అయోధ్య శ్రీరామ జన్మభూమిలో 5 ఆగస్టు 2020న జరిగిన భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంతతికి చెందిన ప్రజలు, భారతదేశాన్ని అమితంగా ఇష్టపడేవారు ఆ ఉత్సవాన్ని హృదయ పూర్వకంగా నయనానంద కరంగా చూశారు. అనేకమందికి ఈ దృశ్యం ఒక స్వప్నం సాకారమైందన్న ఆనందం కలిగించింది. సుదీర్ఘకాలం కొనసాగిన పోరాటం వల్ల ఒక గొప్ప ప్రయోజనం చేకూరింది. అసంఖ్యాక భారతీయుల ముఖంలో ఆనందం తాండవించింది. రెండు కళ్లల్లోనూ హర్షాతిరేకం వ్యక్తమయింది. కొందరు ఈ కార్యం సంపూర్ణంగా పూర్తయిందని భావించారు. వాస్తవానికి ఇది శుభారంభం మాత్రమే.

చాలామందికి ఈ కార్యక్రమం ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటయినట్టు కనిపిస్తుంది. అయితే, భారతీయ సంప్రదాయం, ఆలోచనా విధానం, తత్త్వశాస్త్రం ఒక్కటే. అది అంతటా విస్తరించింది. మానవ జీవనాన్ని సమగ్రంగా దర్శిస్తోంది. భారతదేశంలో మతం, సామాజిక జీవితం ఒకదాని కొకటి భిన్నమని భావించలేదు. భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడని విశ్వసిస్తారు. వ్యక్తిలోని ఆ దైవత్వాన్ని మేల్కొల్పి మోక్షం సాధించే మార్గం అతని ముందు ఉంచారు. తన అంతర్గత, బాహ్య ప్రకృతి నియమాలను అనుసరించి ఆ దైవత్వాన్ని మేల్కొల్పే మార్గం (religions) ఆ వ్యక్తి సామర్ధ్యం, అభిరుచిని బట్టి విభిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ అవన్నీ సమానమేనని భారతీయుల భావన. దీనిపై భారత్‌ ‌విజయం సాధించింది కూడా. ప్రతీ కాలంలోనూ ప్రపంచం ఈ చరిత్రను వీక్షించింది. అయితే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ భౌతికసంపద సంరక్షణ, అభివృద్ధిని భారత్‌ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. అందువల్లే చతుర్విధపురుషార్థాల్లో ధర్మం, మోక్షంతో పాటు అర్ధం, కామం కూడా జోడించారు.

‘Ubantu’- ఇదొక ఆఫ్రికన్‌ ‌భావన. అంటే ‘నేను ఉన్నాను – కారణం మనం ఉన్నాం’ అని అర్ధం. భారత్‌లో ధర్మం అనే నిర్వచనానికి కూడా ఇదే ఆధారం. నేను, నా కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం, మానవత, మానవాతీత జీవజాలం, ప్రకృతి, దానితో ముడిపడిన విభిన్న అంగాలు, అలా విస్తరిస్తూ అన్నీ ఒక్కటే అనే భావన పెంపొందింది. వీటన్నిటి మధ్య పరస్పరం సమన్వయం ఉంది. సంఘర్షణ లేదు. పోటీలేదు. ఇవన్నీ కలిస్తేనే మనిషి జీవితం. ఇవి ఉంటేనే మానవాళి మనుగడ సాగుతోంది. వీటి మధ్య ఉన్న సమతౌల్యమే ధర్మం. అది కాపాడుకోవడం ధర్మస్థాపన అనవచ్చు.

ఈ భారతీయ ధర్మదృష్టిని మతానికి పరిమితం చేయడం తప్పు. ఆధ్యాత్మికతకు పరిమితం చేయడం కూడా సరిపోదు. ఆధ్యాత్మిక సాధన కోసం భౌతికాభివృద్దిని భారత్‌ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తిరస్కరించనూ లేదు. భారత్‌లో ధర్మానికి ఒక నిర్వచనం ఉంది. ‘యతో అభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః’ అభ్యుదయం అంటే భౌతికాభివృద్ది, నిఃశ్రేయసకు అర్ధం మోక్షం. ఈ రెండింటిని సాధించడం ధర్మం అని చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తులో భౌతికాభివృద్ది కోసం అవసరమైన జ్ఞానాన్ని అవిద్య అని, మోక్ష సాధనకు అభ్యసించే జ్ఞానాన్ని విద్య అని అంటారు. ఉపనిషత్‌ ‌కర్తలు – అవిద్య, విద్య రెండింటినీ సాధించడమే ధర్మం అని అభివర్ణించారు. వ్యక్తి అవిద్యతో ఈ మృత్యులోకాన్ని సంతోషంగా అధిగమిస్తాడు. విద్య ఆధారంగా, అమరత్వాన్ని (మోక్షం) పొందుతాడు.

విద్యాంచ అవిద్యాంచ యస్తద్‌ ‌వేదో-భ్యమ్‌ ‌సహ!

అవిద్యాయా మృత్యుమ్‌ ‌తీర్థ్వా విద్యయా -మృతమశ్నుతే !!

ఈ సమతౌల్యం (balance)ను లేదా ధర్మాన్ని అర్థం చేసుకునేందుకు ఒక ప్రత్యేక గుణం ఉంది. దేశ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకుల ద్వారా లక్షలాది గొంతుల నుండి ప్రతిరోజు ఆలపించే సంఘ ప్రార్థనలో ‘సముత్కర్ష’ (అభ్యుదయం) ‘నిఃశ్రేయస’ (మోక్షం) ఈ రెండింటిని సాధించే అంశం వస్తోంది. వాస్తవానికి ఇవి రెండు వేర్వేరు కాదు, ఒకే కోణానికి ఉన్న రెండు పార్శ్వాలు. ఏక వచనానికి షష్టి ప్రత్యయం ‘అస్య’ (సముత్కర్ష, నిఃశ్రేయస) అని ఉపయోగించారు. అంటే భారతదేశంలో జీవితం గురించి సంపూర్ణంగా ఆలోచించే ఒక సంప్రదాయం ఉందని అర్థం. దీనిలో భౌతిక (అభివృద్ధి), ఆధ్యాత్మిక (మోక్షం) రెండింటి వృద్ధిని పరిగణించారు.

వందలాది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా భారత్‌ ‌భాసిల్లింది. సమర్థవంతమైన సామర్ధ్యం కలిగిఉన్నప్పటికి ఎవరిపైనా యుద్ధానికి పూనుకోలేదు. వాణిజ్యం కోసం ప్రపంచంలోని నలు మూలలకు వెళ్లి, అక్కడి ప్రాంతాలను వలసరాజ్యంగా మార్చలేదు. దోపిడీ చేయలేదు, దోచుకోలేదు. మత మార్పిడిలకు పాల్పడలేదు. అక్కడి వారిని బానిసలుగా మార్చి వ్యాపారం చేయలేదు. మనవాళ్లు అక్కడి స్థానిక జనసముదాయాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. ధనవంతులను చేశారు. సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. దక్షిణ ఆసియాలోని పలు దేశాల భాషలు, కళలు, దేవాలయాలు వారి జీవన విధానంలో ఆనాటి సాంస్కృతిక వారసత్వ జీవనశైలి నేటికి సజీవంగా కనిపిస్తుంది. ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి బాట పట్టిన భారతీయులు స్థానికులను అదే మార్గంలో తీసుకెళ్లి సమర్ధులుగా తీర్చిదిద్దుతూ సంపాధించిన దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘మహా లక్ష్మిగా’ పేర్కొన్నారు. ఇక్కడ ధనాన్ని కాదు, ధనలక్ష్మిని, మహాలక్ష్మిని పూజిస్తారు. కనుకనే మన అభివృద్ధి, సంపన్నతకు, సుసంస్కృత సదాచారాలకు ధర్మం (religion కాదు) ఆధారంగా ఉండేది. దేవాల యాలు ఈ ధర్మ స్థాపనకు, సాధన మార్గానికి కేంద్రంగా నిలిచేవి. ఎందుకంటే సంపూర్ణ మానవ జీవన విధానానికి ఆధారం ఆధ్యాత్మికతే (spirituality).

అందువల్ల దేశంలోని దేవాలయాలు ఆధ్యాత్మిక సాధనతో పాటు అద్భుతమైన ఆచార వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధికి కారణాలు మాత్రమే కాదు, కేంద్ర బిందువుగా వెలిగొందాయి.

1951లో సోమనాథ్‌ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న స్వతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌ ‌తన ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. అందులోని అంశాలను యథాతథంగా చదవడం ప్రేరణ కలిగిస్తుంది. ఆయన ఇలా అన్నారు.

‘… పవిత్రమైన ఈ శుభ తరుణంలో మనమందరం ఒక దీక్షను స్వీకరించడం అవసరం. ఏ విధంగానైతే మన చరిత్రాత్మక భక్తిభావాన్ని పునరుద్ధరించామో అలాగే మన దేశంలోని సాధారణ ప్రజానీకం అభివృద్ధికి మందిర ప్రతిష్టాపనతో కంకణధారుల మవుదాం. పురాతనమైన సోమనాథ్‌ ‌మందిరం ఈ అభివృద్ధికి చిహ్నంగా ఉండేది. పూర్వం మన దేశం ప్రపంచానికి పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులను తీసుకొని విశాలమైన నావల్లో వ్యాపారస్థులు సుదూర దేశాలకు వెళ్లేవారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అధిక పరిమాణంలో బంగారం, వెండి నిల్వలు ఈ దేశంలో ఉండేవి. మన ఎగుమతులు చాలా ఎక్కువగా సాగేవి. దిగుమతుల అవసరం పరిమితంగా ఉండేది. కనుకనే భారతదేశం నాడు బంగారం, వెండి నిల్వలతో సమృద్ధిగా వికసించింది. నేడు అభివృద్ధి చెందిన దేశాల బ్యాంకు లాకర్లల్లో ఏ విధంగానైతే బంగారం నిల్వలు అవసరాన్ని మించి ఉన్నాయో, అదేవిధంగా శతాబ్దాలకు పూర్వం ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు మన దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండేవి. కేవలం ఈ పునాదిరాయిపైన భవ్యభవన నిర్మాణమే కాకుండా, దేనికి ప్రతీకగా పురాతన సోమనాథ్‌ ‌మందిరం ఉండేదో అలాంటి భవన నిర్మాణం జరిగినప్పుడే సోమనాథ్‌ ‌మందిర పునర్నిర్మాణం జరిగిందని భావిస్తాను. నా దృష్టిలో ఎప్పటివరకైతే ఈ దేశ సంస్కృతి ఉన్నత స్థాయికి ఎదగదో అప్పటివరకు ఈ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు కాదు. ఒకవేళ ఎవరైన వర్తమాన (అల్బరూని) దేశ పరిస్థితిని చూసినట్లయితే మన సంస్కృతి గురించి సమాజానికి ఆనాడు ఏ విధంగా చెప్పారో అది ఈనాడు చెప్పినప్పుడే సోమనాథ్‌ ‌మందిరం పూర్తి అయినట్లుగా భావిస్తాను’’ అని అన్నారు.

రామమందిర ఉద్యమం అటువంటి జీవన దృష్టికోణంలో పునరుద్ధరించే పోరాటం. దాన్ని  లౌకికవాదం (secularism) ముసుగులో భారత్‌ ‌నుండి వేరు చేసేందుకు కుట్రలు పన్నారు.

రామమందిర భూమిపూజా కార్యక్రమ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ సర్‌ ‌సంఘచాక్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌మూడు విషయాలను ఉల్లేఖించారు. ఆత్మనిర్భరత (స్వావలంబన- self-reliant), ఆత్మవిశ్వాసం (self-confident), ఆత్మభాన్‌ (‌స్వీయ సాక్షాత్కారం- self -aware). ఇందులో ‘స్వయం సమృద్ధి’ జ్ఞానం (భారతీయ జ్ఞానం-విద్యా, అవిద్య కూడా) ఆర్థిక సందర్భంలో ప్రస్తావించారు. ‘ఆత్మవిశ్వాసం’ అనేది మన ప్రాచీన, నిత్యనూతన, చిర పురాతనమైన ఆధ్యాత్మికత ఆధారిత ఐక్యత, సర్వవ్యాప్త సంపూర్ణ జీవితం ఆధారంగా మనం పొందవచ్చు. ఇలాంటి విశ్వాసం గురించి ఆలోచించడం క్రియాత్మకమైన సంకల్పంలో ఉంది. ‘స్వీయ-సాక్షాత్కారం’’ (ఆత్మభాన్‌) ‌భారతీయ తత్త్వాన్ని మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి, జాతీయ జీవనంలో పూర్తి శక్తితో వ్యక్తపరచటంలో ఉంటుంది. ఇదే మాటను రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌తన ‘స్వదేశీ సమాజం’లో ‘మనం వాస్తవంగా ఎలా ఉన్నామో అదే విధంగా తయారుకావాలి. జ్ఞానపూర్వకంగా సరళమైన, మన వాస్తవరూపాన్ని మనం పొందుదాం’ అని అన్నారు.

మనం పూర్తిగా భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక మూలాలతో అనుసంధానం కావాలి. అప్పుడే ఆర్ధికాభివృద్ధి, సాంస్కృతిక విస్తరణ, పోటీ, సంఘర్షణ, హింస, యుద్ధం, దోపిడీ, అణిచివేతలతో సతమతమవుతున్న మానవాళిని పరస్పర సంభాషణలతో, ఓర్పుతో సమన్వయం చేసి ఆత్మీయతానురాగాల బంధంతో ముడివేయవచ్చు. కులం, మతం , భాష, సాంస్కృతిక భిన్నత్వంతో కొట్టుమిట్టాడుతున్న మానవ జగత్తును మన ప్రవర్తన ద్వారా శాంతి, అభివృద్ధి చెందిన ప్రపంచం దిశగా, శుభప్రదమైన మార్గం వైపు తీసుకెళ్లగలం. ఈ ఆలోచన సారాంశమే డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌ ‌మాటలలో ధ్వనిస్తుంది. వారు సొమనాథ్‌ ఆలయం ప్రాణ ప్రతిష్టాపన సమయంలో ప్రసంగిస్తూ – ‘వీటన్నింటినీ స్వీకరించే ప్రదేశం దేవాలయం. ఈ ఆలయం కూడా అలాంటి కేంద్రం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. అప్పుడే మందిర పునర్ని ర్మాణం జరిగినట్లుగా నేను భావిస్తాను’ అని అన్నారు.

అయోధ్యలోని నేటి రామాలయానికి ఇదే వర్తిస్తుంది (relevant). అందువల్లే ఇది ఒక సంకల్పం నెరవేరిన రోజు, శుభారంభం కూడా.

నేడు ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. జాతీయ దృక్కోణంతో ముడిపడిన ఇలాంటి పెండింగ్‌ ‌నిర్ణయాలు ఇప్పుడు వరుసగా పూర్తి అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది.

1987లో రామ్‌-‌జానకి రథయాత్ర జరుగుతున్నది. సంఘ కార్యక్రమంలో భాగంగా ఒక స్వయంసేవక్‌ ‌నాటి సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌బాలాసాహెబ్‌ ‌దేవరస్‌జీతో ‘గోవధ నిషేధం, కశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌ ‌రద్దు తదితర ఉద్యమాల నుండి మనం తప్పుకున్నట్లు అనిపిస్తోంది. ఇవన్నీ సాధ్యం అవుతాయని కూడా అనిపించడం లేదు. రామ మందిర ఉద్యమం కూడా అటువంటిదేనా?’ అని ప్రశ్నించాడు. బాలాసాహెబ్‌జీ సమాధానం చెప్తూ – ‘మనం వీటిని సాధించే దిశగా దేశాన్ని మేల్కొల్పుతాం. ఇది నిరంతరం జరగాలి. నేడు హిందూ సమాజంలో జాతీయచైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అందువల్లే అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి. ఏ రోజైతే సంపూర్ణ సమాజంలో జాతీయచైతన్యం సాధారణ స్థాయి నుండి (General level of national consciousness) ఉన్నతంగా వికసిస్తుందో నాడు అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభించవచ్చు’ అని చెప్పారు. మాల్కోమ్‌ ‌గ్లాడ్వెల్‌ ‌పుస్తకం ‘Tipping Point- How  little things can make a big differenceµ Tipping Point గురించి ఇలా వ్యాఖ్యానించారు – “Tipping point is the point at which a series of small changes or incidents becomes significant enough to cause a larger, more important change.” బాలాసాహెబ్‌జీ చెప్పిన మాటలను నేడు స్మరిస్తుంటే ఆ భావాలను వ్యక్తం చేసే సమయంలో వారి సంకేతం “Tipping Point” వైపు ఉన్నదా అని అనిపిస్తుంది.

సంఘ జ్యేష్ట ప్రచారకులు, గొప్ప తత్త్వవేత్త దత్తోపంత్‌ ‌ఠెంగ్డేజీ ఎల్లపుడు ఒక విషయం చెప్పేవారు- ‘సమాజంలో కొంతమంది మాత్రమే జాతీయ భావాలతో మేల్కొని క్రియాశీలంగా పనిచేయడం వల్ల శాశ్వతమైన మార్పులు సాధ్యం కావు. ఒక సాధారణ వ్యక్తిలో జాతీయస్పృహ స్థాయి ఏ మాత్రం పెరిగినా పెద్ద మార్పులు సంభవిస్తాయి. అందువల్ల, కొన్ని జాతీయసమస్యలపై ప్రజలను ఎప్పటికప్పుడు మేల్కొల్పే ప్రయత్నాలు నిరంతరం జరగాలి. తద్వారా సాధారణ వ్యక్తిలో జాతీయస్పృహ స్థాయి క్రమంగా పెరుగుతుంది. వీటన్నిటి ఫలితంగా నిర్మితమయ్యే జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అనేక ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే నెరవేరుతాయి. ఈ కారణంగా జాతీయ చైతన్యాన్ని రగిలించేందుకు కొంతమంది నిరంతరం జాతీయ భావాలను మేల్కొల్పే పనిలో నిమగ్నం కావాలి. ఇది అత్యంత అవసరమైన అంశం మాత్రమే కాదు ముఖ్యమైనది కూడా’ అని అన్నారు.

బాలాసాహెబ్‌ ‌దేవరస్‌జీ, దత్తోపంత్‌జీ వ్యక్తపరిచిన టిప్పింగ్‌ ‌పాయింట్‌ ‌తుదిదశకు చేరింది. రవీంద్రనాథ్‌ ‌టాగూరు ప్రస్తావించిన స్వదేశీ సమాజం క్రియాశీలంగా అవుతోంది. జాతీయ జీవనంలో అనేక రంగాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, దేశహితం కోసం మౌలికమైన అంశాల్లో మార్పులు వరుసగా జరుగుతున్నాయి. దేశరక్షణ, విదేశాంగ విధానంలో సంభవించిన మార్పులను ప్రపంచం గమనిస్తోంది. వికేంద్రీకరణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక విధానంతో స్వయంసమృద్ధి వైపు వెళ్లాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ మూలాలతో అల్లుకొని విశ్వ గగనసీమలో ఎత్తుకు ఎగిరేందుకు కొత్త రెక్కలు విచ్చుకొన్న నూతన విద్యావిధానం ప్రకటించారు. సమాజంలోని సొంత సంస్థల వారికీ నూతన ఆవిష్కరణల (innovations) కోసం ప్రోత్సాహకర వాతావరణం నిర్మాణమవుతోంది. ఇలాంటి పనులన్నీ ఒకేసారి జరుగుతున్న దాఖలాలు అగుపిస్తున్నాయి. ఈ మార్పులు 2014 నుండి కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వంతో సాధ్యమయ్యాయని చెప్పడం అసహజం కాదు. అయితే 2014 మే 16న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మే 18 ఆదివారం రోజున ‘సండే గార్డియన్‌’ ‌సంపాదకీయంలో ఎంతో ముఖ్యమైన అంశం ప్రాధాన్యం గల విషయం ప్రస్తావించారు. అది- “It should be obvious that the underlying changes in the Indian society have brought us Mr. Modi and not the other way round”

జాతీయ చైతన్యాన్ని సాధారణ స్థితి నుండి ఉధృతంగా పెంచిన కారణంగా అన్ని రకాల అనుకూలమైన మార్పులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మార్పు అందులో భాగమే.

భగవంతుడు నిర్దేశించిన బాధ్యతలను నెరవేర్చేందుకు భారత్‌ ‌తన చిర పురాతన, నిత్య నూతన, శాశ్వతమైన శక్తితో ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. (ఒక సీనియర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌ ‌సంఘ గురించి ఒక వాక్యంలో పూర్తి వివరణ ఇచ్చారు – RSS is the evolution of the life mission of this Hindu nation.) ఇప్పటి వరకు నిలిచిపోయిన లేదా నిలిపివేసిన అన్ని ముఖ్యమైన పనులు జరిగే పక్రియ మొదలైంది. సంపూర్ణ సమాజం అన్నింటికి సిద్దమై, అప్రమత్తంగా ఉంటూ క్రియాశీలకంగా పనిచేయాలి. అదే స్వీయసాక్షాత్కారం. అందుకు ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత (స్వావలంబన) తప్పనిసరి.

ఒక సంఘ పాటలో ఇలా చెప్పారు….

‘అరుణోదయం అయింది. ఓ వీరుడా! ఇక కార్యరంగంలోకి దూకు

నీ స్వేదం, రక్తంతో నూతన యుగాన్ని అవనిపై ఆవిష్కరించు!’.

  • డా. మన్మోహన్‌ ‌వైద్య : ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సహసర్‌ ‌కార్యవాహ

About Author

By editor

Twitter
YOUTUBE