‌భారత్‌పై విద్వేషం వెళ్లగక్కడం, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం దాయాది దేశమైన పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. కానీ ఇటీవల కాలంలో శ్రుతిమించుతోంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దునాటి నుంచి ఇస్లామాబాద్‌ ఉ‌క్రోషంతో ఊగిపోతోంది. అసహనంతో వ్యవహరిస్తోంది. దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. చైనా దన్నుతో చెలరేగిపోతోంది. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పిఓకె)లో అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఉద్దేశపూర్వకంగా వక్రబుద్ధితో వ్యవహరిస్తోంది. 1994 ఫిబ్రవరి 22న నాటి ప్రధాని పి.వి.నరసింహారావు నేతృత్వంలోని భారత్‌ ‌ప్రభుత్వం పిఓకె భారత్‌లో అంతర్భాగమని విస్పష్టంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయం తెలిసినప్పటికీ తెలియనట్లే వ్యవహరిస్తోంది ఇస్లామాబాద్‌. ‌తాజాగా పిఓకెలో చైనా ఆర్థిక సాయంతో మూడు భారీ జల విద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణానికి పూనకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ పనులకు సంబంధించి  ఇటీవల భూమిపూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

తాజాగా పిఓకె, ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా ప్రావిన్స్ ‌సరిహద్దులో సింధునదిపై భారీ జలవిద్యుత్‌ ‌కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 4500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు సంబంధించి మే 13న పాక్‌, ‌చైనా అధికారుల మధ్య ఒప్పందం వచ్చింది. జూలై 16న శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు ఎత్తు 272 మీటర్లు. 2028 నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా. 16వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పాక్‌ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వేలకోట్ల రూపాయలు వ్యయం కానున్నాయి. ఇందులో 70 శాతం మొత్తాన్ని చైనా, 30 శాతం పాకిస్తాన్‌ ‌భరించనున్నాయి. 1998 నాటి ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. కానీ వివిధ కారణాలవల్ల అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. సీపీఈసీ (చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌) ‌కింద డయామర్‌ ‌బాషా ప్రాజెక్టును నిర్మించనున్నారు. బీఆర్‌ఐ ‌పథకంలో ఆసియా, ఐరోపాలు అనేక దేశాలను అనుసంధానించేందుకు చైనా ఈ బృహత్తర పథకాన్ని చేపట్టింది బీఆర్‌ఐ ‌పథకంలో భాగమే సీపీఈసీ. దానిమీద ఇప్పటికే పాక్‌లోని గ్వదర్‌లో ఓడ రేవును నిర్మించారు. బీఆర్‌ఐలో చేరాల్సిందిగా చైనా కోరినప్పటికి భారత్‌ ‌తిరస్కరించింది. పీఓకేలో  ప్రాజెక్టులు చేపట్టడమే ఇందుకు కారణం. పీఓకేకు సంబంధించి వాస్తవాలు తెలిసినప్పటికీ అక్కడ ప్రాజెక్ట్ ‌నిర్మాణానికి పాక్‌ అనుమతించడం చైనా ముందుకు రావడం భారత్‌ను రెచ్చగొట్టడమే. దయామర్‌  ‌బాషా ప్రాజెక్టు పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద జల విద్యుత్‌ ‌కేంద్రం. ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా ప్రావిన్స్‌లో 4888 మెగావాట్ల సామర్థ్యం గల టార్బెలా దేశలోని అతి పెద్ద జల విద్యుత్కేంద్రం. 1974 నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తి జరుగుతోంది. పీఓకేలోని మీర్‌పూర్‌ ‌జిల్లాలో గల మంగ్ల జల విద్యుత్‌ ‌కేంద్రం రెండో అతి పెద్దది. దానిని జీలం నదిపై నిర్మించారు. 1965 నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దయామర్‌• ‌బాషా జల విద్యుత్‌ ‌కేంద్రం భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ‌కమాల్‌ ‌జావెద్‌ ‌బజ్వా, నిఘా సంస్థ (ఇంటర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) అధిపతి జనరల్‌ ‌ఫయాజ్‌ ‌హమీద్‌, ‌జల వనరుల శాఖ నుండి ఫైజల్‌ ‌వాద్వా తదితరులు పాల్గొన్నారు. సీపీఈసీ పాక్‌ ‌ఛైర్మన్‌ ‌లెఫ్టనెంట్‌ ‌జనరల్‌ (‌రిటైర్డు) అసీమ్‌ ‌సలీం బద్వా ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా వ్యవహరించారు.

పీఓకే రాజధాని ముజఫర్‌నగర్‌ ‌సమీపంలో ‘కొహల’ జల విద్యుత్‌ ‌కేంద్రం నిర్మాణానికి పాక్‌ ‌పూనుకుంది. చైనా ఆర్థిక సాయంతో జీలం నదిపై 1124 మెగవాట్ల సామర్థ్యంతో దానిని నిర్మిస్తున్నారు. 2016లో దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఇప్పటికి కార్యరూపం దాల్చాయి. 2026 నాటికి దానిని పూర్తి చేయాలన్నది అంచనా. ఇందుకు సంబంధించి జూన్‌ 25‌న మూడు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. చైనా త్రీగోర్జెస్‌ ‌కార్పోరేషన్‌ ‌పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, పీఓకే మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ఎత్తు 69 మీటర్లు. దానిని బిల్ట్, ఓన్‌, ఆపరేషన్‌, ‌ట్రాన్సఫర్‌ ‌పద్ధతిలో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో చైనాదే సింహభాగం వాటా ఉంది.

పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిధిలోని ‘ఆజాద్‌ ‌పట్టన్‌’ ‌వద్ద 700 మెగావాట్ల జలవిద్యుత్‌ ‌కేంద్రం నిర్మాణానికి పాక్‌ ‌పూనుకుంది. చైనా సాయంతోనే దానిని నిర్మిస్తున్నారు. పీఓకే పరిధిలోని ‘సుధోటి’  జిల్లా పరిధిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి జూలై 7న ఒప్పందం కుదిరింది. దానిని కూడా సీపీఈసీ (చైనా పాకిస్థాన్‌ ఎకనమిక్‌ ‌కారిడార్‌) ‌ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తు 90 మీటర్లు. 3.8 చదరపు కిలమీటర్ల విస్తీర్ణం జలాశయాన్ని నిర్మిస్తారు. 2024 నాటికి పూర్తవుతుందని అంచనా. బిల్ట్, ఓన్‌, ఆపరేషన్‌, ‌ట్రాన్స్‌ఫర్‌ ‌విధానంలో నిర్మిస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టును పాక్‌ ‌ప్రభుత్వానికి అందజేస్తారు.

ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదన ఈనాటిది కాదు. గత నాలుగు దశాబ్దాలుగానే ఉంది. వివాదాస్పద ప్రాంతంలో చేపట్టే నిర్మాణాలకు ఆర్థిక సంస్థలు విముఖత చూపడంతో పాక్‌ ‌ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు  ఇతర ఆర్థిక సంస్థలు పాక్‌ ‌సర్కారు వినతిని మన్నించలేదు. దాంతో ఇవి ఆగిపోయాయి. తాజాగా చైనా సాయం చేసేందుకు ముందుకు రావడంతో కదలిక వచ్చింది. భారత్‌పై గుడ్డి వ్యతిరేకతో పాక్‌ ‌ప్రాజెక్టులకు చైనా దన్నుగా నిలుస్తోంది.

పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌  ‌పరిధిలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్‌ ‌తీవ్రంగా ఖండించింది. తమదైన భూభాగంలో నిర్మాణాన్ని విస్పష్టంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పాక్‌ ‌సర్కారుకు తన నిరసన తెలియజేసినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీ‌వాస్తవ వెల్లడించారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, భారత్‌ ‌మొదటి నుంచి ఇదే వైఖరిలో ఉందని ఆయన తెలిపారు.

1994 ఫిబ్రవరిలో ఈ మేరకు భారత పార్లమెంట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా పాక్‌ ‌వెనక్కు తగ్గాలని ఆయన కోరారు. చైనా కూడా వాస్తవాల ప్రాతిపదికగా వ్యవహరించాలని సూచించారు. గతంలో తమ అభ్యంతరాల మేరకు ఈ ప్రాజెక్టులకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సాయం చేసేందుకు తిరస్కరించాయని స్పష్టం చేశారు.

మరోపక్క ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. వీటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. కాలుష్యం ప్రబలుతుందని, ఇప్పటికే దాని ప్రభావం కనపడుతోందని వారు చెబుతున్నారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌ ‌నగరంలో ఈ మూడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముజఫరాబాద్‌ – ‌రావల్పిండి జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధనం చేశారు. ఏ ప్రాతిపదికన పాక్‌- ‌చైనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వారు ప్రశ్నించారు. ఐరాస తీర్మానాలను రెండు దేశాలు ఉల్లంఘించాయని  పేర్కొన్నారు. ‘సేవ్‌ ‌రివర్స్… ‌సేవ్‌ ఆజాదీ కశ్మీర్‌’ అం‌టూ నినాదాలు చేశారు. చేయూత పేరుతో చైనా తమ దేశాన్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేటట్లు చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంవల్ల ‘జీలం’ నది అస్థిత్వం దెబ్బ తింటుందని, నది రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు.

సామాజికప్రచార మాధ్యమాలలో కూడా ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. సేవ్‌ ‌రివర్స్ (‌నదులను కాపాడు) సేవ్‌ ‌ముజఫరా బాద్‌ (‌ముజఫరాబాద్‌ను రక్షించండి) సేవ్‌ అజ్‌ ‌ఫ్రమ్‌ ‌పాకిస్తాన్‌ అం‌డ్‌ ‌చైనా (పాక్‌, ‌చైనాల నుంచి మమ్మల్ని కాపాడండి) అని నినాదాలు చేస్తున్నారు. అవసరమైతే ఇస్లామాబాద్‌ ‌దిశగా పాదయాత్ర చేస్తామని వారు హెచ్చరించారు.‘పీఓకే ప్రభుత్వం పాకిస్తాన్‌ ‌సర్కారు చేతిలో కీలుబొమ్మ వంటిది. ఈ ప్రభుత్వం మా హక్కుల కోసం పోరాడలేదు. ఇస్లామాబాద్‌కు దాసోహం అంటుందని’ ఓ నిరసనకారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకే పట్ల పాక్‌ ‌ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

 తాజాగా భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ రాజకీయ చిత్రపటాన్ని విడుదల చేయడంపై భారత్‌ ‌తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌ ‌పూర్తిగా, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని కొత్తగా రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు పాక్‌ ‌ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌దానిని విడుదల చేశారు. రాజకీయ కుయుక్తిలో భాగంగా పాక్‌ ఈ ‌చిత్రపటాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సియాచిన్‌ ‌తమ దేశ అంతర్భాగంగా పేర్కొంది. గుజరాత్‌లోని జునాఘడ్‌ ‌ప్రాంతాన్ని కూడా తమదేనని వాదించింది. స్వాతంత్య్రానికి పూర్వం జునాఘడ్‌ ‌సంస్థానం అధిపతి భారత్‌లో అంతర్భాగంగా ఉండేందుకు నిరాకరించిన సంగతి ఇక్కడ గమనార్హం. తరువాత నాటి హోంమంత్రి సర్దార్‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌హెచ్చరికతో జునాఘడ్‌ ‌సంస్థానం దిగి వచ్చింది. జమ్ముకశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా, ఐరాస భద్రతామండలి తుది నిర్ణయం ప్రకారం గుర్తించాల్సిన ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ ‌తెంపరితనాన్ని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి 370 వ అధికరణ రద్దును జీర్ణించు కోలేక పాకిస్తాన్‌ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఈ నెల 5 నాటికి 370 అధికరణ రద్దుచేసి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కశ్మీర్‌ ‌ప్రగతి పథాన పయనిస్తోంది. పాక్‌ ‌కంటగింపునకు అసలు కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు!

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

About Author

By editor

Twitter
YOUTUBE