పీవీ శతజయంత్యుత్సవాల సందర్భంగా

‘మనం నిర్లక్ష్యం వహించాం. నమ్మి మోసపోయాం.’ 1962 నాటి చైనా దురాక్రమణ గురించి నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌చేసిన వ్యధాపూరిత వ్యాఖ్య ఇది. నిర్లక్ష్యం ఎవరిది? నమ్మి మోసపోయినదెవరు? ఈ రెండు ఉల్లేఖనలు ప్రథమ ప్రధాని పండిట్‌ ‌నెహ్రూకు వర్తించేవే. స్వతంత్ర భారతదేశ చరిత్ర మరచిపోలేని ఈ కఠోర వాస్తవానికి నవలారూపం ‘ది ఇన్‌సైడర్‌’. ‌బహుముఖ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకటనరసింహారావు ఆంగ్ల రచన ఇది. (తెలుగు – లోపలి మనిషి, అను- కల్లూరి భాస్కరం).

నాటి దేశ కాల పరిస్థితులలో ఏ ప్రధాని అయినా రక్షణ వ్యవస్థ గురించి అంతకుమించి ఆలోచించే అవకాశం లేదంటూనే, ఇలాంటి ధోరణి కారణంగా భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందన్న సత్యాన్ని కూడా నిలబెట్టే యత్నం ఈ రచనలో కనిపిస్తుంది. నెహ్రూను సమీపంగా పరిశీలించి, జాతీయ కాంగ్రెస్‌తో ఐదారు దశాబ్దాలు మమేకమైన పీవీ నిశిత రాజకీయ వ్యాఖ్య ఈ నవల. నెహ్రూను సమున్నత శిఖరం మీద నిలబెడుతూనే, ఆయన చేసిన తప్పిదాల గురించి కూడా చర్చించడం అవసరమని పీవీ అభిప్రాయపడ్డారు. కాబట్టే ‘లోపలిమనిషి’ వాస్తవ చరిత్రే చోదకశక్తిగా సాగిన చారిత్రక నవలగా గౌరవించుకోవచ్చు.

విమర్శకుల అంచనా ప్రకారం ‘లోపలి మనిషి’ ఆత్మకథాత్మక నవల. ఇందులో కథానాయకుడు ఆనంద్‌. ఆ ‌పాత్ర పీవీ ప్రతిబింబమన్న సంగతి నవలలోకి వెళ్లిన కొద్దిసేపటికే పాఠకుల అవగాహనకు వస్తుంది. నిజాం సంస్థానంలోని అఫ్రోజాబాద్‌ ‌దగ్గర మొదలై, ఢిల్లీ రాజకీయమే కేంద్రంగా ఇతివృత్తం సాగుతుంది. బాబూ రాజేందప్రసాద్‌, ‌నెహ్రూ, ఇందిర, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, కామరాజ్‌, ‌మొరార్జీ, గుల్జారీలాల్‌ ‌నందా, నీలం సంజీవరెడ్డి, వివి గిరి, నిజలింగప్ప వంటి వాస్తవిక పాత్రలు కొన్ని. ఆనంద్‌, అరుణ, శేఖర్‌, ‌మహేంద్రనాథ్‌, ‌చౌదరి వంటి కల్పిత పాత్రలు కొన్ని. ఇవే పాఠకుడిని గతంలోని ఆయా అపరచిత తీరాలకు తీసుకు వెళతాయి. ఆ చరిత్ర పురుషుల అంతరంగాలను దగ్గర నుంచి చూపేవి కూడా ఈ కల్పిత పాత్రలే.
నవలలో చైనా దురాక్రమణ ప్రధాన ఇతివృత్తం కాదు. రచయిత స్పృశించిన చాలా అంశాలలో చైనా దాడి ఒకటి. ఆ దురాక్రమణ, తరువాతి పర్యవసానాలు, స్వతంత్ర భారత చరిత్రలో వాటికి ఉన్న స్థానం ఈ దేశం ఎన్నటికీ విస్మరించలేదు. ఈ వ్యాసం ఉద్దేశం మాత్రం ఆ అంశాన్ని పీవీ ఎలా విశ్లేషించారో కొద్దిగా పరిచయం చేయడమే. నిజానికి ఈ నవల స్వతంత్ర భారతదేశంలోని పలు క్లిష్ట రాజకీయ, సామాజిక సంక్షోభాలను గురించి చర్చిస్తుంది. ఆదర్శాలకీ, ఆచరణకీ మధ్య అగాధాల లోతు, కొత్తగా స్వాతంత్య్రం తెచ్చుకున్న పేద దేశం బాలారిష్టాలను అధిగమించ డానికి పడిన కష్టం ఎలాంటివో చెబుతుంది. ఒక గొప్ప పురాతన సంస్కృతి కలిగిన దేశం బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తరువాత ఎందుకు తనకు వారసత్వంగా వచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి నడిచిందో, దాని ఫలితాలు ఏమిటో అంతర్లీనంగా ‘లోపలి మనిషి’ హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే- భూమి సమస్య, స్వరూపం ఏమిటి? భూస్వామిక వ్యవస్థ నుంచి వచ్చినప్పటికి, భూస్వామ్యాన్ని అనుభవిస్తూనే ప్రజాస్వామిక వ్యవస్థలో పదవులను అధిష్టించడానికి సోషలిజం నినాదం ఎలా ఉపయోగపడింది? సర్దార్‌ ‌పటేల్‌ ‌మరణం నెహ్రూను పదవీ గండం నుంచి విముక్తం చేసినా, దేశాన్ని సమస్యలలోకి నెట్టివేసిందా? కశ్మీర్‌, ‌ప్రత్యేక ప్రతిపత్తిల గురించి నాటి కాంగ్రెస్‌ ‌పార్టీ ఏమనుకుంది? అలీన విధానం, సోషలిజం నెహ్రూ చితాభస్మంతోనే గంగలో కలిసిపోయాయా? అహింస, లౌకికవాదాలను పండిట్‌ ‌నెహ్రూ, ఆయన పార్టీ స్వీకరించిన తీరు ఎలాంటిది? నెహ్రూ వారసునిగా లాల్‌ ‌బహదూర్‌నే ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ ‌సిండికేట్‌ ఉద్దేశం ఏమిటి? నెహ్రూ ఆశయాలను ఇందిరాగాంధీ గౌరవించారని చెప్పగలమా? కామరాజ్‌ ‌నాడార్‌ ‌పథకం ఎందుకు? నక్సలిజం ఎందుకు తలెత్తింది? 1969 నాటి అంతరాత్మ ప్రబోధానికీ, 1971 నాటి ఇండో-పాక్‌ ‌యుద్ధానికీ సంబంధం ఉందా? ఇలా – రాజకీయ, చారిత్రక స్పర్శ ఉన్న సమస్యలను ఘట్టాలుగా మలచి, వాటి ప్రత్యక్షసాక్షి పీవీ ఈ నవలలో వాటిని నిక్షిప్తం చేశారు. గొప్ప ప్రజాస్వామ్యవాదిగా చరిత్ర పుటలలో కనిపించే నెహ్రూ కాలంలోనే కాదు, ఆయన కుమార్తె ఇందిర హయాంలో కూడా ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక ఎంత దిగజారిందో పీవీ చెప్పారు. ముఖ్యమంత్రులను ఇష్టానుసారం మార్చే ఇందిర రాజకీయ సంస్కృతి పట్ల పీవీ అంతరంగం ఈ నవలలో అవగాహనకు వస్తుంది. ప్రతి అంశాన్ని వస్త్యాశ్రయ దృష్టితోనే పీవీ చర్చించారు. చరిత్రకీ, చరిత్రకు నీడ వంటి సృజన సాహిత్యానికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఇందులో కనిపిస్తుంది. చరిత్ర నిర్మాణంలో మేధోశక్తి కీలకం. చరిత్రకు ఛాయ వంటి సృజనాత్మక సాహిత్యం హృదయగతమైనది.

కానీ ఒక పరిణామం మీద ప్రజల స్పందన ఏమిటో చరిత్ర నిర్మాణానికి ప్రధానం కాదు. ఒక విశ్లేషకుడు, వ్యాసకర్త కూడా వీటిని స్వీకరించలేరు. వారి పరిమితులు వారివి. దేశం యుద్ధంలో ఓడిపోయిందన్న చేదు వాస్తవానికి జాతి ఎలా ప్రతిస్పందించింది? సామాన్య గ్రామీణుడు, పాఠశాల విద్యార్థి మీద ఆ వాస్తవం ఎలా ప్రతిబింబించిందో కూడా వారికి అనవసరం. సైనిక పాటవం, వైఫల్యాలు, మరణాలు, పద్దులు, గణాంకాలు వంటివి వారు ఇస్తారు.

కానీ సాహిత్యం జాతి ఆత్మ స్పందనలను ఆవిష్కరిస్తుంది. చైనా దురాక్రమణ వరకు నాయకత్వ పాత్రతో పాటు, యుద్ధం, తరువాతి పర్యవసానాల మీద సామాన్యుడి స్పందనల గురించి ఒక సజీవ చిత్రం అందించేందుకు యత్నించి, పీవీ సఫలమయ్యారు. ప్రభుత్వాధినేతకు వాస్తవికత బోధపడి, తత్వం తెలియాలంటే యుద్ధం జరగాలా? యుద్ధం తోనే జాతి గాడిన పడుతుందన్న భ్రాంతి ప్రమాదకరం కాదా? ఇలాంటి ప్రశ్నలను సంధించడానికి పాఠకుడి మేధస్సును సంసిద్ధం చేస్తారు పీవీ. ఇలాంటి సందర్భంలో ఆయన అటు సృజనకారుడి పాత్రనీ, చరిత్రకారుడి పాత్రనీ సమంగా నిర్వహించడం కనిపిస్తుంది.

‘‘1950 ప్రారంభం నుంచే నెహ్రూ చైనా నుంచి ముప్పును ఊహించారనడానికి ఇప్పుడు కావలసినన్ని సాక్ష్యాలున్నాయి’ (లోపలి మనిషి, పే 344) అంటారు పీవీ. ఆ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌వ్యాఖ్యను పీవీ సమర్ధించారనే అనిపిస్తుంది. అప్పటి నుంచి 1962 వరకు కూడా చైనా బెడద పట్ల నెహ్రూ ఎంత అవాస్తవిక ధోరణి అవలంబించారో పీవీ చెప్పారు. భారత్‌-‌చైనా సరిహద్దులు ఉద్రిక్తంగా మారడమనేది 1959లోనే ఆరంభమైంది. ఒక అంతర్జాతీయ సమస్య జాతీయస్థాయి చర్చనీయాంశంగా మారడం అదేనంటారు పీవీ. ప్రజలకు మాత్రం నెహ్రూ మీద అపార నమ్మకం. అంతర్జాతీయ వ్యవహారాలలో విశేష ప్రావీణ్యం ఉన్న, శాంతిదూతగా ఖ్యాతి గడించిన నెహ్రూ ఈ సమస్యను ఏదో విధంగా చక్కబెడతారు. 1950 ప్రాంతంలోనే, అంటే తన అంత్యకాలంలోనే సర్దార్‌ ‌పటేల్‌ ‘‌చైనా నుంచి ఎదురుకాగల ముప్పు’ను స్వయంగా నెహ్రూ దృష్టికి తీసుకు వచ్చారు. పటేల్‌ ‌దృష్టిలో చైనా విశ్వసించ దగిన పొరుగు కాదు. చైనాతో అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించు కోమని, కొత్త పరిస్థితులను ఎదుర్కొనడానికి చర్యలు వెంటనే తీసుకోవడం అవసరమని, ఆ చర్యలు ఇలా ఉంటే మంచిదని కూడా పటేల్‌ ‌లిఖితపూర్వకంగా నెహ్రూ దృష్టికి తీసుకు వెళ్లారు. 562 సంస్థానాలను విలీనం చేసిన విలువైన అనుభవం ఆయనది. 48 శాతం భూభాగంలో ఉన్న సంస్థానాలను దారికి తెచ్చి భవిష్యత్‌ ‌భారతాన్ని మహా సంఘర్షణ నుంచి తప్పించిన దూరదృష్టి ఆయన సొంతం. ఈ లక్షణాలే పటేల్‌ ‌చేత చాలా విషయాలు చెప్పించాయి. దేశ సమగ్రత, రక్షణల విషయంలో భ్రమలు పనికిరావన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ లేఖలో, ‘కొన్ని శతాబ్దాల తరువాత పప్రథమంగా భారతదేశం, భారత రక్షణవ్యవస్థ ఒకేసారి రెండు రంగాలపై దృష్టిని కేంద్రీకరించవలసి వచ్చింది. మన రక్షణ చర్యలు ఇంతవరకూ పాకిస్తాన్‌ ‌పై ఆధిక్యానికి సంబంధించిన అంచనా పైనే ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పటి మన అంచనాను అనుసరించి ఉత్తర, ఈశాన్యాలలో కమ్యూనిస్టు చైనాను… నిర్దిష్టమైన ఆకాంక్షలు, లక్ష్యాలు ఉన్న కమ్యూనిస్టు చైనాను… కూడా దృష్టిలో ఉంచుకోవలసిందే. అవి మన పట్ల మిత్రత్వాన్ని సూచిస్తున్నవిగా కనిపించడం లేదు. కనుక, నా అంచనా ప్రకారం ఏ మాత్రం అజాగ్రత్తగానూ, ఊగిసలాట ధోరణితోనూ వ్యవహరించకూడని పరిస్థితి ఇది. మనం సాధించవలసినదేమిటో, అందుకు అనుసరించ వలసిన పద్దతులేమిటో స్పష్టమైన ఆలోచన ఉండాలి. మన లక్ష్యాల కల్పనలో, వాటిని సాధించడానికి ఉద్దేశించిన మన విధానాల అనుసరణలో తడబాటు కానీ, అనిశ్చిత ధోరణి కానీ మనల్ని బలహీనపరిచి ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ముప్పును మరింత పెంచుతాయి’ (లోపలి మనిషి, పే 333) అంటూ పటేల్‌ ఒక స్పష్టమైన చిత్రాన్నే నెహ్రూ ముందు ఉంచారు. ఎంతో తెలివైన భూమిపుత్రుడు, వాస్తవికవాదీ అయిన తన రాజకీయ ప్రత్యర్థి చైనా గురించి చెప్పిన మహోన్నత సత్యం నెహ్రూ బుర్రకు ఎక్కలేదని చెప్పలేం. 1952లో పెకింగ్‌ (‌బీజింగ్‌) ‌వెళ్లి ఒక సభలో ప్రసంగించా రాయన. ‘ఏదో ఒక రోజు ఈ రెండు ఆసియా మహాకాయాలూ ఒకదానితో ఒకటి ఘర్షణకు దిగుతాయి. అది ఆసియాకే మహోత్పాతంగా పరిణమిస్తుంది. ఆ పరిణామాన్ని నివారించడానికి మనమంతా శాయశక్తులా ప్రయత్నించాలి.’ కానీ ఈ వాస్తవికత తరువాత ఏమైంది?

కాబట్టి పటేల్‌ అం‌తరంగాన్ని అర్థం చేసుకున్నా, తన కలల ప్రపంచం మీదనే నెహ్రూ ఎక్కువ విహరించారు. భారతదేశం మీద ఏ దేశమూ దాడి చేయదని ప్రథమ ప్రధాని కలల ప్రపంచం ఘోషించేది. అందుకే చైనా దాడితో ఆయన అంతగా కదలిపోయారు. అప్పుడు గాని ఆయన కలల ప్రపంచం నుంచి ఆయన బయటపడలేదు. తన ఆశయం, తన అంతర్జాతీయ శాంతి కల తన కళ్ల ముందే భగ్నమయ్యాయి. నిజం చెప్పాలంటే అవి ఆయనను వెక్కిరించాయని పిస్తుంది. ఆగస్టు 11, 1950న పార్లమెంటులో నెహ్రూ చేసిన ప్రకటనలోని అవాస్తవికత, అసంబద్ధత ఎంతో ఆయన జీవితకాలంలోనే వెల్లడైన సంగతి గుర్తించాలి. భారత్‌ ‌మీద సైనిక దాడి జరగదని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌, ‌చైనాల సంగతి అంతో ఇంతో తెలిసి కూడా నెహ్రూ ఇలాంటి అభిప్రాయానికి ఎలా వచ్చారో, దానికి ప్రాతిపదిక ఏదో ఎవరికీ అర్ధం కాలేదు. ‘ఏమైనా కానీ భారతదేశం మీద దాడి జరిగే ప్రశ్నే లేదు. ఒకవేళ యుద్ధమే వస్తే మనం దాడికి తలవంచి కూర్చుంటా మనుకుంటున్నారా? కచ్చితంగా కాదు’ (లోపలి మనిషి, పే 335) అన్నారు. మళ్లీ, పాకిస్తాన్‌తో యుద్ధాన్ని తానే తోసిపుచ్చిన సంగతిని నెహ్రూయే అదే ఉపన్యాసంలో అంగీకరించారు. పాక్‌, ‌భారత్‌ ‌సంబంధాలు మెరుగు పడాలనే యుద్ధాన్ని నిరాకరించారట. చారిత్రక వాస్తవాలను, ప్రత్యక్ష అనుభవాలను కాకుండా, తన కలల ప్రపంచంలోని అస్పష్ట నినాదాలను వినడానికే నెహ్రూ ఎక్కువ ఇష్టపడ్డారని అనిపిస్తుంది. 1959 నుంచి సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ చైనా తొందరపడదనే ఆయన నమ్మారు.

కానీ అక్టోబర్‌ 20, 1962‌న ఈశాన్య సరిహద్దు (నేఫా) విభాగంలోని కమెంగ్‌ ‌సరిహద్దు డివిజన్‌కు చెందిన నాన్కాచు రంగానికి రక్షణగా ఉన్న భారతీయ సేన మీద ‘ఆ ఆసియా దిగ్గజం’ దాడికి దిగింది. 160 మైళ్ల లోపలకు, అంటే బ్రహ్మపుత్రలోయలోకి చొచ్చుకొచ్చింది. అక్కడ ఆనాటి ఓటమి తప్పించుకో లేనిదే కూడా. కారణం, అక్కడ ఉన్న సైనికులకు పెద్ద తర్ఫీదు లేదు. దాడిని ఎదుర్కొనే సాధన సామగ్రి కూడా లేదు. దాడి వేళ నెహ్రూ ఏం చేస్తున్నారు? రక్షణమంత్రి వికె కృష్ణమీనన్‌ ఎక్కడ ఉన్నారు? చైనా శాంతి స్వభావం మీద విశేషమైన నమ్మకం ఉంచుకున్న ఈ ఇద్దరు కూడా చైనా దాడి చేయదన్న అర్థం లేని నమ్మకంతో ఆ సెప్టెంబర్‌లో విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇలాంటి నమ్మకం సైనిక దళాల సిబ్బంది ప్రధానాధికారి లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌కౌల్‌కు కూడా ఉందేమో! ఆయనా సెలవులో ఉన్నారు. మిలిటరీ ఆపరేషన్స్ ‌డైరెక్టర్‌ ఓ ‌యుద్ధనౌకలో సుదూరంగా ఉన్నారు. మన నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఏమాత్రం అలికిడి లేకుండా ఒక దేశం ఆత్మ విశ్వాసం మొత్తం ధ్వంసం చేయగలిగిన దుర్ఘటన జరిగిపోయింది. ‘సరిహద్దులలో మన సైనికులు ఎదుర్కొన్న ఓటమికీ, మనకు సంభవించిన నష్టాలకూ నేనెంతో మనస్తాపం చెందాను. పెద్ద ఎత్తున చైనా బలగాలు, వారు వెంట తెచ్చుకున్న భారీ శతఘ్నులు, కొండ తుపాకులు, మోర్టార్లు మన సైన్యాన్ని ముంచెత్తాయి’ అని ఆకాశవాణిలో నెహ్రూ ఓటమి ప్రకటన చేశారు.

సెప్టెంబర్‌ 3, 1962‌న రాజ్యసభలో మాట్లాడుతూ నెహ్రూ, పాకిస్తాన్‌, ‌చైనాతో పరిస్థితి విషయమించడంతో దేశానికి సైనిక సన్నద్ధత ఎంత ముఖ్యమో అంగీకరించడం విశేషం. కానీ అప్పటికి సైనిక సంఖ్యను కుదించారు. రక్షణ వ్యయాన్ని కుదించారు. ఈ ఆలోచన ఆయన ఒక్కరిదే కాదు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, ఇంకొందరు రాజకీయవేత్తలు రక్షణ, సైనిక వ్యయం గురించి విమర్శలు గుప్పిస్తూనే ఉన్న సంగతిని గుర్తు చేసి చురక కూడా వేశారాయన. అందులో తన బాధ్యత కూడా ఉందని మాత్రం అంగీకరించారు. ఈ వ్యాఘాతం నుంచి ఆయనను కాలం కూడా తప్పించలేకపోయింది.
ఇదంతా జరిగినప్పుడు ఆనంద్‌ ‌తన స్వస్థలంలో ఉన్నాడు. ఒక టీ దుకాణం దగ్గర అన్నీ మరచి రేడియో వింటూ, విషణ్ణ వదనాలతో గ్రామస్థులు ఎలా తల్లడిల్లిపోయారో గమనిస్తాడు. ఆఖరికి అల్లరిచిల్లరిగా తిరిగే రికామీలు కూడా ఆ వార్తను జీర్ణించుకోలేక నిస్తేజంగా, నిశ్శబ్దంగా ఉండిపోవడం చూశాడు. నిజమే, ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొగలుల కాలంలో, పాశ్చాత్యులు దాడులు చేసిన కాలమో కాదు. గతంలోని కొన్ని చీకటికోణాలలో మాదిరిగా ఎవడు పాలకుడో, ఎవడు దురాక్రమణ దారో ప్రజలు పట్టించుకోని దురదృష్టకర కాలం కాదది. ఒక గొప్ప స్వాతంత్య్ర సమరంతో పదిహేనేళ్ల క్రితమే స్వేచ్ఛావాయువులు పీల్చుకునే మహదవకాశం సాధించుకున్న దేశం. ఇలాంటి జాతీయవాద స్పృహకు పునాది ఆ ఉద్యమమే.
తక్షణం ఢిల్లీ బయలుదేరదామని బలంగా అనిపించినా, అక్కడి ఒక పాఠశాలలో ప్రసంగం ఉండడం వల్ల ఆనంద్‌ (‌ప్రజాప్రతినిధి హోదాలో) ఆగిపోతాడు. జరిగిన పరిణామాలు పిల్లలకు తెలియచేయడం అవసరమని భావిస్తాడు. అంతా విన్న ఒక బాలుడు భయం భయంగా, బిక్కమొహంతో వచ్చి జేబులో నుంచి ఒక నాణెం తీసి ఆనంద్‌ ‌చేతిలో పెడతాడు. అది పావలా నాణెం. ‘చైనా మీద పోరాటానికి ఇది నా విరాళం’ అన్నాడు. నిజమే, అది 25 నయాపైసల నాణమే. తక్కువ విలువే. కానీ చైనా దాడి, భారత్‌ ‌చిక్కుకున్న పరిస్థితికి ఆ పిల్లవాడి స్పందన విలువ కట్టలేనిది. చెమర్చిన కళ్లతో ఆనంద్‌, ‘ఇది పండిట్‌ ‌జీకి అందచేస్తాను. నీకు రశీదు కూడా వస్తుంది’ అంటాడు. ప్రథమ ప్రధాని మీద భారత జాతి ఉంచుకున్న ఆకాశమంత విశ్వాసానికి పెద్ద హేతువే ఉంది. వందలేళ్ల బానిసత్వంలో మగ్గిన జాతి స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత జాతిని నడిపే బాధ్యత ఆయన స్వీకరించారు. సమకాలికులు నెహ్రూ జీవించి ఉండగానే మన పురాతన మహనీయుల పక్కన ప్రతిష్టించారు. కానీ ఈ ధోరణి నుంచి బయటపడిన నెహ్రూ భక్తుడు పీవీ. నెహ్రూ గొప్పవారే కావచ్చు. చారిత్రక వాస్తవం, వాస్తవిక దృక్పథం అంతకంటే గొప్పవి కదా!

చారిత్రక దృష్టితో ఆయన పాత్రను అంచనా వేయడం కూడా అపచారం అనుకుంటే నిజానికి అది నెహ్రూ వ్యక్తిత్వానికి అపచారం చేసినట్టు. అందుకే పీవీ అంటారు, ‘ఆయన విజయాలను పూర్తిగా విమర్శనారహిత దృక్కోణం నుంచి చూడడమూ పనికి రాదు. ఆయన సాధించిన విస్తార విజయాల వెనుక, ఆయనదిగా చెప్పుకుంటున్న ఒకే ఒక ఖరీదమై వైఫల్యం వెనుక ఉన్న కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషించుకోవడం అవసరం’ (లోపలి మనిషి, పే 346). ఒక వ్యక్తిని గాఢంగా అభిమానించడం వేరు. దేశ ప్రయోజనాల స్పృహతో, చారిత్రక దృష్టితో, ఇవి చెప్పిన తీర్పుల ప్రాతిపదికగా ఆ వ్యక్తి తప్పొప్పులను అంచనా వేసే ప్రయత్నం వేరు. ఎవరి విషయంలో అయినా ఇది నిజం.

– కల్హణ
(జాగృతి, 2019 దీపావళి సంచిక నుంచి, కొన్ని మార్పులతో)

About Author

By editor

Twitter
YOUTUBE