– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
‘ఒకరోజు నేను దేశ పూర్వాధ్యక్షుడిని అవుతాను. కానీ ఎప్పటికి మాజీ విద్యావేత్తను కాను’ (One day I will become former president but I will never become ex academician) అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు. చదవడమన్నా, చదువు చెప్పడమన్నా అంత ఇష్టం. ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు, రాష్ట్రపతిగా ఒకసారి రాజ్యాంగ పదవుల నిర్వహణకు ముందు సుదీర్ఘకాలం అధ్యాపక వృత్తిలో కొనసాగారు. దేశంలోని అనేక ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో పాఠాలు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు. ప్రతి చోట విద్యార్థుల మనసులపై చెరగని ముద్రవేశారు.
విద్యార్థుల మనసులో గూడు కట్టుకొని, వారితో బ్రహ్మరథం పట్టించుకున్న ఆధునిక గురువులలో అరుదైనవారు. మైసూరు నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వెళుతున్నప్పుడు పూలతో అలంకరించిన గుర్రబగ్గీని మైసూర్ రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కెళ్లారంటే ఆయన విద్యార్థులకు ఎంత చేరువయ్యారో, గురుస్థానానికి ఆయనఇచ్చిన విలువ ఎంతో అవగతమవుతుంది. రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తరువాత కలసిన పలువురు అభిమానులు, విద్యార్థులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేసిన అభ్యర్థనను మృదువుగా తిరస్కరించారు. తన జన్మదినం కంటే ఉపాధాయ దినోత్సవంగా జరుపుకోవడం తనకు సంతోషదాయకమని చెప్పారట. అలా 1962 సెప్టెంబర్ 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవం ఆనవాయితీగా వస్తోంది. డాక్టర్ రాధాకృష్ణన్‌ను నవభారత విద్యానిర్మాతగా చెబుతారు. ‘విశ్వవిద్యాలయాలు జ్ఞాననిలయాలుగా భాసిల్లుతూ నూతన ఆవిష్కరణలు చేయాలి. కళాశాలల సంఖ్య పెరగాలి. విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి. విద్యపై వ్యయాన్ని ప్రజల, ప్రజాస్వామ్య భవిష్యత్ పెట్టుబడిగా భావించాలి’ అని ఆయన సూచించారు. సంపదను పెంచేందుకు, ఉజ్వల భారతదేశ నిర్మాణానికి విద్య ముఖ్య సాధనంగా, చోదకశక్తిగా పని చేయాలని, ఉపాధ్యాయలోకం ఇంధనంగా పనిచేయాలని ఉద్బోధించారు. దేశం పారిశ్రామిక ప్రగతి సాధించాలంటే విద్యారంగం పటిష్ఠంగా ఉండాలని భావించిన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అందుకు తగు సలహాలు కోరుతూ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు (1948) చేసిన విశ్వవిద్యాలయ మొదటి కమిషన్ నివేదికలో ఆయన ఈ సూచనలు చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, భావావేశాన్ని, కళాత్మకతను, మేధోపరమైన కార్యకలాపాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది’ అని సూచించి అమలు చేయించారు. ఉపాధ్యాయులకు బోధనాంశాల పట్ల ప్రేమ, శిష్యులు ఎదగాలనే తపన ఉండాలంటూ తాను ఆచరించి ఉపాధ్యాయలోకానికి ఆదర్శంగా నిలిచారు. విద్యాసంస్థలలో వాణిజ్య దృక్పథం అసమానతల సమాజానికి, అనేక దుష్ఫలి తాలకు దారితీస్తుందనే ఆనాడే సూత్రీకరించారు.
‘మీరు నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించే జగద్గురువైన శ్రీకృష్ణుడు. నేను ఆ జ్ఞానామృతాన్ని స్వీకరించే అర్జునుడిని’ అని గాంధీజీ, ‘నేను దేశానికి ప్రధాన మంత్రిని కావచ్చు కానీ మీ సమక్షంలో నిరంతరం విద్యార్థినే’ అని నెహ్రూజీ, ‘నా తరంలో నేను దర్శించిన స్ఫూర్తిదాయక మహనీయులు మీరే’ అని నాటి సోవియెట్ అధినేత స్టాలిన్ ప్రశంసలను బట్టి రాధాకృష్ణన్ గురుత్వ విశిష్టత బోధపడుతుంది. భారతీయ ఆధ్యాత్మిక చింతనను దేశవిదేశాలలో ప్రచారం చేసిన మేటి తత్వవేత్త. మూర్తిభవించిన సమగ్ర భారతీయ సంస్కృతి. ‘సమస్త ప్రపంచానికి మన దేశమే సంస్థానం. ఆ స్థానాన్ని మనమెల్లప్పుడు పదిల పరచుకోవాలి’ అనేవారు. రాధాకృష్ణ పండితుడు రాజనీతివేత్త, పరిపాలనాదక్షుడిగా కూడా నిరూపించుకున్నారు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ అధ్యక్షుని హోదాలో సభా కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా వివిధ పార్టీల సభ్యుల మధ్య వాదోపవాదాలు, ఆవేశాకావేషాలు తారస్థాయికి చేరే సమయంలో అనునయ వాక్యాలు, హాస్యోక్తులు, శ్లోకాలతో సభను గాడిలో పెట్టేవారట.అందుకే ‘రాధాకృష్ణన్ రాజ్యసభ నిర్వహిస్తుంటే పండుగకు పదిమంది ఒకచోట చేరి సందడి చేస్తున్నట్లు ఉంటుంది’అని నెహ్రూ వ్యాఖ్యానించారు.
అధ్యాపకత్వమే మిన్న
విద్యా విజ్ఞాన పరంగా రాధాకృష్ణణన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నవారు మరో పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. పదవీ విరమణ తరువాత తనను మాజీ రాష్ట్రపతిగా కంటే అధ్యాపకుడిగా, శాస్త్రవేత్తగా సంబోధించడాన్నే ఇష్టమనే వారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పిల్లలతో సమావేశ మయ్యేవారు. ఆ సందర్భంలో కొందరు పిల్లలు ‘మీకు మార్గదర్శకులు ఎవరు?’ అని ప్రశ్నిస్తే ‘అమ్మానాన్న, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు’ అని బదులు ఇచ్చారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ’ ఆర్యోక్తికి ఆయన జవాబు సమాంతరంగానే అనిపించినా ‘ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు’ అనడంలోనే ప్రత్యేకతను గమనించవచ్చు.ఎన్ని అంతస్తుల భవనానికైనా పునాదే కీలకమనే భావం ఆ మాటలలో వ్యక్తమవుతోంది. వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయినా ప్రవృత్తిరీత్యా బోధన పట్ల ఆసక్తి చూపేవారు. గురువు-తాను తన ఆచార్యుల నుంచి నేర్చిన దానిని శిష్యులకు బోధించి, వారు వారి శిష్యులకు (ప్రశిష్యులకు) ప్రబోధించాలని కోరుకుంటారని, అదే కృతజ్ఞత అని పెద్దల మాట. దానిని అక్షరాల పాటిస్తూ, కలాం దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ తరువాత పలు విద్యాసంస్థలలో పాఠాలు చెప్పేవారు. 2015 జూలై 15న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)విద్యార్థులకు బోధిస్తూనే ఆ జ్ఞానశిఖరం నేలకొరిగింది.
గురుస్థానం
శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించి, ప్రతిభా పాటవాలను పెంచి అజ్ఞానాన్ని అంతమొదిస్తాడు కనుక గురువును త్రిమూర్తుల స్వరూపుడిగా వర్ణించారు. ఆయన ఆశీస్సులు లేని పుస్తక జ్ఞానం వృథా అని, ఎంత మంచి పుస్తకమైనా ఉపాధ్యాయునికి దీటు రాదని అంటారు. ‘పుస్తకాం ప్రత్యయాధీతం -నాధీతం గురుసన్నిధౌ’ (గురువు వద్ద నేర్చుకొనక స్వయంగా పుస్తకాలు వల్లించడం వల్ల కలిగే జ్ఞానం అసంపూర్ణమ’ని గురువు విశిష్టతను ‘చాణక్యనీతి’ చెబుతోంది. ‘గురువు శిక్షలేక గుఱుతెట్లు గల్గునో/అజునికైన వాని యబ్బకైన/దాళపు జెవి లేక తలుపెట్టులూడురా’ అని గురువు విలువను వేమన నొక్కి చెప్పారు.
‘తాను కష్టపడి తెలుసుకున్న సత్యాన్ని స్వయంగా ఆచరిస్తూ నలుగురిని మార్చగల మహనీయుడే నా దృష్టిలో గురువు’ అని గాంధీజీ, వేదాతీతమైన ఆత్మశక్తిని విద్యార్థులలో ప్రజ్వరిల్లంపచేసే గురువే జాతిభవితకు మూలస్థానమని, మనల్ని దారితప్ప కుండా సమర్థంగా నడపగల ఏకైక వ్యక్తి గురువే’ అని స్వామి వివేకానంద ఆచార్య ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు. ‘గురువు ఆదేశాలను అనుసరించు. గురువు చూపిన దారిలో నడువు. ఎందుకంటే ఇప్పటికే గురువు ఆ దారిలో నడచి ఉండడం వల్ల ముళ్లు (సమస్యలు) ఉన్నా అవి నిన్ను బాధించవు. అటువంటి వాటిని తప్పించుకొని నడిచేలా గురువు నేర్పుతాడు’ అని ఉపదేశించారు షిర్డీ సాయి.
గురుశిష్యుల అనుబంధంపై అనేక పురాణ, చారిత్రక గాథలు ఉదాహరణలుగా ఉన్నాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద,బలరామకృష్ణులు సాందీపుని వద్ద, భీష్ముడు పరశురాముని వద్ద, అర్జునుడు ద్రోణుని వద్ద, ఆదిశంకరులు గోవింద భగవత్పాదుల వద్ద, వివేకానందుడు రామకృష్ణ పరమహంస వద్ద… ఇలా ఎందరో విద్యను అభ్యసించారు. పురాణపురుషులంతా స్వయంజ్ఞానులు, జ్ఞానప్రదాతలు, మహిమాన్వితులైనప్పటికీ గురుకులంలో ఉండి, గురుశుశ్రూషతో విద్యాభ్యాసం చేయడం ఆనాటి ఆచారం.ఈశ్వరావతారమైన ఆదిశంకరులు సన్యాసం స్వీకరణకు గురువును అన్వేషిస్తూ వెళ్లారు. గురుస్థానం విలువ పెంపునకు, పరిరక్షణకు ఇలా చేయవలసి వచ్చిందని భావించాలి.
‘శిష్యాదిచ్ఛేత్ పరాజయం’
తన సుఖం, పేరు ప్రఖ్యాతుల కంటే శిష్యుడి ఉన్నతి కోరేవాడే నిజమైన గురువు అంటారు. ‘శిష్యాదిచ్ఛేత్ పరాజయం’ ఆర్యోక్తిని బట్టి శిష్యుడి చేతిలో ఓటమి పొందాలని కోరుకుంటారు. పలానా వ్యక్తికి గురువునని చెప్పుకునేందుకు ఇష్టపడతారు. ఆయన బోధన, అనుగ్రహంతో పాటు శిష్యుని అభ్యాసం వల్లనే అది సాధ్యం. ఉత్తమ గురువు జ్ఞాన వారసత్వాన్ని అభిలషిస్తారు. తాను బోధించే మంచి తన వారసుల ద్వారా తరతరాలకు అందాలను కుంటారు. అదే సమయంలో ‘ప్రమాదో ధీమతామపి’ అన్నట్లు.. తమలోని ఏవైనా లోపాలు ఉంటే వాటిని పరిహరించి తమలోని మంచిని మాత్రమే స్వీకరించాలని విద్యాభ్యాసం ముగింపువేళ గురువులు శిష్యులకు చెప్పేవారు.
గురుకులంలో వేదవిద్యను అభ్యసించిన విద్యార్థులకుగురువు చేసిన స్నాతకోపదేశం’ నేడు పట్టాల ప్రదాన సమావేశంగా మారిపోతోందని అపవాదు కూడా ఉంది. ‘ఒకప్పుడు పాఠశాలలు దైవ మందిరాలు. అధ్యాపకులు ఆరాధ్యదైవాలు. విద్యాయాలకు విలువలేదు. గురువులకు పరువు లేదు. ఒక విద్యార్థిని దండిస్తే ప్రజలు నిలదీస్తారు. ప్రజానాయకులు అసెంబ్లీలో దుమ్మెత్తిపోస్తారు’ అని యూభయ్ మూడేళ్ల నాటి అప్పటి పరిస్థితిపై వచ్చిన ప్రబోధాత్మక చలనచిత్రంలోని పతాక సన్నివేశం గుర్తుకొస్తోంది. వర్తమాన పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనలేం. గురుశిష్యుల బంధం ఎలా ఉంది? గురువులకు దక్కుతున్న విలువ ఏ పాటిదో? అక్షరాస్యత, సాంకేతికాభివృద్ధి స్థాయిలో గురువుకు గౌరవం దక్కుతుందా? ‘బతకలేక బడిపంతులు’ అనే సామెతను దాటి ‘బతకాలంటే బడిపంతులు’ అనేంత వరకు ప్రయాణించినా, నాటి వీధిబడుల అయ్యవార్ల లోని అంకితభావం, చిత్తశుద్ధి కనిపిస్తోందా? వారికి దొరికిన గౌరవం దొరకుతోందా? ఆలోచించుకోవాలి. ముఖ్యంగా సినిమాలలో తల్లిదండ్రులతో పాటు గురువును చిన్నబుచ్చే పాత్రలు ఎన్నెన్నో. విద్యా సంస్థలలో లైంగిక వేధింపుల గురించి తరచూ మాధ్యమాలలోచదువుతున్నాం, వింటూనే ఉన్నాం. ఏ కొందరి వల్లనో ఎందరో ఉపాధ్యాయులు అపవాదులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ‘మనిషి నైతిక వర్తనానికి అవసరమయ్యే ఎన్నో సుగుణాలకు ఆలవాలం గురువు’ అనే ఆర్యోక్తి నిజమయ్యేందుకు పునరంకితం కావాలి. అందుకు సమాజం సహక•రించాలి.
‘శ్రీ గురుభ్యోనమః’