అక్షరాభ్యాసం నుంచి పరిశోధన స్థాయి వరకు నూతన జాతీయ విద్యా విధానం పెను మార్పులను సూచించిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపి) అఖిల భారత సంఘటన మంత్రి గుంత లక్ష్మణ్ చెబుతున్నారు. పాఠ్యాంశాల ఎంపికను సరళం చేయడం ద్వారా విద్యార్థి వికాసానికి దోహదపడే విధంగా, అటు విజ్ఞానశాస్త్ర అంశాలు, ఇటు సామాజికశాస్త్ర అంశాలను మేళవించి చదువుకునే అవకాశం ఇది కల్పిస్తున్నదని చెప్పారు. ఇది భారతీయత, విద్యార్థి అభిరుచి కేంద్రాలుగా రూపొందిన విధానమని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రద్దు, ఎంఫిల్‌కు స్వస్తి పలకడం, ఏక ఛత్రం కిందనే విద్య గురించిన నిర్ణయాలకు అవకాశం కల్పించడం వంటి అంశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అలాగే కొందరు విమర్శిస్తున్నట్టు ఇందులో రిజర్వేషన్‌ల వ్యతిరేక నిర్ణయాలు ఏమీలేవనీ, ఇది విద్యార్థి సంఘాల బాధ్యతను పెంచే విధానమని చెబుతున్నారు. ఇంటర్వ్యూలోని అంశాలు, జాగృతి పాఠకుల కోసం:
బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) ప్రత్యేకతలు ఏమిటి?
విధాన పత్రం విజన్ పేపర్‌లో ఈ విధానాన్ని భారత కేంద్రిత విధానమని ప్రస్తావించారు. విద్యార్థిని కేంద్ర బిందువుగా తీసుకున్న విధానమిది. ప్రాథమిక, ఉన్నత, పరిశోధన విద్యలో విద్యార్థి ఆధారిత, విద్యార్థి అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి సృజనను వెలికితీయడానికి ఉపకరించే అన్ని దారుల ద్వారా సహకారిగా విద్య ఉండేట్టు చూడటం ఈ విధానం ప్రత్యేకత. ప్రాథమిక విద్య తప్పకుండా మాతృభాష లోనే ఉండాలని ఇది సూచిస్తున్నది. బడ్జెట్‌లో 10శాతం మాత్రమే నిధులు కేటాయించేవారు ఇప్పుడు రెట్టింపు అంటే 20శాతానికి పెంచారు. సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం విశేష ప్రయోజనాలు కల్పించాలని విధానపత్రంలో లక్ష్యంగా పేర్కొన్నారు.
పాఠశాల స్థాయిలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి?
ఇప్పుడున్న 7 + 3 + 2; 7+5 పద్ధతి ఇక 5+3+3+4 విధానంగా మారబోతుంది. ఇదే ఈసీఈ (ఎంట్రీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్). ఇలా కూడా చెబుతారు.
పి.కె.జి, + ఎల్.కె.జి + యు.కె.జి.+ 1+2-5
3+4+5 – 3
6+7+8 – 3
9+10+11+12 – 4
మొదటి 5 సంవత్సరాలు దృశ్య, శ్రవణ మాధ్యమంగా, ఆటలు, కథలు, సంభాషణల ఆధారంగా విద్యాబోధన. తరువాత 3 సంవత్సరాలు భాష, గణితం, పర్యావరణం మీద అవగాహన కల్పిస్తారు. ఆపై 3 సంవత్సరాలు భావనలతో కూడిన బోధన. ఇంకా, 4 సంవత్సరాలు మైనర్, మేజర్ సబ్జెక్టులు ఎంచుకొనే విధానం. విద్యాహక్కు చట్టం పరిధిలోకి వచ్చే బాలల వయసు 14 నుండి 18 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం కూడా తీసుకున్నారు. బాల్యం నుండి ఇంటర్ వరకు విద్య, ఆటలు, పౌష్ఠికాహారంతో పాటు సంపూర్ణ వికాసం తన తప్పనిసరి బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించింది. విద్యార్థుల శారీరక, మానసిక, ఉద్వేగ, ప్రజ్ఞల ఆధారంగా విద్యా బోధనతో అన్ని స్థాయిల విద్యార్థుల వికాసం గురించి ఇది ప్రతిపాదించింది.
గ్రామీణ ప్రాంతాలలో ఉండే 20 పాఠశాలలకు కేంద్రంగా ఒక ‘పాఠశాల ప్రాంగణ నిర్మాణం’ జరగాలి. అది ఈ 20 పాఠశాలల వికాసానికి పనిచేయాలి. సృజన, నైపుణ్యం, అభ్యాసం, విద్యార్థి – ఉపాధ్యాయుల ప్రమాణాల పెంపు ఇందుకు భూమికగా ఉంటాయి.
ఉన్నత విద్యలోనూ సమూల మార్పులు ఈ విధానంలో పొందుపరిచినట్టు చెప్పారు. అవి ఎలాంటివి? వాటి పరిణామాలు ఎలా ఉండ బోతున్నాయి?
ఈ విధానం ఉన్నత విద్యలోను పెద్ద ఎత్తున మార్పులను తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇవాళ దేశంలో 40 వేలకుపైగా ఉన్న విద్యాసంస్థల గురించి అధ్యయనం చేశారు. వాటిలో 40 శాతం విద్యాసంస్థలు ఒక సబ్జెక్టు (ఇంజనీరింగ్, మెడిసిన్, ఎమ్‌బీఏ లాంటివి) బోధించేవిగా, 20శాతం విద్యాసంస్థలలో కేవలం 100 లోపు విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. 3 శాతం విద్యాసంస్థలతో మాత్రం 3000 పైగా విద్యార్థులు ఉన్నారు. రాబోయే రోజులలో ఈ 40 వేల సంఖ్యను 10వేలకు కుదించి, ప్రతి ప్రాంగణంలో 5000కు తగ్గకుండా విద్యార్థులకు ప్రవేశం ఉండే విధంగా ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని ఈ విధానం ప్రతిపాదిస్తున్నది. అన్ని రకాల సబ్జక్టులు ఉండే ఉపయుక్తమైన ప్రాంగణాలుగా వాటిని తీర్చిదిద్దాలన్నదే ఉద్దేశం.
విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలు లేకుండా అటానమస్ కళాశాలలను ప్రోత్సహించడం ఒకటి.
అటానమస్ కళాశాలల సంఖ్య పెరిగితే విద్యా వ్యాపారీకరణ పెరిగే అవకాశం ఉన్నదన్న విమర్శలు ఉన్నప్పటికీ దానిని నిరోధించడానికి ఈ విధానంలో అనేక విధి, విధానాలు రూపొందించారు.
అభిరుచి ఆధారంగా విద్యాబోధన, పరిశోధనలు ప్రత్యేకతలుగా ప్రాంగణాలు అభివృద్ధి చేయడం మరొకటి.
4 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రారంభిస్తారు. ఇందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు విరమించుకొనే వెసులుబాటుంది. ఏడాది పూర్తయితే సర్టిఫికెట్ కోర్సు, రెండవ సంవత్సరం పూర్తయితే డిప్లమో, మూడవ సంవత్సరం పూర్తయితే డిగ్రీ, నాలుగో ఏడు పూర్తయితే ప్రత్యేక డిగ్రీ ప్రదానం చేసే ప్రతిపాదన ఉంది.
విద్యార్థి కోరుకొన్న పాఠ్యాంశాల కాంబినేషన్‌ని ఎంచుకొని అవకాశం మరొక కీలక మార్పు. గణితం – జీవశాస్త్రం లేదా జీవశాస్త్రం-ఆర్థికశాస్త్రం లేదా కామర్స్- భౌతికశాస్త్రం.. విద్యార్థి ఎలాంటి కాంబినేషన్ అయినా ఎంచుకోవచ్చు.
క్రెడిట్ బ్యాంక్ అంటే ఏమిటి?
ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం విద్యార్థి ఎంచుకొన్న కోర్సులో లభించిన మార్కులకు క్రెడిట్స్ ఇస్తారు. ఈ క్రెడిట్స్ విద్యార్థి ప్రత్యేక Data base (Bank) కి చేరతాయి. మొత్తం క్రెడిట్స్ విద్యార్థి భవిష్యత్తు చదువు, ఉద్యోగం విషయంలో పరిగణలోకి తీసుకుంటారు.
దేశంలో జరుగుతున్న పరిశోధన నాణ్యంగా లేదనీ, అందుకే ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు విదేశాల వైపు మొగ్గుతున్నారనీ చెబుతారు. ఈ విషయంలో నూతన విద్యావిధానం వైఖరి ఏమిటి?
కొన్ని కేంద్రీయ విద్యాసంస్థలలో తప్ప చాలా సంస్థల్లో పరిశోధన నాణ్యంగా లేని మాట నిజమే. పరిశోధనా దృష్టికి ప్రాధాన్యం ఇవ్వకపోవటం, సరిపడా నిధులు సమకూర్చకపోవటం, అధ్యాపకుల కొరత వంటివి ఇందుకు కారణం. ఎన్‌ఈపీలో పరిశోధన మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
పరిశోధన పట్ల ఆకర్షణ పెంచి ఎక్కువమందిని ప్రోత్సహించటం, అధిక నిధులు కేటాయించటం, నాణ్యమైన పరిశోధన ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు, మారిన పరిస్థితులకు అనుగణంగా అధ్యాపకుల వికాసం కోసం ప్రత్యేక శిక్షణ, దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలను (ఐఐఎస్‌సి, డీఆర్‌డీఎల్, ఎల్‌సీటీ వంటివి) విద్యాసంస్థలతో అనసంధానం చేసి, పరిశోధనలో వేగం, నాణ్యత పెంచటం కోసం జాతీయ పరిశోధనా సంస్థను నెలకొల్పి, స్థాయిని పెంచాలని కొత్త విధానం చెబుతున్నది. దీనితో మార్పు తథ్యం. విద్యార్థులను పరిశోధన కోసం ఇక్కడే ఉండేటట్టు చేయవచ్చు.
ఇంకా, 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి ప్రతిభ ఆధారంగా నేరుగా పరిశోధనలో ప్రవేశం పొందే అవకాశం ఇస్తారు.
అయితే, ఇకపై ఎం.ఫిల్. ఉండదు. ఈ నిర్ణయంతో ఎవరికీ నష్టం లేదు. అనేక ప్రత్యమ్నాయ ఏర్పాట్లు సూచించారు.
భారతీయ కేంద్రిత విద్య అని విజన్ పేపర్‌లో పొందుపరచారన్నారు. ఈ భారతీయత ఎలా ప్రతిబింబిస్తుంది?
విధానంలోని ప్రతి ఆలోచన వెనక భారతీయత ఉంది. ప్రాథమిక విద్య భారతీయ భాషలో ఉండాలన్న ఆలోచన అదే.
5+3+3+4 విధానం ముమ్మాటికి భారతీయతను ప్రతిబింబిస్తుంది. విద్యార్థి వికాసం ఏ వయసులో ఎలా జరగాలో వివరిస్తూ ఏ పద్ధతి సరియైనదో స్పష్టతతో,శాస్త్రీయంగా చెప్పారు. శారీరక, మానసిక, ఉద్వేగ, ప్రజ్ఞల ఆధారంగా విద్యార్థి సమగ్ర వికాసం ఎలా జరుగుతుందో వివరణలతో పొందుపరిచారు.
మనవి 64 కళలని చెబుతారు. వీటన్నింటిపై అధ్యయనం, వాటి వికాసం, సమాజంలో వ్యవహారికంగా వాటిని ఎలా అభివృద్ధి చేయాలో వివరించారు. భారతీయ ప్రజ్ఞ పద్ధతి ఈ దేశంలోని మారుమూల ప్రాంతాలలో దాగి ఉన్నది. దాని ఉన్నతి, అభివృద్ధి గురించి యోచన కూడా ఉంది.
వ్యక్తి సర్వాంగీణ వికాసం చెందాలని భారతీయ పరంపర చెబుతుంది. విషయ పరిజ్ఞానం ఒక్కటే చాలదని మన నమ్మకం. ఇందుకు అనుగుణమైన ప్రత్యేక ప్రతిపాదనలు కూడా చేశారు. సంస్క ృతి, మూలాలు, వారసత్వ సంపదలను తెలుసుకునే పద్ధతులు, అసమానతలు, సామాజిక దురాచారాలను రూపుమాపి విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి పెద్దపీట వేశారు.
రిజర్వేషన్ల ప్రస్తావన లేదనీ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వ్యతిరేకమైన విధానమనీ కొందరు విమర్శిస్తున్నారు. నిజానిజాలు ఏమిటి?
ఇది అవాస్తవం. రాజ్యాంగం కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను సమర్ధిస్తూ, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రత్యేక సదుపాయాలను పొందుపరిచారు. అండర్ రిప్రజెంటెడ్ గ్రూప్, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి విశేష ప్రోత్సాహం ఇవ్వాలని ఈ విధానం నిర్దేశిస్తున్నది. స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు, విస్తృతంగా బ్యాంకు రుణాలు, ఇతర రాయితీలను కల్పించాలని చెబుతోంది. మతిభ్రమించిన కొన్ని శక్తులు ఈ దుష్ప్రచారానికి ఒడిగడుతున్నాయి. సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు, కొందరు కుహనా మేధావులు ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు పెద్దపీట వేస్తూ ఈ విధానంలో విప్లవాత్మక చర్యలు తీసుకోవటం ఎన్‌ఈపీతోనే.
విద్యార్థి సంఘాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతున్నది?
ఈ ఎన్‌ఈపీ విద్యార్థి సంస్థల బాధ్యతను పెంచుతుంది. ప్రతి విద్యార్థి సంస్థ స్వాతంత్య్రా నంతరం విద్యారంగంలో మార్పు కోసం అనేక డిమాండ్లు చేస్తూనే ఉంది. దాదాపుగా అన్ని విద్యార్థి సంస్థల డిమాండ్లను ఈ విద్యావిధానం తీర్చింది. కాబట్టి ఈ విద్యావిధానం అమలులో నిర్మాణాత్మక భాగస్వామ్యం పోషించాల్సిన బాధ్యత అన్ని విద్యార్థి సంస్థలకి ఉంది.
విద్యార్థుల తరఫున, వారి సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణాత్మక ఉద్యమాలు చేసే హక్కు ప్రతి విద్యార్థి సంస్థకు ఉంది. విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని ప్రతి సంఘం ఎప్పటి నుంచో కోరుతోంది. కేంద్రం ఆధీనంలో నడిచే విద్యాసంస్థలు చక్కగా ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు విధిగా విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించడం గురించి ఇందులో పొందుపరిస్తే బాగుండేది.
విదేశీ విద్యాసంస్థలను మన దేశంలోకి అనుమతిస్తే అందరికి సమంగా విద్య అందాలన్న ఆలోచనలకి అడ్డంకి కాదా?
దేశంలో ఇప్పటికే విదేశీ విద్యాసంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సరియైన నియంత్రణలు తీసుకొని నాణ్యమైన విద్యాసంస్థలను మాత్రమే అనుమతించాలి. దీనివల్ల విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించలేని పేద, మధ్య తరగతి కుటంబాలకు లాభం కలుగుతుంది. బోగస్ విద్యాసంస్థలు రాకుండా చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన, గుర్తింపు పొందిన సంస్థలే మనగలుగుతాయి. మిగతావి మూతపడక తప్పదు. ప్రపంచంలో సమాచార, కమ్యూనికేషన్ పరిజ్ఞాన (I.C.T) రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. మన విద్యార్థులు వాటిని అందిపుచ్చు కోవాలి. విదేశీ విద్యాసంస్థలు అందుకు కొంతవరకు దోహదపడతాయి. మన దేశీయ విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకొనేలా ప్రోత్సహించటం కూడా తక్షణావసరం. ఎన్‌ఈపీ ఆ దిశగా అనేక సూచనలు చేసింది.
విద్య అనేది కాంకరెంట్ లిస్ట్‌లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు దీని అమలుకు ముందుకు రాకపోతే దేశమంతా ఒకే విధానం ఎలా సాధ్యం?
ఈ ప్రశ్న సరియైనదే. ఇప్పటివరకు రూపొందించిన విద్యావిధానాలలో కెల్లా అత్యుత్తమమని దేశంలోని మెజారిటీ మేధావులు, విధాన రూపకర్తలు చెపుతున్నారు. దీనిని విమర్శించే మేధావులవి పసలేని వాదనలే. ఏ రాష్ట్ర మైనా వీటి అమలుకు ముందుకు రాకపోతే ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో కోల్పోతారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ‘ఆంగ్లం’ విషయంలో వెనక్కు తగ్గబోమని అంటున్నది. ఆ వైఖరి ఆ రాష్ట్ర విద్యార్థుల సమగ్ర వికాసానికి గొడ్డలిపెట్టు. తమిళనాడు మూడు భాషల విధానాన్ని అమలు చేయబోమని అంటున్నది. అక్కడి స్వార్థ రాజకీయ నాయకుల దుష్ట పన్నాగంలో తమిళనాడు ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. భాష కారణంగా ఇతర రాష్ట్రాలలో లభిస్తున్న అవకాశాలను కోల్పోతున్నామన్న భావన అక్కడి విద్యార్థి యువతలో ఉన్నది. సంకుచిత భావాలు, స్వార్థ రాజకీయాలు మాని ఆయా ప్రాంతాల సమగ్ర వికాసానికి తద్వారా దేశ ఉన్నతికి అందరు ముందుకు రావటం నేటి అవసరం.
చిన్నారులను 6 సం।।ల వయసులో పాఠశాలకు పంపటమే శ్రేయస్కరం. శాస్త్రీయం. కానీ 3 సం।।ల నుండి పంపాలనటం ఎంత వరకు సమంజసం?
కొందరు ఈ అంశాన్ని తప్పుగా అర్థం చేసుకొంటున్నారు. ఈ దేశంలో ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలు తమ పిల్లలను 3 సం।।ల వయసు నుండే రకరకాల పేర్లతో వారి వికాసం కోసం శ్రద్ధ తీసుకొంటున్నారు. కొన్ని కుటుంబాలలో ఇంట్లోనే వారి వికాసం కోసం కావాలసిన వాతావరణం కల్పించడానికి మనుషులున్నారు. వారికి పంపించక పోయినా ఇబ్బందులు లేవు. కానీ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక కుటుంబాలలో అలాంటి అవకాశాలు లేక పిల్లల వికాసం ఆగిపోతున్నది.
రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలలో పిల్లల బాధ్యత ఎవరిది? వారికి పౌష్టికాహారం అందక వికాసం ఆగితే ఎవరిది బాధ్యత? సరియైన గూడులేని కుటుంబాలలోని పసివాళ్ల భవితవ్యం ఎవరు కాపాడాలి? పాఠశాలలో పిల్లల వికాసం కోసం, వారి వయసుకు తగ్గ ఆట, పాటలు, దృశ్యశ్రవణ మాధ్యమంగా, మంచి వాతావరణంలో పౌష్టికాహారం లభించేలా చర్యలు తీసుకోవాలని ఈ విధానం స్పష్టంగా వివరించింది. ఇది ముమ్మాటికి అవసరం.
ఈ విద్యా విధానం ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుత విధానంలో విద్యనభ్యసిస్తున్న వారిపై దీని పర్యవసానాలు ఏమిటి?
ఎంత వేగంగా చొరవ తీసుకొని అమలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలలో నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వెళుతున్నది. దీని అమలు విషయంలో అదే ఆశిద్దాం. ఇప్పటికే ఆలస్యమైందని దేశహితాన్ని కోరుకొనే ప్రతి ఒక్క ఆలోచనాపరుడు భావిస్తున్నాడు. అలాగే ప్రస్తుత విధానంలో కొనసాగుతున్న ఏ ఒక్కరిపైనా ఏ విధమైన ప్రతికూల ప్రభావాన్ని చూపబోదు. సాధ్యమైనంత త్వరలో నూతన జాతీయ విధానం ఫలాలు అందరికీ అందాలని ఆశిద్దాం. ఏ నూతన విధానాన్నయినా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అమలులో పెడతారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రపంచంలో అతి పెద్ద విద్యార్థి సంస్థ. నూతన జాతీయ విద్యావిధానంపై మీ విశ్లేషణ ఏమిటి?
ఏబీవీపీ ఈ నూతన జాతీయ విద్యావిధానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నది. నేను పరిషత్‌లో గత మూడు దశాబ్దాలుగా చురుకైన భూమికలో ఉన్నాను. మేము ఇచ్చిన నినాదాలు, గోడవ్రాతలు, విజ్ఞాపనలు, ఉద్యమాల సందర్భంగా, గోష్టుల సందర్భంగా చేసిన అనేక డిమాండ్‌లను ఎన్‌ఈసీలో పొందుపరచటం ఆహ్వానించదగ్గ పరిణామం. విద్యార్థి పరిషత్ 1949లో ప్రారంభించినప్పటి నుండి చేసిన ప్రముఖ డిమాండ్లలో
- భారతీయ సంస్కృతి, విలువల ఆధారంగా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించే విద్యావిధానం,
- భారతీయ భాషలు పరిరక్షణ, మాతృభాషలో ప్రాథమిక విద్య,
- జీడీపీలో 6శాతం, బడ్జెట్ నిధులలో 20శాతం కేటాయించాలి,
- స్వయం ప్రతిపత్తి కల్గిన జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు,
- విద్యా వ్యాపారీకరణ అరికట్టాలని విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేసింది. అనేక ఇతర అంశాల గురించి ఎప్పటి నుండో చెబుతున్నది. వాటికి ప్రాధాన్యం దక్కినందుకు గర్వంగా ఉన్నది.
గతంలో అమలవుతున్న విధానాలు మంచివే కాని అమలులో నిజాయితీ లేని కారణంగా అనుకొన్న ఫలితాలు సాధించలేదని అంటున్నారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ ప్రశ్న ముఖ్యమైనది. విధానాలు ఎంత బాగా ఉన్నా చిత్తశుద్ధితో అమలుచేసే బాధ్యత ఎవ్వరిది అన్న విషయంలో స్పష్టత ఉండాలి. దీని అమలు బాధ్యత కేవలం ప్రభుత్వానిదేనని వదిలేస్తే ఆశించిన ఫలితాలు రావు. ప్రభుత్వ వ్యవస్థ అతి పెద్దది. ఏదైనా విధానం విజయవంతం కావాలంటే కేంద్రం చిత్తశుద్ధితో బాధ్యతను నిర్వర్తించాలి. అంతే చిత్తశుద్ధితో అన్ని స్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం ఆధీనంలోని అన్ని సంస్థల అధిపతులు ధైర్యంతో, సృజనశీలతతో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీని విమర్శిస్తూ కూచుంటే లాభం లేదు. విద్యార్థి సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణాత్మక బాధ్యత పోషించాలి. ఎక్కడ పొరపాట్లు జరిగినా దానిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకపోవాలి. స్పందించకపోతే నిర్మాణాత్మక ఉద్యమాలబాట పట్టాల్సిందే.
ఈ విధ్యావిధానం అమలైతే జాతీయస్థాయిలో U.G.C, AICTE, NAAC, NCERT, M.C.I. D.C.I లాంటి సంస్థల పాత్ర ఏమిటి?
ఆ సంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపో నున్నాయి. ఎక్కువ సంస్థలతో నిర్వహణ సంక్లిష్టమవు తుంది. నూతన విద్యావిధానం కింది స్థాయివరకు సాఫీ•గా అమలు కావడానికి నూతన సంస్థలను ప్రతిపాదించారు. కేవలం 4 రకాల సంస్థలు పై స్థాయిలో ఉంటాయి. వాటి ఆదేశాలమేరకు క్రింది స్థాయిలో నడుచుకోవాలి.
నూతన విధానం ప్రతిపాదించిన ప్రకారం జాతీయ ఉన్నత విద్యా కమిషన్ నేతృత్వంలో 1. నేషనల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ, 2. నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్), 3. హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, 4. జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఇది One Academic Activity, Carriculum గురించి ఆలోచిస్తుంది) పని చేస్తాయి.
ఈ విద్యావిధానం గురించి మీరు గమనించిన ఇతర అంశాలు, అందరికీ తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా?
మొదటిసారిగా ఇంత సమగ్రంగా విద్యావిధానం రావటం వెనక ఎందరో ప్రముఖులు కృషి ఉన్నది. ఇస్రో మాజీ చైర్మన్ డా।। కస్తూరి రంగన్ అధ్యక్షతన ప్రముఖ విద్యావేత్త మంజిల్ భారత్, డా।। ఎమ్.కె. శ్రీధర్ (ప్రస్తుతం యు.జి.సి. సభ్యులు) వంటివారు 4 సం।।లపైగా కసరత్తు చేశారు. సుదీర్ఘ సమయం కేటాయించి దేశంలోని అందరికి అన్ని భాషలలో ముసాయిదాను అందుబాటులో ఉంచి లక్షకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించారు. వాటిని అధ్యయనం చేసి సముచితమైన వాటిని జోడించి నూతన విద్యావిధానం తీసుకురావటంతో సమగ్ర విధానం అందుబాటులోకి వచ్చింది. దీని అమలుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ చక్కటి ముందుచూపుతో ఏర్పాటుచేసిన ముసాయిదా సంఘ సభ్యులకు, దీనిని పరిపుష్టం చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థిపరిషత్ తరఫున ధన్యవాదాలు.