ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల మీద కూడా కరోనా ప్రభావం పడింది. దాదాపు వందేళ్ల క్రితం మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ ఆరంభించిన సామూహిక వినాయక చవితి పూజలు, నిమజ్జనం ఇప్పుడు దాదాపు దేశమంతా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు వినాయక చవితి సామూహిక పూజలను, నిమజ్జనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కానీ ఇది సరికాదని బజ్‌రంగ్‌దళ్, బీజేపీ వంటి సంస్థలు భావిస్తున్నాయి. ఈసారి పండుగ ఇళ్లలోనే జరుపుకోవాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రకటన ఇచ్చింది. ప్రభుత్వాల ఆదేశాలు ఎలా ఉన్నా కొంత బాధ్యత మన మీద కూడా ఉంది. మన సంప్రదా యాన్ని గౌరవిస్తూనే, ఆ సంప్రదాయాన్ని ఆచరించే మన హక్కుకు భంగం వాటిల్లకుండా చూసుకుంటూనే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను బట్టి కొన్ని జాగ్రత్తలు పాటిద్దాం.
తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఉత్సవాలను నిషేధించింది. దీని మీద బీజేపీ మండిపడింది. తమిళనాడులో వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహించి తీరాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్ ప్రకటించారు. మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలను సామూహి కంగా జరుపుకోవడానికి నిషేధాజ్ఞలు ఎందుకు విధిస్తున్నదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్సవాలకు అనుమతిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంలో హిందు మున్నని తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము అనుకూలంగానే స్పందిస్తామని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన విధివిధానాలనే తాము అమలు చేస్తామని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. అలాగే అన్ని రకాల మత కార్యక్రమాలను ప్రస్తుతానికి నిషేధించాలన్న కేంద్రం మార్గదర్శకాలనే తాము అనుసరిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. పళనిస్వామి తదితర నాయకులంతా నపుంసకులని బీజేపీ తమిళనాడు ఐటి విభాగం నాయకుడు నిర్మల్ కుమార్ విమర్శించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల అక్కడ వినాయక చవితి ఉత్సవాల మీద నిషేధం విధించలేదని మరొక బీజేపీ నాయకుడు హెచ్. రాజా దుమ్మెత్తిపోశారు. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ భాగస్వామి అయినప్పటికి కేంద్రం తీసుకున్న పలు అంశాల మీద ద్రవిడ పార్టీ విభేదిస్తోంది. కొత్త జాతీయ విద్యా విధానం కూడా అందులో ఒకటి. అంతకుముందు హిందీని రుద్దితే సహించబోమని కూడా అన్నాడీఎంకే పేర్కొంది. అలాగే బీజేపీ పట్ల కొంత కటువుగా కూడా వ్యవహరిస్తున్నది. పెరియార్ విగ్రహం ధ్వంసం ఉదంతానికి సంబంధించి బీజేపీ నాయకుడు ఒకరిని నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద అరెస్టు చేయించింది. మరొక ఎనిమిది మాసాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఈ రెండు పార్టీ మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయి.
సంప్రదాయాన్ని గౌరవిద్దాం, కరోనాతో జాగ్రత్తగా ఉందాం:
- ప్రస్తుత పరిస్థితులలో నిరాడంబరంగా ఉత్సవాలను పూర్తి చేయడం అవసరమే.
- గణేశ్ మండపాల దగ్గర నలుగురు లేదా ఐదుగురు భక్తులకు మించి దర్శనానికి అనుమతించడం సరికాదు.
- మాస్కులు, సామాజిక దూరం కచ్ఛితంగా పాటించేటట్లు చూడాలి. భక్తులు మాస్కులతో రావాలని నిబంధన ఉండాలి.
- ప్రసాదాల విషయంలో, పంపకంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.
- కుంకుమ, ప్రసాదం, తీర్థం, పత్రి వంటివి అందిచేవారు చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు వాడాలి.
- నిమజ్జనానికి కూడా ఆర్భాటాలు, గుంపులు గుంపులుగా చేరడం వంటివి లేకుండా చూసుకోవాలి.
- వృద్ధులు, బాలల విషయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించగలిగితే మరీ మంచిది.
- భాగ్యనగర ఉత్సవ సమితి ఇచ్చిన సూచనలను గౌరవిద్దాం. జీవితంలో అవిఘ్నాలు కలగరాదని ప్రార్థిస్తూ గణేశ్ మహరాజ్‌ను పూజిస్తాం. ఈ క్రమంలో సామాజిక శ్రేయస్సుకు, వ్యక్తుల ఆరోగ్యానికి విఘాతం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత మనందరిది.