గాంధీలు సత్యం, గాంధీలే నిత్యం.. మిగిలిన దంతా మిధ్యే అంటూ, సోనియా గాంధీయే ఇంకొంత కాలం నేత అంటూ ఆగస్టు 24 నాటి కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ తీర్మానించి సమావేశానికి మంగళం పాడింది. ఓ 23 మంది కాంగ్రెస్‌ ‌నేతలు కొన్ని సదాశయాల కోసం ఒక లేఖ రాశారు. పార్టీని సమూలంగా క్షాళన చేయాలన్నదే వారి ఆకాంక్ష. క్షాళన చేయవలసిన స్థితిలోనే పార్టీ అఘోరించిం దని ఆ ఇరవై ముగ్గురు గుర్తించా రేమో కానీ, ఆ వాస్తవం అధినేతల దయకి ఇంకా నోచుకోలేదు. అధ్యక్ష స్థానంలో ఉంటూ సదా అందుబాటులో ఉండే వ్యక్తి, క్షేత్రస్థాయిలో తిరిగే పనిమంతుడూ ఉండాలని ఆ లేఖ సారాంశం. మన పార్టీ బతికే ఉంది, నమ్మండి అంటూ కార్యకర్తలలో ఉత్సాహం నింపే అధ్యక్షుడు అవసరమని వారు కోరుతున్నారు. ముప్పయ్‌ ఏళ్లయింది, ఇకనైనా కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీకి ఎన్నికలు జరపరాదా అన్న విన్నపమూ ఉంది. ఇవేమీ పరిగణనలోనికి రానివే అన్నట్టు సీడబ్ల్యుసీ సమావేశం ముగిసింది. గాంధీ-నెహ్రూ కుటుంబమే పైచేయి సాధించింది- ప్రజాస్వామ్యం మీద, పార్టీ మనుగడ మీద కూడా. గాంధీ కుటుంబేతర నేత అన్న నినాదం ఎంత బూటకమో ఇంకాస్త స్పష్టమయింది.


ఆశకి అంతుండాలంటారు. ఆ లేఖ కింద చేవ్రాలు చేసిన నేతలంతా భారీ స్థాయిలో అత్యాశకు పోయారని జరిగిన పరిణామాలు రూఢి చేశాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందనివారు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టాలి అంటూ యువరాజు రాహుల్‌ ‌గాంధీ అన్న మాటను ఇంత కాకలు తీరిన కాంగ్రెస్‌ ‌యోధులు సైతం నిజమని ఎలా నమ్మారో అర్థం కాదు. నిజానికి యువరాజు మాటలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వారు ఎవరైనా సరే, దమ్మూ ధైర్యం ఉంటే ఆ పదవిలో కూర్చోండి చూద్దాం అన్న సవాలే ధ్వనిస్తుంది. సోనియా శరణు శరణు అంటూ భక్తబృందం యావత్తు మళ్లీ ఆమె తాత్కాలిక అధ్యక్ష గిరీనే నిరవధికంగా పొడిగించారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పునరంకితమయ్యారు. ఈసారి ఆమె తాత్కాలిక పదవిలో నిరవధికంగా తిష్ట వేసే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే, దేశంలో పరిస్థితులు చక్కబడాలట. అంటే కొవిడ్‌ 19 ‌శాంతించాలి. నిజమే తలలు తీవ్రంగా పండిన వారే పార్టీలో ఎక్కువ. బయటకి అడుగు పెడితే కరోనా ఖాయం. ఆ ప్రమాదం ఏదీ లేదన్న భరోసా ఏర్పడినప్పుడు ఏఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు అధ్యక్ష ఎన్నిక జరుపుతారట. ఇదెప్పటికి సాధ్యం? కాబట్టి కాంగ్రెస్‌కు మా కుటుంబం తప్ప మరొక దిక్కు లేదని రాహుల్‌ ‌సవాలు విసరడమే నిజం.

23 మంది లేఖ దరిమిలా ఆగస్టు 24న సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సీడబ్ల్యుసీ సమావేశం ప్రహసన పక్రియకు కొత్త సొబగులు అద్దింది. నిరుడు ఆగస్టులో రాహుల్‌ ఏఐసీసీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేయడం, గాంధీ కుటుంబేతరులు అధ్యక్షులు కావాలని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అప్పుడే మయింది? సోనియా తాత్కాలిక అధ్యక్షురాలయింది. తాత్కాలిక నియామకం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. పార్టీలో సమూల మార్పులు అవసరం, పని చేసే అధ్యక్షులు కావాలని లేఖ వచ్చింది. నిజానికి ఇలాంటి ఒక లేఖ అంతకు ముందు కూడా వచ్చింది. కానీ అలాంటి లేఖ ఏదీ లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు అడ్డంగా బొంకారు. అందుకేనేమో, 23 చేవ్రాళ్లతో మరొక లేఖ వచ్చి పడింది. పైగా ఈ లేఖ కూడా రాలేదని అధికార ప్రతినిధులు మళ్లీ బొంకే ప్రమాదం లేకుండా లీక్‌ ‌కూడా చేశారు ‘ఉత్తర’కుమారులు. దీనికి సమాధానం అన్నట్టే సోనియా తాజాగా సీడబ్ల్యుసీ సమావేశానికి పిలుపునిచ్చారట. పైగా అధ్యక్ష ఎంపిక పక్రియకు శ్రీకారం చుట్టండి, నేను తాత్కాలిక అధ్యక్ష పదవికి రాజీనామా సిద్ధం చేస్తున్నానని ప్రకటించారట. ఇప్పుడు కూడా జరిగిందేమిటి? ఒళ్లు బాగోక అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు లేఖ రాస్తారా అంటూ, రాజస్తాన్‌లో కూడా పార్టీ ప్రభుత్వం బొక్కబోర్లా పడుతుందని అంతా బీపీలు పెంచుకుంటున్న తరుణంలో ఆ లేఖ ఏమిటి అంటూ రాహుల్‌ ‌మండిపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఆయన అక్కడితో ఆగలేదు. తన సహజ మూర్ఖపు వైఖరితో మీరంతా బీజేపీతో కుమ్మక్కయి పోయారని ఖరీదైన అభాండం పడేశారు. ఈ లేఖ ఆనంద్‌శర్మ రాశారని అస్మదీయుల శిబిరంలో అగ్రగణ్యుడు అహ్మద్‌ ‌పటేల్‌ ‌తేల్చారు. ఈ కుట్ర యావత్తు శశిథరూర్‌ ‌రచించాడని మరొక నేత ఎవరో అన్నట్టు వార్త. నేను బీజేపీతో కుమ్మక్కయ్యానని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానంటూ గులాం నబీ ఆజాద్‌ ‌భీషణ ప్రతిజ్ఞ చేశారని కూడా వార్త వచ్చింది. గడచిన ముప్పయ్‌ ఏళ్లలో నేను ఏనాడూ బీజేపీని సమర్థించింది లేదు, నన్ను కూడా బీజేపీని అంటకాగే వాళ్ల జాబితాలో చేరుస్తారా, తమకిది ధర్మమా, బీజేపీ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నేను ఎన్నిసార్లు కోర్టుల్లో వాదించానో మరచిపోవడం భావ్యమా అన్న తీరులో కపిల్‌ ‌సిబల్‌ ఏకంగా ట్వీట్‌ ‌చేశారు. ఈయన కూడా లేఖ మీద చేవ్రాలు చేశారు. అయితే తన వ్యాఖ్య ఉద్దేశం అది కాదంటూ రాహుల్‌ ‌స్వయంగా బుజ్జగించడం వల్ల క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా సిబల్‌ ఆ ‌ట్వీట్‌ ‌వెనక్కి తీసుకున్నారు. ఇంతకీ ఈ లేఖ గురించి సీనియర్లని పట్టుకుని అంతలేసి మాటలనడానికి రాహుల్‌కి ఏమిటి అధికారం? ఆయన అధ్యక్ష పదవిలో లేరు. కానీ పార్టీని ఒంటి చేత్తో గిరగిరా తిప్పుతున్నది ఆయనే. పుల్వామా దాడి విషయంలో సైనికుల మనోభావాలకు వ్యతిరేకంగా, కశ్మీర్‌ ‌వ్యవహారాలలో తలా తోకా లేకుండా, రఫేల్‌ ‌విమానాల విషయంలో అడ్డదిడ్డ వాచాలత, కోర్టుల మొట్టికాయలు, ఒక్క ఎన్నికలోను సంపూర్ణ విజయం సాధించలేకపోవడం…. ఇలాంటి ఎన్నో కారణాలు సీనియర్లకు కడుపు మండేటట్టు చేస్తున్నాయి. కొన్ని కీలక సందర్భాలలో రాహుల్‌ అభిప్రాయంతో విభేదించినవారు కూడా ఆ పార్టీలో కనిపించారు. తమ విభేదాన్ని కరణ్‌ ‌సింగ్‌ ‌వంటివారు దాచుకోలేదు. కానీ రాహుల్‌ అనే యువరాజు గాంధీ కుటుంబ వారసుడు. ఆయన ఏం చేసినా చెల్లుతుంది. కచ్ఛితంగా చెప్పాలంటే కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబీకుడు నేత అంటే ‘దెబ్బలబ్బాయి’ పాత్రన్నమాట. యువరాజు రాహుల్‌ ‌మాట్లాడతారు. తిట్లూ, విమర్శలూ ఉత్సవ విగ్రహం స్థానంలో ఉన్న ఆ దెబ్బలబ్బాయి భరించాలి.

నిజం చెప్పాలంటే రాహుల్‌ ‌రాజకీయ గురువు దిగ్విజయ్‌ ‌కొట్టి పారేసినట్టు ఇదంతా టీకప్పులో తుపాను కాదు. లేఖలో కనిపించినవి 23 సంతకాలే కావచ్చు. పార్లమెంటు సభ్యులే దాదాపు పాతిక మంది సంతకాలు చేయడానికి ముందుకు వచ్చారని వార్తలు వచ్చాయి. వివిధ హోదాలలో దేశం నలుమూలలా ఉన్న మరొ వందమంది పార్టీ పెద్దలు కూడా సంతకాలు చేయడానికి ఉత్సాహం చూపించారట. అయితే రాబోయే ఎన్నికలలో సీటు భయం వెనక్కి లాగిందట. కానీ ఇలాంటి లేఖ, అందులో విషయాలు సత్యదూరం కావని వారంతా ముక్త కంఠంతో పలికారట. పేరు వెల్లడించడానికి మొహమాట పడిన ఒక ప్రముఖ నేత అయితే, ‘ఆ లేఖలో గాంధీ, నెహ్రూ(అంటే ఎంకె గాంధీ, జవాహర్‌లాల్‌)‌లు పార్టీకి చేసిన సేవలని గుర్తు చేశాం. పైగా సోనియా సేవలకి కూడా అదేస్థాయిలో పొగడ్తలు కేటాయించాం. అయినా లేఖలో ఏముందో తెలియకుండానే మమ్మల్ని తిరుగుబాటుదారులనడం దారుణం కదా!’ అని వాపోయాడని వార్త. ఇవన్నీ ఎలా ఉన్నా, దేశంలో గాంధీ కుటుంబం పట్ల విధేయత, ఉన్న మేరకే అయినా చాలా గట్టిగానే ఉంది. అసమ్మతి, ప్రజాస్వామ్యం, ఎన్నికలు వంటి బంధాలలో ఆ కుటుంబాన్ని ఇరికించి వారి గత త్యాగాలను అవమానపరుస్తారా అంటూ దేశం నలుమూలల నుంచి లేఖ మీద సంతకం చేసిన నాయకులను శాపనార్థాలు పెడుతున్నారు కార్యకర్తలు. అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు లేఖ రాస్తారా అంటూ కొడుకు వెలిబుచ్చిన ఆవేదన కార్యకర్తలను కలచి వేసి ఉండాలి. అయినా అంత అనారోగ్యంగా ఉండి పదవి ఎందుకు? తాత్కాలికమే కాబట్టి ఎవరికైనా అప్పగించవచ్చు కదా అన్న ప్రశ్న వారికి రాలేదు. తర్ఫీదు అలాంటిది. అహ్మద్‌ ‌పటేల్‌ ‌కూడా పరోక్షంగా అసమ్మతి మీద తనవంతుగా నీళ్లు చిలకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయం నాయకులకీ, అధ్యక్షుల వారికీ సంబంధించినది. మాది ప్రజాస్వామిక సంస్థ. అధ్యక్షుల అభిప్రాయంతో విభేదించే హక్కు నాయకులకి ఉంటుంది. అయితే అది తగిన వేదిక మీద జరగాలి’ అన్నారు. కాబట్టి లేఖ రాయడం ఒక తప్పయితే, అది బహిర్గతం కావడం మరొక తప్పని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌ ‌దృష్టిలో ‘బీజేపీతో కుమ్మక్కయిన వారు’, సాధారణ కార్యకర్తల ఉద్దేశంలో ‘అసమ్మతివాదులు’ అంటే లేఖ మీద సంతకాలు చేసినవారు 24 నాటి సీడబ్ల్యుసీ సమావేశం మరునాడే సంజాయిషీలు ఇచ్చుకున్నారు. దీనితో గాంధీ కుటుంబ విధేయుల బృందమే ఆ సమావేశంలో పైచేయి సాధించిన సంగతి రుజువైపోయింది. నాయకత్వాన్ని సవాలు చేసే ఉద్దేశం కాని, అసమ్మతి కార్యకలాపాలు కాని తమ ఉద్దేశమే కాదని వారు చెప్పుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే స్థితిలో, సొంత సిద్ధాంతాలతో ముందుకు నడిచే స్థితిలో కాంగ్రెస్‌ ‌లేకపోవడంతో కలత చెంది ఈ లేఖ రాశామని, పార్టీ పునరుద్ధరణే మా అందరి ధ్యేయమని సీనియర్‌ ‌నాయకుడు వీరప్ప మొయిలీ ప్రకటించారు. అయితే సమావేశం తరువాత గులాం నబీ ఆజాద్‌ ఇం‌ట జరిగిన సమావేశం సంగతి గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. అలా అని ఈ సమావేశం అంత ప్రాధాన్యం లేనిదేమీ కాదు. ఈ వ్యూహం ఎవరిదైనా గులాం నబీ ఆజాద్‌ను ముందు ఉంచడం పెద్ద ఎత్తే. ఈ లేఖ, దరిమిలా జరిగిన సీడబ్ల్యుసీ సమావేశం కాంగ్రెస్‌కే కాదు, గాంధీ-నెహ్రూ కుటుంబానికి కూడా కుదుపే. దీనిని అంగీకరించడం అవసరం. అలాగే సీడబ్ల్యుసీ పార్టీ పరిణామాలను చర్చించినట్టయితే విజయరాదిత్య సింధియా వ్యవహారం రాకుండా ఉండదు. ఒక రాష్ట్రంలో చిరకాలం తరువాత వచ్చిన అధికారాన్ని చేజార్చుకోవ డానికి దారి తీసిన పరిణామమది. అసలు చర్చే లేకుండా ఇలాంటివి ప్రస్తావనకు రాకుండా చేశారనిపిస్తుంది. చర్చిస్తే వైఫల్యం ఎవరిదో తెలిసేదే.

నిజానికి తిరుగుబాటు సోనియా మీద కాదని స్పష్టమవుతోంది. ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. అయినా ఆమెకే పగ్గాలు అప్పచెప్పక తప్పని పరిస్థితిని కల్పించినది కుమారరత్నమే. ఇంకా ఆగస్టు 24వ తేదీ సమావేశంలో రాహుల్‌, ‌సోనియా శిబిరాలు వెలవడం కొత్త పరిణామమే. లేఖలో సోనియా తప్పుకుని పూర్తి సమయం అధ్యక్షునిగా రాహుల్‌నే పునఃప్రతిష్టించాలన్న అభిప్రాయం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ఏకే ఆంటోని వంటివారు సోనియా గాంధీయే అధ్యక్ష పదవి స్వీకరించాలని చెప్పారు. తను ఇచ్చిన ఒక కీలక ఆర్డినెస్స్ ‌తన ఎదుటే విలేకరుల సమావేశంలో రాహుల్‌ ‌చించిపారేసిన సంగతి ఈ వృద్ధ నేత మరచిపోవడం కష్టమే. తన రాజకీయ గురువు పీవీని దృష్టిలో ఉంచుకుని, ‘తమ కుటుంబం అధికారంలో ఉంటే బాబ్రీ కూలేది కాద’ంటూ చేసిన అవమానకర మైన ప్రకటన కూడా సింగ్‌ ‌మదిలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కొందరు రాహుల్‌ ‌గాంధీ అధ్యక్షుడు కావాలంటూ నినాదాలు చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా సోనియా అంతరంగం ఏమై ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఇందిర పార్టీ అధ్యక్షురాలు కావాలని నెహ్రూ భావించినట్టు, సంజయ్‌ ‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఇందిర ఆశించినట్టు, ఇప్పుడు సోనియా కూడా రాహుల్‌ ‌పగ్గాలు చేపట్టా లనే అనుకుంటున్నారు. ఆ కుటుంబానికే చెందిన ప్రియాంక వాద్రా మనసులో ఉన్నది ఎవరైనా తమ కుటుంబం కనుసన్నలలోనే పదవి పదిలంగా ఉండాలనే. తన కుమారుడు పార్టీ అధ్యక్ష పదవిలో ఉండాలని అనుకున్నప్పుడు ఆయన బాధ్యతతో మెలిగేటట్టు సోనియా చేయగలిగితే ఈ రగడకు ఆస్కారం ఉండేది కాదు. కొందరు విశ్లేషకుల అంచనా ప్రకారం భవిష్యత్తులో రాహుల్‌ ‌గాంధీయే అధ్యక్ష పదవి చేపడతారు. పార్టీలో వ్యతిరేక శిబిరం మీద పైచేయి సాధించడం కోసం ఇలాంటి విన్యాసాలు చేయడం రాజకీయాలలో కొత్త కాదు. కాబట్టి ఎన్నిక ద్వారా అధ్యక్షుడైనట్టు భ్రమింప చేసే ఒక దృశ్యాన్ని సృష్టించే పని మొదలయింది. కొవిడ్‌ 19 ‌సద్దుమణిగిన తరువాత జరిగే ఏఐసీసీ సమావేశంలో ఆయనే ఎన్నికవుతారన్నమాట. పార్టీలో సోనియాకు బలం ఉంది. ఆమె ‘త్యాగశీలి’ కాబట్టి ఆ బలం తన కోసం కాకుండా, తనయుడి కోసం ధారపోయడం ఖాయం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌ను ఎన్నుకోవలసింది అంటూ సోనియా పిలుపునిస్తే అది పార్టీకి శిరోధార్యం కాకుండా ఉండగలదా?

– జాగతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE