దేశం, ప్రపంచం ఒక నూతన భారతావనిని దర్శిస్తోంది. నేడు భారతీయ విదేశీ విధానం, రక్షణ, ఆర్థిక విధానాల్లో పెను మార్పులు సంభవించాయి. విదేశీ, రక్షణ విభాగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా సైన్యంబలం, సైనికుల మనోబలం మరింత పెరిగాయి. భారతదేశ విశ్వసనీయత ప్రపంచంలో పటిష్టమైంది. అత్యధిక దేశాలు భారత్‌కు సమర్థన తెలుపుతూ, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం తాత్కాలిక సభ్యురాలిగా మారడం కంటే కూడా ఎంతో ముఖ్యమైన అంశం 193 మంది సభ్యులలో, 184 మంది భారత్‌కు మద్దతు ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం భారత్ చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సభ్యులందరూ ఆమోదించారు. సౌరశక్తితో సహా అనేక విషయాల్లో ప్రపంచంలోని చాలా దేశాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు భారత్ ప్రదర్శించిన చొరవ, పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైంది. అనేక రంగాల్లో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. శక్తిమంతమైన, సంపన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఎదగడం సమస్త మానవాళికి, పర్యావరణం, ప్రకృతికి లభించిన గొప్ప వరమని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కారణం చాలా సుస్పష్టం. ప్రపంచం పట్ల భారతదేశ దృక్పథం పోటీ కాదు, సంఘర్షణ కాదు, సమన్వయం మాత్రమే కాదు, తమ కోసం కాకుండా సృష్టిలోని ప్రతి ఒక్కరి మేలు, వృద్ధి గురించి ఆలోచించే ఏకైక దేశం భారత్ మాత్రమే.
ఆర్థిక విధానంలో చాలా మార్పులు తీసుకురావలసిన అవసరం నేడు ఉంది. కానీ వేగంగా సాగుతున్న వృద్ధి క్రమంలో ఇలాంటి మార్పులు చేయడం సులభం కాదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆర్థిక గమనం పూర్తిగా స్తంభించింది. అయినప్పటికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థిక విధానాలను మెరుగు పరచేందుకు భారత ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధితో కృషి చేసింది. అయితే 70 సంవత్సరాల ఆర్థిక విధానాలను పునర్ నిర్వచించుకోవడానికి ధైర్యం, దూరదృష్టి, సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సహనంతో, అంతా కలసి పనిచేయడం అవసరమే. ఈ తరుణంలో మన ఏకాత్మభావన, అందరి అభివృద్ది కోసం, అందరిని కలుపుకుంటూ వెళ్లాలనే భారతీయ దృష్టికోణం ఆధారంగా ప్రస్తుత కాలానుగుణంగా నూతన కార్యకలాపాల కోసం ప్రణాళికలు రూపొందించాలి. భారత్ ఇప్పుడు ఈ దిశలోనే పయనిస్తోంది. నేడు భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోంది. ఇది ప్రపంచం మొత్తం చూస్తోంది, అనుభూతి చెందుతున్నది. ఈ పరిణామం భారత్‌ను కాస్త కొత్తగా కనిపించేలా చేస్తోంది. ప్రపంచం కూడా ఈ కొత్తదనాన్ని ఆస్వాదిస్తోంది.
దశాబ్దాల ప్రయత్నాల ఫలితంగా ఈ ప్రాథమిక మార్పుకు దారితీసిన జాతీయతా చైతన్యానికి వామపక్షవాదులు, వారు పెంచి పోషించిన జర్నలిస్టులు, ఉదారవాదులు, మేధావులు ‘జాతీయవాదం’గా ముద్రవేసి, దేశం మేల్కొనడాన్ని నిరంతరం వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి, ఇది ‘జాతీయ ఉద్యమం. ‘జాతీయవాదం’ కాదు. ఈ ‘జాతీయవాదం’ భారతీయుల భావన కాదు. ఇది పశ్చిమ దేశాల నుండి ఉద్భవించింది. అందుకే అక్కడ రాజ్యం ఆధారంగా జాతి (Nation – State) ఏర్పడింది. కనుక అక్కడ నేషనలిజం (nationalism) అంటే ‘జాతీయవాదం’గానే పరిగణిస్తారు. ఈ పశ్చిమ ‘జాతీయవాదం’ రెండు ప్రపంచ యుద్ధాలను ఇచ్చింది. అక్కడి ‘జాతీయవాదం’ పెట్టుబడిదారీ విధానానికి జన్మనిచ్చింది. ఈ సూపర్ జాతీయవాదం (super-nationalism) కమ్యూనిజం వర్గానికి చెందింది. ఏ మాత్రం అనుభవం లేకుండా మధ్య ఆసియా, తూర్పు ఐరోపా దేశాల్లో సోవియెట్ రష్యా తన కమ్యూనిస్ట్ ఆలోచన విధానాలను ఏ విధంగా బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే.
అదేవిధంగా, చైనా విస్తరణ ప్రవృత్తితో హాంకాంగ్, దక్షిణాసియా దేశాల విషయంలో ఎలా తన సామ్రాజ్యవాద తత్వాన్ని ప్రదర్శిస్తోందో నేడు ప్రపంచానికి బహిర్గతమైంది. ఆరు దేశాల్లోని 41 లక్షల చదరపు కిలోమీటర్ల భుభాగాన్ని చైనా ఆక్రమించిందనీ, 27 దేశాలతో వైరం కలిగి ఉందనీ అంచనా. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు చైనా సామ్రాజ్యవాదానికి లేదా సూపర్ నేషనలిజానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నట్లు తెలుస్తోంది.
భారతీయ ఆలోచనలో ‘జాతీయత’ అనే భావం ఉంది, ‘జాతీయవాదం’ కాదు. మనం ఇక్కడి జాతీయులమే కానీ జాతీయవాదులం కాదు. కనుకనే సంఘం పేరును రాష్ట్రవాది స్వయంసేవక్ సంఘం అని కాకుండా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌గా నిర్ణయించారు. మనం మరే ఇతర ‘జాతీయవాదాన్ని’ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశ భావన భారతీయ జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రజలే రాష్ట్రంగా భావింపబడతారు. రాజ్యాన్ని రాష్ట్రంగా భావించరు. వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధ కులాల పేరుతో జీవించేవారు, అనేకమంది దేవతలను ఆరాధించే భారత ప్రజలందరూ ఆధ్యాత్మికంగా సమగ్రమైన, సర్వవ్యాప్తమైన ఈ జీవన శైలిని తమదిగా భావిస్తారు. తద్వారా, అందరూ ఈ సమాజంతో, ఇక్కడి భూమితో మమేకమయ్యారు. భారతీయుల సాముహిక గుర్తింపు, బంధుభావనను జాగృతం చేస్తూ ‘మనది’ అనే ఆలోచనలను అందించి, సంస్కారాలను పెంపొందించి, జాతీయతా భావాలను మేల్కొల్పాలి. సమాజంలోని అన్ని రంగాల్లోను ఈ జాతీయతా భావాలు స్పష్టంగా కనిపించాలి. వ్యక్తం చేయాలి. అదే జాతీయ పునర్నిర్మాణం. ఇది దేశ ప్రజల స్వీయ మేల్కొలుపు, తమ భావాలను వ్యక్తపరిచే కార్యక్రమం. అంతే తప్ప జాతీయవాదం ఎంతమాత్రం కాదు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల పట్ల, చైనా విస్తరణవాదం, అభ్యంతరకర వైఖరి పట్ల భారతదేశ ప్రతిస్పందన చూసి వామపక్షాలు ఇది భారత్ సూపర్-జాతీయవాదం (super-nationalism) అని ప్రచారం చేశాయి. వాస్తవానికి వామపక్ష వాదులకు భారతదేశ స్వీయతత్వం (ఈ దేశం నాది అనే ఆంతరిక శక్తి) నేటివరకు అర్థం కాలేదు. ప్రస్తుత సందర్భంలో కనిపించేది ‘జాతీయవాదం’ కాదు. నేటివరకు తిరస్కరణకు గురై, నిర్లక్ష్యం చేసిన భారతీయ స్వీయతత్వం. అంతేకాదు, భారతీయుల ఆలోచన విధానమే ‘వసుధైక కుటుంబకం’, ‘సర్వేపి సుఖిన సంతు’ అని. కనుక భారతీయుల స్వీయతత్వం మేల్కోవడం, స్వావలంబనతో స్వయంసమృద్ధి సాధించడం పట్ల ఎవరూ భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ నేడు మేల్కొంటున్నది. అలాగే, భారతీయుల స్వీయతత్వం వ్యక్తీకరించడం పట్ల ఇక్కడే వ్యతిరేకత రావడం కొత్తేమి కాదు. స్వాతంత్య్రానంతరం జునాఘడ్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే పక్రియ పూర్తిచేసిన తర్వాత నాటి కేంద్ర హోం మంత్రి వల్లభాయ్ పటేల్ సోమనాథ్ వెళ్లారు. అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయం జీర్ణావస్థలో ఉన్న దృశ్యం చూసి ఎంతో వ్యథ చెందారు. దేశానికి స్వాతంత్య్రం లభించింది కనుక ఆ ఆలయానికి పూర్వ వైభవం తీసుకుని రావాలనే సంకల్పం వారి మనసులో మెదిలింది. వెంటనే ఈ బాధ్యత పండిత్ నెహ్రూ మంత్రి మండలిలోని క్యాబినెట్ మంత్రి కన్నయలాల్ మున్షికి అప్పగించారు. సర్దార్ పటేల్ ఈ సమాచారాన్ని మహాత్మాగాంధీకి తెలిపారు. అందుకు ఆయన ఎంతో సంతోషించారు. కానీ ఆలయ నిర్మాణ వ్యయం ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల నుండి సమీకరించాలని సూచించారు. ఆ సూచనను పటేల్ అంగీకరించారు. ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేందప్రసాద్ హాజరై, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పలికిన మాటలు స్ఫూర్తిదాయకం.
కానీ పండిత్ నెహ్రూకు ఇది ఎంత మాత్రం నచ్చలేదు. ఈ ఆలయ పునర్నిర్మాణం పట్ల మహాత్మా గాంధీజీ, సర్దార్ పటేల్, కన్నయలాల్ మున్షి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితర ప్రతిష్ట కలిగిన నేతలు భారతీయ గౌరవాన్ని తిరిగి పునరుద్ధరణ చేసినట్లుగా భావిస్తున్న తరుణంలో ఈ సంఘటనను నాటి ప్రధానమంత్రి ‘హిందూ పునరుజ్జీవనం’ (Hindu revivalism) అంటూ వ్యతిరేకించారు. భారతీయ స్వీయతత్వాన్ని, దానిని వ్యక్తం చేసే వారిని వ్యతిరే కించడం ఆనాడు కూడా ఉండేదని స్పష్టమవుతోంది. కానీ జాతీయ భావాలు గల నేతలు నాడు కాంగ్రెస్‌లో అత్యధిక సంఖ్యలో ఉండేవారు. అందువల్లే ఈ కార్యం సాధ్యమైంది. ఇక ఒక క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా జాతీయభావాలున్న నేతలను పక్కకు తప్పించారు. దీనితో కమ్యూనిస్టు భావాలు గల నేతల ప్రభావంలో కాంగ్రెస్ పడిపోయింది. ఆధ్యాత్మికతనే కాదు, ఇదొక దేశం (జాతి) అనే భావనను కూడా కమ్యూనిస్టులు అంగీకరించరు. వీరంతా పెట్టుబడిదారీ విధానం, వలసవాద మనస్తత్వానికి ప్రతినిధులు. గతంలో సోవియట్ యూనియన్, ఇప్పుడు చైనా కూడా అదే విస్తరణవాదం, నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కనుకనే కమ్యూనిస్టులు భారతీయ స్వీయతత్వాన్ని సరిగ్గా అర్థం చేకోలేకపోయారు లేదా ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేకించారు. ఆ కారణంగానే ఈ దేశం ఒకే సూత్రంతో అనుసంధానం కాలేదు. అది ముక్కలుగా విచ్ఛిన్నమై, బలహీనపడుతూ వచ్చింది. అటువంటి పరిస్థితిలో మన కర్తవ్యం ఏమిటి?
1904లో గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘స్వదేశీ సమాజ్’లో దీని స్పష్టమైన, కచ్ఛితమైన మార్గదర్శక చిత్రాన్ని ప్రతిబింబించారు. గురుదేవ్ జాతీయవాదాన్ని వ్యతిరేకించారన్నది నిజం. ఆయన వలసవాదానికి (colonialism), ప్రపంచ యుద్ధ పరిణామాలకు వ్యతిరేకంగా, పశ్చిమ దేశాల ‘జాతీయవాదానికి’ వ్యతిరేకంగా ఉన్నారు. టాగూర్ భారతీయ స్వీయతత్వానికి ఏ విధంగా అనుకూలురో ఆయన రాసిన ‘స్వదేశీ సొసైటీ’ వ్యాసమే రుజువుగా నిలుస్తుంది. అందులో ఇలా రాసారు.
‘మీ శరీరాన్ని కప్పి ఉంచుకొని, నిశ్శబ్దంగా ఒక మూల పడుకోవడం ఆత్మరక్షణ అనిపించుకోదని ఇప్పుడు అందరికి బాగా తెలుసు. మీలోని అంతర్గత శక్తిని మేల్కొల్పడం, దాన్ని ప్రకటించడమే ఆత్మరక్షణకు సరైన మార్గం. ఇదే సృష్టికర్త నియమం. జడత్వాన్ని త్యాగం చేసి మనలోని ఉద్యమ శక్తిని ఉపయో గించుకునే వరకు, బ్రిటిష్ వారు మన మనసులను ఓడిస్తూనే ఉంటారు. ప్రతిదానిలో బ్రిటిష్ వారిని అనుకరించడం, వారి వేషధారణను అనుకరించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకొనే క్రమంలో చేసే ప్రయత్నాలన్నీ మిమ్మల్ని మీరు మోసం చేసుకొనేవే. మనం నిజమైన ఆంగ్లేయులం కాలేం. నకిలీ ఆంగ్లేయులుగా మారి బ్రిటిష్ వారిని మోసం చేయలేం. మన తెలివితేటలు, అభిరుచులు, హృదయం దమ్మిడీకి కూడా కొరగానివిగా అయిపోతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక ఉపాయం. మొదట వాస్తవంగా మనం ఎవరమో తెలుసుకొని ఆ విధంగా రూపుదిద్దుకోవాలి. జ్ఞానంతో సరళమైన పద్ధతిలో సజీవంగా సంపూర్ణ రూపంతో మనది అనే భావనతోనే మనం తయారు కావాలి.’
ఈ దేశ మహర్షులు కూడబెట్టిన శక్తి ఎంతో విలువైనది. సృష్టికర్త దాన్ని ఎన్నటికి విఫలం కానివ్వడు. అందువల్ల ఆయన సరైన సమయంలో నిస్పృహలో ఉన్న భారతదేశానికి గట్టి వేదనను ఇచ్చి మేల్కొల్పాడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం, వైవిధ్యంలో ఐక్యతను స్థాపించడం భారతదేశ అంతర్గత ధర్మం. వైవిధ్యం అంటే వ్యతిరేకించడం అని భారత్ ఎప్పుడూ భావించలేదు. విదేశీయులు అంటే శత్రువులు అనే ఆలోచనను కూడా భారత్ ఏనాడూ వ్యక్తపరచలేదు. ఎవరైతే తనవారో వారిని త్యాగం చేయకుండా, ఎవరినీ నాశనం చేయకుండా, ప్రతి ఒక్కరినీ సమగ్ర వ్యవస్థలో ఉంచాలనేది ఈ దేశం కోరిక. అన్ని మతాలను ఇది స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కరి ప్రాముఖ్యతను వారి వారి స్థానాల్లోనే గుర్తిస్తుంది. ఇది భారతదేశ సుగుణం. అందువల్ల, ఏ మతావలంబికులనూ మన ప్రత్యర్థులుగా పరిగణించి భయభ్రాంతులకు లోనుకానివ్వం. కొత్తవారి కలయికతో (చివరికి మనలోనే కలుపుకొని) విస్తరించాలని ఆశిస్తాం. భారతదేశంలో హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు ఒకరితో ఒకరు పోరాడుతూ చనిపోరు. ఇక్కడ వారు సామరస్యాన్ని సాధిస్తారు. ఆ సామరస్యం హిందుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ అది ప్రత్యేకంగా హిందూ (భావన) అవుతుంది. అతని అవయవాలు విదేశీవి కావచ్చు, కాని ప్రాణంలో, ఆత్మలో భారతీయత ఉంటుంది.
మనం భారతదేశ సృష్టికర్త, నిర్దిష్ట ఆదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే సంకోచం దూరమవుతుంది. లక్ష్యం స్థిరమవుతుంది. భారతదేశంలో విరాజిల్లుతున్న మృత్యువులేని అమరశక్తితో మనం అనుసంధాన మవుతాం. యూరోపియన్ జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు విద్యార్థులుగా స్వీకరించవలసిన అవసరం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. జ్ఞాన విజ్ఞానాలకు చెందిన అన్ని విభాగాలను సరస్వతీదేవి ఒకే శతపత్ర కమలంలో వికసింపచేస్తుంది. జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన అన్ని విభాగాలతో సమన్వయం ఏర్పడుతుంది. మన భారత శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్ చంద్రబోస్ వస్తువులను, వృక్షాలను, జంతుజాలాలను ఒకే చేతనా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బహుశా ఒకే చేతనాతత్వం వాటిలో ఉందని ఆయన నిరూపించగలిగాడేమో! ఈ ఐక్య సాధన భారతీయ ప్రతిభకు తార్కాణం. ఎవరినీ విడిచిపెట్టడానికి లేదా దూరంగా ఉంచడానికి భారతదేశం సమ్మతించదు. ఏదో ఒక రోజున అన్నింటినీ స్వీకరించి, గ్రహించి వాటి గౌరవాన్ని కాపాడుతూనే వివాదాస్పదమైన, అనేక అవాంతరాలతో సతమతమవుతున్న భువికి విరాట్‌రూపంలో ఐక్యతా మార్గాన్ని చూపిస్తుంది. ఆ విలక్షణమైన క్షణాలు ఇంకా రాక పూర్వమే అందరూ ఆమెను ఒకసారి తల్లీ అని పిలవండి. భారతమాత అందరిని తన వద్దకు పిల్చుకోవడానికి, భిన్నత్వాన్ని రూపుమాపడానికి అందరిని రక్షించేందుకు నిరంతరం సన్నద్ధంగా ఉంటుంది. ఆమె తన సత్య జ్ఞానాన్ని, ధర్మాన్ని వివిధ రూపాలతో, వివిధ సందర్భాల్లో మనందరి అంతఃకరణలో ప్రసరింపచేసింది. అంతేకాదు, మన మనసును పరాధీనమైన చీకటికాలంలో నాశనం కాకుండా రక్షించింది. తన సంతానంతో నిండిన ఈ దేశంలో తల్లిని ప్రత్యక్షంగా పొందటానికి మనం ప్రాణాన్ని పణంగా పెట్టే ప్రయత్నం చేయుదం గాక!
భారతదేశ ఆత్మను మేల్కొల్పడానికి, వ్యక్తం చేయడానికి సరైన సమయం ఆసన్నమైంది. ఈ పక్రియ భగవంతుని ప్రణాళిక, ఆశీర్వాదాలతో ప్రారంభమైంది. భారతదేశపు ఈ ఆత్మను తిరస్కరించే అంశాలను ఎంత వ్యతిరేకించినా, భారతీయ వ్యతిరేక విదేశీశక్తులు ఎంత ప్రయత్నించాలనుకున్నా, అది సాధ్యం కానంత రీతిలో భారత ప్రజల సంకల్పం నేడు కనిపిస్తోంది. భారతదేశ జాతీయతను మేల్కొల్పే కార్యాన్ని దశాబ్దాలుగా కీర్తిప్రతిష్టలకు దూరంగా ఉంటూ, తరతరాలుగా పని చేస్తున్న వారిని ‘విశ్వ సంక్షేమం ఆకాంక్షించే మౌన పూజారులు’గా వర్ణించారు. విశ్వసంక్షేమం కోసం సాధన చేస్తున్న పూజారుల తపస్సు, కృషి తప్పకుండా విజయవంతం అవుతాయి. భారతదేశ ‘స్వీయతత్వాన్ని’ శక్తితో, గౌరవంతో పునరుద్ధరించే ఈ చారిత్రాత్మక సమయంలో, భారతదేశ ప్రజలందరూ తమ రాజకీయాలను, ఇతర స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ఐక్యతను ప్రదర్శించాలి. స్వాభిమాన పూర్వకమైన ‘ఆత్మనిర్భర భారత్’ను నిర్మించే ఈ యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని దేశం మనందరినీ కోరుతోంది.
– డా. మన్మోహన్ వైద్య: ఆర్‌ఎస్‌ఎస్, సహ సర్ కార్యవాహ