సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి భాద్రపద శుద్ధ త్రయోదశి – 31 ఆగస్టు 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
రాజకీయాలు సమాజ సేవకు ఉపకరణాలని కొందరి భావన. అధికార ప్రాప్తికి రాజకీయాలే శరణ్యమని కొందరి నమ్మకం. కొందరికి మాత్రం లాభదాయకమైన వృత్తుల్లో రాజకీయం కూడా ఒకటి. వ్యక్తులు తమ ఆలోచనలకు తగిన రాజకీయ పార్టీలను ఎంచుకోవడం కద్దు. సంఖ్యాధిక్యతే చెల్లుబాటయ్యే ప్రజాస్వామిక వ్యవస్థలో స్వార్థపరుల సంఖ్య పెరిగిన పార్టీల్లో రాజకీయ పునాదులే కదలడం చూస్తా. అలాంటిది నాయకత్వంలోనే సిద్ధాంత నిబద్ధత లోపిస్తే సంభవించే విపరిణామాలు తెదేపా చరిత్రకు సాక్షులైన తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పేపని లేదు.
దేశ రాజకీయాల్లో పోటాపోటీగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల చరిత్రను పరిశీలిస్తే అధికార దాహం, వ్యక్తుల స్వార్థం ఎంతటి గొప్ప పార్టీలనైనా పతనపు అంచులకు చేర్చగలవని బోధపడుతుంది. జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంత పునాదులపై బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో భారత కమ్యూనిస్టులు పెద్దఎత్తున ప్రజాభిమానం చూరగొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల మీద మోజుతో జాతీయ సిద్ధాంత నిష్ఠకు నీళ్లొదిలారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను హిట్లరు బూట్లు నాకే కుక్కగా చిత్రించి జాతి ద్రోహానికి పాల్పడ్డారు. నాటి నుండే భారత రాజకీయాల్లో కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై దేశం స్వతంత్రమైంది. నెహ్రూ ప్రధానిగా కేంద్రంలో తొలి జాతీయ ప్రభుత్వం ఏర్పడ్డది. హైదరాబాద్ సంస్థానానికి తరతరాల బూజులా పట్టిన నిజాం రాజు పాలన వదిలించడానికి కమ్యూనిస్టులు పోరాటం ప్రారంభించారు. నాటి హోం మంత్రి పటేల్ చేపట్టిన పోలీసు చర్య ఫలితంగా నిజాం లొంగిపోయాడు. తాము ఆశించిన రాజకీయ లబ్ధి చేకూరలేదని భావించిన కమ్యూనిస్టులు ఆ తరువాత కూడా పోరాటాన్ని కొనసాగించడం, సోవియట్ రష్యా అధినేత స్టాలిన్ చివాట్లు పెట్టడంతో విరమించడం చరిత్ర. 1962లో భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు తెగించిన తరుణంలోను, జమ్ము కశ్మీర్ విషయంలో షేక్ అబ్దుల్లా విభజన వాదాన్ని సమర్థించడంలోను కమ్యూనిస్టుల్లో జాతీయ నిష్ఠ కొరవడినట్లు చరిత్ర సాక్ష్యమిస్తోంది. కాంగ్రెస్ తరువాత భారత రాజకీయాల్లో అధికారం చేపట్టగల పార్టీగా ప్రశంశలు అందుకొన్న కమ్యూనిస్టులు జాతీయత, రాజకీయ నీతి కొరవడిన కారణంగా ఉప ప్రాంతీయ పార్టీల స్థితికి దిగజారిపోయారు.
అధికార దాహం, కుటుంబం చుట్టూ తిరిగే స్వార్థ, భజన పరుల స్తోత్రాలకు అలవాటు పడిన కారణంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వినాశనం దిశగా పడినట్లు తెలుస్తోంది. జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో సైతం సమర్థులను సాగనంపడం, వంది మాగధులను చేరదీయడం కాంగ్రెస్ నేతలకు తొలి నుండీ అలవాటు. స్వతంత్ర భారతావనిలో నెహ్రూ నాయకత్వంలోని తొలి జాతీయ ప్రభుత్వం నుండి డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ వైదొలగడమే కాంగ్రెస్ ధోరణికి ప్రబల నిదర్శనం. డా.ముఖర్జీ ఆనాడు స్థాపిచిన భారతీయ జనసంఘమే కాలాతరంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది నేడు కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తోంది. కాంగ్రెస్‌కు దూరమైన వారు స్థాపించిన పార్టీలు కాగ్రెస్‌ను సవాలు చేసే స్థాయికి ఎదిగినా కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగలేదు. జనతా పార్టీ స్థాపనకు కారకులైన మొరార్జీ దేశాయి, నీలం సంజీవరెడ్డి, చంద్రశేఖర్ వంటి నేతలంతా కాంగ్రెస్‌కు దూరమయ్యాక శక్తిశాలురుగా ఎదిగి సత్తా చాటిన వారే. సోనియా హయాంలో పార్టీకి దూరమైన మమతా బెనర్జీ, శరద్‌పవార్, పి.ఎ. సంగ్మా వంటి వారు కాలాంతరంలో శక్తివంతులు కాగా, ఆంధప్రదేశ్‌లో అలా దూరమైన జగన్ దెబ్బకు కాంగ్రెస్‌కు నిలువ నీడ లేకుండా పోవడం తాజా చరిత్ర.
గొప్ప రాజకీయ పార్టీల ఉత్థాన పతనాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి విశ్లేషిచుకోవడం రాజకీయ రంగంలోని వారికి, ప్రజాస్వామ్య ప్రియులకు ప్రయోజనకారి కాగలదు. ఆరోగ్యవంతమైన మానవ దేహంలో సైతం నిత్యం అనేక కణాలు జీవశక్తి ఉడిగి నిర్జీవ స్థితికి చేరుకుంటుంటాయి. అలాగే చాలా కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. శక్తి ఉడిగిన కణాలను తొలగించి, నూతన కణాలతో ఆ లోటును పూరించే జీవక్రియ కొనసాగుతున్న దేహం నిరంతర జీవకళతో ఉంటుంది. ప్రకృతి సహజమైన ఈ జీవక్రియ నిరంతరం కొనసాగేలా శరీరంలోని ప్రాణశక్తి చూస్తుంటుంది. ఈ కర్తవ్య నిర్వహణలో ప్రాణశక్తి వైకల్యం ఫలితం వ్యాధి కాగా సంపూర్ణ వైఫల్యం మరణం అవుతుంది. మానవ దేహంలో మాదిరే ఈ జీవక్రియ సంస్థలలో జరిగినప్పుడు ఉత్థాన, పతనాలు సంభవిస్తుటాంయి. మానవ దేహంలో ప్రాణశక్తి పోషించే పాత్రను రాజకీయ పార్టీల్లో అధినాయకత్వం నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలోని వైకల్యమే దీర్ఘ వ్యాధి రూపంలో పార్టీని పీడిస్తున్నది. అదే జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ కన్నా హీన స్థితికి దిగజార్చింది. వైకల్యం వైఫల్యగా పరిణమిచి పార్టీ మరణానికి దారితీయకముదే జాగ్రత్తపడాలి. ఆరోగ్యప్రదమైన రాజకీయాలకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం బ్రతికి ఉడాలనే ఆశతో కాగ్రెస్‌పార్టీ దీర్ఘ వ్యాధి నుడి బయటపడి, కోలుకోవాలని ఆశిద్దా!