాంటి దొంగ వ్యూహాలతో పౌర సమాజంలోని ప్రముఖుల వ్యక్తిగత సంగతులను కూపీ లాగి చైనాకు చేరవేయడం. భారతీయులు ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ద్వారానే అది ఈ పని చేయగలుగుతున్నది. అంటే మన జేబులో సొమ్ముతోనే మన లోగుట్టును మన శత్రుదేశానికి ఈ సంస్థ సమకూర్చి పెడుతున్నది. ఆన్‌లైన్‌ ‌ద్వారా తన కార్యం నెరవేర్చుకుంటున్నది.

సమాచార సేకరణ పరిధి చాలా లోతుగా ఉంది. రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఇందులో ఎక్కువ. దేశానికి వస్తున్న పెట్టుబడుల వివరాలు దీనితో చైనా తెలుసుకుంటున్నది. ఇది సరే. బీజేపీ, మోదీ సమాచారం చైనా రహస్యంగా సేకరించదలిచిందంటే వింతేమీ కాదు. కానీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీల నేతల సమాచారం కూడా చాటుగా సేకరించడం ఎందుకు? జేకే, లద్ధాఖ్‌, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువగా సమాచారం కోసం ఆ సంస్థ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంది. మనం చైనా పెట్టుబడులను ఇబ్బడిముబ్బడి ఆహ్వానించామని, ఆ పెట్టుబడులు సమాచార వ్యవస్థలో కూడా భారీగా ఉన్నాయని, ఈ మార్గం ద్వారానే మన ఆర్థిక వ్యవస్థను చైనా శాసించగలిగే స్థాయికి చేరుకుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు భారీగా చైనా యాప్‌లను నిషేధించడంతో సరిహద్దులలో ఆ దేశం గభాను రెట్టింపు చేసిందన్న అభిప్రాయం కూడా కొట్టి పారేయలేనిది. ఇవాళ్టి పరిస్థితులలో ప్రపంచంలో ఎవరూ భౌతికదాడులకు దిగడం సాధ్యం కాదు. అందుకే సైబర్‌రక్షణ వ్యవస్థ మీద చాటు నుంచి దాడులు చేయడం మొదలు పెట్టారన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ఉంది. అన్ని పక్షాలు కోరినట్టు చైనా వ్యవహారాల మీద కూడా మనం నిఘా వేయాలి. చైనాతో తలనొప్పి ఇప్పుడే వదిలేది కాదని అర్థమయింది. అందుకు తగిన విధంగా వ్యవహరించడమే భారత్‌ ‌ముందున్న కర్తవ్యం.

About Author

By editor

Twitter
YOUTUBE