ఏ దేశానికైనా సరిహద్దు వివాదాలు ఉండటం సహజం. పొరుగు దేశాలతో మంచి సంబంధాలను అనుసరించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాటిని పరిష్కరించుకోవచ్చు. అయితే కొన్ని దేశాలు మాత్రం మితిమీరిన దురహంకారం, సామ్రాజ్యవాద ధోరణితో పొరుగు దేశాల సరిహద్దుల మీద కన్నేస్తాయి. మరికొన్ని దేశాలు గిల్లికజ్జాలతో సమస్యను ఎటూ తెగనివ్వకుండా శత్రుత్వాన్ని కొనసాగిస్తుంటాయి. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు ఇలాంటివే. పొరుగు దేశాల విషయంలో కుటిల పన్నాగాలతో ప్రపంచమంతా అసహ్యించుకునే పరిస్థితిని తెచ్చుకున్నాయి. సరిహద్దుల విషయంలో తరచూ భారత్‌తో ఘర్షణలకు దిగుతున్న ఈ రెండు దేశాలకు ప్రపంచ దేశాలు క్రమంగా దూరమవుతున్నాయి.
భారత సరిహద్దుల్లో అటు పాకిస్తాన్, ఇటు చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మన భూభాగాల్లో తిష్ట వేయడంతో పాటు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ రెండు దేశాలు మొదటి నుంచి భారత్‌ను ఉమ్మడి శత్రువుగానే భావిస్తున్నాయి. తనవికాని భూభాగాలపై కన్నేసి ఆక్రమించుకోవడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఇరుగు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే చైనా నిన్నటి దాకా పాకిస్తాన్ దురాగతాలకు అండగా ఉండేది. ఇప్పుడు నేపాల్‌ను కూడా మనదేశం మీదకు రెచ్చగొడుతోంది. డోక్లాం, గల్వాన్ లోయల్లో అక్రమంగా ప్రవేశించ బోయి భారత సైన్యం చేతిలో భంగపడిన చైనాను కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ శత్రువు గానే చూస్తున్నాయి. చైనాకు ఏ పొరుగు దేశంతో సత్సంబంధాలు లేవు. తన దురాక్రమణ ధోరణితో ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత్వం పెంచుకుంది.
మొన్నటి దాకా అమెరికా సాయంతో ఉగ్రవాదు లను పెంచి పోషించిన పాకిస్తాన్‌ను ఇప్పుడు అగ్రదేశం సైతం దూరం పెడుతోంది. ఉగ్రవాదాన్ని నియంత్రిస్తేనే సాయం అందుతుందని అమెరికా, ప్రపంచ ఆర్థిక సంస్థ ఇప్పటికే ప్రకటించాయి. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్‌తో తన స్నేహన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. తక్కువ ధరకు చమురు సరఫరా ఒప్పందం పునరుద్ధరించేది లేదని స్పష్టం చేయడంతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలను వెంటనే తీర్చేయాలని పాక్ మీద ఒత్తిడి తెస్తోంది. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, ప్రపంచానికి ఇప్పుడు కంటిలో నలుసులా కనిపిస్తోంది.
పాకిస్తాన్, చైనాల తీరు ఇలా ఉంటే భారత్ మాత్రం సరిహద్దు వివాదాల విషయంలో పొరుగు దేశాలతో చాలా వ్యూహాత్మకంగా, సఖ్యతగా వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవడాన్ని మనం గమనించవచ్చు.
భారతదేశ సరిహద్దులు
ప్రపంచంలో భారత్ మొత్తం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలో మీటర్లు. మనదేశం భూగోళం మీద 2.4 శాతం ఉంటుంది. వైశాల్య పరంగా ప్రపంచంలో ఏడో స్థానం మనది. ఆసియా ఖండంలో రెండో స్థానం (రష్యాను మినహాయిస్తే). భారత్ ఏడు దేశాలతో 15,106.7 కిలో మీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది.
దేశాలవారీగా భారత్ సరిహద్దులు: బంగ్లాదేశ్-4,096 కి.మీ.; చైనా-3,488 కి.మీ.; పాకిస్తాన్-3,323 కి.మీ.; నేపాల్-1,751 కి.మీ.; మయన్మార్-1,643 కి.మీ.; భూటాన్-699 కి.మీ.; ఆఫ్ఘానిస్తాన్•-106 కి.మీ.
శ్రీలంక మన పొరుగు దేశమే అయినా, అది సముద్రంలో ఉన్నందున మన దేశంతో నేరుగా భౌగోళిక సరిహద్దులు లేవు.
వాస్తవానికి ఇప్పుడు దక్షిణాసియా (భారత ఉపఖండం) పేరుతో పిలుస్తున్న ప్రాంతమంతా ప్రాచీన కాలం నుంచి అఖండ భారతంగా ఉండేది. చారిత్రక కారణాలతో విడిపోతూ వచ్చాయి. స్వాతంత్య్రానికి కొద్ది సంవత్సరాల ముందు వరకూ బర్మా (మయన్మార్), శ్రీలంక దేశాలు పాలనా పరంగా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నాయి. టిబెట్, నేపాల్ స్వతంత్ర దేశాలైనా బ్రిటిష్ ఇండియాతో రక్షణ ఒప్పందాలు ఉండేవి. భారత్ నుంచి అధికారికంగా చివరగా విడిపోయిన భూభాగం పాకిస్తాన్ (14 ఆగస్టు 1947). ఆ తర్వాత పాక్, చైనాలు మన దేశంలోని కొన్ని భూభాగాలపై అక్రమంగా పట్టు కొనసాగిస్తున్నాయి.
పుట్టుకతోనే పాక్‌తో వివాదం
భారతదేశ విభజన కోసం సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు 1947లో వైస్రాయ్ సర్ రాడ్‌క్లిఫ్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ 1.భారత్, 2.పశ్చిమ పాకిస్తాన్, 3.తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) సరిహద్దులను నిర్ధారించింది. ఈ సరిహద్దునే రాడ్‌క్లిఫ్ రేఖ అని పిలుస్తారు. కొన్నిచోట్ల ఈ సరిహద్దు రేఖ సంక్లిష్టంగా ఉండటంతో వివాదాలు వచ్చాయి.
జమ్ముకశ్మీర్
భారత్ నుంచి విడిపోయి పుట్టుకతోనే శత్రుదేశంగా మారిన పాకిస్తాన్ మొదట కన్నేసింది కశ్మీర్ మీదనే. తటస్థంగా ఉన్న జమ్ముకశ్మీర్ సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ కిరాయి సైనిక మూకలను పంపింది. దీంతో సంస్థానాధిపతి మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 24న జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన భారత సైన్యం పాక్ సైన్యాన్ని తిప్పికొట్టడం ప్రారంభించింది. జమ్ముకశ్మీర్‌ను పాకిస్తాన్ సైన్యం నుంచి పూర్తిగా విడిపించక ముందే నాటి ప్రధాని నెహ్రూ తొందరపాటుతో ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశారు. ఐరాస ఆదేశాల మేరకు ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ అమల్లోకి వచ్చింది. దీంతో అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ముజఫరాబాద్ (72,971 చ.కి.మీ.) గిల్గిత్, బాల్టిస్తాన్ (13,297 చ.కి.మీ.) అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ ప్రాంతమే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే). ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సరిహద్దును సీజ్ ఫైర్ లైన్ అని పిలిచేవారు. దీన్ని 1972లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ)గా మార్చారు. భారత్-పాక్‌ల మధ్య జరిగిన తొలి యుద్ధం ఇక్కడే.
షక్సగమ్ వ్యాలీ
ఆక్రమిత కశ్మీర్ మీద న్యాయపరంగా పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కులు లేవు. అయినప్పటికీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన బాల్టిస్తాన్‌లోని షక్సగమ్ వ్యాలీని 1963లో చైనాకు అప్పగించింది పాక్. ఈ ప్రాంతంపై వ్యూహాత్మకంగా పట్టుబిగించింది చైనా. చైనాలోని గ్జియాంగ్జిన్ ప్రావిన్స్ నుంచి అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ పోర్టు వరకు నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ఆక్రమిత పాకిస్తాన్‌లోని గిల్గిత్, బాల్టిస్తాన్, బలూ చిస్తాన్ మీదుగా సాగుతోంది. భారత్ ఈ ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం వస్తే పాకిస్తాన్‌కు చైనా సహకరించేందుకు షక్సగమ్ వ్యాలీ కీలకంగా మారింది.
సియాచిన్ గ్లేసియర్
హిమాలయాల్లోని కారకోరం పర్వత శిఖరాల్లో హిమానీ నదులతో విస్తరించిన సియాచిన్ గ్లేసియర్ ఎంతో కీలక ప్రాంతం. ఇరుదేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించే సమయంలో బ్రిటిష్ అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సియాచిన్ మీద పట్టు బిగించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు నిలువరిస్తూ వచ్చింది. 1984లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా భారత్ స్వాధీనంలోకి వచ్చింది సియాచిన్. 1989లో దీనిపై భారత సైన్యం పూర్తి పట్టు సాధించింది. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా మారింది. ఏమాత్రం అవకాశం ఉన్నా సియాచిన్‌లోకి ప్రవేశించడానికి పాక్ సైన్యం నిరంతరం గుంటనక్కలా ఎదురుచూస్తోంది. అత్యంత శీతల వాతావరణం ఉండే సియాచిన్‌లో మనుగడ సాగించడం చాలా కష్టం. మనదేశ సరిహద్దులను కాపాడేందుకు ఎంతో మంది జవానులు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అక్కడ విధులను నిర్వహిస్తున్నారు.
సర్ క్రీక్
గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, పాక్‌లోని సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న చిత్తడి ప్రాంతం సర్ క్రిక్. స్వాతంత్య్రం తర్వాత కచ్ సంస్థానం భారత సమాఖ్యలో చేరింది. గతంలో ఈ ప్రాంతం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగం. పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో సర్ రాడ్‌క్లిఫ్ కమిటీ ఇక్కడున్న 17 క్రీకులను సక్రమంగా విభజించలేదు. ఇక్కడి మొత్తం 3,500 చ.కి.మీ. భూభాగంలో పాకిస్తాన్‌కు 350 చ.కి.మీ. ఇస్తూ సరిహద్దు రేఖ నిర్ణయించారు. అయితే ఇది తమకే చెందుతుందని పాక్ వాదన. దేశ విభజన ద్వారా కరాచీ నౌకాశ్రయం పాకిస్తాన్‌లో భాగం కావడంతో భారత ప్రభుత్వం ఖాండ్లాలో కొత్త నౌకాశ్రయం నిర్మించింది. కచ్ విషయంలో భారత్, పాక్ మధ్య దీర్ఘకాలం వివాదం సాగింది. 1965లో జరిగిన యుద్ధంలో పాక్ సైన్యం కచ్‌లోకి ప్రవేశించకుండా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. 1999 కార్గిల్ యుద్ధం తరువాత కొన్ని వారాలకు వివాదాలు తిరిగి తలెత్తాయి. దేశ రక్షణతో పాటు వాణిజ్య పరంగా సర్ క్రీక్ ఎంతో కీలకం. ఇక్కడి నుంచి చొరబాట్లు, అక్రమ రవాణాకు అధికంగా అవకాశం ఉంది.
చైనా దురాక్రమణ ధోరణి
ప్రాచీన కాలం నుంచి భారత్, చైనాల మధ్య సంస్కృతి, వాణిజ్య సంబంధాలున్నాయని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బ్రిటిష్ కాలం నుంచి క్షీణించాయి. అయితే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ చైనాను గుడ్డిగా నమ్మడం ప్రస్తుత సమస్యలకు దారి తీసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించడాన్ని, ఐక్యరాజ్య సమితిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడాన్ని సమర్థించారు. హిందీ-చీనీ భాయి భాయి భ్రమల్లో పూర్తిగా మునిగిపోయారు నెహ్రూ. ఇలాంటి సమయంలో 1962లో భారత్ మీదకు చైనా దండెత్తింది. నాటి నుంచి కొన్ని భూభాగాలు చైనా కబ్జాలోనే ఉండిపోయాయి.
పశ్చిమ సెక్టార్ పరిధిలోని జమ్ముకశ్మీర్ లద్ధాఖ్ రీజియన్‌లోని అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా దురాక్రమించుకుంది. తూర్పు సెక్టార్ పరిధిలోని అరుణాచల్‌ప్రదేశ్, టిబెట్ మధ్య బ్రిటిష్ పాలకులు గుర్తించిన సరిహద్దును మక్‌మోహన్ రేఖగా పిలుస్తారు. దీన్ని చైనా ఎప్పటి నుంచో అంగీకరించడంలేదు. వాస్తవానికి టిబెట్ మీద ఎలాంటి హక్కులు లేకున్నా దురాక్రమించిన చైనా, అరుణాచల్‌లోని 65,000 చ.మీ. భూభాగం తమదేనని గుడ్డిగా వాదిస్తోంది. దీన్ని దక్షిణ టిబెట్‌గా చెప్పుకొస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనకు మన రాష్ట్రపతి, ప్రధానులతో సహా ప్రముఖులు ఎవరు వెళ్లినా చైనా అభ్యంతంర వ్యక్తం చేయడం ఆనవాయితీగా మారింది. ఇక మధ్య సెక్టార్ పరిధిలోని హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల విషయంలో కూడా తరచూ పేచీలకు దిగుతోంది చైనా. సిక్కింను చాలా కాలం వరకూ భారత్‌లో అంతర్భాగంగా గుర్తించలేదు. 2005లో కుదిరిన సరిహద్దు ఒప్పందం తర్వాతే అంగీకరించింది.
ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత మన సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచారు. యుద్ధం వస్తే త్వరితగతిన ఆయుధాలు, ఆహార అవసరాలను వెంటనే అందించడానికి వీలుగా పటిష్టమైన రోడ్లను నిర్మించడం చైనాకు నచ్చలేదు. భారత్‌కు అత్యంత ఆప్త పొరుగు దేశం భూటాన్. దీని రక్షణ బాధ్యత భారత్‌దే. భూటాన్‌లోని డోక్లాం లోయ మీద కన్నేసింది చైనా. 2018లో అక్కడ రోడ్డు మార్గం వేసేందుకు ప్రయత్నించింది. దీన్ని భారత సైన్యం గట్టిగా ప్రతిఘటించడంతో తాత్కాలికంగా తోక ముడిచారు చైనా సైనికులు. అప్పటి నుంచి చైనా పాలకులు భారత్ మీద బుసలు కొట్టడం ఎక్కువైంది. తాజాగా పశ్చిమ సెక్టార్‌లోని లద్ధాఖ్‌లో ఉన్న గల్వాన్ లోయలోని పాంగాంగ్ సరస్సు దగ్గర చైనా చొచ్చుకురావడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.
నేపాల్‌ను రెచ్చగొడుతున్న చైనా
భారత్, నేపాల్ దేశాల మధ్య చిరకాలంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, స్నేహ సంబంధాలున్నాయి. నేపాల్‌కు అవసరమైన ఎగుమతులు, దిగుమతులన్నీ భారత్ మీదుగానే సాగుతాయి. భారత ఓడరేవులను నేపాల్ ఉపయోగించుకుంటోంది. భారత్, నేపాల్ దేశ పౌరులు పాస్‌పార్టులు లేకుండానే స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే నేపాల్ రాజకీయాల్లో చైనా జోక్యం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పాలకులు పూర్తిగా చైనా కనుసన్నల్లో నడుస్తున్నారు. ఇటీవల నేపాల్ ప్రధాని కేపీ ఓలి పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని అవలంభించడం తెలిసిందే. ఉత్తరాఖండ్ పరిధిలోని సరిహద్దుల్లో మానససరోవర్ యాత్రికుల కోసం భారత ప్రభుత్వం రోడ్డు మార్గం మెరుగుపరచడం చైనాకు కంటగింపుగా మారింది. చైనా వెనుదన్నుతో రెచ్చిపోయిన కేపీ ఓలి భారత్‌తో సరిహద్దు వివాదాలకు తెరలేపారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న లిపులేఖ్, కాలాపానీ, లింపాధురియా భూభాగాలు తమ దేశానివిగా చూపిస్తూ నేపాల్ కొత్త మ్యాప్ రూపొందించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించే దశకు వచ్చాయి. భారత్ ఎంత సంయమనంగా ఉన్నా చైనా అండతో ఓలి రెచ్చిపోవడంతో ఇరు దేశాల ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
బంగ్లాతో సరిహద్దుల పరిష్కారం
భారతదేశ విభజన ద్వారా వేరైన తూర్పు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల కారణంగా 1971లో బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులు మొదటి నుంచి సంక్లిష్టంగానే ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు భారతదేశంలోకి చొరబడటం భౌగోళిక సమగ్రత దెబ్బతినడానికి కారణమవుతోంది. బంగ్లా సైనికులు, భారత జవాన్లతో ఘర్షణకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు స్వస్తి చెప్పే దిశగా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా తీన్ బిఘా కారిడార్‌కు అనుమతిచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన దహగ్రామ్ పూర్తిగా భారత భూభాగం పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు తీన్ బిఘా కారిడార్‌ను శాశ్వత ప్రాతిపాదికన భారత్ లీజుకు ఇచ్చింది. ఇందుకు ప్రతిగా దక్షిణ బెరుబారి భారతదేశం ఆధీనంలోనే ఉంటుంది. ఈ ఒప్పందంతో అక్రమ వలసలకు కొంత బ్రేక్ పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో న్యూయూర్ దీవులు, సిలిగురి కారిడార్, తిపాయ్‌ముఖ్ ప్రాజెక్టు, మతబంగా నదీ జలాల వివాదం, తీస్తా జల వివాదం పరిష్కారం కావాల్సి ఉన్నాయి.
శ్రీలంకతో కచ్చాతీవు వివాదం
భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. లంకకు దగ్గరలో ఉన్న ఈ దీవిని తమిళనాడుకు చెందిన జాలర్లు చేపలను ఆరబెట్టుకోవడానికి ఉపయో గించుకుంటారు. అయితే శ్రీలంకతో ఘర్షణ వాతావరణాన్ని నివారించే దిశగా కచ్చాతీవు విషయంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీలంకకు ధారాదత్తం చేశారు. ఈ ఒప్పందాన్ని తమిళనాడు జాలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లంకతో కుదిరిన ఒప్పందం ప్రకారం చేపల వేటకు వెళ్లే మన జాలర్లకు ఎలాంటి అవరోధాలు కల్పించకూడదు.. కానీ తరచూ తమిళ జాలర్లను లంక నేవీ అరెస్టు చేయడం సమస్యలకు దారితీస్తోంది. ఈ ద్వీపంలో ఉన్న ఆంథోనీ చర్చిలో ఏటా జరిగే ఉత్సవాలకు ఇరు దేశాల క్రైస్తవులను మూడు రోజుల పాటు శ్రీలంక అనుమతిస్తోంది. అయితే ఇప్పుడు కచ్చాతీవులో చైనా తిష్ట వేసినట్లు తెలుస్తోంది. శ్రీలంకలోని అంబన్‌తోట నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న చైనా తన పెర్ల్ గార్లెండ్ (ముత్యాలదండ) కోసం కచ్చాతీవును ఉపయోగించుకుంటోంది.
మయన్మార్, ఆఫ్ఘాన్‌తో వివాదాలు లేవు!
భారత్, బర్మా(మయన్మార్) దేశాల మధ్య ఉన్న స్వల్ప సరిహద్దు వివాదాలు 1964లోనే పరిష్కార మయ్యాయి. కాగా ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులు తరచూ మయన్మార్ భూభాగాలను ఉపయోగించు కుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ తన అవసరాల కోసం మయన్మార్ ఆ దేశంతో సఖ్యతగా ఉంటోంది. అయితే భారత్‌తో మాత్రం ఎలాంటి వివాదాలు లేవు. ఇక దేశ విభజన తర్వాత భారత్‌కు ఆఫ్ఘానిస్తాన్‌తో అతిచిన్న సరిహద్దు (106 కి.మీ.) మిగిలింది. దీని డ్యూరాండ్ రేఖగా పిలుస్తారు. ఆఫ్ఘాన్‌లో శాంతి వాతావరణం ఏర్పడి ప్రజాస్వామ్యం బలోపేతం కావాలని కోరుకుంటున్న భారత్ అక్కడ మౌలిక సదుపాయాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ భవనం నిర్మించి ఇచ్చింది.
ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించడం చైనాకు ఎంతతమాత్రం ఇష్టం లేదు. ఆ దేశాలకు సహాయం అందించడం ద్వారా భారత్‌కు దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ప్రస్తుతం చైనా చేస్తున్న పని ఇదే. భూటాన్ మాత్రమే చైనాను గట్టిగా వ్యతిరేస్తోంది. మిగతా దేశాల విషయంలో భారత ప్రభుత్వం దౌత్య పరంగా మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
– క్రాంతిదేవ్ మిత్ర : సీనియర్ జర్నలిస్ట్