సయోధ్యకు స్వస్తి పలికి, సంఘర్షణనే స్వాగతించాలన్న దృఢ నిశ్చయం ఆ రెండు ప్రపంచ వాణిజ్య దిగ్గజాలలో బలపడుతున్నది. పెట్టుబడిదారీ దేశమంటూ, సామ్రాజ్యవాద వ్యవస్థ అంటూ కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు అమెరికాకు శాపనార్థాలు పెట్టని రోజే ఉండదు. చైనా, అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ అబద్ధాల పుట్టలని అమెరికాతో పాటు, ప్రపంచ రాజకీయ పండితులు దానికి సమాధానమిస్తుంటారు. కానీ ఈ రెండు దేశాల మధ్య కొన్ని బిలియన్ డాలర్ల మేర వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. లేనిది ఒకరి మీద ఒకరికి విశ్వాసమే. కలిపి ఉంచుతున్నది ఒక్క వాణిజ్యమే. ఆ బంధమే ఇప్పుడు దారుణంగా బలహీనపడింది. కొవిడ్ 19 వ్యాప్తి విషయంలో చైనా ప్రపంచం ముందు బోనులో నిలబడి, ఈ ఆరోపణల నుంచి చైనీయుల దృష్టి మరల్చడానికి భారత సరిహద్దు లద్ధాఖ్‌లో రగడ సృష్టించిన నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగి డ్రాగన్ మీద దాదాపు రణభేరి మోగించింది. ఆ తరువాత అమెరికా తీసుకున్న కీలక చర్య- అక్కడి హూస్టన్ నగరంలో ఉన్న చైనా దౌత్య కార్యాలయానికి తాళం వేయమని ఆదేశించడం. ఇందుకు చైనా ప్రతీకార చర్య- చెంగ్డులోని అమెరికా దౌత్యకార్యాలయాన్ని 12 గంటలలోగా మూసివేయమని ఆదేశించడం. చైనా దౌత్య కార్యాలయం గూఢచర్యానికి పాల్పడుతున్నదని అమెరికా ఆరోపించింది. చైనా ఆరోపణ కూడా సరిగ్గా అదే.
పోటీ యందు కమ్యూనిస్టు పోటీ వేరయా అనిపిస్తుంది చైనా సరళి. ఇది అమెరికాకు తెలియని విషయం ఏమీ కాదు. నవ చైనా ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తరువాత గాని అమెరికా దానిని గుర్తించలేదు. అంతదాకా చాంగ్ కై షేక్ ప్రవాస ప్రభుత్వాన్ని, అంటే కమ్యూనిస్టు చైనా ప్రభుత్వానికి పోటీ ప్రభుత్వాన్ని అమెరికా సమర్థించింది. కొరియా యుద్ధంలో, టిబెట్ విషయంలో కూడా చైనాకు అమెరికా వ్యతిరేకమే. తియానాన్మెన్ స్క్వేర్ ఊచకోత ఫలితంగా చైనా మీద ఆంక్షలు పెట్టింది అమెరికా. ఇక అణుపరీక్షలు జరిపినందుకు అగ్రరాజ్యం అలక సరేసరి. తమ రెండు దేశాల మధ్య వాణిజ్య పోటీ పోటీతత్వానికే ఆదర్శమవుతుందని అమెరికా అంచనా. ఇదే విఫలమైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ను చైనా అధిగమించిందన్న వార్త వెలువడడంతోనే అమెరికా అప్రమత్తమైంది. కానీ ఇంతకాలం అమెరికా ఎందుకు చైనాను దువ్వింది? అప్పుడు సోవియెట్ రష్యా బలం తగ్గించాలని! ఇప్పుడు తన ఆధిపత్యానికి అడ్డు రాకూడదని! కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అనే రీతిలోనే సాగాయి.
హూస్టన్(టెక్సాస్) లోని చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయవలసిందని జూలై 22న అమెరికా ఆదేశించింది. రెండు రోజులు సమయం ఇచ్చింది. అంటే 24వ తేదీకల్లా తాళం పడాలి. సరిగ్గా 24వ తేదీనే చైనా కూడా చెంగ్డు లోని అమెరికా దౌత్యకారాలయం మూసివేయాలని అగ్రరాజ్యాన్ని ఆదేశించింది. ఇది అసాధారణ పరిణామమే. చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ ఒకవైపున, అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు మరొక వైపున దాదాపు వైరి శిబిరాల ప్రాతిపదికన మోహరించి ఉన్న సమయంలో శక్తిమంతమైన ఆ రెండు దేశాలు ఇలాంటి అడుగు వేయడం తీవ్రమైనదే. ప్రపంచం పలు చైనా యాప్‌లను బహిష్కరిస్తున్న సమయంలో ఇది జరగడం వల్ల మరింత ప్రాధాన్యం వచ్చింది. హూస్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయం గూఢచర్యానికి పాల్పడుతున్నదని అమెరికా ఆరోపణ. తమ మేధో సంపత్తిని, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వివరణ ఇచ్చింది. చిత్రం ఏమిటంటే, అమెరికా ఆదేశాలు వెల్లడైన కొద్ది సేపటికే చైనా దౌత్యకార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పలు పత్రాలను లోపలే దగ్ధం చేశారనీ, తమను, అగ్నిమాపక సిబ్బందిని కూడా అనుమతించ లేదని అమెరికా పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య కొవిడ్ 19 వ్యాక్సిన్ అధ్యయనం, పరిశోధనల గురించి రేగిన చిచ్చు ఇలాంటి అసాధారణ చర్యకు దారి తీసిందని నిపుణులు అంచనాకు వచ్చారు. ఆ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను దొంగిలించారంటూ ఇద్దరు చైనా జాతీయులపై అమెరికా న్యాయశాఖ ఆరోపణలు చేసిన రోజునే దౌత్య కార్యాలయం మూసివేతకు ఆదేశాలు వెలువడినాయి. ఈ ఇద్దరు చైనా సైన్యంలో పని చేస్తున్న సంగతి వెల్లడించకుండా, పరిశోధక విద్యార్థులుగా వచ్చారని అమెరికా ఆరోపిస్తున్నది. దీనికి ఒక్కరోజు ముందే అమెరికా విదేశాంగ మంత్రి (కార్యదర్శి) మైక్ పాంపియో, చైనా కమ్యూనిస్టు పార్టీ విషయంలో రొనాల్డ్ రీగన్, ‘నమ్ము, కానీ తనిఖీ చేసుకో’ అనే నినాదం ఇచ్చారనీ, ఇప్పుడు ‘నమ్మవద్దు, తనిఖీ మానవద్దు’ అన్ని విధానమే చైనాతో అనివార్యంగా కనిపిస్తున్నదని అన్నారు. ప్రజాస్వామిక దేశాలన్నీ ఏకం కావాలనీ, చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవహార సరళిలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవన్నీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా గురించి చేస్తున్న ప్రకటనలకు సమీపంగానే ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను మిగతా ఆర్థిక ప్రపంచం నుంచి విడగొట్టే (డికప్లింగ్) ప్రయత్నం కనిపిస్తున్నదని అమెరికా వాదన. అమెరికా భద్రత, సౌభాగ్యాలను తుడిచిపెట్టాలని చైనా కోరుకుంటున్న దని ట్రంప్ అభిప్రాయపడుతున్నారని జపాన్ టైమ్స్ వ్యాఖ్యానించింది. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు స్థానం లేకుండా చేయడానికి కూడా చైనా పని చేస్తున్నదని కూడా ట్రంప్ విశ్వసిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆ ప్రాంతంలో చైనా దూకుడు కొత్తకాదు. తన ఆధిపత్యం కోసం, వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సైనిక బలంతో ఆయా దేశాలను భయపెడుతున్నది. ఇటీవలి కాలంలో చైనా దూకుడు అమెరికాతో మాత్రమే ఉద్రిక్తతలకు దారి తీయలేదు. ఇండోనీసియా, మలేసియా, తైవాన్, ఇండియా, ఆస్ట్రేలియాలతో కూడా విభేదాలను తెచ్చుకుంది. సెంకాకు దీవుల వద్ద చైనా నౌకాదళ జోక్యం కూడా పెరిగింది. వాణిజ్యంతో సాధించిన బలిమితో మిగిలిన దేశాలు డ్రాగన్‌కు మోకరిల్లడం తప్ప మరొక మార్గం లేదన్నదే నేటి చైనా అభిప్రాయం.
చైనా ప్రధాన భూభాగంలో ఐదు అమెరికా దౌత్య కార్యాలయాలు పని చేస్తున్నాయి. అవి గుంగ్జవు, షాంఘై, షెన్యాంగ్, చెంగ్డు, ఊహాన్ నగరాలలో ఉన్నాయి. చైనా పట్టులో ఉన్న హాంకాంగ్, మకావులలో కూడా అమెరికాకు కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో చెంగ్డులోని కార్యాలయం మూసివేతకు ఆదేశం వచ్చింది. 2019లోనే చైనాతో వాణిజ్య వైరం పతాక స్థాయికి చేరింది. ప్రతీకారంలో భాగమే అయినా చెంగ్డులోని తమ దౌత్య కార్యాలయాన్నే మూసివేయమని చైనా ఆదేశించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నదన్న వాస్తవాన్ని అమెరికా గ్రహించకపోలేదు. జూలై 24కు హూస్టన్‌లోని తమ కార్యాలయం మూసివేతకు అమెరికా పెట్టిన గడువు పూర్తయ్యే సమయంలోనే చైనా చెంగ్డులోని ఆ దేశ దౌత్యకార్యాలయం మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇది చైనా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమనే అమెరికా నిర్ధారించుకుంది. నిజానికి ఊహాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయవలసిందని చైనా ఆదేశిస్తుందని అమెరికా మొదట అనుకుంది. అమెరికా దౌత్యకార్యాలయాల మూసివేత విషయంలో చైనా మరింత ముందుకు వెళ్లదలిస్తే మాత్రం హాంకాంగ్, మకావులలోని కార్యాలయాలని కూడా మూసివేయ మని ఆదేశించే అవకాశమే ఎక్కువన్న అభిప్రాయం ఉంది. మూసివేతకు చెంగ్డులోని దౌత్య కార్యాలయాన్ని ఎంచుకోవడం అమెరికాకు చెందిన వ్యూహాత్మక మౌలిక వ్యవస్థను చైనా ప్రధాన భూభాగంలో లేకుండా చేయడానికే. చెంగ్డు పశ్చిమ చైనాలో సిచువాన్ ప్రాంత రాజధాని. ఇండో-చైనా సరిహద్దు, మైన్మార్, ఆగ్నేయ చైనా ప్రాంతంలో స్వయం ప్రతిపత్తి కలిగిన టిబెట్ భూభాగం సహా, అక్కడి కొన్ని ఇతర ముఖ్య ప్రాంతాలకు సంబంధించిన దౌత్య వ్యవహారాల నిర్వహణకు అదే కేంద్రం. అంతేకాదు, సిచువాన్ అవిభక్త టిబెట్‌లో ఒక భాగం. టిబెట్ పశ్చిమ భాగమైన ఖామ్ కూడా దీనిలోనే కలసి ఉంది. చైనాకు వ్యతిరేకంగా టిబెటిన్లు చేపట్టిన అన్ని వ్యతిరేక కార్యకలాపాలకి ఈ భూభాగమే వేదిక. డ్రాగన్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఆత్మాహుతి ఘటనలు కూడా జరిగాయి. అయితే ఈ విషయంలో లాసాకు ఉన్న ఘనతను కూడా కాదనలేం. ఇప్పుడు చెప్పుకున్న ఆ టిబెట్ ప్రాంతాలకు లాసా చాలా దూరంలోనే ఉన్నది. అయినా అది కూడా చైనా వ్యతిరేక ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇంకా, భారత-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టర్ భద్రతా వ్యవహారాలను చెంగ్డు జిల్లా సైనిక యంత్రాంగమే నిర్వహిస్తుంది. ఆ విధంగా కూడా చెంగ్డు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చెంగ్డు కార్యాలయాన్ని 1985 అక్టోబర్‌లో జార్జి బుష్ ప్రారంభించారు. అప్పటి నుంచి నిఘా వివాదాలతో కీలకంగా మారింది. కాబట్టి చెంగ్డు కార్యాలయం మూసివేతకు ఆదేశించడం వల్ల అమెరికాకు టిబెట్ వ్యవహారాలపై పట్టు సడలిపోతుంది. చైనా వార్షిక వ్యవసాయోత్పత్తి ఎంతో అంచనా వేసేందుకు అవకాశాలు మూసుకుపోతాయి. అంటే చైనాకు సంబంధించిన సమాచారంతో చాలా వరకు అమెరికాకు లంకె తెగిపోతుంది.
కొవిడ్ 19 కల్లోలాన్ని విస్తరణకు సదవకాశంగా ఉపయోగించుకోవాలన్న బుద్ధి ఇప్పుడు ఇద్దరిలోనే కనిపిస్తున్నది. ఒకటి – చైనా, రెండు- ముస్లిం ఉగ్రవాదులు. కరోనా కల్లోలాన్ని కూడా దురాక్రమణకు ఉపయోగించుకోవాలన్న చైనా తత్వం వల్ల ఒక్క అమెరికాతోనే కాదు, చాలా దేశాలతో చైనా విభేదాలు రోజురోజుకు విరోధం స్థాయికి పరిణమించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)తో అమెరికా తెగతెంపులు చేసుకోవడం మరొక పరిణామం. చైనా చేతిలో ‘కీలుబొమ్మ’గా మారిన డబ్ల్యుహెచ్‌ఓకు నిధులు ఆపివేస్తున్నట్టు కూడా అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందేనని అమెరికా లెక్కలేనన్ని పర్యాయాలు ఆరోపించింది. ఇప్పటికే 23 దేశాలతో కచ్ఛితమైన విభేదాలు ఉన్న చైనాను ప్రపంచంలో ఏకాకిని చేయాలన్న వ్యూహాన్ని అమెరికా దశల వారీగానే అయినా వేగంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఇక్కడ ఒక అంశం ప్రస్తావించుకోవాలి. చైనా, అమెరికా సంబంధాలలో ఘర్షణ వాతావరణం, సర్దుబాటు తత్వం కూడా కనిపిస్తాయి. కానీ ఆ రెండు ప్రపంచ వాణిజ్య దిగ్గజాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ప్రస్తుతం కనిపిస్తున్న క్షీణతను మాత్రం మునుపెన్నడూ చూడలేదనే దౌత్య వ్యవహారాల నిపుణులు అంటున్నారు. చైనా విదేశాంగ విధానానికి స్వప్రయోజనమే ముఖ్యం. జాతీయ భావాలు, గత చరిత్ర చైనా విదేశాంగ విధానానికి ఏనాడూ చోదకశక్తులు కావు. విధానం, నినాదం ఏమైనప్పటికీ దాని అంతస్సూత్రం మాత్రం సామ్రాజ్యవాదమే. సంఘర్షణలకు దిగడం, సయోధ్యకు వెళ్లడం అందులోని వ్యూహమే కూడా. ఇందుకు 2001 నాటి ఒక ఉదంతం గురించి దౌత్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. హెయినన్ ద్వీపం దగ్గర ఉన్న అంతర్జాతీయ ఎయిర్ స్పేస్‌లో అమెరికా నౌకాదళ నిఘా విభాగ విమానం మరొక విమానాన్ని కూలగొట్టింది. అది చైనాకు చెందినది. అమెరికా బలగాలు తమ భూభాగంలోకి ప్రవేశించి ఒక పైలట్ మృతికి కారణమయ్యాయని చైనా ఆరోపించింది. చైనా తమ సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం, నష్టపరిహారంతో పాటు క్షమాపణ కోరడాన్ని అమెరికా విమర్శించడం దీనికి కొనసాగింపు. తరువాత అమెరికా విదేశాంగమంత్రి కోలిన్ పావెల్ చైనాతో మూడు దశాబ్దాల పాటు సాగిన ‘దృఢ మైత్రీబంధం’ గురించి ఉపన్యాసం ఇచ్చారు. డ్రాగన్ కూడా పాత సంబంధాలను కొనసాగించింది. భారత్ వలె సరిహద్దు బాదరబందీ ఏమీ లేకున్నా సుదూరంగా ఉన్న దేశంతో చైనాకు ఎందుకీ వివాదాలు అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే, వాణిజ్యంలో పోటీ. మానవీయ కోణం లేని పోటీ అది. ఇదంతా అలా ఉండగానే చైనాతో సంబంధాలు కొనసాగించవలసిన అవసరం గురించి ఇటీవల వరకు అమెరికా పారిశ్రామికవేత్తలు తమ ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే ఉన్నారు. చైనాలో పెట్టుబడులు అమెరికాకు ఎంత లాభదాయకమో చెబుతూనే ఉన్నారు. ‘షెమెరా’ లేదా జి2 వాదన కూడా దీనికి దగ్గరగానే ఉంది.
చైనా, అమెరికా పరస్పరం సహకరించుకోవలసిన దేశాలు. ఈ సహకారం వాణిజ్యంలో పోటీ తత్వం పెంచుతుంది. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రులకు చైనా ఇటీవలి వరకు పెద్ద పెద్ద సమస్యలు సృష్టించలేదు. అమెరికా వ్యూహాత్మక స్థానాన్ని కూడా చైనా ఏనాడూ నిలదీయలేదు. ఇవన్నీ చూసే, సంపద పెరిగే కొద్దీ చైనా సరళీకృత విధానాలకు చేరువ అవుతుందనీ, ప్రపంచ దేశాలతో సన్నిహితంగా ఉంటుందని అమెరికాలో చాలామంది నమ్మకం పెంచుకున్నారు. కానీ ఈ నమ్మకానికి హేతువు శూన్యమని అమెరికా సకాలంలో గుర్తించినట్టు కనిపిస్తున్నది. నిజానికి సరళీకరణ విధానాలతో, అంతర్జాతీయ సంబంధాలలో చైనా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదన్న అమెరికా అంచనా 1989లో తియనాన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థుల మీద డెంగ్ జియావోపింగ్ సాగించిన మారణహోమంతోనే పటాపంచలైందని చెబుతారు. కానీ, చైనా విదేశాంగ విధానానికి వెన్నెముక వంటి ఏకఛత్రాధిపత్యం, సామ్రాజ్యవాద ధోరణి వాణిజ్య సంబంధాలలో ఉండదని భావించడం చారిత్రక తప్పిదమే. అమెరికాతో వాణిజ్య బంధం ఉన్నా, చైనా అంతరంగం నిండా ఉన్నది ఏకఛత్రాధిపత్యమే. ప్రపంచ ఏకైక ఆర్థిక శక్తిగా అవతరించడమే. ఇప్పుడు చైనాలో అమెరికా దర్శిస్తున్న విశ్వరూపం సరిగ్గా ఆ ఆధిపత్య ధోరణిదే. డెంగ్ జియావోపింగ్, జియాంగ్ జమిన్, హు జింతావో ప్రభుత్వాలు విదేశాంగ విధానంలో జాతీయ భావాలకు చోటివ్వలేదు. ఇందుకు 1999 నాటి ఒక ఉదంతం సాక్ష్యం చెబుతుంది. బెల్ గ్రేడ్‌లోని చైనా దౌత్య కార్యాలయాన్ని అమెరికా విమానాలు బాంబులతో ధ్వంసం చేశాయి. యుగోస్లావియా యుద్ధం సమయంలో జరిగిన ఆ దుర్ఘటనలో ముగ్గురు చైనా దేశీయులు మరణించారు. అయినా అమెరికా సంబంధాలలో చైనా ఎలాంటి మార్పులకు ప్రయత్నించలేదు. కానీ జిన్‌పింగ్ విదేశీ సంబంధాలలో సామ్రాజ్యవాద ధోరణులను కొనసాగిస్తూనే, జాతీయ భావాలను తీసుకువచ్చే యత్నం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. చైనా ఎదుగుదలను అమెరికా అడ్డుకుంటున్నదన్న ఇటీవలి వాదన కొత్తగా వచ్చిన ఈ జాతీయ భావాల ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సుస్థిరతకు కూడా జాతీయవాదం ఉపయోగపడాలన్నది జిన్‌పింగ్ మరొక లక్ష్యమని ఆసియా పత్రికలు చెబుతున్నాయి. అటు, నాలుగేళ్లు వెనక్కి వెళితే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చైనా వ్యతిరేకత ఒక బలమైన పార్శ్వంగా ఉన్న వాస్తవం తెలుస్తుంది. దీనికి కొనసాగింపు కూడా ఉంది. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి జో బైడెన్ చైనా పట్ల మరింత ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా చైనా వ్యతిరేకత అన్నది అమెరికా విధానం. రిపబ్లికన్ పార్టీ, డెమాక్రటిక్ పార్టీ అన్న భేదం ఇక్కడ వర్తించదు. చైనా, అమెరికా ఘర్షణ ఒక సహజ దౌత్య, వాణిజ్య పరిణామం.
జిన్‌పింగ్ మీద విమర్శలు చేసినందుకు..
చైనాలో జిన్‌పింగ్ 2012లో కమ్యూనిస్టు పార్టీ అధినేత అయినప్పటి నుంచి విమర్శలని అసలు సహించడం లేదు. ఇది అక్కడి రాజకీయ సంస్కృతి. పార్టీనీ, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ల మీద అనేక ఆరోపణలు తక్షణం పుట్టుకు వస్తాయి. రెన్ జిక్వియాంగ్ ప్రభుత్వ ఆధీనంలో నడిచే రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి. కొవిడ్ 19 కట్టడిలో జిన్‌పింగ్ దారుణంగా విఫమయ్యారని ఆరోపిస్తూ రెన్ మార్చిలో ఆన్‌లైన్‌లో ఒక వ్యాసం పోస్టు చేశారు. వెంటనే అతడిని కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అతడిని అవినీతి ఆరోపణలతో విచారిస్తారట. జిన్‌పింగ్ పార్టీ అధినేత అయిన తరువాత విమర్శని పూర్తిగా తొక్కేశారు. అప్పటికే ఉన్న సెన్సార్‌షిప్‌ను మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వంతో పెట్టుకున్న ఎలాంటి సంస్థనయినా నేలమట్టం చేయించారు. కొవిడ్ 19 విషయంలో జిన్‌పింగ్, ఆయన నాయకత్వలోని చైనా ఎన్ని వాస్తవాలు దాచి పెడుతున్నదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
– జాగృతి డెస్క్