ఆగస్టు 3 శ్రావణ/ రాఖీ పౌర్ణమి సందర్భంగా..
భారతీయు ధార్మిక చింతనాపరంపరలో శ్రావణ మాసం మకుటాయమానమైనది. ఈ మాసంలోని పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. వేదాలను రక్షించేందుకు హయగ్రీవుడిగా పౌర్ణమినాడు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం కృష్ణుడిగా శ్రావణ బహుళ అష్టమినాడు అవతరించాడు.
భారతీయ సంస్కృతిలో శ్రావణ పూర్ణిమకు ఇచ్చిన ప్రాధాన్యం బహుముఖీనం. పురుషోత్తముడైన శ్రీమహా విష్ణువు శ్రవణ నక్షత్రం నాడే ఆవిర్భవించాడు. ఆయన అద్భుత అంశరూపం ‘వాగీశ్వరుడు’ హయగ్రీవుడు అవతరించిన తిథి. కలియుగదైవం తిరువేంకట నాథుడు శ్రీవానివాసుడి ఆవిర్భావం కూడా శ్రవణ నక్షత్రంలోనే. వైఖానస సంప్రదాయ ప్రవర్తకులు విఖనస మహర్షి కూడా ఆవిర్భవించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. అలాంటి శ్రవణా నక్షత్రయుక్త పూర్ణిమ కావడం వలన ఈ మాసానికి ‘శ్రావణం’అని పేరు వచ్చింది. మహారాష్ట్రులు, కన్నడిగులు శ్రావణ పౌర్ణమి నాడు సముద్రపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఆ రోజును నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు. గుజరాతీలు తమ పోషకులను సందర్శించి వారి ముంజేతికి రాఖీ కడతారు. అందుకే రాఖీ పండుగ అని పేరు వచ్చింది.
నూతన యజ్జోపవీతధారణ
శ్రావణ పూర్ణిమ నాడు జపహోమ ధ్యానాదుల నిమిత్తం దీక్షాసూచికగా నూతన యజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రవచనం. గడచిన సంవత్సరంలో ఏమైనా దోషాలు చోటుచేసుకుంటే వాటి పరిహారార్థం కూడా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారని చెబుతారు. కొత్తగా ఉపనయనం అయినవారికి ఈ తిథినాడే ఉపాకర్మను జరిపిస్తారు. వేదాభ్యాసం చేసేవారికి మాత్రం ఏటా ఈ పౌర్ణిమ నాడు ఉపాకర్మ నిర్వహిస్తారు. ఈ పక్రియతో వేద విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. ‘ఇతర పున్నములు అనధ్యాయాలు. ఆనాడు పాఠాలు చెప్పకూడదు. కానీ శ్రావణ పౌర్ణమి అందుకు మినహాయింపు’ అని వేదమూర్తులు చెబుతారు. వేదాధ్యాయనం ఈ తిథినాడే అరంభిస్తారు.
జ్ఞానప్రదాత హయగ్రీవుడు
‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే’
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అద్భుతమైనది ‘హయగ్రీవం’. సరస్వతీదేవి వాగ్దేవి కాగా, హయగ్రీవ స్వామి వాగీశ్వరుడు. సర్వ విద్యలకు ఆధారభూతుడు. గుర్రపుతల, మానవ దేహం గల ఈ స్వామి జ్ఞానానికి అధిదేవుడు. ‘హయ’ అంటే విజ్ఞానం, ‘గ్రీవం’ అంటే కంఠం. సమస్త విద్యలు కంఠగతమైన సర్వ విద్యాస్వరూపుడు. బ్రహ్మ వద్ద నుంచి వేదాలను అపహరించుకుపోయిన మధుకైటభులు అనే రాక్షసుల సంహారం కోసం విష్ణువు శ్రావణ పూర్ణిమ నాడే యజ్ఞగుండం నుంచి హయగ్రీవుడిగా ఆవిర్భవించారు. రాక్షసులను వధించి వేదాలను రక్షించారు. వేదాలను కాపాడుకోవలసిన బాధ్యతను శ్రావణ పూర్ణిమ గుర్తుచేస్తుంది. అందులో భాగంగానే ఆనాడు విద్యార్థులతో వేదాధ్యయనాన్ని ఆరంభిస్తారు. ఈ రోజున హయగ్రీవారాధనం విద్యాప్రాప్తిని, శీఘ్రఫలిసిద్ధిని కలిగిస్తుందని విశ్వాసం.
రాఖీ/రక్షాబంధన్
సోదరీసోదరుల అనుబంధానికి, కౌటుంబిక సంబంధాల మాధుర్యానికి చిహ్నం రక్షబంధన్. కుల, మత, వర్గ ధనిక, పేద తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకుంటూ సోదర ప్రేమను చాటుకుంటారు. స్త్రీలు తోబుట్టువులకే కాకుండా, సోదర సమానులకూ రాఖీలు కట్టి తీపి పదార్థాలు తినిపిస్తారు. రక్షాబంధన్ గురించి భవిష్యోత్తర పురాణంలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు, ఇంద్రాణి ఇంద్రుడికి రక్షాబంధనం గురించి వివరించినట్లు ఉంది.
రక్షాబంధనం ఒకప్పుడు విజయకాంక్షకే పరిమితమైందట. యుద్ధవీరులకు పట్టుదల, ఆత్మస్థైర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. కాలక్రమంలో పాలకుల దుర్నీతి, ఆరాచకాల బారిన పడుతున్న మహిళల రక్షణ కోసం రాఖీ సంప్రదాయం వచ్చిందని చెబుతారు. చారిత్రక ఆధారాలను బట్టి, మొగలాయిల కాలంలో హిందూ స్త్రీలకు రక్షణ ఉండేది కాదు. తమ రక్షణ కొరతూ మహిళలు మహావీరులకు రాఖీలు కట్టేవారు. వారు ఆ స్త్రీమూర్తులను తోబుట్టువులుగా భావించి ఆదరించేవారు. ప్రాణాలకు తెగించి రక్షించేవారు.
కన్నవారినీ వీడి మెట్టినింటికి చేరిన ఆడపిల్లలకు కష్టసుఖాల్లో అండదండగా ఉండే బాధ్యతను సోదరులకు గుర్తుచేసే పర్వంగా శ్రావణ పూర్ణిమ రూపొందింది.
‘దివిలో తారలు భువిలో మానవులు ధూళిలో కలిసినా
అన్నచెల్లెళ్ల జన్మబంధాలు నిత్యమై నిలుచులే’ అన్న కవి వాక్కు నిత్యసత్యం.
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి