జాతీయ స్థాయిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రారంభించిన సంతుష్టీకరణ అంటురోగం ప్రాంతీయ పార్టీలకూ సోకి దేశం అంతటా విస్తరిస్తోంది. స్వాతంత్య్ర సమరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడానికి ముస్లిముల తోడ్పాటు అనివార్యమనే భ్రమలో జాతీయ కాంగ్రెస్‌కు గాంధీజీ అలవర్చిన ఎత్తుగడే రాజకీయ సంతుష్టీకరణ. జాతీయతకు, జాతి సమైక్యతకు ఈ విధానం చెరుపు చేస్తుందని సావర్కర్ ఆనాడే చెప్పారు. సావర్కర్ హెచ్చరికను పెడచెవిన పెట్టిన ఫలితం ద్విజాతి సిద్ధాంతం పేర జిన్నా రూపంలో అప్పుడే అనుభవంలోకి వచ్చింది. ఆంగ్లేయులు దేశాన్ని ముక్కలు చేయగా, పాకిస్తాన్ అనే ఇస్లామిక్ రాజ్యం పేరుతో మూడో వంతు భూభాగాన్ని సొంతం చేసుకుని జిన్నా వెళ్లి పోవడం చరిత్ర.
బిడ్డ చచ్చినా పురిటి కంపు పోనట్లు దేశం ముక్కలైనా సంతుష్టీకరణ జాడ్యం కాంగ్రెస్‌ను, మన దేశాన్ని వదల్లేదు. నెహ్రూ కొనసాగించిన ఈ జాడ్యానికి రాజ్యాంగబద్ధగాం సెక్యులరిజం ముసుగేసి ఇందిర మరింత బలోపేతం చేశారు. ఎత్తుగడల పేరిట ఏ రోటి దగ్గర ఆ పాట పాడే కమ్యూనిస్టులు దీన్ని చులాగ్గా అందిపుచ్చుకున్నారు. ‘మతం మత్తుమందు’ అని ఢంకా బజాయిచే కమ్యూనిస్టులు ముస్లి, క్రైస్తవమతస్తులను లోబరచుకోడానికి మైనారిటీ హక్కుల ముసుగేశారు. అంతర్జాతీయవాదం ముసుగులో రష్యా, చైనాల చెక్క భజన చేసే ఈ విభజన వాదులకు దేశభక్తి, జాతీయతల పొడ గిట్టదని దశాబ్దాల చరిత్ర సాక్ష్యమిస్తోంది. పేద, శ్రమజీవుల పక్షాలుగా డప్పు కొట్టుకునే ఈ ఎర్రదండు జాతీయత, దేశభక్తిని సమర్థించే యస్సీ, యస్టీ వర్గాలకు చెందిన పేదలను సైతం పొట్టన పెట్టుకోవడానికి వెనుదీయదని కేరళ అనుభవాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్, కమ్యూనిష్టుల వైఫల్యాల ఫలితంగా ఊపిరి పోసుకున్న ప్రాంతీయ పార్టీలు సైతం సత్వరమే రాజకీయ అధికారాన్ని అందుకోవాలనే ఆత్రుతలో వినాశకర సంతుష్టీకరణ ఎత్తుగడలకు దిగజారడం విషాదం. సహజంగా జాతీయవాదులైన హిందువులు వేర్వేరు రాజకీయ పార్టీల పంచన చేరి, రాజకీయంగా చీలిపోతున్నారు. కనుక మైనారిటీల మద్దతు పొందిన వారికి గెలుపు తధ్యం అనే విశ్లేషణల సారాంశం ప్రాంతీయ పార్టీలను సంతుష్టీకరణకు పురికొల్పుతోంది. రామ జన్మభూమి విషయమై జాతీయ స్థాయిలో అనుభవమైన సంతుష్టీకరణ దుష్ఫలితాలు మజ్లిస్ వల్ల తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి రావడం తాజా చరిత్ర. ‘హిందూగాళ్లు, బొందూగాళ్లు’ అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీనగర్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం గుర్తుంచుకో తగినది. కులమతాలకు అతీతంగా దేశప్రజలంతా ఆగస్ట్ ఐదున అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ భూమిపూజను స్వాగతించారు. ఒక్క మజ్లిస్, కొన్ని ముస్లిం సంఘాలు మాత్రమే భిన్నస్వరం వినిపించాయి. కేసీఆర్ అడదండలే మజ్లిస్‌కు ఈ ధైర్యాన్ని ఇచ్చాయనే వ్యాఖ్యలు సత్యదూరం కాదు.
ఆంధప్రదేశ్‌లో మంత్రులు క్రైస్తవ మతప్రచారకులను, పాస్టర్లను మించి పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో ఆనంద ప్రార్థనా మందిరం అనే భవనాన్ని ప్రారంబిస్తూ ఆధప్రదేశ్ మంత్రి నాని చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. ‘ప్రపంచంలోని 800కోట్ల జనాభాలో 700కోట్ల మంది ఏసును ప్రార్థించే క్రైస్తవులే అని మంత్రి తేల్చి చెప్పారు. ఈ మంత్రి లెక్క ఎంత చెప్పడానికి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల జనభా లెక్కిస్తే చాలు. రోడ్డు మీద ఎవరైనా క్షతగాత్రులై పడుంటే ఇతరులు అంటు అని భయపడి దూరంగా వెళతారని, క్రైస్తవులు మాత్రం వెంటనే సేవలు అందిస్తారని ఆయన ప్రశంసించారు. ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రైస్తవులే అని, క్రైస్తవం చాలా మంచిది, మేలైనది అని ప్రచారం చేయడం ఆయన ఉద్దేశంగా తేటతెల్లమవుతోంది.
‘క్రైస్తవులు చేసిన ప్రార్థనల వల్లే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అని మరోచోట మరో మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంత్రులు ఆళ్ల నాని, మేకతోటి సుచరితల ప్రసంగాల వీడియోలు, ప్రచురితమైన వార్తా కథనాలు, దానికి శివశక్తి అనే ధార్మికసంస్థ స్పందన విడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు అనే వైసీపీ శాసనసభ్యుడు ఓ సభలో మాట్లాడుతూ ‘ స్వేచ్ఛగా మత మార్పిడులు చేసుకోండి ఎవరేం చేస్తారో నేను చూస్తాను’ అంటూ పాస్టర్లను ప్రోత్సహిస్తూ చేసిన ప్రసంగం ఓటుబ్యాంకు రాజకీయాల వికృతికి పరాకాష్ట.
జాతీయ స్థాయి నుండి రాష్ట్రాలకు సోకిన ఈ సంతుష్టీకరణ జాడ్య మండల, గ్రామ పంచాయతీల స్థాయికి చేరుకోనుంది. రాజకీయ లబ్ధికోసం మైనారిటీలను దువ్వడంతో మొదలైన ఓటు బ్యాంకు రాజకీయం పరోక్షంగా మత మార్పిడులకు ఊతమిస్తోంది. జాతీయతకు, జాతి సమైక్యత, సమగ్రతలకు ముప్పుగా మారనున్న ఈ రాజకీయ అంటు జాడ్యాన్ని నివారిచడానికి హిదూ సమాజం సమాయత్తం కావాలి. జాతీయత పరిరక్షణ కోసం హిందూ సమాజం జాతీయ, ప్రాతీయ, గ్రామ పంచాయతీ స్థాయి దాకా రాజకీయ ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది!