‘మనిషి నా భాష’ కవితాసంపుటి కర్త కిల్లాడ సత్యనారాయణ. వృత్తిరీత్యా బాధ్యత గల పెద్ద ‘పీఎస్‌హౌస్’ ఆఫీసర్. ప్రవృత్తి సామాజిక సమస్యల కవిత్వీకరణ. ఈ సంపుటిలో కవితా ఖండికలన్నీ స్వేచ్ఛా భావుకత వ్యక్తీకరణలు. ఇందులో 54 కవితా ఖండికలున్నాయి. వీటిలో పువ్వు సుకుమార స్వగతాలున్నాయి. మాతృభాషా మమకారాలున్నాయి. ఆత్మవిశ్వాస ప్రబోధకా లున్నాయి. పురుషాధిక్య నిరసనలున్నాయి. వెబ్ జీవిత నాగరికతా నిరసనలున్నాయి. కవితా తత్త్వ అభివ్యక్తీకరణులున్నాయి.
మాతృభాషా మమకారంతో ‘మాతృభాష’ ఖండికలో ‘‘కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు అప్రయత్నంగా బాధను వ్యక్తీకరించే అమ్మా! మాతృభాష. మాతృ ఉనికిని వర్ణిస్తూ ‘‘దుఃఖం ఉప్పొంగినపుడు ఉరకలు తీసే భావం మాతృభాష / కోయిలమ్మ కూత మాతృభాష / లేగ దూడ అంబా! మాతృభాష / తల్లిపాల తియ్యదనం మాతృభాష / కన్నీటి వెచ్చదనం మాతృభాష / అంతరాత్మ ధ్వని మాతృభాష / సుగంధ పరిమళం మాతృభాష’’ – అంటూ ఔచిత్యమైన సముచిత దృష్టాంతాలతో మాతృభాష ఔన్నత్యాన్ని వర్ణించారు. మాతృభాషను నిర్లక్ష్యం చేసేవారిని నిరసిస్తూ, మాతృభాషను విస్మరిస్తే ఏ జాతికీ మనుగడ ఉండదని హెచ్చరించారు.
‘హిపోక్రసీ’ ఖండికలో ప్రపంచీకరణ ప్రభావంతో మనిషిలో పెరిగిన వ్యాపార దృక్పథాన్ని నిరసిస్తూ ‘‘నేను నా కోసం పుట్టాను / మార్కెట్ కోసం పెరిగాను / నేను మార్కెట్ మనిషిని’’ అంటాడు. ‘‘కంప్యూటర్ మౌస్ చేతికిచ్చారు / పోగ్రామ్‌లో అమ్మేశారు’’ సమాజం నన్ను నన్నని ఒప్పుకోదు. ‘దారి తప్పిన అంతరాత్మ’ను అంటారు. ప్రపంచమంతా కంప్యూటర్‌తో మమేకమై యాంత్రికంగా జీవిస్తున్న స్థితిని అధిక్షేపించారు. ‘‘జీవితం రంగస్థలమయింది / అన్నీ నటించే పాత్రలే / ప్రపంచం మార్కెట్ పరమయింది’’ – అంటూ ప్రపంచీకరణ ప్రభావంతో ప్రజలంతా సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా నటిస్తున్న స్థితిని నిరసించారు. జీవితమే రంగస్థలం – అన్న షేక్స్పియర్ భావాన్ని సందర్భోచితంగా ప్రయోగించారు.
కవి తన కవితాతత్త్వాన్ని ‘తాదాత్మ్యం – ఖండికలో కవిత్వీకరిస్తూ ‘‘నా కవిత్వం అదే / మార్మికం / ధార్మికం/ దైవికం’ – తన కవిత్వం మార్మిక ధార్మిక ఆధ్యాత్మిక భావాల త్రివేణీ సంగమమని చెప్పారు. ఆధునిక కవులు శ్రీశ్రీ, తిలక్ వంటి వాళ్లు మాత్రమే తమ కవితా తత్త్వాన్ని చెప్పారు. ‘స్వరూపం’- ఖండికలో తన తత్త్వాన్ని వ్యక్తీకరిస్తూ ‘‘ఆత్మలో నడుస్తున్న పరమాత్మను నేను /…..నేను’’- తాను మతాలకు అతీతంగా మత త్రయ ప్రతినిధుల సమాహార స్వరూపంగా చెప్పుకున్నారు. ‘అన్నీ నేనే అన్నింటా నేనే’ అని నాలో ఉన్న సర్వాంతర్యామి తత్త్వాన్ని ఆవిష్కరించుకున్నారు.
ప్రతి దానికి ‘వెబ్‌సైట్‌పై ఆధారపడే వాళ్లను ‘వెబ్ జీవితం’ ఖండికలో నిరసించారు’’. కృత్రిమ, వేషధారణకు ప్రాధాన్యమిస్తూ తలవెంట్రుకలను డై చేసి పెర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకొనేవాళ్లను అధిక్షేపించారు.
స్వేచ్ఛ – ఖండికలో ‘‘పంజరంలో పావురానికి ఏం తక్కువని? / సువర్ణ ఊసల్ని ఛేదించుకుని / ఎగిరిపోవాలని తహతహలాడు తోంది’’ – అంటూ వీరసావర్కర్ చెప్పిన ‘‘The forest of Independence is better than the cage though mada of gold’’ అన్న భావాన్ని స్వేచ్ఛా ప్రీతితో కవిత్వీక రించారు. ‘‘ఆధిపత్యం ఏ జీవికీ నచ్చదేమో / తన బాణీలో జీవించే హక్కు కోసమే కదా!/ ప్రతి ప్రాణిప్రాకులాడేది’’ – అంటారు.
‘‘కూయడంలో ఆనందం / పంజరంలో పలకడంలో ఎక్కడుంది? అంటూ ప్రశ్నిస్తారు – స్వేచ్ఛగా సంకెళ్లు తొలగితేనే మేధస్సు వికసిస్తుందంటారు.
‘మట్టివాసన’ ఖండికలో శ్రామికులు, కార్మికులు, కర్షకులు తమకు దెబ్బలు తగిలితే తమ కర్మగా భావించి ‘సర్దుకు’పోయేవారు. వాళ్లలో తిరుగుబాటు తత్త్వం లేదు. ఒకప్పుడు శ్రమజీవులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఉద్యోగస్థు లైనా ‘‘ఎవరి జానెడు పొట్టకు/ వాళ్ల దోసెడు సంపాదన / అప్పుడు ఇప్పుడూ / ఆ వూరి గుడిసె రెమ్మలు/ అలాగే రెపరెపలాడుతున్నాయి’’ – తరాలు మారినా, ప్రపంచీకరణ వ్యాపార దృష్టివల్ల వాళ్ల పరిస్థితి మారలేదంటారు.
ప్రపంచీకరణ ప్రభావంతో మానవ సంబంధాలు తరిగి, ఆత్మీయతలు అంతరించి పోయాయి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చే సంస్కృతి పెరిగిపోయింది. ‘ఓల్డ్ ఏజ్ హోమ్’ – ఖండికలో ‘‘ముత్తాతలు వేలు పట్టి నడిపిస్తేగదా / నీకు వివేకం వచ్చింది / ముసిలోడివి నీకు మనుగడ లేదనీ / చీదరించి తీసేసారు’’ – వృద్ధుల ఆవేదనను ఆర్ద్రతతో కవిత్వీకరించారు. ‘స్వార్థంతో ముసలోళ్లను ఓల్డ్ ఏజ్ హోమ్‌కు – తరలించేవాళ్ళను నిరసించారు. అనుభవ సారమైన వార్ధక్యాన్ని నిర్వచిస్తూ ‘‘భూత భవిష్యత్ వర్తమానాల మధ్య సంవాదం / మూడు… అంటారు. ‘‘వార్ధక్యంలో …..
ఈ ఖండికలో కవి ప్రముఖ ఆంగ్ల రచయిత ‘ఎలెక్స్ – కంపోర్ట్’ రాసిన ‘good age old age’ అనే గ్రంథంలో భావాలను స్ఫురింపజేస్తున్నాయి.
ధన సంపాదనే లక్ష్యంగా విరామమెరుగక పరిశ్రమించే శ్రామికులు, కార్మికుల యాంత్రిక జీవనాన్ని కవి నిరసించారు. రాత్రీ పగలు తేడా లేకుండా సంపాదన కోసం భార్యాపిల్లలతో ఆనందంగా గడిపే సమయం లేదనే వాళ్ల సమయ దారిద్య్రాన్ని అధిక్షేపించారు.
రచయిత మానవత్వం, మనిషితనం, మమకారాలను ప్రేమించే లక్షణాలతో ఈ ఖండికలన్నీ కవిత్వీకరించారు. ‘మనిషి నా భాష’ – అనే కవితా సంపుటి శీర్షిక ఔచిత్యంగా ఉంది. ఆధునిక కవితాప్రియులు మానవతావాదులు విధిగా చదువదగిన కవితా సంపుటి ‘మనిషి నా భాష’.
మనిషి నా భాష (కవిత్వం)
కవి: కిల్లాడి సత్యనారాయణ
వెల: రూ.75/-, రమ ప్రచురణలు
ప్రతులకు : నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ- హైదరాబాద్; విశాలాంధ్ర, ప్రజాశక్తి పుస్తకాల షాపులన్నింటిలో లభ్యం.
– డా।।పి.వి.సుబ్బరావు