చరిత్రాత్మక భూమిపూజ మహోత్సవానికి పూజ్య సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ భూమిపూజతో భవ్య మందిర నిర్మాణంతో పాటు ప్రజానీకంలో ఆత్మగౌరవ నిర్మాణానికీ, స్వావలంబన దృష్టికీ కూడా శ్రీకారం పలుకుతున్నామని ఆయన అన్నారు. అందరిలోను రాముడు ఉన్నాడు, రాముడు అందరివాడు అని చెబుతూ, అయోధ్య మందిరంతో పాటు ప్రతి మనసులోను ఒక అయోధ్య నిర్మితం కావాలని, అప్పుడే ఈ యావత్ ప్రపంచాన్ని తనదిగా చూసే మహోన్నత దృష్టి నిర్మితమవుతుందని ఆయన అన్నారు.
భూమిపూజ వేళ మోహన్‌జీ ఇచ్చిన సందేశం పాఠం:
పూజ్యులు మహంత నృత్యగోపాల్‌జీ మహరాజ్ సహా ఇక్కడ ఆసీనులైన సాధుసంతులు, ఆదరణీయులు, భారత ప్రజల ప్రియతమ ప్రధానమంత్రివర్యులు, గౌరవనీయ ఉత్తరప్రదేశ్ గవర్నరు, గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు, పుర సజ్జనులు, మాతృమూర్తులు, సోదరీమణులారా!
ఈ రోజు అందరికి అన్ని విధాలుగాను సంతోషదాయకం. మనమంతా ఒక సంకల్పం చేసుకున్నాం. అందులో ముందుకు సాగేందుకు మనం చేయవలసిన పని గురించి ఆనాడు సంఘ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్, ‘ఎంతో శ్రమకోరుస్తూ 20, 30 సంవత్సరాలు పనిచేయవలసి వస్తుంది, అప్పుడే ఈ కార్యం విజయవంతమౌతుంది’ అని చెప్పడం నాకు జ్ఞాపకముంది. మనం 20, 30 ఏళ్లు పనిచేశాం. 30వ సంవత్సర ప్రారంభంలో ఆ సంకల్పం నెరవేర్చుకున్న ఆనందం మనకు లభిస్తున్నది. అందరూ హృదయపూర్వకంగా, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు. చాలామంది ప్రాణాలర్పించారు. వాళ్లందరూ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారు. అనేకమంది ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు. పరిస్థితుల కారణంగా వారు రాలేకపోయారు. రథయాత్రకు నేతృత్వం వహించిన అడ్వాణీ గారు ఇంటి దగ్గర కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. ఇంకా ఎందరెందరో రాగలిగేవారే, కాని వారందరిని పరిస్థితుల కారణంగా పిలవలేక పోయారు. వాళ్లందరు కూడా తాము ఉన్నచోట నుండే వీక్షిస్తూ ఉండవచ్చు. నేను దేశమంతటా ఆనందోత్సాహాన్ని చూస్తున్నాను. వందల సంవత్సరాల ఆకాంక్ష నెరవేరిన క్షణంలోని ఆనందమిది.
ఇపుడు అన్నిటికన్నా ఆనందింపచేసే విషయమేమి టంటే భారత్‌ను స్వావలంబన దేశంగా తయారు చేయడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం సగుణ సాకారంగా ప్రతిష్టితమయ్యే శుభారంభం ఈనాడు జరుగుతున్నది. అదేమిటంటే ఆధ్యాత్మిక దృష్టి. అది ‘సియా రామమయ సబ్ జగ జానహి’ (ప్రపంచమంతా సీతారామమయమని తెలుసుకోవాలి). ప్రపంచమంతటిని తనలో చూసుకొనే దృష్టి, తనలోనే ప్రపంచాన్నంతటిని చూసుకొనే దృష్టి వల్లనే భారతదేశంలోని ప్రతి వ్యక్తి వ్యవహారం ఈనాటికి కూడా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సహృదయతతో కూడి ఉంటుంది. అదేవిధంగా ఈ దేశంలోని వసుధైక కుటుంబ భావన అందరిలోను ఉంటుంది. ఇటువంటి స్వభావంతోపాటు, కర్తవ్య నిర్వహణ, భౌతిక ప్రపంచంలోని మాయకు సంబంధించిన అన్ని సంశయాల నుండి మార్గాలను ఏర్పరుచుకుంటూ సాధ్యమైనంతవరకు అందరిని తోడుగా తీసుకొని వెళ్లే ఒక పద్ధతి ఉంటుంది. ఇది ఇక్కడ ఏర్పడుతున్నది. పరమవైభవ సంపన్నంగా అందరి క్షేమం కోరే భారత్ నిర్మాణానికి వ్యవస్థా నిర్వహణ సామర్ధ్యం గల చేతుల మీదుగా ఈనాడు శుభారంభం జరుగుతున్నది. ఇది అత్యంత ఆనందకరమైన విషయం.
ఈ రోజు అందరినీ స్మరించుకుంటున్నాం. అశోక్ సింఘాల్ గారు, పూజ్య మహంత్ పరమహంస దాస్ జీ ఈ రోజు మన మధ్య ఉంటే ఎంతో బాగుండునని సహజంగానే అనిపిస్తుంది. అయినా వాళ్ల ఆశయం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. వాళ్లు మనస్ఫూర్తిగా ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అదేకాకుండా ఈ ఆనందాన్ని వారు వందలరెట్లు పెంచుతున్నారు. ఈ ఆనందంలో ఒక స్ఫురణ ఉంది. ఒక ఉత్సాహం ఉంది. మనం చేయగలం, మనమే చేయాలి, ఇదే చేయాలి.
ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మన:
స్వం స్వం చరిత్రం శిక్షేరన్పృథివ్యాం సర్వ మానవా:
జీవనాన్ని ఇచ్చే విద్యను మనం అందరికీ అందించాలి. ఇప్పుడు కరోనా వాతావరణం ఉంది. ప్రపంచమంతా అంతర్ముఖమై ఉంది. పొరపాటు ఎక్కడ జరిగింది, దీని నుండి బయటపడే మార్గం ఏముందని ఆలోచిస్తున్నది.
ప్రపంచం రెండు మార్గాలను సూచింది. ఏదైనా మూడో మార్గముందా? అని ఆలోచిస్తున్నది. అవును ఉంది. ఆ మార్గం మన దగ్గర ఉంది. మనం చూపగలం. ఆ మార్గమేదో చూపించవలసిన పని కూడా మనమే చేయాలి. ఆ పని పూర్తిచేయాలనే సంకల్పం కూడా ఈ రోజే తీసుకోవాలి. దానికి కావలసిన తపస్సు, పురుషార్థం మనం సాధించాం. ప్రభు శ్రీరాముని జీవితం నుండి ప్రారంభిస్తే ఈనాటి వరకు ఆ పురుషార్థాలన్నీ, అంటే పరాక్రమం, ధైర్యం మన నరనరంలోను గమనించగ•లం. వాటిని మనం కోల్పోలేదు, మన దగ్గరే ఉన్నాయి. మనం ప్రారంభిస్తే చాలు, పూర్తవుతుంది. ఈ రకమైన విశ్వాసం, ప్రేరణ, ఉత్సాహం ఈ రోజు నుండే మనకు, భారతీయులందరికి లభిస్తున్నది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఎందుకంటే రాముడు అందరివాడు. అందరిలో రాముడున్నాడు.
ఇప్పుడిక్కడ భవ్యమైన మందిరం నిర్మాణమౌతుంది. పక్రియ ప్రారంభమైంది. బాధ్యతలు కూడా అప్పగించడం పూర్తయింది. ఎవరి పని వారు చేస్తారు. ఆలాంటప్పుడు మనందరం చేయవలసిన పని ఏముంటుంది? మనందరం మన మనసులో ఉన్న అయోధ్యను అలంకరించుకోవాలి. శోభాయమానం చేసుకోవాలి.
ఏ ధర్మానికి మూర్తీభవించిన మూర్తిగా ప్రభు శ్రీరాముడిని భావిస్తామో అది అందరినీ కలుపుతుంది, అందరి ఉన్నతిని కోరుతుంది. ఆ ధర్మ ధ్వజాన్ని భుజాన ధరించి సమస్త ప్రపంచానికి సుఖశాంతులను ప్రసాదించే భారత్‌ను నిలబెట్టగలగాలి. అందుకోసమే మనసులో అయోధ్యను నిర్మించుకోవాలి. ఇక్కడ జరిగే మందిర నిర్మాణంతో పాటుగా మన మనసులో అయోధ్య నిర్మాణం కూడా జరుగుతూ ఉండాలి. ఈ మందిర నిర్మాణం పూర్తికావడానికి ముందే మన అంతరంగ అయోధ్య నిర్మాణం కూడా పూర్తి కావాలి. ఇది చాలా అవసరం. ఈ మందిరం ఎలా ఉంటుందో తులసీదాసు రామచరిత మానస్‌లో వివరించాడు.
‘కామ కోహ మద్ మాన్ న మోహ !
లోభ న ఛోభ్ న రాగ న ద్రోహా!!
జిన్హ కే కపట దంభ్ నహి మాయా!
తిన్హకే హృదయ బసహు రఘురాయా!!
జాతి పాంతి ధను ధరము బడాయీ!
ప్రియ పరివార్ సదన్ సుఖ దాయీ!!
సబ తజి తుమ్హహి రహయి ఉర్ లాయీ!
తెహిం కే హృదయ రహహు రఘురాయీ!!
(కామం, క్రోధం, మదం, దురభిమానం, మోహం, అనురాగం, లోభం, క్షోభ, ద్రోహం ఉండకూడదు. ఎవరిలో కపటం, మిథ్యాభిమానం, మాయ ఉండదో వారి హృదయంలోనే రఘురాముడుంటాడు. కుల మతాలు, ధనం కాదు ప్రియమైన కుటుంబ గృహమే సుఖాన్ని ఇస్తుంది. అన్నింటిని త్యజించిన హృదయంలోనే రఘురాము డుంటాడు).
మన హృదయం కూడా శ్రీరామ నివాసం కావాలి. మనం అన్ని దోషాల నుండి, వికారాల నుండి, ద్వేషాల నుండి, శతృత్వభావన ముక్తుమై మాయా ప్రపంచం ఎలా ఉన్నప్పటికి అందులో అన్ని రకాలుగా మసులుకోగలిగే సామర్థ్యాన్ని పొందాలి. హృదయంలోని ఆన్ని రకాల భేదాలకు తిలాంజలి సమర్పించి, కేవలం మన దేశవాసులనేకాదు చరాచర జగత్తును తనదిగా స్వీకరించే సామర్థ్యం గల ఈ దేశంలోని వ్యక్తినీ, ఇలాంటి సమాజాన్నీ నిర్మించే పని ఇది. ఈ సమాజాన్ని నిర్మించే పనికి సాకారరూపం ఇక్కడ నిర్మాణం కాబోతున్నది. ఈ రూపం మనందరికి ఎల్లప్పుడు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. భవ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమం అంటే, భారతదేశంలోని లక్షల రామ మందిరాలకు సమాంతరంగా మరొక మందిరాన్ని నిర్మించే కార్యక్రమం కాదు. కాని దేశంలోని మందిరాలలో ప్రతిష్టించుకున్న మూర్తుల లక్ష్యం, ఆశయం ఏమిటో ఆ ఆశయాల పున:శ్చరణ, పునఃస్థాపన చేసే శుభారంభం ఈ రోజు ఇక్కడ సమర్థవంతమైన చేతుల మీదుగా జరిగింది. ఈ మంగళ ప్రదమైన సమయంలో, ఈ ఆనందమయ క్షణంలో నేను మీ అందరికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ సమయంలో నా మనసులో వచ్చిన భావాలను మీ దృష్టికి తీసుకువస్తూ, మీ ముందుంచుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను, ధన్యవాదాలు.