హిందూ వ్యవస్థ సృష్టించుకున్న పురాతన వైద్య విధానమే ఆయుర్వేదం. రుగ్మతల నివారణకు ఔషధాలు, శస్త్రచికిత్స అనే రెండు పద్ధతులు ఇందులో ప్రతిభావంతంగా రూపుదిద్దుకున్నాయి. ఆయుర్వేదం గురించి వివరించే ‘చరక సంహిత’, ‘సుశ్రుత సంహిత’ ఈ పద్ధతులను విశేషంగా పరిచయం చేస్తాయి కూడా. తెలంగాణ ప్రాంతం కూడా గొప్ప ఆయుర్వేద విద్వాంసులకు జన్మనిచ్చింది. అగ్గలయ్య, సిద్ధనాగార్జున, పేరయ్య మొదలైన వారు ఆ వైద్యశాస్త్రంలో నిష్ణాతులు. వీరి గురించి తెలుసుకోవడం జ్ఞానదాయకంగా ఉంటుంది.

అగ్గలయ్య

సైదాపురం శిలాశాసనం అగ్గలయ్య గురించి చక్కని సమాచారం ఇస్తుంది. ఇది తెలుగు/కన్నడ లిపులలో ఉంది. ముప్పనపల్లి అనే గ్రామం రెండు జైన బసాదిల నిర్వహణకు దానంగా మంజూరు చేసినట్టు కన్నడ, సంస్కృత భాషలలో సమాచారం ఉంది. ఇందులోనే అగ్గలయ్య పేరు ఉంది. ఆ బసాదిల స్థాపకుడు ఆయనే. ఈ గ్రామం కొల్లిపాక ప్రాంతంలో ఆలేరు సబ్‌ ‌డివిజన్‌ ‌లోనిది. ఇది యాదగిరిగుట్టకు సమీపంలోనే ఉంది. నరవైద్య, వైద్య రత్నాకర అన్న బిరుదులు కూడా అగ్గలయ్యకు ఉన్నాయి. క్రీస్తుశకం జూన్‌ 4, 1034‌న; కల్యాణ చాళుక్య పాలకుడు జగదేకమల్ల అనే రెండవ జయసింహ (1015-1045) హయాంలో సైదాపురం శిలాశాసనం ప్రతిష్టించారు. ఔషధాలతో, శస్త్రచికిత్సతో వ్యాధులను నయం చేయడంలో ఆ జైన విద్వాంసునకు ఉన్న ప్రావీణ్యం గురించి ఈ శాసనం వెల్లడిస్తున్నది. ఆయనకు ‘వైద్యరత్నాకర’, ‘శస్త్రశాస్త్రకుశల’ అన్న బిరుదులు ఉన్నాయి. ఆ కాలానికి చెందిన ఇతర వైద్యులంతా నయం కాదంటూ పెదవి విరిచిన రోగాలను సైతం ఈయన నివారించేవాడు. వ్యాధుల నివారణలో అటు ఔషధాలు, ఇటు శస్త్రచికిత్స అనే రెండు పద్ధతులను ఉపయోగించడమే తన విజయ రహస్యమని ఆయన చెప్పుకున్నాడు. ఆనాటికి ఆ విధానం ఎంతో కొత్తది. ప్రశంసనీయమైనది.

వర్తమానకాలంలో మా వంటి న్యూరోసర్జన్లు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తున్నారు. మెదడులో క్షయ సంబంధిత (ట్యుబర్‌క్యులోమా) పదార్థాల తొలగింపు ఔషధాలతో సాధ్యం కాకుంటే మేము ఆనాటి పద్ధతినే అనుసరిస్తున్నాం. ట్యుబర్‌క్యులోమా మందులతో నయమవుతుంది. అలా కాకుండా అవయవ చలనం తిరిగి క్రియాశీలకం కానప్పుడు మెదడు మీద ఒత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. ఆ స్థితిలో శస్త్రచికిత్స చేస్తాం. అంటే కొన్ని పరిస్థితులలో వ్యాధిని నయం చేయడానికి మేం కూడా మందులు వాడడం, తరువాత శస్త్రచికిత్సను ఆశ్రయిస్తున్నాం.

అగ్గలయ్య ఉమతంత్ర, సగ్రహపరిచ్ఛేద పద్ధతులలో నైపుణ్యం కలిగినవాడు. అంటే ఈ విధానంలో ఉండే శస్త్రశాస్త్రంలో నిష్ణాతుడు.

సుశ్రుత సంహిత 120 అధ్యాయాల బృహత్‌ ‌గ్రంథం. వీటిని స్థానాలు పేరుతో ఐదుగా విభజించారు. అవి-సూత్ర, నిదాన, సరిస, చికిత్స, కల్ప. ఇంకా ఉత్తరతంత్ర పేరుతో అనుబంధం వంటి భాగం కూడా ఉంది. పురాతన భారతదేశంలో శస్త్రచికిత్స కోసం ఉపయోగించిన పరికరాల పేర్లు ఇందులో ప్రస్తావించారు. క్రీస్తుపూర్వం ఒకటి-మూడు శతాబ్దాలకు చెందిన 13 శస్త్రచికిత్స పరికరాలను తక్షశిల తవ్వకాలలో జాన్‌ ‌మార్షల్‌ ‌కనుగొన్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. డికాపిటేటర్లు, స్పాట్యులా, ఫోర్సెప్స్, ‌స్కేల్‌ ‌పెన్‌, ‌సూదులు అక్కడ దొరికాయి. వీటిని బట్టి శస్త్రచికిత్సకు సంబంధించి భారతదేశానికి గొప్ప నేపథ్యంమే ఉందని అర్థమవుతుంది.

సిద్ధనాగార్జున

మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎల్లేశ్వరం దగ్గర సిద్ధనాగార్జునుని ప్రయోగశాల ఉండేది. ఇది 9వ శతాబ్దానికి చెందినది. పాదరసంతో పూత పూసే విధానాన్ని తొలిసారి ఇతడే ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘రసేంద్రమంగళం’, ‘రసరత్నాకర’, ‘లోహ శాస్త్రము’ వంటి పుస్తకాలు రాశాడు. వైద్యంలో లోహాలను వినియోగించే పద్ధతిని తెచ్చినవాడు సిద్ధనాగార్జునుడే.. అప్పటి దాకా ఔషధగుణం ఉన్న మొక్కలను లేదా శాకాల ఉత్పత్తులను ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో ఔషధాలలో లోహాలను కూడా ఉపయోగించడం ఇతడితోనే ఆరంభమైంది. డెక్కన్‌ ఆర్కియలాజికల్‌ అం‌డ్‌ ‌కల్చరల్‌ ‌రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ‘‌రసేంద్రమంగళం’ పుస్తకం ప్రచురించింది. ఆ ఇనిస్టిట్యూట్‌లో నేను కూడా సభ్యుడిని. దొరుకుతున్న నాలుగు అధ్యాయాలు అందులో ఉన్నాయి. అవన్నీ తాళపత్ర గ్రంథాల లోనే ఉన్నాయి. మిగిలిన భాగం అలభ్యం. నిజానికి ఇక్కడ లభ్యం కాకుండా ఉన్న ఆ భాగాలు లండన్‌లోని ఓరియంటల్‌ ‌లైబ్రరీలో ఉన్నాయి. నేను మొన్న ఏప్రిల్‌లో తీసుకువద్దామని కూడా అనుకున్నాను. కానీ కొవిడ్‌ 19‌తో ఇది సాధ్యం కాలేదు. వచ్చే సంవత్సరమైనా ఆ పని పూర్తిచేయాలి.

పేరయ్య

పదహారో శతాబ్దానికి చెందిన పేరయ్య ఆయుర్వేదం గురించి తెలుగు భాషలో తొలిసారిగా పుస్తకం రాశారు. అంతకుముందు వరకు ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉండేవి. వాటిని సాధారణ ప్రజలు చదువుకోలేకపోయేవారు. కె. జితేంద్రబాబు 2000 ఆయుర్వేద వ్రాతప్రతులను సేకరించారు. అందులో పేరయ్య రచన కూడా ఉంది. ఇది తాళపత్ర గ్రంథం. డెక్కన్‌ ఆర్కియలాజికల్‌ అం‌డ్‌ ‌కల్చరల్‌ ‌రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ‌దీనిని పుస్తకంగా వెలువరించింది.

దేశంలోని మిగతా కేంద్రాలకు వలెనే తెలంగాణ కూడా నిష్ణాతులైన ఆయుర్వేద భిషగ్వరులను చూసింది. ఇక్కడ నుంచి ఆ శాస్త్రానికి ఎంతో సేవ కూడా జరిగింది. అలంపురంలో రసవైద్యం నేర్పేవారు. ఇవన్నీ రసశాస్త్ర సూత్రాలు. తెలంగాణ ప్రాంత ఆయుర్వేద నిపుణుల గురించి చెప్పే ఇంకొన్ని శాసనాలు కూడా ఉన్నాయి. వారంతా ప్రాణహిత కుటుంబానికి చెందినవారు. ఆ శాసనాలన్నీ అధ్యయనం చేస్తే ఈ ప్రాంతంలో ఆయుర్వేదం ఎలాంటి వైభవం చూసిందో అవగతమవుతుంది. ఆయుర్వేదం ఆరోగ్యవంతంగా జీవించే నిబంధనల గురించి తరచి చెబుతుంది. వ్యాధులు దరిచేరకుండా అనుసరించవలసిన జీవన శైలిని గురించి వివరిస్తుంది. పరిశుభ్రత, వ్యాయామాల గురించి చెప్పడంతో పాటు, చిరకాలం జీవించాలంటే చేయకూడని పనులేమిటో ఒక జాబితా ఇస్తుంది. ఇవాళ మానవాళి ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధుల గురించి నాటి మన వైద్యశాస్త్రం నిశితంగా చర్చించింది. ప్రధానంగా ఇవాళ ఎక్కువ మందిని వేధిస్తున్న రక్తనాళాల సంబంధిత రోగాల గురించి అది చెబుతుంది. కాబట్టి ఆయుర్వేదాన్ని మరింత శాస్త్రీయంగా అధ్యయనం చేయవలసి ఉంది.

– డాక్టర్‌ ‌దేమే రాజారెడ్డి, : న్యూరోసర్జన్‌, అపోలో, 9848018660

About Author

By editor

Twitter
YOUTUBE