ఏదైనా సరే, ఎవరిదైనా సరే- ఒక పుస్తకంలో ఏ విషయం ఉండాలి? అదెలా రాయాలి? రచయితలు/రచయిత్రులు ఎవరివైపు మొగ్గాలి? ఎవరిని చీల్చిచెండాడాలి? ఎవరు అచ్చువేయాలి? ఎవరు ఆవిష్కరించాలి? ఇవన్నీ మేమే శాసిస్తాం అంటున్నారు ఈ దేశంలో ఉదారవాదులు, వామపక్ష మేధావులు. ఏ రచన అయినా వాస్తవాలను కాదు, మా వాదనలనే సమర్థించాలంటున్నారు. అంతేనా, రచయితలూ, ప్రచురణ సంస్థలూ మేం నిలబడమంటే నిలబడాలి. కూర్చోమంటే కూర్చోవాలి అంటున్నారు. అచ్చయిన పుస్తకమైనా ఉపసంహరించుకోమని ఫత్వా ఇస్తే తలొగ్గవలసిందేనంటున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛా పరిరక్షణ మీద పేటెంట్‌ ‌మాదే అంటూ విర్రవీగే ఉదారవాదులు, వామపక్ష మేధావుల తీరు అక్షరాలా ఇదే. ఢిల్లీ రయిట్స్ 2020: ‌ది అన్‌టోల్డ్ ‌స్టోరీ’ అనే పుస్తకం విషయంలో ఇప్పుడు ఈ దేశంలో సరిగ్గా జరిగింది కూడా ఇదే. అందుకే ఈ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ మాఫియాల చేతుల్లోకి పోయిందా అన్న ప్రశ్న పదునెక్కుతున్నది.


పుస్తకాల గురించి, వాటిలోని అంశం గురించి వివాదాలు లేవడం, లేవనెత్తడం కొత్త కాదు. చర్చకు దారితీయడం కూడా సర్వసాధారణం. కానీ ఆగస్టు 22, 2020న ప్రఖ్యాత ప్రచురణ సంస్థ బ్లూమ్స్‌బరీ ‘ఢిల్లీ రయిట్స్ 2020: ‌ది అన్‌టోల్డ్ ‌స్టోరీ’ పుస్తకాన్ని హఠాత్తుగా ఉపసంహరించుకోవడం ఇలాంటి చర్చలకు కొత్త మలుపు. ఈ ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి చెప్పిన పుస్తకమిది. మోనికా ఆరోరా, సోనాలీ చితాల్కర్‌, ‌ప్రేరణా మల్హోత్రా రాశారు. సరిగ్గా ఆవిష్కరణ రోజే (ఆగస్టు 22), కార్యక్రమానికి కొంచెం ముందే ఈ పుస్తకాన్ని మార్కెట్‌ ‌నుంచి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించి బ్లూమ్స్‌బరీ పెద్ద వివాదమే రేపింది. బ్లూమ్స్‌బరీ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తిగా విరుద్ధమన్నదే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వాదన. ఆ ప్రచురణ సంస్థ మీద ఒత్తిడి తెచ్చి కొందరు ఉదారవాదులు, వామపక్ష మేధావులు ఆ పుస్తకాన్ని ఉపసంహ రించునేటట్టు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా పుస్తకావిష్కరణ జరిగింది. దాదాపు రెండుగంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం పూర్తిగా భావ ప్రకటనా స్వేచ్ఛ, దాని పరిధి మీదే సాగింది. గరుడ ప్రకాశన్‌ అనే సంస్థ ఈ పుస్తకం వెలువరించ డానికి అంగీకరించింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని రీతిలో పెచ్చరిల్లిన ఢిల్లీ అల్లర్లకు 53 మంది బలయ్యారు. మరో నాలుగు వందల మంది గాయాల పాలయ్యారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

జరుగుతున్న దానిని బట్టి ఉదారవాదులు, వామపక్ష మేధావుల ఉద్దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎలాంటి రచనలకు వర్తిస్తుంది? అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉండాలి. దేశ సమైక్యతకు భంగకరమైనవీ, ఐక్యతకు చేటు చేసేవీ కావాలి. మైనారిటీలను రెచ్చగొట్టేవీ, మెజారిటీ మతస్థుల మనోభావాలను గాయపరిచేవీ అయి ఉండాలి. జియాయుస్‌ ‌సలామ్‌, ఉజ్మా అసఫ్‌ ‌రాసిన, బ్లూమ్స్‌బరీయే ప్రచురించిన ‘షాహిన్‌బాగ్‌: ‌ఫ్రం ఎ ప్రొటెస్ట్ ‌టు ఏ మూవ్‌మెంట్‌’ ‌పుస్తకం దీనికి గొప్ప ఉదాహరణ. షాహిన్‌బాగ్‌ ఉదంతం గాంధీ అహింసోద్యమానికి ఆధునిక నమూనాగా కీర్తిస్తున్నారు. కానీ వాస్తవాలతోనే అయినా మైనారిటీల ప్రమేయం అధికంగా ఉన్న ఢిల్లీ మత కల్లోలాల గురించి రుజువైన వాదనలు ఉన్నా ఆ పుస్తకం వెలుగు చూడకుండా తమదైన శైలిలో కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారు. రంధ్రాన్వేషణే ధ్యేయంగా కువిమర్శలతో రెచ్చిపోతున్నారు. కాబట్టి భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఉదారవాదులు, వామపక్షవాదులు చెప్పేదంతా ఒట్టి బూటకమేనని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి.

ఈ పుస్తక ఆవిష్కరణోత్సవానికి బీజేపీ నాయకుడు కపిల్‌ ‌మిశ్రా ముఖ్య అతిథి. మిశ్రా ఈశాన్య ఢిల్లీ దాడుల సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశాడని ఆరోపణ. అది నిజం కాదని తరువాత పోలీసులు తేల్చి చెప్పారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలను మినీ పాకిస్తానంటూ మిశ్రా ఈసడించారంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. మరొక వీడియో ప్రకారం ఆయన పోలీసుల ఆదేశాలను తోసిరాజని రాజ్యాంగ బాధ్యతను అగౌరవపరిచారు. ఆయనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్‌-‌పాక్‌ ‌మధ్య ఎన్నికలుగా పేర్కొన్నారనీ, ఇది అన్యాయమనీ కొందరు ఆరోపిస్తున్నారు. కార్యక్రమానికి అధ్యక్షునిగా భూపేంద్ర యాదవ్‌ ‌వ్యవహరించారు. ఆయన బీజేపీ ఎంపీ. ‘ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలు ఉండడం ఆమోదయోగ్యమే. అయితే ఒక అంశాన్ని చూసేటప్పుడు ఒకరు రాజ్యాంగం పరిధిలో చూడడం, వేరొకరు అందుకు భిన్నంగా చూడడం సాధ్యం కాదు’ అన్నారు భూపేంద్ర. ‘రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల, రాజ్యాంగం మేరకు జరిగిన ఎన్నికల పట్ల గౌరవంగా వ్యవహరించడానికి మనం సిద్ధపడాలి. అయితే అర్బన్‌ ‌నక్సల్స్‌గా పేరు పడిన వారూ, జీహాదిస్టులూ ఈ సూత్రంలోని భారతీయతను బలహీనపరుస్తున్నారు. ఈ అంశాన్నే ఈ పుస్తకంలో గాఢంగా పొందుపరిచారు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా ఆన్‌లైన్‌ ‌కార్యక్రమమే. అప్‌ఇం‌డియా ఎడిటర్‌ ‌నూపుర్‌శర్మ ఆవిష్కరణో త్సవంలో ఆహ్వానితులుగా ఉండడం కూడా ఉదారవాదులకు నచ్చలేదు. నూపుర్‌ ‌ఢిల్లీ అల్లర్ల మీద ఆధారాలు లేని వార్తలు ఇచ్చారని ఆరోపణ. ఇవన్నీ ఉదారవాద ముద్రాంకితులు, వామపక్ష ప్రముఖులు, స్వయం ప్రకటిత మేధావులు చేస్తున్న, రాస్తున్న ఆరోపణలు.


‘‌పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ చెలరేగిన ఆందోళనలు వామపక్ష, ముస్లిం ఛాందసవాదుల ప్రోద్బలంతో జరిగాయని, సీఏఏ వ్యతిరేక అల్లర్లన్నింటి వెనుక ఉన్నది ఖిలాఫత్‌ ‌నాయకులేనని ఆ ముగ్గురు రచయిత్రులు ఆధారం లేకుండా రాశారని కూడా మేధావులు తీర్పు ఇచ్చేశారు. ఒక మూక ఉన్మాదమే సీఏఏ వ్యతిరేకత చుట్టూ ఉందని రాయడం వారికి నచ్చలేదట.’


మరొక అంశం కూడా ఉదారవాదులకు, వామపక్ష మేధావులకు మింగుడుపడనిదేనని ఒక అభిప్రాయం ఉంది. అది, ఆ ముగ్గురు రచయిత్రుల నేపథ్యం, ఆలోచనా ధోరణి. రచయిత్రులలో ఒకరు, ఆవిష్కరణ తరువాత జరిగిన చర్చలో వక్త ప్రేరణా మల్హోత్రా వ్యక్తం చేసిన అభిప్రాయం గమనించాల్సిందే. ‘వామపక్ష ముఠా, ఇస్లామిక్‌ ‌ఛాందసవాదులు పథకం ప్రకారం అమలు చేసిన కుట్ర ఫలితమే, ఢిల్లీ దాడులు’ అన్నారామె. అవి కేవలం దాడులు కావు, భారత్‌లో మావోయిస్టు తరహా తంత్రంతో తొలిసారి నగర ప్రాంతంలో జరిగిన యుద్ధమని ఆమె వాదించారు. మరొక రచయిత్రి సోనాలి చితాల్కర్‌, ‘ఔను, ఈ పుస్తకానికి ఒక వైఖరి ఉంది. అది ముస్లిం ఛాందసశక్తులకు, అర్బన్‌ ‌నక్సల్స్‌కు వ్యతిరేకమైనదని చెప్పడానికి గర్వపడుతున్నాను’ అన్నారు. అలాగే ఈ పదాన్ని (అర్బన్‌ ‌నక్సల్స్) ‌ప్రపంచానికి పరిచయం చేసినందుకు వివేక్‌ అగ్నిహోత్రికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితుడే. మరొక అతిథి నూపుర్‌శర్మ ఆ దాడులు ఏ విధంగా హిందూ వ్యతిరేకమైనవో రుజువు చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. రచనలో కీలక పాత్ర వహించిన మోనికా అరోరా, ఆనాటి కపిల్‌ ‌మిశ్రా ప్రసంగాన్ని (షాహిన్‌బాగ్‌కు వ్యతిరేకంగా) సమర్థించారు. రోడ్లను కబ్జా చేసిన వారి పట్ల ఎవరైనా అదే విధంగా మాట్లాక తప్పదని అన్నారు. ఈమె బీజేపీ మద్దతుదారు అని, రాష్ట్ర స్వయం సేవికా సమితి, ఏబీవీపీ నేపథ్యం ఉందని, 2003లో ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ టికెట్‌ ‌మీద పోటీ చేసిన సంగతి వెంటనే తెలుసుకున్నారు ఉదారవాదులు. ఇంకొక వాదన కూడా చేస్తున్నారు. 2014లో వెండీ డొనీర్‌ ‌రాసిన హిందూయిజం పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో అరోరా వాదించారట (ఈమె న్యాయవాది). వెండీ హిందూయిజం మీద అవాకులు చవాకులు రాశాడన్నది తెలిసినదే. అది భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఒక రచయిత హిందూ పురాణాలను, ఆచారాలను అవహేళన చేసినందుకు జరిపిన న్యాయ పోరాటం. కొత్త పుస్తకం కొన్ని మాసాల క్రితం జరిగిన మత ఘర్షణకు సంబంధించినది. అందులో ఎవరి పాత్ర ఏమిటో చెప్పే ప్రయత్నం చేసింది. ఓ ‘అన్‌టోల్డ్ ‌స్టోరీ’. మరుగున పడిన కొన్ని విషయాలను వెలుగులోకి తేవడం. ఈ పుస్తకోదంతం మొత్తానికి కొసమెరుపు వంటి అంశం ఇంకొకటి ఉంది. జియాయుస్‌ ‌సలామ్‌, ఉజ్మా అసఫ్‌ అనేవారు రాసిన పుస్తకాన్ని కూడా బ్లూమ్స్‌బరీయే ప్రచురించింది. దాని పేరు, ‘షాహీన్‌బాగ్‌: ‌ఫ్రం ఎ ప్రొటెస్ట్ ‌టు ఏ మూవ్‌మెంట్‌’. ‌షాహిన్‌బాగ్‌లో వినిపించిన నినాదాలు, దాని అభిప్రాయాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ మేధావుల అసలు రూపం, ఎజెండా అర్థమవుతాయి. షాహిన్‌బాగ్‌ ‌శిబిరం నిర్వహణ వెనుక మరో ప్రత్యేక దేశం ఏర్పాటు బీజాలు ఉన్నవనే ఎక్కువ మంది భారతీయుల అభిప్రాయం. కానీ ‘ఢిల్లీ నుంచి చెన్నయ్‌ ‌వరకు ఎన్నో షాహిన్‌బాగ్‌లు. ఆ శిబిరాలలోని వారందరికి ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరొక చేతిలో త్రివర్ణ పతాకం. షాహిన్‌బాగ్‌ ‌ప్రగాఢ ప్రజాస్వామ్య భావనకి, సెక్యులర్‌ ‌యాత్రకి ప్రతీకగా మారింది’ అంటూ ఆ పుస్తకం వెనుక ఇచ్చిన బ్లర్బ్‌లో కీర్తించారు. మనసును ద్రవింపచేసే సాహసోపేత మహిళల గాధ అంటూ కూడా వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. ఇది ఆధునిక కాల గాంధేయవాద ఉద్యమమని ఆకాశానికి ఎత్తేశారు. సీఏఏ పేరుతో ముస్లింల పట్ల అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా దీనిని అంచనా వేశారు. ఇది సత్యమని ఈ దేశంలో ఎంతమంది చెప్పారు? ఇది చాలు, ఇక్కడి మేధావులు ప్రచురణ సంస్థలను ఏ విధంగా శాసిస్తున్నారో చెప్పడానికి. బ్లూమ్స్‌బరీ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛను దారుణంగా భంగపరిచేదనని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. అసలు భారతీయ ప్రచురణ రంగాన్నే లెఫ్ట్ ‌మాఫియా శాసిస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛా దూతలుగా చెలామణి అవుతున్నవారు ప్రచురణకర్తలను భయపెట్టి ఇలాంటి చర్యకు పాల్పడేటట్టు చేశారని ప్రముఖ బాలీవుడ్‌ ‌నటుడు అనుపమ్‌ ‌ఖేర్‌ ‌చక్కగానే చెప్పారు. ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకునేటట్టు ఒత్తిడి తేవడంలో విలియం డాల్రింపుల్‌, ‌ఖాలేదా హాసిని, కామిలా షామీస్‌, ఆతిష్‌ ‌తాసిర్‌ (‌తవ్లీన్‌ ‌సింగ్‌ ‌కుమారుడు) ఉన్నారని ‘అర్బన్‌ ‌నక్సల్స్’ ‌రచయిత, బాలీవుడ్‌ ‌ప్రముఖుడు వివేక్‌ అగ్నిహోత్రి ఒక వీడియో ద్వారా ఆరోపించారు. అయితే వీరిలో ఖాలేదా (ఆఫ్ఘనిస్తాన్‌) ‌తన ప్రమేయం ఏమీ లేదని తరువాత ఖండించారు. కాంగ్రెస్‌ ‌తన వైఖరిని స్పష్టం చేస్తూ, బ్లూమ్స్‌బరీ చర్యనే సమర్థించింది. కపిల్‌ ‌మిశ్రా హాజరవు తున్నప్పటికి ఎంతో ధైర్య సాహసాలతో బ్లూమ్స్‌బరీ పుస్తకాన్ని మార్కెట్‌ ‌నుంచి ఉపసంహరించుకుందని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్‌ ‌మనుసింఘ్వి ప్రశంసలు కురిపించారు. అయితే సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తిన తరువాత బ్లూమ్స్‌బరీ ఎవరినీ సంతృప్తి పరచలేని ఒక వివరణ ఇచ్చింది. ‘వాస్తవ నివేదికతో, రచయిత్రులు జరిపిన ముఖాముఖీలు ఇచ్చిన ఆధారాలతో రాసిన ‘ఢిల్లీ రయిట్స్ 2020: ‌ది అన్‌టోల్డ్ ‌స్టోరీ’ పుస్తకాన్ని సెప్టెంబర్‌లో ఆవిష్కరించాలని బ్లూమ్స్‌బరీ భావించింది. బ్లూమ్స్‌బరీ భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యున్నత గౌరవం ఇస్తుంది. అలాగే సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తెరిగి ఉంటుంది’ అని ప్రకటించింది. అలాగే ఆగస్టు 22 నాటి ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథుల జాబితాకు తాము ఆమోద ముద్ర వేయలేదనే ఆ సంస్థ ముక్తాయించింది.

విమర్శకులు- అంటే ఉదారవాదులు, వామపక్ష వాదులు ఈ పుస్తకం నిండా అవాస్తవాలు ఉన్నాయని ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి ఆవిష్కరణోత్సవ ఆహ్వానపత్రంలో బీజేపీ ప్రముఖులు, వామపక్ష వ్యతిరేకుల పేర్లు ఉన్నందునే పుస్తకాన్ని మార్కెట్‌ ‌నుంచి ఉపసంహరించుకోవాలని అలా ఆగమేఘాల మీద బ్లూమ్స్‌బరీ నిర్ణయం తీసుకుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది? పరిచయం, అర్బన్‌ ‌నక్సలిజమ్‌ – ‌జిహాదీజమ్‌, ‌పౌరసత్వ సవరణ చట్టం, జామియా విశ్వవిద్యాలయంలో హింస, షాహిన్‌బాగ్‌ ‌నమూనా, ఈశాన్య ఢిల్లీ దాడులు, క్షేత్రస్థాయిలో బాధితుల అనుభవాలు, ముగింపు అనే ఎనిమిది అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. చివరిగా అనుబంధం ఒకటి చేర్చారు. ఢిల్లీ అల్లర్లు ముందస్తు ప్రణాళిక మేరకే జరిగాయని, అర్బన్‌ ‌నక్సల్స్-‌జీహాదీ పథకం నమూనాలో ఇదంతా జరిగిందని ఆ పుస్తకం పేర్కొనడం వామపక్ష, ఉదారవాద మేధావులకు మింగుడు పడడం లేదు. ఈ పుస్తకం మీద తలెత్తిన వివాదం మొత్తానికి కేంద్ర బిందువు ఇదే. ఇలాంటి ఆరోపణ చేస్తే అందుకు సంబంధించి పుస్తకం తొలి అక్షరం నుంచి ఆధారాలు కనిపించాలన్న నిబంధనేదో ఉన్నట్టు చెబుతున్నారు వారు. ఒక నిజ నిర్ధారణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే పుస్తకం రాశారనీ, ఆ నివేదికనే పుస్తకమంతా నింపారనీ, వాస్తవాలకు సంబంధించిన తప్పులతో పాటు, కుట్ర సిద్ధాంతల ఆధారంగా ఆ ముగ్గురు రచయిత్రులు పుస్తకం వెలువరించారని ఆరోపణ. సీఏఏ వ్యతిరేక ఆందోళనల వివరిస్తూ, కుట్ర సిద్ధాంతాలకి ఒక అధ్యాయమే ఎందుకు కేటాయించారన్నదే ఆ మేధోవర్గం ప్రశ్న. మావోయిస్టు సాహిత్యం, ఖిలాఫత్‌ ఉద్యమం, సిరియా-ఇరాక్‌ల ఐఎస్‌ఐఎస్‌ ‌కుమ్మక్కయ్యాయని రచయిత్రులు ఆరోపించినా, ఆ కలయికకీ, ఢిల్లీ అల్లర్లకీ మధ్య సంబంధం ఏమిటో చెప్పలేదన్నారు. నక్సల్‌, అర్బన్‌ ‌నక్సల్‌ అన్న పదాలు ఒక్కటే అన్నట్టుగా రచయిత్రులు ప్రయోగించారనీ, అసలు అర్బన్‌ ‌నక్సల్స్ అన్న పదం తమ దృష్టిలోనే లేదని కేంద్ర హోంశాఖ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందనీ, అర్బన్‌ ‌నక్సల్స్ ‌కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారనీ చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు మేధావులు. ఇస్లామిక్‌ ‌రాడికల్స్, ‌రాడికల్‌ ‌ముస్లిమ్స్, ‌జీహాదీ ఎలిమెంట్స్, అ‌ల్ట్రా లెఫ్ట్ ‌జీహాది కేడర్‌ అం‌టూ నిరసనకారుల గురించి చెబుతూ పరస్పరం సంబంధం లేని శక్తులను కలిపి కలగాపులగం చేశారంటూ కోడిగుడ్డు మీద ఈకలు లాగేందుకు యత్నించారు. అసలు ఈ పుస్తకాన్ని అచ్చుకు పంపే ముందు ఈ మేధావులకి చూపించి, వారి సర్టిఫికెట్‌ ‌తీసుకుంటే సరిపోయేదేమో!

ఈ పుస్తకానికి ఐపీఎస్‌ ‌మాజీ అధికారి పీసీ డోగ్రా ముందుమాట రాశారు. అందులో జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ చెప్పినట్టుగా ఒక ఉల్లేఖను ఇచ్చారు. ‘నేను సంస్కృతి చేత ముస్లింను. పుట్టుక చేత యాదృచ్ఛికంగా హిందువును’ అన్నదే ఆ ఉల్లేఖన. ఇది నెహ్రూది కాదనీ, నెహ్రూను ఉద్దేశించి హిందూ మహాసభ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్య అనీ పుస్తకం వ్యతిరేకుల ఆరోపణ. షాహిన్‌బాగ్‌లో పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ అన్న నినాదాలు, 2016లో జేఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాలు చేశారని ఈ పుస్తకంలో ఉంది. కానీ, షాహిన్‌బాగ్‌ ‌నిరసన శిబిరంలో అలాంటి నినాదాలు ఇచ్చినట్టు ఆధారాలు లేవంటున్నారు మేధావులు. అలాగే జేఎన్‌యూ గొడవ ప్రస్తుతం విచారణలో ఉందంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ చెలరేగిన ఆందోళనలు వామపక్ష, ముస్లిం ఛాందసవాదుల ప్రోద్బలంతో జరిగాయని, సీఏఏ వ్యతిరేక అల్లర్లన్నింటి వెనుక ఉన్నది ఖిలాఫత్‌ ‌నాయకులేనని ఆ ముగ్గురు రచయిత్రులు ఆధారం లేకుండా రాశారని కూడా మేధావులు తీర్పు ఇచ్చేశారు. ఒక మూక ఉన్మాదమే సీఏఏ వ్యతిరేకత చుట్టూ ఉందని రాయడం వారికి నచ్చలేదట. ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు అమానుతుల్లాఖాన్‌, అదే పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ‌తాహిర్‌ ‌హుసేన్‌లు ఇచ్చిన ఉపన్యాసాల గురించి విరివిగా ఇచ్చి, బీజేపీ నాయకులు అనురాగ్‌ ‌ఠాకూర్‌ (‌కేంద్ర మంత్రి), పర్వేష్‌ ‌వర్మ ఉపన్యాసాలను అసలు ప్రస్తావించలేదనీ, కపిల్‌ ‌మిశ్రా మాటలను ఎక్కడో ఆరో అధ్యాయంలో కొద్దిగా ఉదాహరించారనీ కూడా ఉదారవాదులు ఆరోపిస్తున్నారు. కపిల్‌ ‌మిశ్రా శాంతిని నెలకొల్పడానికి వెళ్లారని ఈ పుస్తకం పేర్కొన్నది. కానీ ‘ది క్వింట్‌’ అనే వెబ్‌సైట్‌ ఇం‌దుకు భిన్నమైన కథనం ఇచ్చిందట. ఆ కథనం వారికి వేదమైనంత మాత్రాన అందరికీ కావాలా? అలాగే ఈ సంవత్సరం జనవరి నాటి జేఎన్‌యూ అల్లర్ల గురించి చెప్పినప్పుడు ఏబీవీపీ అరాచకాల గురించి ప్రస్తావించనే లేదన్నది కూడా వ్యతిరేకుల ఆరోపణ.

షర్జిల్‌ ఇమామ్‌ అనే జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి అస్సాంను ఇండియా నుండి వేరు చేయాలని అనడం దేనికి నిదర్శనం? ఆ మాట అతడు ఎక్కడ అన్నాడు? రివాల్వర్లతో కొందరు ముస్లిం యువకులు కాల్పులు జరపడం, అవి అన్ని రకాల మీడియాలోను పెద్దగా వెల్లడికావడం, తాహిర్‌ ‌హుస్సేన్‌ అనేవాడి ఇంట భారీగా మందుగుండు దొరకడం ఇవన్నీ ఈ ఉదారవాదుల దృష్టిలో కేవలం అభూత కల్పనలేనా? చిన్న చిన్న నేరాలేనా? ‘ఒక చేత రాజ్యాంగం, మరొక చేత త్రివర్ణ పతాకం పట్టిన వారితో నిండిపోయిన’ షాహిన్‌బాగ్‌ ‌శిబిరంలోనే మోదీనీ, అమిత్‌ ‌షాని కాల్చి పారేస్తానంటూ ఒక చిన్నారి చేత పలికించిన సంగతి ఇండియాటుడే వంటి చానల్‌ ‌కూడా ప్రసారం చేసింది. వాటిని ఏమనాలి? వామపక్షవాదుల పరిభాషలోనే, ‘ఎలా చూడాలి?’


‘‌ఢిల్లీ నుంచి చెన్నయ్‌ ‌వరకు ఎన్నో షాహిన్‌బాగ్‌లు. వారందరికి ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరొక చేతిలో త్రివర్ణ పతాకం. షాహిన్‌బాగ్‌ ‌ప్రగాఢ ప్రజాస్వామ్య భావనకి, సెక్యులర్‌ ‌యాత్రకి ప్రతీకగా మారింది. ఇది మనసును ద్రవింపచేసే సాహసోపేత మహిళల గాధ, ఆధునిక గాంధేయవాద ఉద్యమం. సీఏఏ పేరుతో ముస్లింల పట్ల అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం.’


భారతీయ ఉదారవాదులంటే- అటు భారతీయులు కాదు, ఇటు ఉదారవాదులు కూడా కాదని ప్రముఖ కాలమిస్ట్, ‌పురాణాల వ్యాఖ్యాత ఆనంద్‌ ‌నీలకంఠన్‌ ఔట్‌లుక్‌ ‌వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో విమర్శించడం గమనార్హం. బ్లూమ్స్‌బరీ ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు నిర్ణయం ప్రకటించిన తరువాత, అందుకు వామపక్ష మేధావులను, ఉదారవాదులను బాధ్యులను చేస్తూ విమర్శించిన అనేక మందిలో నీలకంఠన్‌ ఒకరు. అలా అని ఈ పుస్తకంలోని ప్రతి అంశానికి నీలకంఠన్‌ ఆమోదముద్ర వేయలేదు. అందరికీ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నదే ఆయన వాదన. ఇంకొకటి- పాశ్చాత్య దేశాల ఉదారవాదం వలె కాక, మనదేశంలో ఉదారవాద మేధావులకు మార్క్సిజంతో లంకె ఉంది. మార్క్సిజం కూడా ఒక మతంలా ఎదిగినదే. తన సోదర మతాల మాదిరిగానే ప్రతిదానిలోను రెండు పరస్పరం ప్రతిఘటించుకునే శక్తులనే వెతుకుతూ ఉంటుంది. తమ మూక తప్ప అన్యులంతా రాక్షసశక్తులుగానే చూస్తూ ఉంటుంది. మైనారిటీలకు రక్షకులుగా వీరు తమకి తామే నియమించుకున్నారు. అయితే మైనారిటీలకు ఇలాంటి ఉదారవాదులు చేసిన అన్యాయం మరొకరెవరూ చేయలేదు. హిందువులలో మిలిటెన్సీ (ఏమైనా ఉంటే) ఈ ఉదారవాదుల పుణ్యమే అన్నది నీలకంఠన్‌ ‌మాటల సారాంశం. దీనికి ఈయన మీద కూడా కొందరు మేధావులు విమర్శలు గుప్పించారు. ఉదారవాదికి సహనం, ఎదుటివారు చెప్పేది వినే ఓపిక ఉండాలని చెబితే, వెంటనే ఒక మతోన్మాది తరహాలోనే, అయితే మీరు హిట్లర్‌ని సమర్ధిస్తారా, యూదుల మీద అన్ని ఘోరాలు చేసిన హిట్లర్‌ని సమర్ధిస్తారా అంటూ దాడి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎప్పటికీ హిట్లర్‌ను సమర్థించబోననీ, అయితే హిట్లర్‌ ‌సైతం అతడు కోరుకున్నది చెప్పుకునే హక్కును కలిగి ఉన్నాడని చెబుతానని అంటున్నారు. తను అనుకున్నది చెప్పడానికి హిట్లర్‌కు ఉన్న హక్కును, సమర్థించడానికీ, హిట్లర్‌ను సమర్థించడానికి ఎంతో తేడా ఉందని అన్నారు. ఇదే ఉదారవాదులలో చాలా మందికి అర్థం కావడం లేదని నీలకంఠన్‌ ‌విశ్లేషిస్తున్నారు. ఇంకొందరు ఉదారవాదులు ఈ పుస్తక రచనే ముస్లిం వ్యతిరేకమని కొట్టి పారేసే ప్రయత్నం చేయడం కనిపిస్తున్నది. ఉదారవాదుల, వామపక్షవాదుల గుండె చప్పుడు సరిగ్గా ఇదే.

సంఘ్‌ ‌పరివార్‌ ‌వైపు గొప్ప మేధావులు ఎవరూ లేకపోవడం వల్లనే బ్లూమ్స్‌బరీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విచిత్రాతి విచిత్రమైన మరొక వాదం నేడు బయటకు వస్తున్నది. ఇప్పుడు మేధావులుగా చెలామణి అవుతున్నవారికి ఆ కిరీటం తగిలించిన వారు అసలు ఎవరు? వాళ్ల కుతర్కం మీద అంత ప్రేమ ఎవరికి? మైనారిటీ మతోన్మాదం కంటే, మెజారిటీ మతోన్మాదం ఘోరం ఘోరం అన్న నికృష్ట వాదన జనం ఇంకా నమ్మాలా? హిందువుల మనోభావాలను నిరంతరం అవమాన పరచడమే మేధావి బిరుదానికి తొలి అర్హత అన్నట్టు ఉన్నారు ఈ దేశ మేధావులు. ఇంటి నిండా పెట్రోలు బాంబులు, మందుగుండు, విసరడానికి రాళ్లు పెట్టుకుని విధ్వంసం సృష్టించిన, ఐబీ అధికారి అంకిత్‌ ‌శర్మను దారుణంగా చంపిన తాహిర్‌ ‌హుసేన్‌ ‌చర్య కంటే కపిల్‌ ‌మిశ్రా ఉపన్యాసమే బీభత్సం, భయానకం, ప్రమాదం అని నిస్సిగ్గుగా వాదించడం అజ్ఞానం, గుడ్డితనం, పక్షపాతం తప్ప మరొకటి అవుతుందా? ఇలాంటి మేధావులు సంఘ్‌ ‌పరివార్‌కు ఎప్పటికీ అక్కరలేదు. దేశభక్తిని, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అనే ఆయుధంతో ఆ రాజ్యాంగాన్నే వెన్నుపోటు పొడిచే, జాతీయ జెండాను నిరాకరించే ఇలాంటి మేధావులను పరివార్‌ ‌పట్టించుకోదు. పరివార్‌ ‌దృష్టిలో వీరి మేధో విన్యాసం కేవలం తృణప్రాయం. వీళ్ల వాదాలు ఊకదంపుడు. అసలు అలాంటి అమ్ముడుపోయిన స్వయం ప్రకటిత మేధావులు ఈ దేశానికి అవసరం కూడా కాదు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. కశ్మీరీ పండిత్‌లపై ఘోరాల మొదలు నిన్నమొన్నటి మహారాష్ట్ర సాధువుల హత్య వరకు కొన్ని వందల ఉదంతాలు కనిపిస్తాయి – మేధావులు పక్షపాత వైఖరిని చెప్పడానికి. భారత దేశాన్ని, భారతీయ జనతాపార్టీని విమర్శించడంలో ఉండవలసిన కనీస విజ్ఞత, సంయమనం లేని ఇలాంటి మేధావులు ఈ దేశానికే, ఈ సమాజానికే కేన్సర్‌. ‌కసబ్‌నీ, పార్లమెంట్‌ ‌మీద దాడి నిందుతులనీ, పాకిస్తాన్‌నీ, పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులనీ, మతోన్మాద ముస్లింలనీ, మావోయిస్టులనీ, దేశాన్ని ముక్కలు చేయాలని నినాదాలు చేసే ఉన్మాదులనీ సమర్ధించడం తప్ప మరొక ఎజెండా లేని ఈ మేధావులు, ఉదారవాదులు ఎన్ని కుతంత్రాలు పన్నినా వాస్తవాలు బయటకు వస్తూనే ఉంటాయి. అరిచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరని డాంబికంగా చెబుతూ ఉంటారు వారు. ఆ విషయం వారికి కూడా వర్తిస్తుంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE