మోప్లా తిరుగుబాటు/ హిందువుల ఊచకోత (1921) నూరేళ్ల సందర్భం నేపథ్యంలో కేరళలో ఇలాంటి ఉదంతం జరగడం ఆలోచింపచేసేదే. ఈ ఉదంతం కేంద్రంగా అల్లుకున్న చాలా అంశాలు ఇప్పుడు దేశం చూపును కేరళ వైపు తిప్పాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ ‌కార్యాలయానికి అవాంఛనీయ పరిస్థితులలో ఫోన్‌ ‌కాల్స్ ‌వెళ్లడం కూడా ఇప్పుడు కేరళతో పాటు భారతీయులను నిశ్చేష్టులను చేస్తున్నది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌నుంచి దుబాయ్‌ ‌మీదుగా వచ్చిన ఒక బ్యాగ్‌ను విడిచిపెట్టమని అడుగుతూ వెళ్లిన ఫోన్‌ ‌కాల్స్ అవి. కస్టమ్స్ అధికారులు తొక్కిపట్టిన ఆ బ్యాగ్‌ను విడిచిపెట్టి తీరాలని కస్టమ్స్ అధికారులను తరువాత కొందరు బెదిరించడం మరొక పరిణామం. అయినా కస్టమ్స్ ‌శాఖ కేంద్రం అనుమతితో ఆ బ్యాగ్‌ ‌తెరిచింది. ఆశ్చర్యం..30 కిలోల బంగారం బయటపడింది. దాని విలువ రూ.14.8 కోట్లు.

తరువాత ఒకదానిని మించి మరొకటి విభ్రాంతికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బంగారం బ్యాగ్‌ ‌కూపీ లాగడానికి సాక్షాత్తు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఐదు రోజులకే రంగంలోకి దిగింది. అందుకు ఎన్‌ఐఏ ‌చెప్పిన కారణం ఇంకా విభ్రమంగా ఉంది. ఈ బంగారం రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికే దింపారనీ, ఈ కేసులో హవాలా కోణం కూడా ఉందనీ ఎన్‌ఐఏ ‌వెల్లడించింది. నిజానికి అందులో ఉన్నది బంగారం ఒక్కటే కాదని కూడా కొన్ని టీవీ చానళ్లు చెబుతున్నాయి. ఇది తిరువనంతపురం లోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌కార్యాలయం ఉన్నతాధికారి (ఇన్‌చార్జ్) ‌రషీద్‌ ‌ఖమిస్‌ అల్‌ ‌షమిలి పేరుతో వచ్చింది. అలా స్మగ్లింగ్‌ అయిన ఆ బంగారం బ్యాగ్‌ ‌గురించి, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉద్దేశించినదని భావిస్తున్న దొంగ బంగారం కోసం కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌కాల్స్ ‌వెళ్లడం ఏమిటి? ఈ వ్యవహారంలోనే కొన్ని కాల్స్ అం‌దుకున్న రాష్ట్ర మంత్రి, సిమి మాజీ సభ్యుడు కేటీ జలీల్‌ ‌పాత్ర ఏమిటి? ఇందులో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి, సన్నిహితుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.శివశంకర్‌, ఐటీ విభాగానికి చెందిన అరుణ్‌ ‌బాలచంద్రన్‌ ‌ప్రమేయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తాజాగా బయటపడిన మరొక అంశం ఇందులో హవాలా కోణానికీ, హైదరాబాద్‌కూ సంబంధం ఉంది.

పినరయి వెనకే…

కేరళలో మావోయిస్టులకూ, ముస్లిం ఉగ్రవాదులకూ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మార్క్సిస్టులే ఘోషిస్తున్న వాస్తవమిది. ముఖ్యమంత్రి అంతు చూస్తామని మావోయిస్టులు ప్రకటనలు చేశారు. పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా, ఐఎస్‌ ‌వంటి దేశ విద్రోహ ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే సంస్థలు కేరళలో యథేచ్ఛగా పనిచేన్నాయి. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో వలస కార్మికులను ఐఎస్‌ ‌మద్దతుదారులు రెచ్చగొట్టారని ఏప్రిల్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముస్లిం ఉగ్రవాదులకు సాయపడే అధికారులు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే తిష్ట వేశారా? ప్రభుత్వ వ్యవహారాలలో, అందులోనూ, కీలకమైన ఐటీ శాఖలోకి చొరబడ్డారా? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలివి. దేశంలోకి బంగారం అక్రమ రవాణా ఎంత సులభంగా, యథేచ్ఛగా జరుగుతున్నదో కూడా అర్థమయింది.

ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి పాత్ర ఉండడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌కంగు తిన్నారన్నది నిజం. కానీ ఇది ఎదుటివారికి అర్థమైపోయేటట్టు వ్యవహరిస్తే, విజయన్‌ ‘‌కాకలు తీరిన’ కమ్యూనిస్టు ఎలా అవుతారు? కానీ ఇప్పుడు ఆయన ప్రదర్శిస్తున్నది కేవలం మేకపోతు గాంభీర్యం. జాతీయ దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెబుతున్నారు. అలాగే దోషులంతా బయటకి రావాలని బీరాలు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇద్దరిని ఎన్‌ఐఏ ‌దోషులుగా పేర్కొనడంతో తరువాతి వంతు విజయన్‌దేననీ, అందుకే ఆయన ముందస్తు బెయిల్‌ ‌తీసుకుంటున్నారనీ కేరళ బీజేపీ ఆరోపిస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌కూడా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉన్న బంగారం స్మగ్లింగ్‌ ‌కేసు ఎంత సంచలనమో, కేంద్రాన్ని ఎంత కలత పెడుతున్నదో కేసు ఎన్‌ఐఏకు అప్పగించడంతోనే అర్థమవుతుంది. ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌కీ, ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శివశంకర్‌కీ ఉన్న గాఢ సంబంధాలు బయటకు వచ్చాయి. అలాగే, సీఏం కార్యాలయంలోని ఇంటిదొంగలకీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ)కార్యాలయానికి ఉన్న చాటు బంధం కూడా బయటపడింది. ఇవి చాలు, కేరళ తాజా దొంగ బంగారం వివాదం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి. అయినా ఒక వర్గం మీడియా అంటీముట్టనట్టే ఉంది. ఇందుకు రెండు కారణాలు. ఒకటి, దీని మీద చర్చ మొదలుపెడితే వామపక్షానికి చేటు తేవచ్చు. రెండు, ఒక శిబిరంలోని మేధావివర్గానికి ఆప్తబంధువులైన ముస్లిం ఉగ్రవాదుల గురించి వివరాలు బయటకొస్తాయి. ఈ రెండు అంశాలు ఆ వర్గానికి ఇష్టం ఉండదు.

ఉత్కంఠభరితంగా సాగే క్రైమ్‌ ‌సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో కేసు సాగింది. ఎక్కడి నుంచో బంగారం నిల్వలు రావడం, వాటిని అనుమానంతో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం, వ్యాంప్‌ ‌పాత్ర తరహాలో ఒకరు ఆ బ్యాగ్‌ను విడిచిపెట్టమని ఫోన్‌లో చెప్పడం, తరువాత సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి కాల్స్ ‌రావడం, బెదిరింపులు, పతాక సన్నివేశాన్ని మరిపిస్తూ ఈ బంగారం దిగుమతికీ, ఉగ్రవాద కార్యకలాపాలకీ బంధం బయటపడడం.. ఇవన్నీ జరిగాయి.

జూన్‌ 30- ‌తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు దుబాయ్‌ ‌నుంచి వచ్చిన డిప్లమాటిక్‌ ‌బ్యాగేజ్‌ని అక్రమ రవాణా అనుమానంతో నిలిపివేశారు.

దీనితో పెద్ద డొంకే కదిలింది. చార్టర్డ్ ‌విమానంలో యుఏఈ నుంచి ఆ బ్యాగ్‌ ‌వచ్చింది. ఇది డిప్లమాటిక్‌ ‌బ్యాగేజీ. దానిపై యూఏఈ కాన్సులేట్‌ ‌చిరునామా ఉంది. సాధారణంగా దౌత్యకార్యాలయానికి వారి స్వదేశాల నుంచి వచ్చే ఇలాంటి బ్యాగులను (డిప్లమాటిక్‌ ‌బ్యాగేజీ) వియన్నా ఒప్పందం మేరకు తనిఖీ చేయరు. కానీ అక్కడి కస్టమ్స్ అధికారులకు ఒక రహస్య సమాచారం వచ్చింది. అందుకే బట్వాడా నిలిపివేశారు. తిరువనంతపురం విమానాశ్రయానికి ఇలాంటి బ్యాగ్‌లు గతంలోనూ చాలాసార్లు వచ్చాయి. ‘దౌత్య’ వెసులుబాటును అడ్డం పెట్టుకొని బంగారం స్మగ్లర్లు దౌత్య కార్యాలయాన్ని తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఇందులో దారుణమైన విద్రోహకోణం కూడా ఉంది. ఈ విషయం నిఘా వర్గాలకు తెలిసి, తీగ లాగాయి.

మన బంగారం గురించి ఇక్కడ కొంత చెప్పుకోవాలి. దేశంలో ఏటా 1000 టన్నుల బంగారం వినియోగమవుతుంది. కానీ ఇందులో ఇంచుమించు నాలుగో వంతు బంగారం దేశంలోకి అక్రమ మార్గంలోనే దిగుమతి అవుతోంది. 800 నుంచి 900 టన్నులు రాజమార్గంలోనే దిగుమతి అయినా, మిగిలినది దొంగ బంగారమే. ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా 1990లో విధానం మారి దేశంలోకి పెద్ద ఎత్తున దొంగ బంగారం ప్రవేశించింది. మళ్లీ ఇప్పుడు అలాంటి రవాణా పెరిగింది. 1960 నాటి బంగారం క్రమబద్ధీకరణ చట్టం 1990లో రద్దు కావడం ఇందుకు కారణం. కానీ బంగారం దిగుమతిలో నగల అవసరాల కోసం మినహాయింపు ఇచ్చారు. ఇదే సడలింపు స్మగ్లర్లకు ఉపయోగపడుతున్నది. తాజా వివాదంలో బయటపడ్డ బంగారం నగల తయారీకి ఉపయోగించే ఉద్దేశంతో దిగుమతి కాలేదనీ, ఉగ్రవాదులు నగదు కంటే బంగారాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ నగదుగా మార్చుకోవడం సులభమని భావిస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ కొచ్చిలోని తన కోర్టుకు నివేదించింది. గడచిన 10 మాసాలలోనే ఒక్క కేరళ

సరిత్‌ను అరెస్టు చేసిన కష్టమ్స్ అధికారులు

రాష్ట్రంలోనికే 150 కిలోల బంగారం అక్రమంగా దిగుమతి చేశారని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. గత ఏడాది కేరళకే రికార్డు స్థాయిలో 550 కిలోల దొంగ బంగారం వచ్చి పడింది. తాజా కేసులో పట్టుబడిన స్వప్న, సందీప్‌ ‌నాయర్‌ల మీద యూఏపీఏ చట్టంలోని 16, 17 సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన నేరం మీదనే ఈ సెక్షన్లతో కేసు పెడతారు.

జూలై 1 – కేరళ ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్నప్రభా సురేశ్‌ ‌లేదా స్వప్నా సురేశ్‌ ఇక్కడే రంగప్రవేశం చేశారు. కస్టమ్స్ ‌శాఖ సహాయ కమిషనర్‌కు ఫోన్‌ ‌చేసి ఆ బ్యాగేజీని విడుదల చేయమని అడిగింది. తాను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌దౌత్య కార్యాలయంలోని కాన్సుల్‌ ‌జనరల్‌ ‌కార్యదర్శినని ఆమె చెప్పడం విశేషం. అయితే అప్పటికి ఆమె ఆ పదవిలో లేరు.

బ్యాగ్‌ ‌తెరవడానికి ఒకరోజు ముందు స్వప్న పరారయ్యారు. తాను అమాయకురాలిననీ, అక్రమంగా ఇరికించారనీ, ముందస్తు బెయిల్‌ ‌కావాలనీ కేరళ హైకోర్టులో పిటిషన్‌ ‌వేయించారు. బ్యాగ్‌ ‌బట్వాడాలో ఆలస్యం గురించి తెలుసుకోవడానికే తిరువనంతపురం కస్టమ్స్ అధికారికి తాను ఫోన్‌ ‌చేశానని, అది కూడా ఇక్కడి యూఏఈ కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌కార్యాలయం ఉన్నతాధికారి రషీద్‌ ‌ఖమిస్‌ అల్‌ ‌షిమిలి సలహా మేరకే చేశానని విన్నవించడం విశేషం.

జూలై 2 – ఈ తేదీన కస్టమ్స్ ‌శాఖ మీద ఒత్తిడి పెంచుతూ అలాంటి ఫోన్లే వచ్చాయి. అయినా ఆ బ్యాగ్‌ను విడిచిపెట్టేందుకు ఆ శాఖ నిరాకరించింది. పైగా దౌత్యకార్యాలయంలో ఎవరి పేరు మీద వచ్చిందో, ఆ వ్యక్తే స్వయంగా వచ్చి బ్యాగేజీ తీసుకువెళ్లాలని సూచించింది. ఈ సమయంలోనే దౌత్యకార్యాలయం ప్రజాసంబంధాల మాజీ అధికారి సరిత్‌ ‌కుమార్‌ ‌రంగంలోకి దిగారు. నేరుగా కస్టమ్స్ ‌కార్యాలయానికి వెళ్లి అధికారులను బెదిరించాడు. ఇతడి వెంట అరేబియన్‌ ‌దుస్తులలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఉండడం విశేషం.

జూలై 3 – బ్యాగేజీకి సంబంధించి దౌత్యకార్యాలయం అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకోవడానికి కస్టమ్స్ ‌శాఖ కేంద్ర అనుమతి పొందింది.

జూలై 4 – ఆ బ్యాగును తక్షణం వెనక్కి పంపించమంటూ కస్టమ్స్ ‌సహాయ కమిషనర్‌కు ఒక ఉత్తరం అందింది. అదేమీ పట్టించుకోకుండా, జూలై 5వ తేదీన హాజరు కావలసిందిగా కాన్సుల్‌ ‌జనరల్‌కు కస్టమ్స్ ‌శాఖ సందేశం పంపింది. ఆ రోజున బ్యాగేజీని తెరచి చూడాలని కస్టమ్స్ ‌నిర్ణయించి, కాన్సుల్‌ ‌జనరల్‌ను పిలిచింది.

జూలై 5 – ఢిల్లీ నుంచి వచ్చిన హైకమిషనర్‌, ఆ ‌బ్యాగేజీ ఎవరి పేరుతో దిగుమతి అయినదో అతడి సమక్షంలోనే మధ్యాహ్నం ఒంటిగంటకు కస్టమ్స్ అధికారులు తెరిచారు. అందులో 30 కిలోల బంగారం బయటపడింది. అయితే దౌత్యకార్యాలయం అధికారులు ఆ బంగారం తమది కాదని చెప్పారు. సాయంత్రం ఆరుగంటల వరకు తనిఖీ కార్యక్రమం జరిగింది. స్వప్న మధ్యాహ్నం 3.15కే స్విచాఫ్‌ ‌చేశారు. కస్టమ్స్ అధికారులు సరిత్‌ ‌కుమార్‌ను అరెస్టు చేశారు.

జూలై 7 – కేరళ ప్రభుత్వ ఐటి శాఖ కార్యదర్శి పదవి నుంచి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి పదవి నుంచి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. బంగారం అక్రమ రవాణాలో కీలక పాత్రధారులతో సంబంధం ఉన్న సంగతి తెలియడంతోనే ఈ చర్య తీసుకున్నారు. స్వప్నా సురేశ్‌తో ఉన్న సంబంధం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు ఆదేశంలో పేర్కొన్నారు కూడా.

జూలై 9 – ఈ కేసును ఎన్‌ఐఏ ‌దర్యాప్తునకు స్వీకరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులతో సమావేశమైన తరువాత కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా ఈ నిర్ణయం తీసుకున్నారు. తరువాత ఇంకొన్ని దర్యాప్తు విభాగాలు కూడా ప్రవేశించాయి.

జూలై 10 – ఈ కేసులో అనుమానితులు నలుగురి మీద అన్‌లాఫుల్‌ ‌యాక్టివిటీస్‌ (‌ప్రివెన్షన్‌) ‌చట్టం కింద కేసులు నమోదు చేశారు.

జూలై 11 – రెండో నిందితురాలు స్వప్న, నాలుగో నిందితుడు సందీప్‌ ‌నాయర్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు. మొత్తం నలుగురిని ప్రధాన నిందితులుగా జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వారు స్వప్న, సరిత్‌, ‌ఫాజిల్‌ ‌ఫరీద్‌. ‌ఫాజిల్‌ ‌యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. ఇతడి అరెస్టుకు ఇంటర్‌పోల్‌ ‌సాయం కోరారు.

మలప్పురంలో ఒక వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి పేరు రమీజ్‌. 2014‌లో జరిగిన ఇలాంటి కేసులో కూడా ఇతడు నిందితుడు. కేటీ రమీస్‌ అనే స్మగ్లర్‌ని కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇంకొందరిని ప్రశ్నించడానికి అదుపులోనికి తీసుకున్నారు.

కుట్రంతా తిరువనంతపురంలోనే హిదర్‌ ‌టవర్‌ అపార్ట్‌మెంట్‌లో, ఆరో నంబర్‌ ‌ఫ్లాట్‌లో జరిగిందని ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన కస్టమ్స్ అధికారుల బృందానికి ప్రాథమిక ఆధారాలు లభ్యమైనాయి. చిత్రం ఏమిటంటే ఇది కేరళ సచివాలయానికి పక్కనే ఉంది. స్వప్న, సరిత్‌ ఈ ‌కుట్ర గురించి ఇక్కడే చర్చించుకున్నారు. ఇందులో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఎం. శివశంకర్‌ ‌మూడేళ్ల పాటు ఉన్నాడు. ఈ ఫ్లాట్‌కు ఇంకో ఘనత కూడా ఉంది. రీబిల్డ్ ‌కేరళ వివాదంలో కూడా ఈ ఫ్లాట్‌ ‌పేరు వినిపించేది. దీని గత చరిత్రను తవ్వితే ఇంకెంత సమాచారం బయటపడుతుందోనని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ యూఏఈ తిరువనంతపురం ఇన్‌ఛార్జి షమిలీ పరారీలో ఉన్నట్టు రిపబ్లిక్‌ ‌టీవీ వెల్లడించింది. ఆ కార్యాలయంలో పనిచేసిన జయఘోష్‌ అనే అంగరక్షకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. మణికట్టు కోసుకుని, ప్రమాదస్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. తన మీదకు కేసు రాకుండే ఉండేందుకే అతడు ఈ ఎత్తు వేశాడని అంటున్నారు. ఇతడికి కూడా ఈ కేసులో కొన్ని కాల్స్ ‌వచ్చాయి.

హైదరాబాద్‌ ‌లింక్‌?

ఈ ‌కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్‌ ‌నుంచి జరిగాయని అనుమానిస్తున్నారు. కోట్లాది రూపాయలు హవాలా రూపంలోనే దుబాయ్‌కి చెల్లించినట్టు వస్తున్న ఆరోపణల మీద కస్టమ్స్ ‌శాఖ కూపీ లాగుతోంది.

ఫోన్‌ల మీద నడిచిన వ్యవహారం

బంగారం అక్రమ రవాణా ఆశ్చర్యం కాదు. దౌత్యమార్గం ఇందుకు ఉపయోగపడడం, 30 కిలోలు పట్టుబడడమే ఈ కలకలానికి కారణం.ఈ స్మగ్లింగ్‌ ‌వెనుక ఎవరు ఉన్నారనే విషయంలో దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు యూఏఈ కాన్సులేట్‌ ‌మాజీ పీఆర్వో సరిత్‌కుమార్‌ను అరెస్ట్ ‌చేశారు. ఇతను ఎయిర్‌ ‌పోర్టు నుంచి నేరుగా కాన్సులేట్‌ ‌చేరిన పార్శిల్స్ ‌నుంచి బంగారాన్ని బయటకు తరలించేవాడని తేలింది. అధికారులు సరిత్‌ను విచారించగా ఈ మొత్తం తతంగంలో కేరళ రాష్ట్ర ఐటీ, ఇన్ఫాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ‌పరిధిలోని స్పేస్‌ ‌పార్క్ ‌మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ‌స్వప్న పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. ఈమె గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పని చేసింది. ఈమెను, మరొక నిందితుడు సందీప్‌ ‌నాయర్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు. కస్టమ్స్ ‌వారికి మొదట ఫోన్‌ ‌చేసిందీ, మొదటిగా పలాయనం చిత్తగించినదీ ఈమే.

ఇంత జరిగినా స్వప్నా సురేశ్‌ను అరెస్టు చేయకుండా ఆపడానికి ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌కార్యాలయం నుంచి ఫోన్స్ ‌కాల్స్ ‌వెళ్లాయి. ఆమెను కేసు నుంచి తప్పించడానికి ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ ఎం.శివశంకర్‌ ‌కస్టమ్స్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్వప్నా సురేష్‌తో అతడి సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. తరచూ ఆమె ఇంటికి కూడా వెళ్లి వస్తుండేవాడని తేలింది. దొంగ సర్టిఫికెట్‌ ‌సమర్పించినప్పటికీ ఆమెకు ఐటీ శాఖలో కీలక స్థానం ఇప్పించింది కూడా శివశంకరే. ఇప్పుడు ఈ అంశం మీద కూడా దర్యాప్తు జరుగుతున్నది.

విపక్షాల ఆందోళన

బంగారం స్మగ్లింగ్‌ ‌కేసులో నిందితురాలిని తప్పించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఫోన్‌లు వెళ్లిన సంగతి మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సీఎం కార్యాలయం స్మగ్లర్లకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని కాంగ్రెస్‌, ‌బీజేపీ ధ్వజమెత్తాయి. కేరళ వామపక్ష ప్రభుత్వ పెద్దలు నిందితులను రక్షిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమానయాన శాఖ కేంద్రానిది కాబట్టి ఈ వ్యవహారానికి ఢిల్లీయే బాధ్యత వహించాలని సీపీఐ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించడం ఇందులో కొసమెరుపు.

ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ ‌మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. స్వప్నా సురేష్‌ను కాపాడటానికి సీఎంఓ కార్యాలయం నుంచి ఎందుకు ఫోన్‌లు వెళ్లాయి? గతంలో ఆమె మీద ఉన్న కేసులను పట్టించుకోకుండా ఐటీశాఖలో ఎలా నియమించారని సురేంద్రన్‌ ‌ప్రశ్నించారు. కేరళ విపక్ష కాంగ్రెస్‌ ‌నేత రమేశ్‌ ‌చెన్నితల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ ‌చేశారు. యూఏఈ కాన్సులేట్‌ ‌దౌత్యపరమైన అధికారాలను దుర్వినియోగం చేశారంటూ ఆరోపిస్తూ ప్రధానికి ఆయన లేఖ రాశారు. బంగారం స్మగ్లింగ్‌ ‌కేసుతో వామపక్షాలు, తోక మీడియా ఇరకాటంలో పడ్డాయి.

ఐటి కార్యదర్శి ఎం. శివశంకర్‌ ‌

సంబంధం లేదంటున్న పినరయి

స్వప్నా సురేష్‌ ఎవరో కూడా తనకు తెలియదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అం‌టున్నారు. ఆ మాట ఆయన అలా అన్నారో లేదో, ఏదో సందర్భంలో ముఖ్యమంత్రి పక్కనే స్వప్నా సురేశ్‌ ‌నడుస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో దేశ వ్యాప్తంగా హల్‌చల్‌ ‌చేయడం మొదలయింది. నిజమే, ముఖ్యమంత్రితో కలసి ఎవరెవరో ఫొటోలలో కననిపించవచ్చు. కానీ ఈ కేసు వరకు సీఎంవోకీ, బంగారం దిగుమతికీ ఏమిటి సంబంధం అంటూ పినరయి చేస్తున్న ఎదురుదాడి జుగుప్సాకరంగానే ఉంది. ‘బంగారం స్మగ్లింగ్‌ ‌కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? పార్శల్‌ ‌ప్రభుత్వ శాఖల నుంచి రాలేదు. అది యూఏఈ కాన్సులేట్‌కు వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది?’ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఆ బంగారం బ్యాగ్‌ను విడిచిపెట్టాలని బెదిరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌కాల్స్ ఎం‌దుకు వెళ్లినట్టు? ఇందులోని దేవ రహస్యాన్ని పినరయి వెల్లడిస్తారని అనుకోవడం దురాశ. మొదట ఇలా డాంబికాన్ని ప్రదర్శించినా, క్రమంగా లింకులు బయటపడటం, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను విధుల నుంచి తొలగించారు ముఖ్యమంత్రి. ఈ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందనడానికి ఇదే తొలి సంకేతం.
బంగారం పట్టుబడినాక కొన్ని వందల ఫోన్‌కాల్స్ ‌చెవులు మారాయి. స్వప్న ఒక్కరే యూఏఈ తిరువనంతపురం కాన్సులేట్‌ ‌జనరల్‌ ఉన్నతాధికారి రషీద్‌ ‌ఖమిస్‌ అల్‌ ‌షమిలికి 117 కాల్స్ ‌చేసినట్టు రిపబ్లిక్‌ ‌టీవీ బయటపెట్టింది. సరిత్‌ 3 ‌నుంచి 4 కాల్స్ ‌చేశారు. షమిలి కస్టమ్స్ ‌శాఖకు 20 కాల్స్ ‌చేశారు.

మరోవైపు ఈ కేసులో గురించి దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఆ బంగారం బ్యాగ్‌ ‌రషీద్‌ ‌ఖమిస్‌ అల్‌ ‌షమిలి పేరుతోనే వచ్చింది. ఆయన మీద ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఇప్పటికే తాజా కేసు నిందితులలో ఒకరు సందీప్‌ ‌నాయర్‌ ‌ప్రశ్నించారు. నిజానికి బంగారం దిగుమతి కావడానికి అవసరమైన వీసా, ఇతర అనుమతి పత్రాలు సమకూర్చినది కూడా ఆయనే. భారతదేశంలో యూఏఈ మిషన్‌ ‌ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. యూఏఈ కాన్సులేట్‌ ‌చిరునామాకు బంగారం బ్యాగేజీ ఎవరు పంపించారో తెలుసుకునేందుకు తమ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. యూఏఈ ఇందులో నిబద్ధత కనపరిస్తే కేరళ, ముస్లిం ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని వాస్తవాలైనా వెలుగుచూస్తాయి.

ఎన్‌ఐఏ ‌విచారణ అనివార్యం

ఈ స్మగ్లింగ్‌ ‌జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. తీవ్ర విమర్శల తరువాత బంగారం స్మగ్లింగ్‌పై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి విజయన్‌ ‌కూడా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇన్ని కోణాలూ, ఇంత లోతూ ఉన్నందునే కేరళ బంగారం కేసులో కేంద్ర హోంశాఖ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా ఎన్‌ఐఏను ఆదేశించింది. పెద్ద తలకాయల ప్రమేయాన్ని బట్టి కేంద్రం తీవ్రంగా పరిగణించక తప్పలేదు. ఢిల్లీ నుంచి ఏ చిన్న ఆదేశం ఇచ్చినా ఫెడరల్‌ ‌వ్యవస్థను బీజేపీ కాలరాస్తున్నదంటూ గగ్గోలు పెట్టే సీపీఎం ప్రభుత్వం, కేసును ఎన్‌ఐఏకు అప్పగించినా తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉండడం ఈ వ్యవహారంలో దాని ప్రమేయం గురించిన మరొక సంకేతమే. కరోనాను అడ్డం పెట్టుకుని పొరుగు మార్క్సిస్టు దేశం కుట్రలు పన్నుతుంటే, మార్క్సిస్టు పార్టీ ప్రభుత్వం దేశంలో చేస్తున్నది కూడా దాదాపు అదే.

జాతీయభద్రతకు విఘాతం కలిగించే అంశం, అత్యంత దారుణమైన నేర కోణం ఉన్న ఈ బంగారం స్మగ్లింగ్‌ ‌వ్యవహారంలో వాస్తవాలు బయటకు రాక తప్పదు. ఇందులో ఇంకొన్ని పెద్ద తలలు కనిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

స్వప్నా సురేష్‌

ఎవరీ స్వప్న?

కేరళ బంగారం స్మగ్లింగ్‌ ‌కేసులో కీలక పాత్రధారి స్వప్నా సురేష్‌ ఎవరు? ఈ విషయం చర్చనీయంశంగా మారడం చిత్రమేమీ కాదు. కానీ, కేరళ సీఎం కార్యాలయం వ్యవహారాలు తెలిసిన కేరళవాసులందరికీ ఆమె పేరు సుపరిచితం. స్వప్నలో ఓ సినిమాకు కావాల్సినంత విలనిజం ఉంది.పెద్దగా చదువుకోకున్నా, అమోఘమైన తెలివితేటలు. చరిత్ర అంతా నేరపూరితమే. ఈమె పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సమావేశాలకు హాజరయ్యేది.
కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండేది. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న దుబాయ్‌లో కొంతకాలం పనిచేశారు. ఆపై తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే విమానయాన సంస్థ సాట్స్‌లో చేరారు. అరబ్బీ భాషా పరిజ్ఞానం కలిసిరావడంతో హెచ్‌ఆర్‌ ‌శాఖలో 2013లో ఉన్నతోద్యోగిగానే చేరారు. ఎంత నేరమనస్తత్వం అంటే, సాట్స్‌లో ఒక ఉన్నతాధికారి మీద కొందరి మహిళల చేత లైంగిక వేధింపుల ఆరోపణలు చేయించారామె. అందుకోసం 17 దొంగ పేర్లతో ఫిర్యాదులు తయారుచేశారు. దీనితో అక్కడా ఉద్యోగం ఊడింది. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదైంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా, ఆమె విడుదలకు పైనుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు చెబుతారు.

తరువాత యూఏఈ కాన్సులేట్‌ ‌జనరల్‌ ‌కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ‌కార్యదర్శిగా ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. తాను కూడా దౌత్యవేత్తనని చెబుతూ ఆమె రాష్ట్రంలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ కూడా అవకతవకలకు పాల్పడటంతో ఆమెను తొలగించారు. ఈ క్రమంలోనే అప్పటికే పెద్ద తలలతో పెరిగిన పరిచయాలతో స్వప్నా సురేష్‌ ‌కేరళ ప్రభుత్వ ఐటీ విభాగం కెఎస్‌ఐటిఐఎల్‌లో ఉద్యోగం సంపాదించారు. ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి శివశంకర్‌ ‌హయాంలోనే (ఆయన ఐటి శాఖ కార్యదర్శిగా కూడా చేశారు) ఇది జరిగింది. క్రమంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో పరిచయాలు పెంచుకున్నారు. ఆఖరికి దొంగబంగారం తాజా వివాదం తరువాత కూడా శివశంకర్‌ ‌కెఎస్‌ఐటిఐఎల్‌లో ఒక విభాగం బిజినెస్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌మేనేజర్‌గా సిఫారసు చేశారు. కానీ ఆ ఉద్యోగానికి కనీసార్హత డిగ్రీ. అప్పుడు తేలిన సంగతి స్వప్న ఎనిమిదో తరగతి వరకే చదివింది. ఈ వాస్తవం సాక్షాత్తు విదేశాలలో ఉంటున్న ఆమె సోదరుడు, ఆమె మాజీ సహోద్యోగులు బయటపెట్టారు. ఆ ఉద్యోగాలలో ఆమె ఎలా చేరింది? నకిలీ పత్రాలతోనే. భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వప్నా సురేశ్‌కు ఒక కుతూరు ఉన్నట్టు తెలుస్తోంది.

– ‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్ జర్నలిస్టు

About Author

By editor

Twitter
YOUTUBE