భారత ప్రభుత్వం ఇటీవల చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లను (యాప్స్) ‌నిషేధించిన విషయం తెలిసిందే. నిషేధించిన వాటిలో విశేష ప్రాచుర్యం పొందిన టిక్‌-‌టాక్‌, ‌హలో, వుయ్‌ ‌చాట్‌ ‌వంటి సోషల్‌ ‌మీడియా అప్లికేషన్లతో పాటు విరివిగా వినియోగంలో ఉన్న షేర్‌-ఇట్‌, ‌యూసీ బ్రౌజర్‌ ‌వంటి టూల్స్, ఆన్‌లైన్‌ ‌షాపింగ్‌ ‌యాప్‌ ‘‌క్లబ్‌ ‌ఫ్యాక్టరీ’ కూడా ఉండటం గమనార్హం. భారత జాతీయ భద్రత, సార్వభౌమత్వాలకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో ఈ మొబైల్‌ అప్లికేషన్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ప్రకటనలో తెలియజేసింది.
ప్రమాదకరమైన మొబైల్‌ ఈ 59 అప్లికేషన్ల వినియోగానికి అడ్డుకట్ట వేయాల్సిందిగా సూచిస్తూ గతంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జాతీయ సైబర్‌ ‌కోఆర్డినేషన్‌ ‌సెంటర్‌ ‌భారత ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది వినియోగ దారులు తమ 45 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ ‌పరికరాల్లో ఈ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. వీరిలో 3.2 కోట్ల మంది టిక్‌-‌టాక్‌, 5 ‌కోట్ల మంది హలో యాప్‌, ‌మరో 5 కోట్ల మంది షేర్‌-ఇట్‌ అప్లికేషన్లు వినియోగిస్తున్నవారున్నారు.

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద దేశంలో అధికశాతం ప్రజలు సానుకూలంగా స్పందిస్తుంటే, కుహనా మేధావి వర్గానికి చెందిన కొందరు మాత్రం ‘చైనా అప్లికేషన్లను నిషేధించి సాధించేది ఏముంటుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కావాలంటే 2001 సంవత్సరానికి వెళ్లాలి.

భారతదేశంలో ఇంటర్నెట్‌ ‌వినియోగం అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయం. 2001లో ‘నౌ ఇండియా’ (Now India) అనే సర్వీస్‌ ‌ప్రొవైడర్‌ (‌కంపెనీ) అత్యంత అందుబాటు ధరలోనే ఇంటర్నెట్‌ ‌సౌకర్యం కల్పిస్తూ మార్కెట్లో భారీ ప్రచారంతో ముందుకు వచ్చింది. ఈ ప్రచారం ఇంటర్నెట్‌ ‌వినియోగదారులను తీవ్రంగా ఆకర్షించింది. అనేకమంది ‘నౌ ఇండియా’ సేవలు వినియోగించడం మొదలుపెట్టారు. వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వస్తున్న సమయంలో ‘నౌ ఇండియా’ సేవలకు సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ, తమ సర్వీసులో భాగంగా, ఇంటర్నెట్‌ ‌కనెక్షన్‌ ‌పొందుతున్న ప్రతి కంప్యూటర్‌ ‌సిస్టంలో ఒక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ ‌చేస్తూ వచ్చింది. ఈ సంస్థ ఇంటర్నెట్‌ ‌సేవలు పొందుతున్న కంప్యూటర్లను రిమోట్‌ (‌వేరే ప్రదేశం నుండి ఇంటర్నెట్‌ ‌ద్వారా) గ్రహించడం ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్దేశం. దీన్ని ఇన్‌స్టాల్‌ ‌చేయడానికి కంప్యూటర్‌ ‌వినియోగదారుని అనుమతి అవసరం ఉండదు. ఇది ఇన్‌స్టాల్‌ అయిన విషయం కూడా సాధారణ వినియోగదారుడికి తెలియదు. దీని ద్వారా అనేక పర్సనల్‌ ‌కంప్యూటర్లలో ఉండే సమాచారాన్ని ఇతరులు రిమోట్‌ ‌ద్వారా గ్రహించగలరన్న వాదనలోని వాస్తవం కోసం అప్పట్లో ‘నౌ ఇండియా’ సంస్థ నిజనిర్ధారణకు సిద్ధపడాల్సి వచ్చింది.

అనంతరం ‘నౌ ఇండియా’ చైనాతో సత్సంబంధాలు కలిగిన ఓ హాంకాంగ్‌ ‌వ్యాపారికి చెందిన మరో సంస్థకు అనుబంధ సంస్థగా మారింది. పసిఫిక్‌ ‌కన్వర్జెన్స్ (‌మారిషస్‌) అనే మరో విదేశీ సంస్థతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది కూడా. గమనించాల్సిన విషయం ఏమిటంటే, పసిఫిక్‌ ‌కన్వర్జెన్స్ ‌కూడా పైన పేర్కొన్న హాంకాంగ్‌ ‌సంస్థకు అనుబంధంగా కొనసాగుతోంది. దీంతో వినియోగ దారులకు చేరాల్సిన ఇంటర్నెట్‌ ‌మరో సంస్థకు చెందిన రెండు సర్వర్ల గుండా హాంకాంగ్‌ ‌లోని చైనా కంపెనీ గేట్‌వేను చేరేవిధంగా ప్రణాళిక రచించారు. అప్పట్లో కొందరు ఈ అంశాన్ని బయటపెట్టగా, వారిని మతిభ్రమించిన వారిగా చిత్రీకరించారు.

వ్యూహాత్మక దాడికి ప్రణాళిక

‘అన్ని యుద్ధాలూ గెలవడం గొప్ప లక్షణం కాదు. యుద్ధం చేయకుండానే శత్రువును బలహీనపరిచి, నిర్వీర్యం చేయడమే గొప్ప లక్షణం’. సన్‌ ‌జూ పేరిట యుద్ధకళలను గురించి రాసిన ప్రసిద్ధ గ్రంథంలోని ఈ సూ•త్రం గ్రహించిన చైనా, దాన్ని భారత్‌ ‌మీద ప్రయోగించేందుకు సిద్ధమైంది. అందుకోసం కొన్ని కీలకమైన, ప్రభావవంతమైన అంశాలను ఎంచుకుంది.

మనుషుల మెదడు, నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపిస్తూ, శత్రుదేశాల నాయకుల నుండి ప్రజలనూ, వారి సైన్యాధిపతుల నుండి సైన్యాన్నీ మానసికంగా వేరుచేసి, వారి మధ్య అగాధం సృష్టించగల పరికరాల అభివృద్ధికి చైనా కృషిచేయడం మొదలుపెట్టింది. ఆధునిక సమాజం సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రాండ్‌ (RAND) అనే సంస్థకు చెందిన భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు మార్క్ ఎ ‌స్టోక్స్ ‘‌చైనా వ్యూహాత్మక ఆధునీకరణ’ మీద జరిపిన పరిశోధన తాలూకు నివేదికలో చైనా ఇంజనీర్లు సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రత్యర్థుల కంప్యూటర్‌ ‌సిస్టమ్స్‌లో వైరస్‌ (‌బింగ్డు)ను వైర్‌లెస్‌ ‌ద్వారా ప్రవేశపెట్టే విషయం సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరిపినట్టు తెలిపారు.

ఈ కారణంగానే రక్షణ, అంతరిక్ష పరిశోధన వంటి కీలక రంగాల్లోని అనేక విభాగాల్లో చైనా సాఫ్ట్‌వేర్‌, ‌మొబైల్‌ అప్లికేషన్లతో పాటు, హార్డ్‌వేర్‌ ‌పరికరాల వినియోగాన్ని గతంలోనే నిషేధించారు. అయితే, సామాన్య పౌరులు వినియోగిస్తే దేశభద్రతకు ముప్పు ఏమిటి అనేది ప్రశ్న. దానికి సమాధానం తెలుసుకోవాలంటే బోట్‌నెట్‌ (‌Botnet), ఆర్టిఫిషల్‌ ఇం‌టెలిజెన్స్ (AI)‌లను అర్ధం చేసుకోవాలి.

రోబోట్‌ ‌నెట్‌వర్క్ అనే పదానికి సంక్షిప్త రూపం బోట్‌నెట్‌. ఒక నెట్వర్క్ ‌ద్వారా అనుసంధానం అయిన వివిధ కంప్యూటర్ల పనితీరును పర్యవేక్షిస్తూ, వాటిని సమన్వయపరిచే ఒక సాంకేతిక వ్యవస్థ తాలూకు సాధనాలను బోట్‌-‌నెట్లు అంటాం. ఇవి ముఖ్యంగా చాట్‌-‌రూమ్స్ (‌గతంలో యాహూ వంటి సంస్థలు అందించిన చాటింగ్‌ ‌వ్యవస్థ)ను అదేపనిగా వినియోగించే కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకునేవి. బోట్‌-‌నెట్‌ ‌పక్రియలో కొన్ని చట్టబద్ధంగా వ్యవహ రించే సాఫ్ట్‌వేర్లు ఉండగా, కొన్ని సందర్భాల్లో మాత్రం చట్టవిరుద్ధంగా, వినియోగదారుల కంప్యూటర్లలోని సెక్యూరిటీ వవస్థలో ఉన్న లొసుగులు కనిపెట్టి, వాటిని హ్యాక్‌ ‌చేసే సాఫ్ట్‌వేర్లు కూడా ఉంటాయి.

తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు ఈ బోట్‌-‌నెట్స్ ‌నెట్‌వర్క్‌లో అనుసంధానం అయి వున్న కంప్యూటర్లను తమ నెట్‌వర్క్‌కు లింక్‌ ‌చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీనికోసం కంప్యూటర్‌ ‌వినియోగ దారుల్ని తప్పుదోవపట్టిస్తూ, వారి ద్వారానే ట్రోజన్‌ ‌హార్స్ (Trojan Horse) అనే సాఫ్ట్‌వేర్‌ ‌వైరస్‌ను వారి కంప్యూటర్లలోకి డౌన్‌లోడ్‌ ‌చేసి, ఇన్‌స్టాల్‌ ‌చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తాయి. ఒకసారి ఆ ట్రోజన్‌ ‌హార్స్ ‌కంప్యుటర్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యాక, వినియోగదారుడి ప్రమేయం లేకుండా, అతడికి తెలియకుండానే ఆ కంప్యూటర్‌ ‌బోట్‌-‌నెట్‌ ‌ద్వారా శత్రువు మాస్టర్‌ ‌కంప్యూటరుకు అనుసంధానం అవుతుంది. ఇదే పక్రియలో ఇంటర్నెట్‌ ‌వినియోగించే మొబైల్‌ ‌వినియోగదారులను కూడా లక్ష్యంగా చేసుకుని, వారి కంప్యూటర్‌, ‌ట్యాబ్‌, ‌మొబైల్‌ ‌పరికరాలను శత్రువులు పర్యవేక్షిస్తూ, అవసరమైతే దానిని నియంత్రించే అధికారం వారికి కలుగుతుంది.

వినియోగదారుల అనుమతి (End User Agreement)
చాలా సందర్భాల్లో మనం మొబైల్‌ అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ ‌చేసుకొని, ఇన్‌స్టాల్‌ ‌చేసే సమయంలో మనకు ‘I Agree’ (నేను అంగీకరిస్తున్నాను) అంటూ ఒక డైలాగ్‌ ‌బాక్స్ ‌ప్రత్యక్షమవుతుంది. దాన్ని అంగీకరిస్తూ ఇన్‌స్టాల్‌ ‌చేయడం ద్వారా సదరు మొబైల్‌ అప్లికేషన్‌ ‌కంపెనీలకు మన మొబైల్‌ ‌ఫోన్లలో డేటాను గ్రహించగల అధికారం, సౌలభ్యం కలుగుతుంది. అటువంటి డాటాలో మొబైల్‌లో నిక్షిప్తమైన కాంటాక్టులు, మెసేజీలు, వీడియో-ఆడియో ఫైళ్లు, ఫోటోలు, పొందుపరుచుకున్న నోట్‌లు కూడా ఉంటాయి. కొన్ని మొబైల్‌ అప్లికేషన్లు క్లిప్‌-‌బోర్డులను గ్రహించే సౌలభ్యం కూడా పొందుతాయి. మనం మొబైల్‌లలో ఉపయోగించే బ్యాంకింగ్‌, ‌రైల్వే ఇతర గోప్యమైన వ్యవహారాలకు సంబంధించిన పాస్‌వర్డస్ ‌క్లిప్‌-‌బోర్డులో స్టోర్‌ అవుతాయి. కాబట్టి క్లిప్‌-‌బోర్డులను గ్రహించే అధికారం ఇవ్వడం అంటే ఏకంగా మన వ్యక్తిగత బ్యాంకింగ్‌, ఇతర కీలక వ్యవహారాలకు సంబందించిన అంశాలను గ్రహించేందుకు అవకాశం, అనుమతి ఇచ్చినట్టే.

కేవలం చైనాకు చెందిన మొబైల్‌ అప్లికేషన్లే కాకుండా, అన్ని కంపెనీలు మొబైల్‌ ‌వినియోగదారుల అభిరుచులను కనిపెట్టేందుకు ‘ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్’ ‌పక్రియను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు.. మొబైల్‌ ‌వినియోగదారులు తమ మొబైల్‌ ‌నుండి ఏదైనా హోటల్‌ ‌కోసం సెర్చ్ ‌చేసిన కాసేపటికి, వాళ్లకు హోటల్‌ ‌రేట్ల డిస్కౌంట్లకు సంబంధించిన యాడ్స్, ‌మెసేజీలు వస్తూ ఉండటం వంటివి చాలా మంది గమనించే ఉంటారు. దీనికి కారణం ఆర్టిఫిషియల్‌ ఇం‌టలిజెన్స్ ఉపయోగించే మొబైల్‌ అప్లికేషన్ల డౌన్‌లోడ్‌ & ఇన్‌స్టాల్‌ ‌సమయంలో మనం వారికి ‘I Agree’ అంటూ అనుమతి మంజూరు చేయడమే. ఈ విధానం ద్వారా, మన అభిరుచులు, ఆలోచనల తాలూకు డేటా ఇతర కంపెనీలకు విక్రయిస్తూ మొబైల్‌ అప్లికేషన్లు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి.

టెక్నాలజీపై పరిమితికి మించి ఆధారపడటం వల్ల కలిగే దుష్పరిణామం ఇది. మనం మన మొబైల్‌ ‌లేదా కంప్యూటర్లలో డౌన్‌లోడ్‌ ‌చేసి ఇన్‌స్టాల్‌ ‌చేసుకుంటున్న అప్లికేషన్లు మనం విశ్వసిస్తున్న వ్యవస్థ, వనరులు, సర్వర్ల ద్వారా మనకు లభ్యమవుతున్నాయా అనే అంశం అత్యంత కీలకం. కానీ ఇక్కడ మనం ఎన్నటికీ నమ్మలేని దేశం చైనా. పైన పేర్కొన్న నిషేధిత మొబైల్‌ అప్లికేషన్లు ఆ దేశానికి చెందినవే.

చైనా ఆర్మీ పెట్టుబడులు
పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీగా పిలిచే చైనా ఆర్మీ వ్యవస్థ వ్యూహాత్మక వ్యాపారంలో కూడా కాలుమోపడం గమనించాల్సిన విషయం. ఇది సాధారణంగా భారతదేశ ప్రజల ఊహకు అందని విషయం. ఎందుకుకంటే మనం సాధారణంగా ఇతర దేశాల ఆర్మీ వ్యవస్థను రాజకీయాలకు, వ్యాపారానికి అతీతంగా ఉండే మన దేశీయ ఆర్మీ వ్యవస్థతో పోల్చి చూస్తూ ఉంటాం. కాబట్టి చైనీస్‌ ‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టె సంస్థలను ఆచితూచి గమనించడం అత్యంత ఆవశ్యకం.

చైనా లక్షణం ఏమిటంటే, టూరిస్టులు మొదలుకుని, సైంటిస్టులు, కంపెనీ అధికారుల వరకు తమ లక్ష్యానికి ఎవరైతే పనికివస్తారని భావిస్తుందో, వారందరినీ చేరదీస్తుంది. అంతేకాకుండా తమకు అనుకూలంగా అనేక విషయాలపై వ్యవహారాలు నెరిపే వ్యక్తులు, మీడియా జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు ఇలా అనేక మందికి తక్కువ ఖర్చుతో మౌలిక సదుపా యాలు, వసతులు, సేవలను చైనా అందిస్తోంది. ఈ దృఢమైన నిశ్చయం ద్వారానే చైనా ఈరోజుకి గూఢచర్యం, సమాచార చోరీ మొదలైన కార్య కలాపాలకు పాల్పడుతోంది.

ఈ కారణంగానే చైనా ప్రమాదాన్ని అమెరికా ముందే పసిగట్టింది. ది టైమ్‌ ‌మ్యాగజైన్‌ ‌కథనం ప్రకారం అక్కడి ఫెడరల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌సంస్థ (FBI) దాదాపు 3000 కంపెనీలను చైనాకు సమాచారాం చేరవేస్తున్నాయన్న అనుమానిత జాబితాలో చేర్చింది.

నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న ‘మేధావుల’ సంగతేమిటి?
ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా పనిచేసి, ప్రచారం చేసే విధంగా మీడియా రంగంలో చైనా దాదాపు 1.3 బిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఈ ధనం చైనా ప్రణాళికను అమలుకు సహకరించే జర్నలిస్టులు, విదేశీ అధికారులు, థింక్‌-‌ట్యాంకులు (ప్రణాళికా బద్ధమైన సూచనలు అందించే గ్రూపులు)లకు నేరుగా చేరుతున్నది. ఈక్రమంలో చైనాకు చెందిన మీడియా సంస్థ జిన్‌-‌హువాకు ప్రపంచవ్యాప్తంగా 170 సంస్థలు ఉన్నాయి. చైనా అధికారిక రేడియో సంస్థ 14 దేశాల్లోని రేడియో స్టేషన్లను నియంత్రిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వందల కొద్ది తమ అనుకూల ప్రణాళికలకు రూపకల్పలనకు సలహాలు ఇచ్చే సంస్థలకు (థింక్‌-‌ట్యాంకు)ల ఏర్పాటుకు చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మన చుట్టూ మేధావులుగా చెలామణి అవుతున్న అనేకమంది చైనా ఇస్తున్న కానుకలపై ఆధారపడి పనిచేస్తున్న విషయం తెలిసిన విషయమే.
ఓ వైపు భారతీయ జవాన్లు చైనాను దీటుగా ఎదుర్కొంటున్న ఈ సమయంలో మనం మన పరిమితి మేరకు చేయగలిగింది ఒక్కటే. క్రమానుగతంగా చైనా సాఫ్ట్‌వేర్‌, ‌మొబైల్‌ అప్లికేషన్లు, మొబైల్‌ ‌ఫోన్లు, ఇతర హార్డ్‌వేర్‌ ‌పరికరాల వినియోగం తగ్గించుకుంటూ, వాటి స్థానంలో భారతీయ ఉత్పత్తులు, ఒకవేళ అవి అందుబాటులో లేకపోతె చైనా కాకుండా ఇతర మెరుగైన ఉత్పత్తులను వాడటం.

రిఫరెన్స్ :
1. www.swadeshitech.in
2. www.wionnews.com
3. www.norton.com
4. www.arisebharat.com
5. Will the Iron Fence Save A Tree Hollowed by Termites?
6. TIME Magazine /Contact:9848038857. [email protected]

– ఆయుష్‌ ‌నడింపల్లి,  ఐటి నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE