రక్షాబంధన్‌ ‌సందర్భంగా..

ప్రస్తుతం ప్రపంచమంతా ఒకవైపు ఉండి, కనపడని శత్రువు కరోనాతో పోరాడటం చూస్తున్నాం. దిక్కుతోచక, దాని వ్యాప్తిని అడ్డుకోలేక కొత్త రకమైన అనుభూతితో ఇంటికే పరిమితమై, ఆధిపత్యాన్ని అంగీకరించి అనిశ్చిత స్థితిలో జీవనం కొనసాగి స్తున్నాం. మన సహజ జీవనానికి భిన్నంగా కలవడం, కలసి పనిచేసే స్వభావాన్ని వదులుకొని, దూరం పాటిస్తున్నాం. కానీ, ఇప్పుడు మన వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచించే సమయం దక్కింది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, బాంధవ్యాలను గట్టిపర్చు కునే అవకాశం వచ్చింది. భారతీయ పరంపరలో కనిపించే చిన్న చిన్న విషయాలే నేడు ప్రపంచానికి శరణమయ్యాయి. ప్రపంచ స్థాయి సమస్యలకు, సవాళ్లకు సమాధానం భారతీయ చింతన, సనాతన జ్ఞానం, మన విశిష్టత ఈ సంస్కృతిలో ఉందనే భావన మరింత బలపడుతోంది. మన నమస్కారం, సంస్కారం, సాధారణ స్వచ్ఛతా సూత్రాలు, ప్రాణా యామం, సరళ జీవనశైలి, అనుశాసనం విలువ ప్రపంచానికి అర్థమవుతున్నాయి. విశ్వకల్యాణం కోసం ఈ సంకట పరిస్థితుల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విస్తృతంగా అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ‘కృణ్వంతో విశ్వమార్యమ్‌’ – ‌కోసం కృతసంకల్పం నేడు మన అంతఃకరణాల్లో స్ఫురించాలి.

ధర్మరక్ష – శ్రీరామరక్ష

భారతదేశం ధర్మాధారిత సమాజం. సనాతన హైందవ ధర్మం శ్రేష్ఠమైనది. ఇది సార్వత్రికం, సార్వకాలీనం, సార్వదేశికం, శాస్త్రబద్ధం, ఇతిహాస శుద్ధం. అంతేకాకుండా త్రివార సత్యం. సాధన చేసి, తపస్సులో మునిగి రుషులు లోక కల్యాణానికి అందించిన శాశ్వత సత్యాలు, జీవన సూత్రాల సంపుటి మన ధర్మం. దీని గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించి అధ్యయనం చేస్తూ అనుసరించడానికి చేస్తున్న కృషి వలన, ఇది సర్వసమ్మతం కాబోతోంది. హైందవ ధర్మం అంటే అందరినీ కలిపి ఉంచుతూ మానవత్వాన్ని రక్షించే గుణం. ఒక ప్రవర్తన నియమావళి. కర్తవ్యాన్ని గుర్తుచేసే దిక్సూచి. మనదేశంలో గురువు, శిష్యులు, పురుషుడు, జాతి, సమాజం, సోదరుడు, పుత్రుడు, తండ్రి, తల్లి, ప్రకృతి – అన్నింటికి ధర్మాలను నిర్దేశించారు. అందుకనే మనం ధర్మాధికారులం, ధర్మకర్తలుగా ఉంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనసా, వాచా, కర్మణా ప్రయత్నం చేస్తున్నాం. ఈ రక్షాబంధన్‌ ‌మనకు ధర్మరక్షా మహోత్సవం కావాలి.

శాస్త్రీయ సంస్కృతీ పూజారులం

వేల ఏళ్లుగా మన జాతి తనదైన శైలిలో జీవిస్తూ, ఇతర జాతులతో అనుభవాలను పంచుకుంటూ, జీవిత సమస్యలకు సమాధానం అన్వేషించే క్రమంలో సంపాదించిన తేనెపట్టులోని తేనె లాంటి అనుభవసారమే మన సంస్కృతి. అది యుగాను గుణంగా, మారే పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనేకమంది మహర్షులు, మహాత్ములు, సన్యాసులు, పీఠాధిపతులు అందజేసిన సంస్కారాల సంపుటి. మానవ ప్రకృతిని, స్వభావాన్ని సంపూర్ణంగా పరిశీలించి – జీవన గమ్యం, లక్ష్యాలు, దృష్టి, పద్ధతులను మన పెద్దలు వికసింపజేశారు. ఆలోచన ఎంత ఎత్తుకు, ఎంత లోతుకు, ఎన్ని పార్శ్వాలకు విస్తరించగలదో – ఆ పరాకాష్టను భారతీయ సంస్కృతి చూడగలిగింది. పశ్చిమదేశాల పాక్షిక దృష్టితో కాక మానవుడిని సమగ్రంగా అధ్యయనం చేసి మన కందించిన జీవన సూత్రాలు, వ్యవహారాలు, ఆచారాలు, కళలు, భాష, దృష్టికోణం వంటి శాశ్వత సూత్రాలు సంస్కృతిలో ఇమిడి ఉన్నాయి. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఎరియాన్నా హాఫింగ్టన్‌ ‌చెప్పినట్లు ‘భారతీయల జ్ఞాన పరంపర, సంస్కృతి నేటి ప్రపంచానికి మార్గదర్శకాలుగా అన్ని దేశాలు గ్రహించాలి.’ విశ్వ సమస్యకు పరిష్కారం భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉందనే వాదాన్ని ఆమె తొణకని విశ్వాసంతో ప్రకటిస్తోంది.

ఈ దేశం, సమాజం నావి. ఇది నా విశాల కుటుంబం. దీని బాగోగులు, సుఖదుఃఖాలు, మంచిచెడులు నావి అనే తాదాత్మ్యం ఉంటేనే మన మధ్య స్నేహభావన, ఆత్మీయత, సేవాభావం, త్యాగం, కరుణ, సౌభాత్రం, పరోపకారం లాంటి సుగుణాలు స్థావరం ఏర్పరచుకుంటాయి. జీవనలక్ష్యం, జీవనదృష్టి నిజ జీవితంలో వ్యక్తమవుతూ ఉంటాయి. వ్యక్తిని ప్రయోజకుడిగా, సమాజోన్ముఖుడిగా, సామాజిక చైతన్య స్ఫూర్తికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు మన పెద్దలు వేలాది సంవత్సరాలుగా చక్కటి వ్యవస్థలు వికసింపజేశారు. బడి, గుడి, కుటుంబం, పండుగలు, సామాజికోత్సవాలు ఈ వ్యవస్థల్లో భాగమే. కానీ పరాయిపాలనలో దెబ్బతిన్న ఈ వ్యవస్థలను పునరుద్ధరించుకోవడం, వాటి ద్వారా జరిగే పనిని అఖండంగా జరిగేటట్లు చూడటం మన బాధ్యత.

ప్రతి వ్యక్తికి దేశ బోధ, సమాజబోధ, సంస్కృతీ బోధ, ఆధ్యాత్మిక బోధ అవసరం. జీవన పర్యంతం వీటికోసం సాధన కొనసాగాల్సిందే. దేశం గురించి ఎన్ని విషయాలు ఎంత లోతుగా తెలుస్తాయో, దాని ఆధారంగానే దేశభక్తి ఉంటుంది. ఈ దేశ స్వరూపం, బాహ్య పరిచయం, ప్రాంతాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, శీతోష్ణస్థితులు, ఖనిజ సంపద లాంటి భౌగోళిక సమాచారంతోపాటు, ఇక్కడ అణువణువు ఎంత పవిత్రమో ఇదెంత పుణ్యభూమో అర్థం కావాలి. అలాగే ఇక్కడ నివసించిన సమాజం గొప్పదనం, వ్యక్తుల విశిష్టత, తిరుగులేని పరంపరతో వ్యక్తి అనుసంధానం కావాలి. దేశ భవిష్యత్తు గతం పైన ఆధారపడి ఉందనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు, కృష్ణుడు, చరిత్ర పురుషులు, వీరులు, శూరులు, భక్తులు, శాస్త్రజ్ఞులందరి ఘనత పరిచయం కావాలి. అప్పుడే ఆత్మ విస్మృతి తొలగి ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుంది.

సంస్కృతి, ఆధ్యాత్మికత ఈ గడ్డ విశేషం. వీటి వివరాలు వయోభేదం లేకుండా అందించాలి. ముక్కు మూసుకుని మోక్షగాములుగా తపస్సు, పూజా పద్ధతులు, ధ్యానం, మిగిలిన అనుష్ఠానాలు వాస్తవానికి ఆధ్యాత్మికత కాదు. అవి ఆధ్యాత్మికం దిశగా ప్రయాణం చేయడానికి మార్గదర్శకాలు మాత్రమే. చరాచర సృష్టి మొత్తం ఒకే ఆత్మతత్త్వ వ్యక్తీకరణ అనే భావన, ప్రకృతిని, చెట్లు చేమలు, జంతుజాలం, పంచభూతాలు అన్నీ నావని మనస్ఫూర్తిగా నమ్మి జీవించడం ఆధ్యాత్మికత. దీని వ్యవహార రూపం – సేవా భావం, త్యాగం, పరోపకారం. గాంధీజీ సైతం సామాజిక పరివర్తనకు సబల మాధ్యమంగా ఆధ్యాత్మికతను నమ్మి జీవితాంతం ఆచరించారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్‌ ‌కలాం విజ్ఞానం దేశ వికాసానికి అవసరమైతే, ఆధ్యాత్మకత మానవ జీవితానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి మార్గదర్శిగా ఉంటూ ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. సంస్కృతీ పూజారులుగా జీవించడానికి మనం వ్రతధారులమవుదాం. ఈ దైవకార్యంలో దీక్ష పెంచుకుంటూ సాధనలో అగ్రగాములుగా నిలుద్దాం.

గ్రామ రక్షా-మమ దీక్షా

భారత దేశాభివృద్ధికి కీలకం గ్రామీణ వికాసమే. 73 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో గ్రామాధారిత ఆర్థిక ప్రణాళికలు చిత్తశుద్ధితో రూపొందలేదు. రాజాజీ, గాంధీజీలు కలలు కన్న సమగ్ర గ్రామీణ వికాసం అందని ద్రాక్షగానే మిగిలింది. గ్రామస్వరాజ్యం – గ్రామాధారిత యోజనలకు పెద్దపీట వేయాలి. ప్రభుత్వంతో పాటు విజ్ఞులైన పెద్దలంతా దృష్టి పెట్టాలి. ఇప్పటికీ 42% ఉద్యోగావకాశాలు మనదేశంలో వ్యవసాయ రంగమే అందిస్తుందన్న సత్యాన్ని విస్మరించకూడదు. ‘ఆత్మనిర్భర భారత్‌’ ఓ ‌నినాదంలా మిగలకుండా ఆచరణకు నోచుకోవాలి. స్వాభిమానంతో స్వావలంబన దిశగా గ్రామాలు పయనించాలి. ఇంకొక అవకాశం కూడా వచ్చింది. పట్టణీకరణ ఇబ్బందులో లేక కరోనా కష్టాల వలనో గ్రామాల పైపు తిరుగు వలస (రివర్స్ ‌మైగ్రేషన్‌) ‌తీవ్రమైంది. మానవ వనరుల లభ్యతకు గ్రామాలలో కొరత లేదు. అందువలన మనమందరం సజ్జన శక్తిని, సేవాభావం కలవారిని అందరినీ కలుపుకొని గ్రామాల పైన దృష్టి పెట్టాలి. గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, గోపాలన, పండ్లతోటలు, తేనె తయారీ, చేపల ఉత్పత్తి, కోళ్ల పెంపకం లాంటి సాంప్రదాయ కార్యకలాపాల పైన దృష్టి పెడుతూనే చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు, స్వయం సహాయక బృందాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం జోడించి గ్రామీణ ఆర్థిక, సామాజిక నైతిక వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్లాలి. కొన్ని ప్రాంతాల్లో నేను – నా గ్రామం – నా తీర్థస్థలం అంటూ గ్రామాల ఆమూలాగ్ర పరివర్తనకు నడుం బిగించిన ఉదాహరణలు, ప్రయోగాలు సఫలీకృతం అవడం ప్రేరణా దాయకమే. ఆత్మనిర్భరత ప్రజల సంకల్ప బలం, ఆచరణలో ఉంటుంది. ప్రభుత్వ యోజనలు కేవలం సహాయకంగా ఉంటాయనే సామాజిక స్పృహతో ‘గ్రామరక్షా – మమదీక్షా’ అని ఈ రోజు సంకల్పించుకుందాం.

భారతీయ విద్య-పునరుజ్జీవనం

పరాయిపాలనలో పూర్తిగా ధ్వంసమైనది ఇక్కడున్న అద్భుత విద్యావ్యవస్థ. వలసరాజ్యంగా మనం కోల్పోయింది విద్యలో భారతీయత. తమ పాలన కోసం ఇక్కడున్న చక్కటి చదువుల చెట్టును కూకటివేళ్లతో పెకిలించారు. తరతరాల అనుభవం, విద్య ద్వారా లభించాల్సిన జాతీయత పాఠాలలో కనిపించకుండా పోయింది. జ్ఞాన, భౌతిక సంపదలకు నిలయమై విశ్వగురువుగా వెలసిల్లిన భారతం పశ్చిమ దేశాల విష వలయంలో చిక్కుకొని ఇప్పటికీ బయటకు రాలేకపోతోంది. ప్రపంచానికి కన్నుకుట్టే సంపద సృష్టించిన భారతీయులు పరాయి సంస్కృతి చూపించిన తాత్కాలిక పరిష్కారాల దిశగా పశ్చిమ మార్గంలో పయనించడానికి సిద్ధపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే విద్యావ్యవస్థలో ఆమూలాగ్ర పరివర్తన రాబోతోంది అని ఎదురు చూసిన వారికి నిరాశ మిగిలింది. భారతీయ దర్శనాలు, తత్త్వం, మనోవిజ్ఞానం, సమాజనీతి, సంస్కృతి ఆధారంగా ఉన్న విద్యలో పునరుజ్జీవనం రావాలి. కొత్త జాతీయ విద్యావిధానం – 2020 ప్రజల ముంగిట పూర్తిగా రాకున్నా, కస్తూరి రంగన్‌ ‌ప్రతిపాదనలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. సమాజమంతా ప్రభావవంతమైన శక్తిగా మారి ప్రభుత్వాల పైన, విద్యావ్యవస్థల పైన, విద్యాలయాల పైన ఒత్తిడి తీసుకురావాలి. ఈ తరానికి అవసరమైన 21వ శతాబ్దపు నైపుణ్యాలు, సాంకేతికతో బాటు భారతీయ శాశ్వత విలువలకు పెద్దపీట వేయడానికి ప్రయత్నం సాగించాలి. భారతీయ విద్యా సంరక్షణ బాధ్యత మనదిగా గుర్తిద్దాం.

మనమంతా పరివర్తన కాలఖండంలో ఉన్నాం. భారతదేశం పురుషార్ధంతో ప్రపంచంలో కీలక పాత్ర పోషించటం కళ్లారా చూస్తున్నాం. ఇతోధిక యువశక్తి కారణంగా ఉత్పాదకశక్తి అధికంగా ఉండి త్వరలోనే శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరించబోతోందని అనేక అంతర్జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి. దాన్ని సాకారం చేయడానికి కలలు మాత్రమే కాదు – మన బాధ్యతను, కర్తవ్యాన్ని, కలిసొచ్చే కాలాన్ని సద్వినియోగం కోసం అలసత్వం లేకుండా సజ్జనశక్తి సహకారంతో ఉద్యమిద్దాం. భవ్య భారత నిర్మాణంలో మనవంతు పాత్ర సక్రమంగా నిర్వహించడానికి భగవంతుని ఆశీస్సుల కోసం కూడా ప్రార్థిద్దాం.

– దూసి రామకృష్ణ  : ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌దక్షణమధ్య
క్షేత్ర సహ సంఘచాలక్‌,
‌విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు

About Author

By editor

Twitter
YOUTUBE