సాక్షాత్తు ఓ శాసన సభ్యుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. పైగా నిజానిజాలు నిర్ధారణ కాకముందే అది హత్య కాదు, ఆత్మహత్యేనని అక్కడి పోలీసులు తేల్చేశారు. చనిపోయింది బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ ‌రాయ్‌. ఈ ‌ఘటన జరిగింది దీదీ పాలనలోని పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రంలో. రాజకీయ ప్రత్యర్థుల హత్యలకు పేర్గాంచిన బెంగాల్‌లో ఇటీవల జరిగిన దేవేంద్రనాథ్‌ ‌రాయ్‌ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షానికి చెందిన, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకోవడం, పైగా రాత్రి వేళ మార్కెట్‌కు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడటం ఏమిటి? అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇది కచ్ఛితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం చేయించిన హత్యేనని ఆరోపిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ‌బీజేపీ నాయకులు సీబీఐ విచారణకు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదంటున్న దేవేంద్రనాథ్‌ ‌కుటుంబం కూడా ఈ ఘటనపై విచారణకు పట్టుబడుతోంది. అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందినవారే ఆయన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్కర్‌ ‌కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఏడాది బెంగాల్‌ ‌శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ హత్యారాజకీయాలకు తెరలేచిందా? అనే భావన ప్రతిఒక్కరిలో కలుగుతోంది.

జూలై 13 ఉదయం.. పశ్చిమబెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్‌ ‌జిల్లాలోని బిండాల్‌ ‌గ్రామ మార్కెట్‌లోని ఓ షాప్‌లో వేలాడుతున్న శవం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ ‌రాయ్‌ ఆ ‌స్థితిలో కనిపించడం అనేక సందేహాలకు తావిచ్చింది. ఎమ్మెల్యే ఇంటికి ఈ మార్కెట్‌ ‌కిలోమీటర్‌ ‌దూరంలోనే ఉంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఇంటికి రాగా, వారితో మాట్లాడేందుకు వెళ్లిన దేవేంద్రనాథ్‌ ‌మరునాడు ఉదయం ఇలా విగతజీవునిగా మారాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దేవేంద్రనాథ్‌ ‌విషాద మరణాన్ని బెంగాల్‌ ‌పోలీసులు ఆత్మహత్యగా తేల్చేశారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదిక కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించిందని చెబుతున్నారు. ఆయన సూసైడ్‌ ‌నోట్‌ ‌కూడా రాశారని, అందులో ఇద్దరి పేర్లు ప్రస్తావించారని అంటున్నారు పోలీసులు. కానీ ఘటనా స్థలాన్ని చూస్తే ఆయన ఆ స్థితితో ఉరి వేసుకోవడం ఎలా సాధ్యమనే అనుమానాలు కలుగుతున్నాయి.

దేవేంద్రనాథ్‌ ‌రాయ్‌ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం టికెట్‌పై హేమతాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ ఫలితాలను సాధించింది. దీంతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేవేంద్రనాథ్‌ ‌బీజేపీలో చేరారు.

ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ ‌చేయాలి : బీజేపీ

దేవేంద్రనాథ్‌ ‌రాయ్‌ ‌హత్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండాల రాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయ్‌ది కచ్ఛితంగా హత్యేనని కేంద్ర మంత్రి బాబుల్‌ ‌సుప్రియో, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ ‌విజయ్‌ ‌వర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతల హత్యల పరంపర కొనసాగుతూనే ఉందని, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నవారిని హతమారుస్తున్నారని వారు అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను కలిసిన బెంగాల్‌ ‌బీజేపీ నేతలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్న మమత ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎమ్మెల్యే రాయ్‌ ‌మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ హత్య వెనుక తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌హస్తముందని, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని బీజేపీ నేత రాహుల్‌ ‌సిన్హా తెలిపారు. ‘రాయ్‌ 2019‌లో బీజేపీలో చేరారు. ఇదే ఆయన చేసిన తప్పేమో?’ అని బీజేపీ ట్వీట్‌ ‌చేసింది. దేవేంద్రనాథ్‌ అనుమానాస్పద మృతిపై స్పందించిన పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్కర్‌ ‘ఈ ఉదంతం అనేక ఆరోపణలకు తావిస్తోంది. హత్య చేశారన్న ఆరోపణలూ వస్తున్నాయి. సత్యాన్ని ఆవిష్కరించడానికి, రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది.’ అని ట్వీట్‌ ‌చేశారు.

పశ్చిమ బెంగాల్‌ అం‌టేనే రాజకీయ హత్యలు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మొదలైన హత్యారాజకీయాల వారసత్వాన్ని మమతా బెనర్జీ అందిపుచ్చుకున్నారు. గతంలో వామపక్షాల ఆడగాలకు వ్యతిరేకంగా పోరాడి తృణమూల్‌ ‌పార్టీని ఏర్పాటు చేసిన మమత ఇప్పుడు అదేబాటలో నడుస్తున్నారు. తృణమూల్‌ను గూండాల పార్టీగా మార్చేశారు. ఆ పార్టీ కార్యకర్తలు తుపాకులు, మరణాయుధాలతో చెలరేగిపోతూ ప్రత్యర్థులపై దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. సోషల్‌ ‌మీడియాలో కూడా ఈ దృశ్యాలు హల్‌చల్‌ ‌చేస్తుంటాయి.

బీజేపీపై తృణమూల్‌ ‌దాడులు

గత ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ ‌షా జరిపిన రోడ్‌ ‌షో మీద తృణమూల్‌ ‌కార్యకర్తల దాడి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలహీన పడటంతో అక్కడి సమస్యలపై పోరాడుతున్న బీజేపీని ప్రజలు ప్రత్యమ్నాయంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పుంజుకోవడం మమతా బెనర్జీకి ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు పక్కన వందేమాతం, భారత్‌ ‌మాతాకీ జై, జై శ్రీరామ్‌ అనే నినాదాలు చేసేవారిని కూడా దీదీ సహించలేకపోయారు. కారు దిగి వారిని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బెంగాల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తృణమూల్‌ ‌గూండాల దాడులు సర్వసాధారణంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు తెచ్చుకోవడం మమతా బెనర్జీకి షాక్‌ ఇచ్చింది. తృణమూల్‌ ‌బలం 34 సీట్ల నుంచి 22కి పడి పోయింది. అదే సమయంలో బీజేపీ బలం 2 సీట్లు నుంచి 18కి పెరగడం ఆమెను తీవ్రంగా భయపెట్టింది. తృణమూల్‌కు బీజేపీ దీటైన పక్షమని బెంగాల్‌ ‌ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడంతో బెంగాల్‌ ‌రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అధికార తృణమూల్‌తో పాటు కాంగ్రెస్‌, ‌వామపక్షాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తీయడం ఖాయమని ఆందోళన చెందుతున్న తృణమూల్‌ ‌కార్యకర్తలు.. ఈ అక్కసుతో దాడులు, హత్యలను మరింత తీవ్రం చేశారు. ప్రధాని మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా హత్యలకు గురైన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించడం మమతా బెనర్జీకి తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా చెబుతారు. గతేడాది పశ్చిమ బెంగాల్‌లో 60 మంది బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షాకు ఒక నివేదిక అందింది. రాష్ట్రంలో హత్యా రాజకీయాలపై ప్రధాని మోదీకి నాటి బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌కేసరీనాథ్‌ ‌త్రిపాఠి దాదాపు నలభై ఎనిమిది పేజీలతో కూడిన ఒక సమగ్ర నివేదికను అందించారని సమాచారం.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE