డా।। పి.వి. సుబ్బారావు, 9849177594
గత సంచిక తరువాయి
కొండవీటి రాజ్య పతనానంతరం రెడ్డిరాజుల ప్రాభవం అంతరించి వెలమరాజుల ప్రాభవం ప్రారంభమైంది. సర్వజ్ఞ సింగభూపాలుడు తన ఆస్థానంలో ప్రముఖ కవిపండితులను ఆదరించి పోషించాడు. శ్రీనాథుడు సింగభూపాలుని సాహితీపోషణకు ముగ్ధుడై ‘‘రావుసింగమహీపాలు ధీవితాలు’’ని దర్శించుకొని శారదాస్తవంతో ఆయన మెప్పు పొందాడు. సింగభూపాలుని కాలం నాటికే భక్తకవి పోతన రసకవిత్వ సృష్టి సాగుతుంది. కాకతీయుల కాలంలో విలసిల్లిన తెలుగు సంస్కృతీ వైభవాన్ని, సాహితీ ప్రాభవాన్ని రెడ్డిరాజులు, రాచకొండ వెలమ ప్రభువులు పునఃప్రతిష్ఠ చేసే ప్రయత్నాలు జరిగినందున కవి ఈ పర్వాన్ని పునఃప్రతిష్ఠాపర్వంగా పేర్కోవడం ఔచిత్యంగా ఉంది.
ఈ కావ్యంలో ఆరోదైన విద్యానగర పర్వంలో విద్యారణ్యస్వామి ఆదేశానుసారంగా హరిహర బుక్కరాయ సోదరులు తమ గురువైన మాధవాచార్యులకు అవివందనం చేసి, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడాన్ని కవి సముచితంగా వర్ణించాడు. హరిహరరాయలు పిదప బుక్కరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్టించారు. బుక్కరాయల కొలువులో ప్రముఖ కవి ఉత్తర హరివంశకర్త నాచన సోముడు ఆస్థానకవి. అతడి పాలనావైభవాన్ని వర్ణిస్తూ ‘‘అతని కంటే ధన్యుడాంధ్ర రాజన్యుల ఉండడనుమాట సమధికోక్తి కాదు’’ అని ప్రశంసించాడు. బుక్కరాయలు సువిశాల సామ్రాజ్య విస్తరణతో 27 సంవత్సరాలు సుపరిపాలన అందించాడు. మధునాపంతులవారీ పర్వంలో ప్రౌఢదేవరాయల పాలనావిభవాన్ని సాహిత్య సంగ్రహణ పారీణతను ఔచిత్యంగా వర్ణించాడు. ఆయన ఆస్థానకవి గౌడ ఢిండిమభట్టు రాజుగారి ముత్యాలశాలలో కవితాగోష్టులు పాండితీ ప్రకర్ష చర్చలు సాగేవి. ఆస్థానకవి గౌడ ఢిండిమభట్టు గర్వోన్నతిని వర్ణిస్తూ ‘‘కవితాగర్వము శాస్త్ర గర్వము మహీకాంతాశ్రయ పాత్రవైభవ గర్వము ముప్పిరిగొనిన విద్వత్ సార్వభౌముడిగా’’ వర్ణించాడు. ఢిండిమభట్టు మూడు గర్వాలతో ముప్పిరిగొని విర్రవీగుతున్నాడు. మొదటిది కవితా గర్వం. రెండోది శాస్త్ర పాండిత్యగర్వం. మూడోది రాజాశ్రయగర్వం. భవిష్యత్‌లో మూడు గర్వాలతో అతనికి శ్రీనాథుడు చేతిలో గర్వభంగం తప్పదన్న విషయాన్ని ఈ పదాల ప్రయోగంతో సూచించడం మధునాపంతులవారి కవితా ప్రతిభకు నిదర్శనం.
అష్టదిక్కులలో పండితులను గెలిచిన గౌడ ఢిండిమభట్టు బిరుదాంకితుడి అసలు పేరు అరుణగిరినాధుడు. అతడి పాండిత్య గర్వం కొండవీటి ప్రాంతంలో ఉన్న శ్రీనాథుడి చెవులకు సోకింది. శ్రీనాథుడు కొందరి శిష్యులతో కలిసి ప్రౌడదేవరాయల ఆస్థానానికి ముందుగా వెళ్లి ఢిండిమభట్టుని మర్యాదపూర్వకంగా కలిశాడు. అతడి ఆకారంలో ఉన్న దురహంకారాన్ని గమనించాడు. పిదప ప్రౌఢదేవరాయలను దర్శించు కొన్నాడు. ముమ్మకవి అభిప్రాయాన్ని అనుసరించి రాయలు శ్రీనాథుని ఆస్థాన సాహిత్య గోష్టికి ఆహ్వానించాడు. చంద్రభూష క్రియాశక్తి మహోపాధ్యా యులవారు అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. శ్రీనాథ, గౌడ• ఢిండిమభట్టుల శాస్త్ర వైదుష్య కవితా శేముషీ చర్చను నిర్వహించాడు. శ్రీనాథ•డు ఢిండిమభట్టును ఓడించి విజేతగా నిలిచాడు. అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రభూష క్రియాశక్తి శ్రీనాథుని విజేతగా ప్రకటించాడు. రాయలవారు శ్రీనాథుని పాండిత్యానికి ముగ్ధుడై తమ అదృష్టం వల్ల ఇటువంటి శాస్త్ర విషయాలు విన్నామని శ్రీనాథ మహాకవి కనకాభిషేకానికి అర్హుడని ప్రకటించాడు. ఢిండిమభట్టు రాజుగారి ఆదేశం మేరకు శ్రీనాథుని కనకాభిషేక సత్కారం నిర్వహిస్తూ ‘‘ఢిండిమ బుదేంద్రు నలఘు పాండితిని గెలిచి / కవులలో సార్వభౌమత గన్న మేటి / ఇతని వ్యుత్పత్తి నెరిగి ఫౌఢీశ్వరుండు / చేయుచున్నాడు స్వర్ణాభిషేక పూజ’’ అంటూ సహృదయ వ్యాఖ్యానంతో శ్రీనాథుని కనకాభిషేక కార్యక్రమాన్ని గొప్పగా రాయలవారు నిర్వహించారు. ఈ ఘట్టంలో మధునాపంతులవారు శ్రీనాథ ఢిండిమభట్టుల శాస్త్రార్ధచర్చలను, కనకాభిషేక కార్యక్రమాన్ని ఔచిత్యమైన పద ప్రయోగాలతో మనోజ్ఞంగా వర్ణించాడు.
ఈ పర్వంలోనే సాళ•వ నరసింహరాయల పాలనా వైభవాన్ని ఆయన ఆస్థానకవి పిల్లలమర్రి పినవీరభద్రుని జెమినీ భారత రచనావిధానాన్ని సముచితంగా వర్ణించాడు. వాణీకటాక్షంతో ఒక్కరోజులో పినవీరన జైమినీ భారతాన్ని రచించి మహాకవులకు ఆశ్చర్యం కలిగించే విధంగా సత్కారం స్వీకరించాడు. ఈ పర్వంలోనే తుళువ నరసరాజు మంత్రాంగ దక్షతను మనోజ్ఞంగా వర్ణించాడు.
ఏడోదైన శ్రీకృష్ణదేవరాయపర్వంలో తిమ్మరుసు ధీయుక్తి, శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవాన్ని కవి అద్భుతంగా వర్ణించాడు. రాయలవారు భూపరిపాలనా భారాన్ని వహిస్తున్నందున అష్టదిగ్గజ కవులు మహాకావ్య రచనలకు పూనుకున్నారని, అష్టదిక్పాలకులు శ్రద్ధతో రాయలవారిని పర్యవేక్షిస్తు న్నారని, అష్టదిగ్గజ పదాన్ని శ్లేషచమత్కారంగా వర్ణించాడు. ఎనిమిదో పర్వమైన విజయపర్వంలో రాయలవారి పాలనలో సామ్రాజ్య విస్తరణపై దృష్టిని కేంద్రీకరించి దుర్భేద్యమైన ఉదయగిరి, కొండవీడు, అద్దంకి, వినుకొండ, నాగార్జునకొండ వంటి వాటిని జయించి పూర్వ దిగ్విజయ యాత్రలో కృతార్ధుడయ్యాడు. మహామంత్రి తిమ్మరుసు రాజనీతి చతురతతో రాయలవారు సువిశాల సామ్రాజ్య పాలకుడయ్యాడు. కటకం పాలకుడైన గజపతి రాయలవారితో సంధి చేసుకొని తన కుమార్తె అన్నపూర్ణను ఇచ్చి కన్యాదానం చేశాడు. సువిశాల సామ్రాజ్య స్థాపనానంతరం సాహితీ తృష్ణతో భువనవిజయ సభను ఏర్పాటు చేశాడు. సాహితీ సమరాంగణా సార్వభౌముడైన రాయలవారి భువనవిజయ సభలో సంస్కృత కర్ణాట ద్రావిడ భాషల మహాకవులున్నారు. భువనవిజయ సభలో అల్లసాని పెద్దనను ‘‘ఆంధ్రకవితా భువనాంచిత శిల్పబంధ మంధరుడిగా’’ వర్ణించాడు. పెద్దనగారి మనుచరిత్రను అంకింతం తీసుకునే సందర్భంలో ఆహ్లాదభరితమైన అనుభూతిని కలిగించే, ఔచిత్యమైన ఉపమానాలను ప్రయోగించి అద్భుతంగా వర్ణించాడు. రాయలవారు ఉత్సాహంతో పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు. పల్లకీని తన చేత్తో ఎత్తి మోశాడు. శ్రీకృష్ణదేవరాయల అనంతరం పాలకుడైన అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు, వెంకటపతిరాయల పాలనతో తుళువ వంశం అంతరించింది. ఆరవీటి వంశస్థుడైన అళియ రామరాయలు రాజ్యపాలకుడైన విషయాన్ని కవి వర్ణించాడు.
మధునాపంతులవారు విజయపర్వంలో రాయలవారి దిగ్విజయ యాత్రలను, సువిశాల సామ్రాజ్య స్థాపనను భువనవిజయ సాహితీ సభా విశేషాలను అద్భుతంగా వర్ణించాడు.
చివరిదైన నాయకరాజ పర్వంలో విజయనగర రాజ్యంలో లెస్సగా విరిసి పండిన ఆంధ్ర వైభవం తంజావూరు నాయకరాజుల పాలనలో 17వ శతాబ్దంలో వెల్లివిరిసింది. అచ్యుత నాయకుడు, ఆయన మంత్రి గోవింద దీక్షితుడు శస్త్ర శాస్త్రాలలో ఉద్ధండులు. యువరాజు రఘునాథ నాయకుడు సాహితీ ప్రీతితో అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనిపించుకున్నాడు. శత్రువులను గెలిచి విజయాలను సాధించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. గర్వంతో విర్రవీగిన మధుర మహారాజును చూసి పరిహసిస్తూ ‘‘వీరెవరయ్యా ! మధుర మహారాజులే / ఇట్లు కృపణులై పట్టువడన్ వీరికి వలసెనే’’ మధునాపంతులవారీ సన్నివేశంలో తిక్కన భారతంలో ద్రోణుడు దృపదమహారాజుని పరిహసించిన విషయాన్ని అనుసరించాడు. రఘునాథ నాయకుడు వాల్మీకి చరిత్ర, అచ్యుతాభ్యుదయం వంటి కావ్యాలు రాశాడు. ఆయన ఆస్థానంలో విజయవిలాసకర్త చేమకూరి వెంకటకవిని ఆదరించి పోషించాడు.
రఘునాథ నాయకుని వారసుడుగా విజయరాఘవ నాయకుడు పాలకుడయ్యాడు. తండ్రి మార్గంలో యక్షగానాలు విరివిగా రాశాడు. రంగాజమ్మను ఆస్థాన కవయిత్రిగా ఆదరించి కనకాభిషేకం చేశాడు. ఇందిరామందిరం అనే సభలో సాహిత్య గోష్ఠులు నిర్వహించేవాడు. నాయకరాజ పర్వంలో కవి నాయకరాజుల పాలనా వైభవాన్ని సాహిత్య పోషణను సముచితంగా వర్ణించాడు.
ఆధునిక చారిత్రక కావ్యాలలో ప్రసిద్ధిమైంది ఆంధ్రపురాణం. ఆంధ్రపురాణ రచనల వల్లనే మధునాపంతులవారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ బిరుదు లభించింది. ఆంధ్ర కల్హణ – అనే బిరుదు వరించింది. అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి ఆంధ్ర పురాణాన్ని మెచ్చుకుంటూ ‘‘తీయని కైతతోడ గడిదేరిన పాండితి తోడ ఆంధ్ర రా/ ష్ట్రీయ వికాసమున్ వలచు డెందము తోడ నపార శౌచ ల / క్ష్మీయుత జీవన ప్రవణశీలముతోడ నెసంగు సత్యనా / రాయణ శాస్త్రికిన్ జయపరంపర సంతతమై లభించుతన్.’’ అంటూ ప్రశంసించాడు. వేలూరు శివరామశాస్త్రి గారు ఆంధ్ర పురాణాన్ని పారవశ్యంతో చదివి అందులో ఉన్న హాలుడు, నన్నయ, గుణఢ్యుడు రాజరాజులు సజీవపాత్రలై తన కళ్లెదుట సంచరిస్తున్నారని ఇది కధ కాదు కదా ! అంటూ ఆశ్చర్యంతో ప్రశంసించారు.
శాస్త్రిగారు శ్రీఖండం చైత్రరథం వంటి ఖండకావ్యాలు ఛందోబద్ధంగా, మనోజ్ఞమైన శైలిలో రచించాడు. ‘గోపికా శౌక’ అనే ఖండకావ్యాన్ని భావకవితా ధోరణిలో రచించాడు. పద్యకవిత్వమే కాకుండా, ‘‘ఆంధ్ర రచయితలు’’ అనే గ్రంథంలో నూట పదమూడు మంది ఆధునిక రచయితలను గూర్చి విమర్శ దృష్టితో సరళమైన గద్యశైలిలో రచించాడు. కొన్నాళ్లు ‘ఆంధ్రీ’ అనే పత్రికను కూడా నడిపారు. ఆయన జీవితం ఉపాధ్యాయ వృత్తిలో పునీతమైంది.
మధునాపంతులవారి ఆంధ్రపురాణంలో తెలుగు సంస్కృతీ దీప్తినీ, రాజవంశాల కీర్తినీ రాజుల ఆదరణలో విలసిల్లిన సాహితీ పరిమళాల స్ఫూర్తినీ ఆకర్షణీయమైన సరళసుందరమైన శైలిలో అచ్చతెలుగు పదాల పోహళింపుతో అక్షరబద్ధం చేశారు. ఆంధ్రజాతి ఉన్నంతవరకు ఆంధ్రపురాణం నిలిచి ఉంటుంది. మధునాపంతులవారి కీర్తిని అజరామరం చేసి చిరస్మరణీయకావ్యం ఆంధ్రపురాణం.
శతజయంతి సందర్భంగా మధునాపంతులవారికి అక్షరాభివందనాలు.
(కేంద్ర సాహిత్య అకాడెమీ వారి మధునాపంతుల శతజయంతి గోష్ఠిలో సమర్పించిన వ్యాసం.)
పల్లెపాలెం, తేది. 5-3-2020.
వ్యాకసర్త : రిటైర్డ్ ప్రొఫెసర్ & తెలుగు శాఖాధిపతి, సి.ఆర్. కళాశాల, గుంటూరు.