సాధారణంగా ఒప్పందాలు వ్యక్తులు, కంపెనీల మధ్య జరుగుతాయి. ప్రభుత్వాలు, దేశాల మధ్య జరుగుతాయి. ఇందులో పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. అయితే అనైతిక లబ్ధి కలిగించే ప్రయోజనాలను ‘క్విడ్‌ప్రోకో’ అంటారు. ఇందులో స్వార్థం ఉంటుంది. ఒక దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ శత్రు దేశానికి చెందిన పార్టీతో, అది కూడా ఏమాత్రం సిద్ధాంత భావసారూప్యం లేని పార్టీతో ఒప్పందం చేసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలి? అదెక్కడో కాదు మనదేశంలోనే జరిగింది. 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాల మధ్య జరిగిన అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) మీద ప్రస్తుతం పెద్ద దుమారమే చెలరేగుతోంది.
అధికార, విపక్షాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరిగా ఐక్యతను ప్రదర్శించాలి. దురదృష్టవ శాత్తు మనదేశంలో కాంగ్రెస్, వామపక్షాలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం మనం చూస్తున్నాం. లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘటనలో భారత భూభాగంలోకి చైనా సైనికులు దూసుకువచ్చిన క్రమంలో మన సైనికులు దీటుగా తిప్పి కొట్టారు. ఈ క్రమంలో చైనా సైనికుల దొంగదెబ్బ కారణంగా తెలుగు జవాన్ కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది అమరులయ్యారు. దేశ ప్రజలంతా చైనా దుష్చర్యమై ఆగ్రహించారు. ఈ ఘటనలో యావత్ ప్రపంచం చైనా దుందుడుకు చర్యను తప్పుపట్టింది.
ప్రపంచానికి కరోనా అంటించిన చైనా, ఇరుగు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వారి భూభాగాలను అక్రమించుకుంటున్న వైనాన్ని ప్రపంచ దేశాలన్నీ తప్పుపడుతున్నాయి. కానీ విచిత్రంగా కాంగ్రెస్, వామపక్షాలు సైంధవపాత్రను పోషిస్తున్నాయి. వామపక్షాలు మొదటి నుంచి చైనాతో అంటకాగుతూ దేశద్రోహ వైఖరిని అవలంభించడం కొత్తేమీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం విజ్ఞత కోల్పోయి చైనాకు వంతపాడేలా ప్రకటనలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో సరిహద్దుల వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేం దుకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19న అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఆక్రమణలో కొత్తగా భారత భూభాగం ఇంచు కూడా లేదని చెప్పారు. మాతృభూమిపై కన్నేసిన వారికి మన సైనికులు గుణపాఠం చెప్పారని అన్నారు. అయితే చైనా మన భూభాగంలోకి వచ్చినా ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారని విచిత్రమై ట్వీట్స్, వ్యాఖ్యాలతో ప్రభుత్వంపై దాడికి దిగారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. చైనా మన జవాన్‌లను చంపేసింది. మన భూభాగాన్ని లాక్కుంది.. అంటూ ఆయన కామెంట్స్ కొనసాగాయి. గల్వాన్ ఘటన జరిగినప్పటి నుండి ప్రతిరోజూ ఇలాంటి విచిత్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు రాహుల్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఇలాంటి ప్రశ్నలే సంధించారు. చైనా విషయంలో ప్రధాని మోదీ దగ్గర ఎలాంటి వ్యూహం ఉందో బయటపెట్టాలని తల్లీ, కొడుకులు పదే పదే డిమాండ్లు కొనసాగించారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే అధికారంలో ఉన్న నాయకులెవరైనా వ్యూహాలను బయటకు చెప్పరు. ప్రధాని తాను చేపట్టబోయే చర్యలను బయటకు చెప్పి చైనాను అప్రమత్తం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ఎలా భావిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అమాయకత్వం అనుకోవాలా, తెలివితక్కువతనం అనుకోవాలా? దేశ భద్రత, రక్షణకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాలనే విచక్షణ కూడా వీరికి లేకపోవడం శోఛనీయం. ముఖ్యంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ‘సరెండర్ మోదీ’ అంటూ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇండియా-చైనా సరిహద్దులోని గల్వాన్ దగ్గర చైనా చేసిన ఎటాక్ ప్రీ ప్లాన్ అని, దాని గురించి తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఒక న్యూస్ లింక్‌ను ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనాతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న రహస్య సంబంధాలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ 2008లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో చేసుకున్న అవగాహనా ఒప్పందంపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆ ఒప్పందం సందర్భంగా తీసిన ఫోటోలను జెఠ్మలానీ పోస్ట్ చేయడంతో చైనాతో తనకు ఉన్న సంబంధాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. 2008 ఆగస్టు 7వ తేదీన చైనా రాజధాని బీజింగ్‌లో ఈ ఒప్పదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, చైనా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నత స్థాయిలో కలిసి పనిచేయాలనేది ఈ ఒప్పంద ప్రధాన సారాంశం. ఇరు పార్టీల మధ్య ఉన్నత స్థాయి సమాచార మార్పిడి, సహకారంతో పాటు ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఒకరికొకరు సంప్రదించుకోవాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. నాటి యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అప్పటి చైనా ఉపాధ్యక్షుడు జిన్‌పింగ్ (ప్రస్తుత చైనా అధ్యక్షుడు) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) అంతర్జాతీయ విభాగ మంత్రి వాంగ్ జియా రూయి ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఎంవోయూ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. వాస్తవానికి అవగాహనా ఒప్పందాలు ప్రభుత్వాల నడుమ లేదా కార్పొరేట్ సంస్థల మధ్య జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం కుదుర్చుకోవడంలోని మర్మం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ రెండు పార్టీలు సైద్ధాంతిక విబేధాలు పక్కన పెట్టి 2008లో కుదుర్చుకున్న ఒప్పందం రహస్యంగా ఉండిపోయింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఎందుకు ఈ ఒప్పదం చేసుకోవాల్సి వచ్చిందో, అందులో ఏముందో కూడా సగటు భారతీయుడికి, కనీసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ తెలియదు. ఆ ఒప్పందం దేశానికి ఉపయోగపడేది అయితే అప్పుడు ప్రధాని మన్మోహన్‌సింగ్ అక్కడ ఎందుకు లేరు? రాహుల్ గాంధీ ఏ హోదాలో సంతకాలు చేశాడు? అప్పటికి రాహుల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగానే ఉన్నారు. సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ జూన్ 21న ఈ ఫోటోను బయటపెట్టే వరకూ ఎవరికీ ఈ ఒప్పందం గురించి తెలియదు.
రాజీవ్ ఫౌండేషన్‌కు నిధులు!
కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ముందే అనేక తతంగాలు నడిచాయి. చైనా ప్రభుత్వం నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు రూ.90 లక్షల విరాళాలు వచ్చాయి. చైనా రాయబార కార్యాలయం ద్వారా ఈ నిధులు అందాయని తెలుస్తోంది. ఈ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మన్మోహన్‌సింగ్, చిదంబరం సభ్యులుగా ఉన్నారు. చైనా నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2005-06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అందినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదిక లోనే ఉందన్నారు. 2005-06లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్ చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎఫ్‌టీఏతో భారత్ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరిందన్నారు. చైనా నుంచి వచ్చే నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఆరోపిం చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి భారీగా నిధులు ముడుతున్నా యన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలున్నా యని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైందని తెలిపారు. డోక్లాం వివాదం సమయంలో రాహుల్ చైనా రాయబార కార్యాలయం వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
చైనాతో రాహుల్ మైత్రి..
చైనా సైన్యం భారత జవాన్ల ప్రాణాలను తీసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఆ దేశంతో ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. చైనా కమ్యూనిస్టు పార్టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ వారికి ఎలాంటి సమాచారం అందించింది. అనేది తేలాల్సిన అవసరం ఉంది. 2017లో భూటాన్, సిక్కిం సరిహద్దులోని డోక్లాం దగ్గర ఇండియా, చైనా బలగాలు ముఖాముఖి తలపడ్డాయి. ఇలాంటి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సందర్భంలో కూడా రాహుల్ రహస్యంగా చైనా రాయబారిని కలిశాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో అవాస్తవమని కాంగ్రెస్ మొదట ఖండించింది. చివరకు చైనా ఎంబసీకి చెందిన వెబ్‌సైట్ ఆ ఫోటో రిలీజ్ చేసేసరికి తెల్లమొహం వేయాల్సి వచ్చింది. బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా గాంధీ, వాద్రా కుటుంబాలకు దక్కిన ఆతిథ్యం ఫోటోలను కూడా ఆ వెబ్‌సైటే బయటపెట్టింది.
చైనాతో రాహుల్ స్నేహం బయటపడిన మరో సందర్భం.. 2018 సెప్టెంబర్ మాసంలో ఆయన కైలాష్ మానససరోవర్ యాత్ర చేసినప్పుడు.. న్యూఢిల్లీలో రాహుల్ బయలుదేరినప్పుడు చైనా రాయబారి అక్కడే ఉన్నాడు. ఈ యాత్రలో ప్రతి దశలోనూ చైనా రాహుల్‌కు సహకరించింది. 2018 నవంబర్ మాసంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులను కలుసు కున్నారు. అనంతరం ‘అర్థవంతమైన అభిప్రాయాల మార్పిడి కోసం సిపిసి సెంట్రల్ కమిటీ సభ్యుడు మిస్టర్ మెంగ్ జియాంగ్ఫెంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 2019 జూన్ మాసంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలోని 10 జనపథ్‌కు వచ్చింది. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలను కలిసింది. ఈ ప్రతినిధి బృందంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గ్వాంగ్‌డాంగ్, పార్టీ కార్యదర్శి లి జి నేతృత్వంలో చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ షిన్ ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారు అభిప్రాయాలను చర్చించు కున్నారని చెప్పారు. ఈ ఏడాది మే 12న ఆనందశర్మ చేసిన ట్వీట్ ఇలా ఉంది- ‘చైనా, ఇండియా కలిసి నడవాలి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరం, కాంగ్రెస్ పార్టీ ఆ వ్యూహం విలువను గుర్తిస్తోంది.’ గత నెలలో చైనా మన సరిహద్దు దగ్గర హడావుడి చేస్తుంటే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ఓ ట్వీట్ పెట్టాడు- ‘చైనా విష సర్పాలూ భారతీయ సైనికులతో పెట్టుకోకండి’ అని.. కానీ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. ఎందుకంటే మేడం (సోనియా) కోపగించిందట.
నెహ్రూ కాలం నుంచే..
చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు ఈనాటివి కాదు.. చైనా అంటే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఎనలేని ప్రేమ. చైనాలో మావో నేతృత్వంలో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మొదట గుర్తించింది భారతే. చైనా 1950లో టిబెట్‌ను ఆక్రమించుకోవడాన్ని నెహ్రూ సమర్థించారు. ఆ తర్వాత 1950లోనే చైనా జమ్ము కశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్న 37,224 చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్‌చిన్‌ను ఆక్రమించుకుంటే నెహ్రూ నోరు మెదపలేదు. పైగా చైనాగు గుడ్డిగా నమ్మి దోస్తీ చేశారు. చైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యత్వం రావడంలో ప్రధానంగా కృషి చేసింది కూడా నెహ్రూయే. చైనాతో కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం, హిందీ-చినీ భాయీభాయీ నినాదం బెడిసికొట్టి ఆ దేశం 1962లో మనపై దురాక్రమణకు దిగితే కానీ నెహ్రూకు జ్ఞానోదయం కాలేదు. లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలు ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో చైనాతో భారత్ సంబంధాలు ఉప్పు నిప్పుగానే కొనసాగాయి. కానీ రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మరోసారి దౌత్య సంబంధాలు మొదలయ్యాయి.
2004లో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధాలు మరోసారి మొగ్గ తొడిగాయి. ఈ సంబంధాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాల రూపంలో చేకూరిన ప్రయోజనాలు ఇప్పుడు బట్టబయలై పోయాయి. చైనా మనదేశ భూభాగంలోకి ఎలా చొరబడుతుంది? ఎంత భూమిని కబ్జా చేసింది? అని తెచ్చిపెట్టుకున్న అమాయకత్వంతో సోనియా, రాహుల్ ఇప్పుడు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం హయంలో చైనాకు అప్పనంగా అప్పగించిన భూభాగం గురించి నోరు మెదపడంలేదు. 2008లో చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ ఎంఓయూ తర్వాత జరిగిన పరిణామాలను చూద్దాం.. సరిహద్దులోని చమూర్ ప్రాంతంలోని తియా పంగ్నాక్, చబ్జీ లోయలోని 250 కి.మీ. భూమి చైనా కబ్జాలోకి వెళ్లిపోయింది. డీమ్జోక్‌లోని జొరావర్ పోర్టును చైనా ఆర్మీ ధ్వంసం చేసింది. 2012లో చైనా ఇక్కడ కొన్ని ఇళ్లను నిర్మించి అబ్జర్వింగ్ పాయింట్ నెలకొల్పింది. 2008-09 మధ్యకాలంలో డూంగ్తీ, డీమ్జోక్ మధ్యలో ఉండే పురాతన వ్యాపార కేంద్రం డూమ్ చెలేయ్‌ను కోల్పోయాం.
చైనా, పాక్‌లకు రాహుల్ అండగా ఉన్నారా?
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్న రాహుల్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘భారత వ్యతిరేక ప్రచారాన్ని మేం సమర్థంగా తిప్పికొట్టగలం. అయితే అతి పెద్ద రాజకీయ పార్టీకి మాజీ అధ్యక్షుడు అయి ఉండి ఇలాంటి నిస్సార రాజకీయాలు చేసినప్పుడు బాధాకరంగా ఉంటుంది’ అని అమిత్‌షా రాహుల్ గాంధీని ఉద్దేశించి మండిపడ్డారు. రాహల్ హ్యాష్ ట్యాగ్‌ను చైనా పాకిస్తాన్‌లు ముందుకు తీసుకెళుతున్నాయని, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. తమ నాయకున్ని పాక్, చైనాలు ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ గ్రహించాలి. ఈ విపత్కర సమయంలో చైనా, పాకిస్తాన్ ఏం ఇష్టపడతాయో మీరు అవే చెబుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు వివాదం ఉద్రిక్తతలపై 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్లమెంట్‌లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు అమిత్ షా.
రాహుల్‌కి శరద్‌పవార్ కౌంటర్
సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం చైనాకు సరెండర్ అయిందని రాహుల్‌గాంధీ చేసిన విమర్శను స్వయంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తిప్పి కొట్టారు. అవతలివారిపై విమర్శలు చేసేముందు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశామో గుర్తు చేసుకోవాలన్నారు. 1962 యుద్ధం సందర్భంగా చైనా 45వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించు కుందని, అది ఇప్పటికీ ఆ దేశం ఆధీనంలోనే ఉందని శరద్‌పవార్ గుర్తుచేశారు. గల్వాన్ ఘటనలో ఎక్కడా రక్షణమంత్రి వైఫల్యం లేదని స్పష్టం చేశారు. మన సైనికులు అప్రమత్తంగా ఉండటం వలనే చైనాకు దీటుగా బదులిచ్చామన్నారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని పవార్ స్పష్టం చేశారు.
– మిత్ర, సీనియర్ జర్నలిస్ట్