ఆగస్టు 30న ఆర్‌ఎస్‌ఎస్ పర్యావరణ విభాగం, వివిధ హిందూ ఆధ్యాత్మిక సంస్థల ఆధ్యర్యంలో ‘పకృతి వందనం’ కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సర్ సంఘచాలక్ మోహన్‌జీ భాగవత్ ఉపన్యసించారు. పలువురు స్వామీజీలు కూడా పాల్గొన్నారు. దేశవిదేశాల నుండి అనేక మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులంతా పకృతిని కాపాడుతామని సంకల్పం తీసుకున్నారు.
‘పర్యావరణ’మనే శబ్దాన్ని ఈ మధ్య తరచుగా వింటున్నాం. అదేమిటో చర్చించుకుంటున్నాం కూడా. దానితోపాటు నిర్వహించుకోడానికే ఈ ‘పర్యావరణ దినం’ కూడా. ఇది ప్రపంచమంతా జరుగుతుంది. ఎందుకంటే, ప్రపంచంలో జీవించడానికి ఇప్పటి వరకు అధికంగా అనుసరించే పద్ధతి ఇప్పుడు కూడా ఇతోధికంగా వాడుకలో ఉంది. కాని ఆ జీవనశైలి నిలకడయినది కాదు. పర్యావరణానికి అనుకూలమైనది కూడా కాదు. అది ప్రకృతిని జయించడానికే మనిషి జీవించాలన్న నమ్మకం కలిగినది. ప్రకృతి మనిషి అనుభవించడానికేనని, ప్రకృతి పట్ల మనిషికి ఎలాంటి బాధ్యతా లేదని, ప్రకృతి మీద మనిషికి పూర్తి అధికార ముందని అనుకుంటూ గత 200-250 సంవత్స రాలుగా జీవిస్తున్నాం. దాని దుష్పరిణామం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. దాని వికృతరూపం మనకు కనబడుతున్నది. ఇదేవిధంగా నడుచుకున్నట్టయితే జీవితం గడవడానికి మనం ఉండం. లేదా ఈ సృష్టే ఉండకుండా పోవచ్చును. అందుకే మనిషి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నాడు. అందుకోసమే ‘పర్యావరణ దినం’ జరుపుకుంటున్నాం. ఇదంతా గత 2000 సంవత్సరాల నుండి సాగిస్తూ వచ్చిన జీవన విధానానికి సంబంధించింది. ఇంకా చెప్పాలంటే, అందులో 300 సంవత్సరాల నుండి మరీ దిశాహీన మైన ఈ పద్ధతి మనం స్వీకరించాం.
కానీ, పర్యావరణం పట్ల భారతదేశం అనుసరించిన మార్గం ఎంతో భిన్నమైనది. మన అస్తిత్వం వెనుక ఉన్న పరిపూర్ణత్వంలోని సత్యాన్ని మన పూర్వీకులు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి మనం కూడా ప్రకృతిలో భాగమేనని భావించడం మొదలు పెట్టారు. శరీరంలోని అన్ని అంగాలు సరిగా పని చేస్తేనే శరీరం కూడా పని చేయగలుగుతుందన్న సత్యం వంటిదే ఇది. శరీరంలో జీవం ఉన్నప్పుడే అన్ని అంగాలు పని చేయగలుగుతాయి. శరీరం నుండి ప్రాణం పోయిన వెంటనే గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఆ తదుపరి మెదడు కూడా పనిచేయదు. వెంట వెంటనే అన్ని అవయవాలు పని చేయడం ఆగిపోయి మనిషి మరణిస్తాడు. శరీరం తన అవయవాలపై ఆధారపడుతుంది. అవయవాలు ‘ప్రాణం’ నుండి లభించే శక్తిపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరస్పర సంబంధమే మనిషికి, భూమికి మధ్య కూడా ఉంటుంది. మనం సృష్టికి అంగాలం కాబట్టి, సృష్టిని పోషించడం మన కర్తవ్యమే. మన ప్రాణాలు నిలుపుకోవడానికి మనం సృష్టి నుండి అవసరమైనంత మేరకు తీసుకుంటాం. అంతేకాని దాన్ని పీల్చి పిప్పి చేయం. సృష్టి గొప్పతనం గ్రహించిన మన పూర్వీకులు దానిని ఒక రోజుకే పరిమితం చేసే పద్ధతిలో కాకుండా, ఒక వ్యవస్థకే అని అనుకో కుండా సంపూర్ణ జీవనానికి సంబంధించిన విధానంగా అలవర్చుకున్నారు. గ్రామాల్లో పెద్దలు ‘సాయంకాలం పూట చెట్ల• ఎక్కకండి! అవి నిద్రపోతాయి. వాటికి ప్రాణం ఉంటుంది. సృష్టిలో అవి భాగం’ అని చెబుతారు. ఎలాగైతే జంతులోకం ఉందో అలానే చెట్టూచేమల లోకం కూడా ఉందనే భావన ఆధునిక విజ్ఞానశాస్త్రం ద్వారా రాకపూర్వమే మన దేశంలో వేల సంవత్సరాలుగా ఈ భావన ఉంది. మన దేశంలోని నిరక్షరాస్యుడు, సామాన్యుడు కూడా సాయంకాలం చెట్లు ఎక్కకూడదని అనుకుంటాడు, దానిని ఆచరిస్తాడు. ఇతర ప్రాణులతో ఎలా మసలు కోవాలో మన పెద్దలు ఆచరించి చూపెట్టారు. మనం చీమలకు ఆహారం వేస్తాం. అలాగే గోవులకు గడ్డి, కుక్కలకు ఆహారం, పక్షులకు ధాన్యం గింజలు అందించే అవాట్లు ఉన్నాయి. గ్రామంలో ఎవరైనా అతిథి ఆకలితో ఉంటే అతడికి భోజనం పెడతారు. ఈ అయిదు రకాల బలి కార్యక్రమం పూర్తి చేసిన తరువాత గృహస్థు భోజనం చేస్తాడు. బలి అంటే ప్రాణిహింస కాదు. మన ఇంట్లో వండిన భోజనాన్ని వీరందరికి ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటి పోషణ భారం గృహస్థుదే అన్న సూత్రాన్ని మన వారు ఆచరించి చూపారు. వీటన్నింటిని మనిషి పోషిస్తాడు. అలాగే వాటి వలన కూడా మనిషికి పోషణ లభిస్తుంది. మనం ఇవన్నీ అర్థం చేసుకుని జీవనం గడుపుతున్నాం. కాబట్టి మన దేశంలో ‘నదుల’ను కూడా పూజిస్తాం. వృక్షాలతో పాటు తులసి మొక్క కూడా పూజలందుకుంటున్నది. ఆవును పూజిస్తాం. పామును పూజిస్తాం. విశ్వమంతా ఒక చరాచర చైతన్యంతో నిండి ఉంది. ఆ చైతన్యాన్ని సృష్టిలోని ప్రతి వస్తువులో చూడటం, దాన్ని శ్రద్ధతో, ఆత్మీయతతో దర్శించడం, దానితో స్నేహపూర్వకంగా నడుచుకోవడం, పరస్పర సహకారంవల్ల అందరి జీవనం సాగేలా మసలుకోవాలి అనేది మన జీవన పద్ధతి.
ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పారు. ‘పరస్పరం భావయంతం’- దేవతల పట్ల మీరు మంచిగా నడుచుకోండి. దేవతలు మీతో మంచిగా నడుచుకొంటారు. పరస్పర మంచి నడవడిక వల్ల సృష్టి మనుగడ సాగిస్తుంది. మన జీవన విధానం ఇలానే ఉండేది. కాని గత వందల సంవత్సరాలుగా గతి తప్పిన జీవన విధానం వల్ల మనం ఇదంతా విస్మరించాం. ఈ కారణంగానే నేడు మనం ‘పర్యావరణ దినం’ అని ప్రత్యేకంగా ఉత్సవం నిర్వహిస్తూ దానిని స్మరించుకోవలసి వచ్చింది. అవును చేయాలి. ఇది మంచి విషయమే. ఇది ప్రతి ఇంటిలో జరగాలి. ఈ 30 ఆగస్టున ప్రారంభం చేశాం. కాని మనం ‘నాగ పంచమి’ జరుపుకుంటాం. గోవర్ధన (పర్వతం) పూజ జరుపుకుంటాం, తులసీ కల్యాణం జరుపుకుంటాం. ఇవన్నీ జరుపుకుంటూ నేటి రోజును కూడా సరియైన పద్ధతిలో నిర్వహిస్తూ మనందరి జీవితాలలో ఈ సంస్కారాన్ని పునరుజ్జీవింప చేసి ఆచరణలోకి తీసుకరావాలి. మనం ఆచరించడం వల్ల కొత్త తరం ఇది నేర్చుకుని ఆచరిస్తుంది. మనం ఈ ప్రకృతిలో ఒక అవయవం (అంగం). మనం ప్రకృతి నుండి పోషణ పొందాలి. అంతేకాని ప్రకృతిని జయించడం కాదు. ప్రకృతి నుండి పోషణ పొందుతూ ప్రకృతిని రక్షించుకోవాలి. ఈ ఆలోచనతో భావి తరాలు ముందుకెడుతుంటే గత 300-350 సంవత్సరాలుగా అతలాకుతలమైన దానిని సరిదిద్దగలం. రాబోయే 100-200 సంవత్సరాలలో ప్రకృతి సురక్షితం అవుతుంది. మానవజాతి సురక్షి తంగా ఉండగలుగుతుంది. జీవితం సుందర మవుతుంది.
ఈ ఉత్సవం ఆనందం కోసం జరుపుకుంటున్నా మని మనం భావించరాదు. సృష్టి సంపూర్ణ పోషణ కోసం, మన జీవితాన్ని సుందరమయం చేసుకోవ డానికి, అందరి ఉన్నతికి ఈ పని చేస్తున్నామనే భావన మనలో ఉంచుకోవాలి. ఈ ఒక్కరోజు సందేశాన్ని సంవత్సరమంతా చిన్న చిన్న విషయాలలోనూ ఆలోచిస్తూ ఆచరణలో చూపించాలి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.