‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!!
‘మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులతో సమాన తేజస్సుతో వెలుగొందే దేవా! చేపట్టే ప్రతి కార్యం నిర్విఘ్నంగా కొనసాగేలా అనుగ్రహించు’ అంటూ యుగయుగాలుగా పూజలందుకుంటున్న వినాయకుడు ప్రమథ గణాలకు అధిపతి. గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించేవాడు గణనాథుడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే వేరే నాయకుడు లేనివాడనీ, తనకు తానే నాయకుడనీ అర్థం. విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. అద్వితీయుడు. ఆనంద స్వరూపుడు. వినాయకోత్పత్తి గురించి ఎన్ని పురాణ గాథలు ఉన్నా, పార్వతీదేవి మంగళస్నానం సందర్భంగా నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసి, వాకిలి వద్ద కావలి ఉంచడం, తన ప్రవేశాన్ని అడ్డగించడంతో ఆగ్రహించిన శివుడు బాలుడి తలను తుంచి, పార్వతీ విలాపంతో గజాసురిని తలను అతికించి పునర్జీవింపచేయడం లోకంలో ప్రసిద్ధమైన కథ.
వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను అధిగమించడం పెద్ద సమస్య కాబోదని వినాయకుడు లోకానికి చాటి చెప్పాడు. తన కుశాగ్రబుద్ధితో సర్వలోకాల మన్ననలు అందుకుంటున్నాడు. సూక్ష్మబుద్ధి, వినయంతో విజయాలు సొంతం చేసుకున్నాడు. గణాధిపత్యాన్ని సాధించాడు. కుశాగ్రబుద్ధి కలవాడు కనుకే మహభారత రచనలో వ్యాస భగవానుడికి రాయసకారుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. తాను చెబుతున్నప్పుడు తన వేగాన్ని అందిపుచ్చుకుంటూ, చెప్పేది అర్థం చేసుకున్న తర్వాతే రాయాలన్న వ్యాసుడి నిబంధనను అంగీకరించాడు. తన దంతాన్నే గంటంగా చేసుకొని పంచమవేదం రచనా బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించాడు.
వినాయక వ్రత విధానం
ఇతర వ్రతాలకు సంబంధించి భక్తులు తమ శక్తినుబట్టి స్వర్ణ, రజిత, కాంస్య లోహాలతో చేసిన దేవతా ప్రతిమలను ఉపయోగించవచ్చని చెబుతారు. వినాయకుని విషయంలోనూ ఆ నియమాలు, వెసులు బాటు లేకపోలేదు. సువర్ణమూర్తిని పూజిస్తే సంకల్ప సిద్ధి, వెండి విగ్రహాన్ని పూజిస్తే ఆయుష్షు, రాగి విగ్రహాన్ని అర్చిస్తే ఐశ్యర్యం సిద్ధిస్తుందని చెబుతారు. అయితే మట్టితో చేసిన ప్రతిమను పూజిస్తే వీటన్నిటితో పాటు సకల శుభాలు కలుగుతాయని గణేశ పురాణం చెబుతోంది. కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించలేమన్నట్లుగా పేదలు కూడా ఉన్నంతలో భక్తిప్రపత్తులతో మనస్ఫూర్తిగా ఆరాధించేలా ఈ మృత్తికా విగ్రహం ఉంటుంది. దేవుళ్లలో నిరాడంబ రతను నేర్పేవాడు వినాయకుడు. విలువైన నగలు, ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలను సేకరించి భక్తితో అర్చిస్తే సంతోషిస్తాడు. కొండంత కష్టాన్ని గోటితో తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.
గణపతి ప్రకృతి దేవుడు. ఆయన జన్మదినం పండుగ. ఆకులు, ఆలములు ఆయనకు పూజా ద్రవ్యాలు. పురాణం ప్రకారం ఆయన ఆవిర్భావం ప్రకృతి పదార్థం నుంచే కదా. పార్వతీదేవి నలుగు పిండితో చేసిన బొమ్మకు ప్రాణం పోసిందని పురాణగాధ.
ఈ వ్రత విధానంలో ‘సర్వాణ్యంగాని పూజయామి’ అంటూ 21 రకాల పత్రులతో ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ అర్చిస్తారు. మాచీ పత్రం, బృహతీపత్రం (ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసీ పత్రం, చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఓషధీ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించ వచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోనూ గరిక శ్రేష్ఠమైనది. ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. స్వామి నామావళితో దీనితో ప్రత్యేకంగా అర్తిస్తారు. ప్రకృతి భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించడమే పత్రితో అర్చనలోని ఆంతర్యం.
గణనాథుని రూపం నుంచి వాహనం వరకు, నివేదన నుంచి నిమజ్జనం వరకు ఈ పండుగలోని ప్రతిదీ విశేషమైనదే. వినాయక రూపాన్ని విశ్లేషిస్తే అనేక సంకేతాలు గోచరిస్తాయి. విఘ్నదేవుడి ఒక్కొక్క అవయం ఒక్కొక్క సుగుణానికి ప్రతీకగా వర్ణించారు ఆధ్యాత్మివేత్తలు.
పెద్దతల : ఏనుగు తల తల జ్ఞానానికి, యోగానికీ చిహ్నంగా, ఉన్నతమైన ఆలోచనలనీ కలిగి ఉంటుంది. గొప్పగా ఆలోచించాలని చెబుతోంది. తొండం ఓంకారానికి, విరిగిన దంతం త్యాగానికి సంకేతమని చెబుతారు.
చిన్నకళ్లు: కళ్లు చిన్నవే అయినా ఆయా విషయాలపై దృష్టి కేంద్రీకరించి వాటిని సూక్ష్మంగా పరిశీలించాలి.
పెద్దచెవులు: స్షష్టంగా విని బాగా ఆకళింపు చేసుకో. మంచిచెడ్డలను అంచనా వేసుకో. విన్నదే చేయి.
చిన్న నోరు: తక్కువగా మాట్లాడు. ఆత్మస్తుతి, పరనిందను పరిహరించు. హితమైన పదార్థాలనే స్వీకరించు.
పెద్ద ఉదరం: జీవితంలో మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలి. నిశ్చింతంగా జీవించాలి.
మూషిక వాహనం: కోరికలు మనిషిని చుట్టుముట్ట కూడదు. అదుపులోని కోరికలతో అశాంతి తప్పదు. అందుకే కోరికమీద సవారీ చేస్తూ దానిని అదుపాజ్ఞలలో ఉంచుకోవాలి. పంటలకు హానీ కలిగించే ఎలుకలను అదుపుచేయడం అనీ కూడా వర్తమాన పరిస్థితికి అనుగుణంగా వ్యాఖ్యానించుకోవచ్చు. అంటే విఘ్నాలను నివారించడం అనే మరో అర్థం ఉంది.
దేశవ్యాప్తంగా గణపతి ఆరాధన ఉన్నా మహారాష్ట్ర, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఇది రెండు రోజుల పండుగ కాగా, ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజులు పండుగ. స్వరాజ్య సంగ్రామంలో బాలగంగాధర తిలక్ గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ఈ పూజలు ఆయన ఆధ్వర్యంలో 1893లో సామూహిక ఉత్సవంగా రూపుదిద్దుకుంది. హిందూమతంలోని వివిధ వర్గాల మధ్య సుహృద్భావం, జాతీయ భావాల పెంపునకు ఈ ఉత్సవాలు తోడ్పడతాయన్నది ఆయన భావన. అలా మైదానాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహించి పదవ రోజున నిమజ్జనం చేసే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.
– రామానుజ కల్యాణ్