అమెరికా, చైనా బంధం గాలిబుడగను తలపిస్తుంది. ఒక్కసారిగా పేలింది. నిజానికి చైనాను రాజకీయ, దౌత్య సమ ఉజ్జీగా కంటే, తన వాణిజ్య వ్యాప్తికి ఉపకరించే మార్కెట్‌గానే పరిగణించినట్టు కనిపిస్తుంది.

1 అక్టోబర్‌ 1949: ‌చైనా ఆవిర్భావం

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో జెడాంగ్‌ ‌పెకింగ్‌ (‌బీజింగ్‌)‌లో చైనా రిపబ్లిక్‌ను స్థాపించారు. చాంగ్‌ ‌కై షేక్‌ ‌నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వాన్ని ఓడించిన తరువాతి పరిణామమిది. ఆపై చాంగ్‌ ‌కై షేక్‌, ‌వేలాది సైనికులు తైవాన్‌ ‌పారిపోయారు. అక్కడ నుంచే ఆయన ప్రవాస ప్రభుత్వం నడిపించారు. రాజధాని తైపీ. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ‌మీద దాడి చేసినందుకు అమెరికా ఈ ప్రవాస జాతీయ ప్రభుత్వాన్ని సమర్థించింది. దీనితో ప్రధాన చైనా (రిపబ్లిక్‌)‌తో సంబంధాలు నామమాత్రంగానే ఉండేవి.

జూన్‌, 1950: ‌కొరియా యుద్ధం

జూన్‌ 25‌న ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద సైనిక దాడికి దిగింది. ఉత్తర కొరియాకు సోవియెట్‌ ‌రష్యా మద్దతు ఉంది. వెంటనే అమెరికా దక్షిణ కొరియాకు మద్దతుగా వెళ్లింది. సోవియెట్‌లతో అప్పుడు రాసుకుపూసుకు తిరుగుతున్న చైనా కూడా కమ్యూనిస్టు ఉత్తర కొరియాకు మద్దతునిచ్చింది. తన దేశ సరిహద్దుల వరకు వచ్చిన దక్షిణ కొరియా, అమెరికా, ఐక్యరాజ్య సమితి సేనలను చైనా నిలువరించింది. 1953 వరకు జరిగిన ఆ యుద్ధంలో నలభయ్‌ ‌లక్షల మంది చనిపోయారు. తరువాత ఐక్య రాజ్యసమితి, చైనా, ఉత్తర కొరియా శాంతి ఒప్పందం చేసుకున్నాయి.

ఆగస్ట్ 1954: ‌తైవాన్‌ ‌జలసంధి వివాదాలు

తైవాన్‌ ‌మీద విధించిన నౌకా దిగ్బంధనాన్ని అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ ఐసెహోవర్‌ 1953‌లో ఎత్తివేశారు. దీనితో చాంగ్‌ ‌కై షేక్‌ ‌తైవాన్‌ ‌జలసంధి దగ్గర కుమొయి, మత్సు దీవులలో తన సైన్యాన్ని మోహరించారు. 1954లో జరిగిన ఈ ఘటననే తైవాన్‌ ‌జలసంధి తొలి వివాదం అంటారు. చైనా లిబరేషన్‌ ఆర్మీ ఆ దీవుల మీద బాంబులు కురిపించింది. అప్పుడే అమెరికా, తైవాన్‌ ‌పరస్పర రక్షణ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 1955లో అణుబాంబుతో దాడి చేయగలమని అమెరికా చైనాను బెదిరించింది. దాచెన్‌ అనే దీవికి సంబంధించి జాతీయ ప్రభుత్వం మీద చిన్న విజయం సాధించిన తరువాత అమెరికాతో సంప్రదింపులకు చైనా అంగీకరించింది. 1956, 1996లలో కూడా ఈ వివాదం తలెత్తింది.

మార్చి, 1959: టిబెట్‌ ‌తిరుగుబాట్లు

టిబెట్‌ ‌మీద చైనా ఆధిపత్యం సాధించిన తొమ్మిదేళ్ల తరువాత లాసాలో తిరుగుబాట్లు ఆరంభమయ్యాయి. చైనా సైనికుల చేతిలో వేలాది మంది చనిపోయారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత్‌లో తలదాచుకున్నారు. టిబెట్‌లో చైనా చేసిన మానవ హక్కుల ఉల్లంఘనను ఐక్య రాజ్యసమితితో కలసి అమెరికా ఖండించింది. నిజానికి టిబెట్‌ ‌తిరుగుబాట్ల ఆరంభంలో (1950) సెంట్రల్‌ ఇం‌టెలిజన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఉద్యమకారులకు మద్దతు ఇచ్చింది.

అక్టోబర్‌ 1964: ‌చైనా మొదటి అణు పరీక్ష

అక్టోబర్‌ 1964‌లోనే చైనా తొలిసారి అణుపరీక్ష జరిపి, అణుశక్తి రాజ్యాల కూటమిలో సభ్యురాలైంది. వియత్నాం వివాదంలో అమెరికా, చైనా మధ్య వైరుధ్యాలు వేడెక్కుతున్న తరుణంలో చైనా అణు పరీక్ష నిర్వహించింది. అదే సమయంలో వియత్నాం సరిహద్దులలో చైనా తన సైనిక బలగాలను మోహరించింది.

మార్చి 1969: చైనా-సోవియెట్‌ ‌రష్యా వివాదం

భద్రతాంశాలు, సిద్ధాంతం, అభివృద్ధి నమూనాలో వచ్చిన విభేదాలతో చైనా, సోవియెట్‌ ‌రష్యా సంబంధాలలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినాయి. పారిశ్రామికీకరణ విషయంలో చైనా ప్రవేశపెట్టిన గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్ ‌విధానం చూసిన తరువాత సోవియెట్‌ ‌రష్యా 1960లో తను పంపిన సలహాదారులను వెనక్కి పిలిపించింది. సోవియెట్‌ ‌రష్యా విధానంలో ఎంత మార్పు వచ్చిదంటే- అప్పటిదాకా తనకు అతి పెద్ద బెడద అమెరికాయే అనుకున్నప్పటికీ, అప్పుడు మాత్రం ఆ బెడద అమెరికా కాదు, చైనాయే అని నిర్ధారణకు వచ్చింది. అప్పుడే చైనా కూడా అమెరికా వైపు మొగ్గడం రష్యా వేగంగా నిర్ణయం తీసుకునేటట్టు చేసింది.

ఏప్రిల్‌ 1971: ‌పింగ్‌పాంగ్‌ ‌దౌత్యం

అమెరికాతో చైనా బంధం బలపడిన సంవత్సరం ఇదే. చైనా పింగ్‌పాంగ్‌ ‌క్రీడాబృందం తమ దేశానికి రావలసిందిగా ఏప్రిల్‌ 6‌న అమెరికా పింగ్‌పాంగ్‌ ‌క్రీడాకారుల బృందాన్ని ఆహ్వానించింది. అమెరికా క్రీడాకారుల బృందం వెంట జర్నలిస్టులు కూడా వెళ్లారు. 1949 నుంచి అంతవరకు చైనా అమెరికా జర్నలిస్టులను అనుమతించలేదు. అదే సంవత్సరం జులైలో అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ ఎ కిసింజర్‌ ‌చైనాలో రహస్యంగా పర్యటించారు. ఇది జరిగిన కొద్దికాలానికే పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనాను అమెరికా గుర్తించింది. భద్రతామండలిలో 1945 నుంచి చాంగ్‌ ‌కై షేక్‌ ‌నాయకత్వంలోని తైవాన్‌కు కేటాయించిన స్థానాన్ని చైనాకు బదలాయించారు.

రిచర్డ్ ‌నిక్సన్‌

ఫిబ్రవరి, 1972: రిచర్డ్ ‌నిక్సన్‌ అమెరికా పర్యటన

ఫిబ్రవరి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ‌నిక్సన్‌ ఎనిమిది రోజులు చైనాలో పర్యటించారు. అప్పుడే చైర్మన్‌ ‌మావో, ప్రధాని చౌఎన్‌లైతో షాంఘై కమ్యునిక్‌ ‌మీద సంతకాలు చేశారు. తైవాన్‌కు సంబంధించిన అంశాలు చర్చించడం ఈ కమ్యునిక్‌లో భాగమే.

ఒకే చైనా విధానం

చైనాకు పూర్తి స్థాయి దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చిన వారు జిమ్మి కార్టర్‌. ‌దీనితో తైవాన్‌తో నిమిత్తం లేకుండా ఒకే చైనా అనే విధానం అమలులోకి వస్తుంది. దీని తరువాతే డెంగ్‌ ‌జియావో పింగ్‌ (‌నాటి ఉపప్రధాని) అమెరికాలో పర్యటించారు. అమెరికాలో ఆర్థిక సంస్కరణలకు ఇతడే ఆద్యుడు. ఫలితం, అమెరికా-తైవాన్‌ ‌సంబంధాలు కేవలం లాంఛనప్రాయంగా మారాయి. అయినా తైవాన్‌ ‌సంబంధాల చట్టానికి కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. అంటే వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు తైవాన్‌లో కూడా సాగుతాయి. ఒకే చైనా విధానానికి భంగం లేకుండా తైవాన్‌కు అమెరికా ఆయుధాలు కూడా ఇస్తుంది.

జూలై 1982: రీగన్‌ ‌పాలన, చైనా

తైవాన్‌కు రొనాల్డ్ ‌రీగన్‌ ‌ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చింది. అందులో తైవాన్‌ ‌సంబంధాల చట్టాన్ని గౌరవించడం కూడా ఒకటి. చైనా, తైవాన్‌ ‌మధ్య అమెరికా మధ్యవర్తిత్వం నిర్వహించబోదని కూడా హామీ ఇచ్చారు. ఇంకొకటి, తైవాన్‌కు ఆయుధాలు అమ్మకం ఎప్పుడు ఆపివేస్తారో కాల నిర్ణయం చేయకపోవడం. 1982 ఆగస్టులో చైనా, అమెరికా మూడో కమ్యునిక్‌ ‌మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడమే. అటు తైవాన్‌కు వరాలు ఇస్తూనే ఇటు ఒకే చైనా విధానాన్ని కూడా అమెరికా గౌరవిస్తుందని చెప్పారు. రీగన్‌ ‌తన ఎన్నికల ప్రచారంలో తైవాన్‌తో బంధం పటిష్టం చేస్తామని నోటి మాటగా చెప్పారు. కానీ ఆయన ప్రభుత్వం మాత్రం చైనాతో బంధాలను బలపరుచుకునేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకు కారణం సోవియెట్‌ ‌రష్యా విస్తరణ విధానం. 1984లో రీగన్‌ ‌చైనాలో పర్యటించారు. అమెరికా వద్ద సైనిక వ్యవస్థకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయడానికి అనుమతి వచ్చింది.

సైనిక ట్యాంకులను ఎదుర్కొంటున్న ఒంటరి నిరసనకారుడు టియానన్మెన్ స్క్వేర్లోని

జూన్‌, 1989: ‌తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌ ఊచకోత

చైనాలో ప్రజాస్వామిక సంస్కరణలు తేవాలనీ, అవినీతిని నిర్మూలించాలన్న డిమాండ్లతో ఆ సంవత్సరం వసంతంలో విద్యార్థులు ఉద్యమించారు. ఆ ఉద్యమానికి కేంద్రంగా మారినదే తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌. ఆ ‌స్క్వేర్‌ ‌నుంచి విద్యార్థులను చెదరగొట్ట డానికి జూన్‌ 3‌న సైన్యాన్ని పంపించడం విశేషం. వందలమంది ఆందోళనకారులు చనిపోయారు. దీనితో అమెరికా చైనాకు సైనిక వ్యవస్థ సంస్థ అమ్మకాలను నిలిపివేసింది. దౌత్య సంబంధాలను కూడా నిలిపివేసింది.

మార్చి 1996: తైవాన్‌లో తొలిసారి స్వేచ్ఛగా జరిగిన అధ్యక్ష ఎన్నిక

ఆ సంవత్సరం తైవాన్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో నేషలిస్ట్ ‌పార్టీకి చెందిన లీ ఫెంగ్‌ ‌హుయి భారీ ఆధిక్యంతో గెలిచారు. అప్పుడు చైనా చేసిన క్షిపణి ప్రయోగాలు కూడా తైవాన్‌ ‌ప్రజల నిర్ణయాన్ని మార్చలేదు. చైనా నుంచి తైవాన్‌కు స్వాతంత్య్రం కోరే పార్టీ అభ్యర్థి హుయి.

నాటో క్షిపణులచే కొట్టిన తరువాత బెల్గ్రేడ్‌లోని చైనా రాయబార కార్యాలయం

మే 1999: బెల్‌‌గ్రేడ్‌లో చైనా దౌత్య కార్యాలయం మీద బాంబులు

మే నెల 1999లో సెర్బియా సేనలు కొసావోను స్వాధీనం చేసుకున్నప్పుడు జరిగిన ఒక సంఘటన అమెరికా, చైనా సంబంధాలలో కొద్దిపాటి ఎగుడుదిగుళ్లను సృష్టించింది. బెల్‌‌గ్రేడ్‌లోని చైనా దౌత్య కార్యాలయం మీద నాటో సైన్యాలు పొరపాటున బాంబులు కురిపించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అమెరికా సైనికుల చర్యకు నిరసనగా చైనాలో వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా ఆస్తులు ధ్వంసం చేశారు.

అక్టోబర్‌ 2000: ‌సాధారణ స్థితికి వాణిజ్య బంధం

అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ అమెరికా చైనా సంబంధాల చట్టం 2000 మీద సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాతో చైనా శాశ్వత వాణిజ్య బంధం కలిగి ఉంటుంది. 2001లో వరల్డ్ ‌ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో స్థానం ఇచ్చారు. 1980-2004 మధ్య చైనా, అమెరికా వాణిజ్యం ఐదు బిలియన్‌ ‌డాలర్ల నుంచి 231 బిలిన్‌ ‌డాలర్లకు పెరిగింది.

సెప్టెంబర్‌ 2005: ‌ప్రపంచ శక్తిగా గుర్తింపు

చైనాతో వ్యూహాత్మక చర్చలు ప్రారంభిస్తామని అమెరికా విదేశ వ్యవహారాల సహాయమంత్రి రాబర్ట్ ‌జోయిలిక్‌ ఒక ఉపన్యాసంలో వెల్లడించారు. బాధ్యతాయుతమైన భాగస్వామిగా, అవతరిస్తున్న ప్రపంచ శక్తిగా చైనాను గుర్తిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మార్చి 2007: సైనిక వ్యయం పెంచిన చైనా

2007 నాటి బడ్జెట్‌ ‌కేటాయింపులలో రక్షణకు 18 శాతం అదనంగా కేటాయిస్తున్నట్టు చైనా వెల్లడించింది. పెంచిన వ్యయం ప్రకారం రక్షణ వ్యయం 45 బిలియన్‌ ‌డాలర్ల కంటే ఎక్కువ. అప్పటి వరకు అంటే 1990 నుంచి 2005 వరకు 15 శాతం వంతున కేటాయింపులు పెంచుకుంటూ వచ్చింది. ఈ వ్యయం అతిగా ఏమీ లేదని నాటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ ‌షెని వ్యాఖ్యానించారు.

షాంఘైలోని లోతైన నీటి ఓడరేవు

ఆగస్ట్ 2010:  ‌ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా

జపాన్‌ను వెనక్కి నెట్టి చైనా ఆ స్థానం ఆక్రమించింది. 2027కు అమెరికాను అధిగమించి ప్రథమ స్థానం ఆక్రమించే దిశగా ప్రయాణం ఆరంభించింది. గోల్డ్ ‌మన్‌ ‌సాచ్‌ ‌సంస్థలో ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ ‌నీల్‌ ఈ అం‌చనా వేశారు. 2010 సంవత్సరంలో చైనా స్థూల జాతీయోత్పత్తి 5.88 ట్రిలియన్‌ ‌డాలర్లు. ఈ సంగతి 2011లో చైనాయే నివేదించింది. అదే సంవత్సరం జపాన్‌ ‌జీడీపీ 5.47 ట్రిలియన్‌ ‌డాలర్లు.

నవంబర్‌ 2011: ‘ఆసియాకు కీలకం అమెరికాయే’

ఈ మాట నాటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ‌రాసిన విదేశాంగ విధానం అనే వ్యాసంలో పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్‌ ‌ప్రాంతంలో అమెరికా పెట్టుబడులు, దౌత్య సంబంధాలు, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు పెంచాలన్న బిల్‌ ‌క్లింటన్‌ ‌పిలుపును ఆమె అందులో పేర్కొన్నారు. నిజానికి చైనా ఎదుగుదలకు కళ్లెం వేసే ఉద్దేశం ఇందులో ఉన్నదన్న అనుమానం చైనాకు కలిగింది.

మే 30, 2015: దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా హెచ్చరిక

ఆసియా భద్రత గురించి జరిగిన 14వ షాంఘ్రి లా చర్చా వేదిక మీద నుంచి అమెరికా ఒక ప్రకటన చేసింది. దక్షిణ చైనా సముద్రంలో తన వివాదాస్పద ఆధిపత్య ప్రకటన విధానానికి చైనా స్వస్తి పలకాలని అమెరికా రక్షణ మంత్రి అష్టన్‌ ‌కార్టర్‌ ‌పిలుపునిచ్చారు. అక్కడ మరింత సైనికీకరణ వల్ల వివాదాలు పెరుగుతాయని కూడా అన్నారు. ఆ ప్రాంతంలో కృత్రిమ దీవులను నిర్మించి, అవి పౌర అవసరాల కోసమని చెబుతున్నా, నిజానికి అక్కడ సైనిక పాటవాన్ని చేరుస్తున్నదని కార్టర్‌ ‌చెప్పారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు.

చైనీస్ యువాన్ నాణేలు, నోట్లు

22 మార్చి, 2018: చైనా దిగుమతుల మీద సుంకం విధించిన ట్రంప్‌

‌చైనా దిగుమతుల మీద సుంకాలు విధిస్తున్నట్టు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రభుత్వం ప్రకటిచింది. దాదాపు 50 బిలియన్‌ ‌డాలర్ల మేర సుంకాలు విధించారు. అమెరికా మేధో సంపదను, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరించిన ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్‌ ‌వివరించారు. తరువాత అమెరికా దిగుమతుల మీద కూడా చైనా సుంకాలు విధించింది.

6 జూలై, 2018: ఊపందుకున్న వాణిజ్య యుద్ధం

చైనా నుంచి దిగుమతి అయిన 34 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా తాజాగా సుంకాలు విధించింది. ట్రంప్‌ ‌మీద చైనా విమర్శలు ప్రారంభించింది. ఈ చర్య అంతర్జాతీయ మార్కెట్‌ ‌మీద ప్రభావం చూపుతుందని, ఇది వాణిజ్యపరమైన గద్దింపు అని వ్యాఖ్యానించింది.

4 అక్టోబర్‌ 2018: ‌చైనాతో మరింత కఠిన వైఖరి

ఆర్థిక దురాక్రమణను తాము సుంకాల విధింపు ద్వారా నిరోధిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ ‌పెన్స్ ‌వ్యాఖ్యానించారు. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని కూడా ఆయన విమర్శించారు. చైనాలో మైనారిటీల అణచివేత, భావ ప్రకటనా స్వేచ్ఛకు అవరోధాలు ఎక్కువయ్యాయని, అమెరికా మేధో సంపదను ఆ దేశం దొంగించిందని ఆరోపించారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కలగచేసుకోవాలని చూసిందని చెప్పారు. వీటిని యథాప్రకారం చైనా ఖండించింది.

మే, 2019: తీవ్రమైన వాణిజ్య సమరం

చైనా నుంచి దిగుమతి అయిన 200 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వస్తువులపై ట్రంప్‌ ‌ప్రభుత్వం సుంకాలు పెంచింది. అంతవరకు విధిస్తున్న సుంకాలకు అదనంగా 10 నుంచి 25 శాతం జోడించింది. అదే విధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 60 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వస్తువులపై తాము కూడా సుంకాలు పెంచబోతున్నట్టు చైనా ప్రకటించింది.

27 నవంబర్‌ 2019: ‌హాంకాంగ్‌ ఆం‌దోళనకు సమర్థన

హాంకాంగ్‌ అల్లర్లను అణచివేయడానికి చైనా నానా తంటాలు పడుతున్నది. ఇలాంటి సమయంలో అక్కడి ఆందోళనకారులకు మద్దతు పలుకుతూ ట్రంప్‌ ‌బిల్లుపై సంతకం చేశారు. ఇదే హాంకాంగ్‌ ‌మానవహక్కుల ప్రజాస్వామిక చట్టం. దీనికి కాంగ్రెస్‌లో కూడా తిరుగులేని ఆధిక్యం లభించింది.

15 జనవరి 2020: కొంత ఊరట

చైనా ఉప ప్రధాని లివు హె, ట్రంప్‌ ‌వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు చేశారు. దీని వల్ల అమెరికా విధించిన కొన్ని సుంకాలను తగ్గించారు. అలాగే 200 బిలియన్‌ ‌డాలర్ల విలువ చేసే అమెరికా వస్తువులు(ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవి) కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది.

31 జనవరి 2020: కరోనా రేపిన కక్ష

ఇటీవల చైనాకు వెళ్లిన అమెరికాయేతరులను తిరిగి దేశంలోకి అనుమతించబోమని అమెరికా ప్రకటించింది. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ ఊహాన్‌ ‌నుంచి అమెరికాకు వచ్చిందని ట్రంప్‌ ‌పదే పదే ఆరోపించారు. అమెరికా సైనికుల వల్లనే దేశంలోకి కరోనా వచ్చిందని చైనా ఆరోపించింది.

18 మార్చి 2020: పత్రికా రచయితల బహిష్కరణ

అమెరికా వార్తాపత్రికలు న్యూయార్క్ ‌టైమ్స్, ‌వాల్‌ ‌స్ట్రీట్‌ ‌జర్నల్‌, ‌వాషింగ్టన్‌ ‌పోస్టర్లకు చెందిన పదముగ్గురు జర్నలిస్టులను బహిష్కరిస్తున్నట్టు చైనా ప్రకటించింది. వీరు చైనాలో ఉండడానికి ఇచ్చిన కాలపరిమితి ఆనాటితో ముగిసిపోతుంది. చైనాకు సంబంధించిన సమాచారాన్ని ఆ మూడు పత్రికలతో పాటు టైమ్‌, ‌వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తమ ప్రభుత్వంతో పంచుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది. ఇదొక రకమైన సెన్సార్షిప్‌. ఇం‌తకీ ఈ బహష్కరణ కూడా ప్రతీకార చర్యే. ఈ మాట చైనా విదేశ వ్యవహారాల శాఖ స్వయంగా వెల్లడించింది. అమెరికాలో 160 మంది చైనా జర్నలిస్టుల అవసరం ఉండదని, వారి సంఖ్యను వందకు కుదిస్తున్నట్టు ఈ సంవత్సరం ఆరంభంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దానికి ప్రతీకారమే మార్చి నాటి చైనా బహిష్కరణలు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE