జూలై 22 దాశరథి జయంతి
దాశరథి కృష్ణమాచార్యులు… ఆ పేరు విన్నవెంటనే స్ఫురించే వాక్యం జన్మభూమి కీర్తిని ఎలుగెత్తిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’. నిజాం నిరంకుశ పాలనపై అక్షర శరాలు సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు. అభ్యుదయ కవిగా ఆవిర్భవించి భావకవితా గీతాలకు పట్టం కట్టిన కవి కుమారుడు. ఆయనలో ఎంత ఉద్యమ తీవ్రత ఉందో అంతే శృంగార కవితా ప్రియత్వం ఉంది. అందుకే కవిత్వంలో అంగారాన్ని, శృంగారాన్ని సమస్థాయిలో పండించారు. పాతికేళ్లలోపు వయసులోనే ‘మహాకవి’గా ప్రశంసలు అందుకున్నారు. అందరికీ తెలిసిన మంచి చలనచిత్ర గీతకర్త. అన్నిటికి మించి ఉన్నత వ్యక్తిత్వం,స్నేహశీలుడు. ఆచరణవాదేకాని అవకాశవాది కాదని, ‘హార్థిక’ సంబంధికుడే కాని ‘ఆర్థిక’ సంబంధికుడు కారని ఆయనను ఎరిగిన వారందరికి తెలుసు. అంకితభావ పోరాటం విషయంలో దాశరథి ఎంత నిబద్ధుడో తెలిపేందుకు ఒక ఉదాహరణ. దాశరథి సహా ముప్పయ్ మందిఖైదీలను అరవై మంది సాయుధ రక్షకభటుల ఆధ్వర్యంలో మరో జైలుకు తరలించే సందర్భంలో జంగారెడ్డి అనే ఖైదీ మిత్రుడు, ‘అయ్యో మనల్ని చంపేస్తారేమో’ అని బేలగా పలికినప్పుడు ‘మనం బతకడానికి కాదుకదా ఉద్యమంలో దూకింది? నీకు ఇంటికి వెళ్లే ఆశలేదు కదా? అయినప్పుడు చద్దాం. భయపడకు. పదిమందితో చావు పెళ్లితో సమానం’ అని తాపీగా చెప్పారట. అలా జన్మభూమి అన్నా, దానిపై రచనలన్నా ఆయనకు తగని మక్కువ. అందుకే దేవులపల్లి రామానుజరావుగారు
‘దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణ మందుండరు
దాశరథిని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు
దాశరథి స్వీకరింపని కావ్య వస్తువు తెలంగాణలో లేదు
దాశరథియే తెలంగాణము, తెలంగాణమే దాశరథి’ అని ‘అగ్నిధార కావ్యం ముందుమాటలో ప్రశంసించారు. అయినా కొందరు, ఆయన సొంతగడ్డపై మమకారంతో చేసిన త్యాగాలను, మహోన్నతమైన కవిత్వాన్ని విస్మరించి లోటుపాట్లను ఎత్తిచూపేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఉదాహరణకు, అప్పట్లో ఆయన సమైక్యవాదాన్ని సమర్థించారు. అలా అని ఆయన జన్మభూమిని నిరాదరించలేదు. తెలంగాణ విమోచనం కోసం నిజాం నవాబుపైనే తిరుగుబాటు చేసిన సంగతి జగద్వితమే. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ; నా తెలంగాణ కంజాతవల్లి’అని శ్లాఘించారు. తెలంగాణ విమోచనం తరువాత తన కృతిని ‘ఆ తల్లి’ కి అంకితమిచ్చారు.
పేదరికంలోనూ ధైర్యంగా,నిశ్చలంగా,నిశ్చింతగా ఉండేవారు. పేదరికం ఒక భావన మాత్రమే. కూడు,గూడు, గుడ్డ కొరతే దారిద్య్రం కాదని, సమాజంలో తాను ప్రేమించే వారు, తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన దారిద్య్రమని భావించిన వ్యక్తి. స్వాభిమానం కల ఆయనకు విద్యార్థి దశ నుంచీ ఉద్యోగం వరకు అర్ధించే తత్వం లేకపోవడం, లేనిదాని కోసం తాపత్రయపడకపోవడం, ఉన్నదానితో తృప్తి పడడం,అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, కష్టించి ఆర్జించడం లాంటి గుణాలను చివరికంటా కొనసాగించారు. ‘సంపాదిస్తూ విద్యను అభ్యసించే’ సూత్రాన్ని పాఠశాల దశలోనే పాటించి చూపారు దాశరథి. తోటి విద్యార్థులకు వ్యాకరణం, ఉర్దూ ట్యూషన్‌లుచెప్పి అలా వచ్చిన ప్రతిఫలంతో ఆర్థిక అవసరాలు తీర్చుకునేవారు. పుస్తకాలు కొనుగోలు చేసి సాహిత్య అధ్యయన అభిలాషను తీర్చుకున్నారు. పేదరికంలోనూ ధైర్యంగా, నిశ్చలంగా, నిశ్చింతగా ఉండేవారు. కష్టాలకు కుంగక•, సుఖాలకు పొంగక స్థితప్రజ్ఞత్వం చూపిన వ్యక్తిగా చెబుతారు. మనిషి బలహీనుడు కాడన్నది ఆయన దృఢ విశ్వాసం. కాలం విలువ తెలిసిన వారు. ‘జీవితంలో ప్రతి క్షణం నాకు అమూల్యం’అనే వారు. ‘ఆయన ఉద్రేకి. అన్యాయాన్ని సహించలేడు. దిగజారే పనిచేసేరకం కాదు’అని ఆయన మిత్రుడు హీరాలాల్ మోరియా ఒక ముఖాముఖీలో పేర్కొన్నారు. దానిని ఎదుర్కోవడంలో వ్యక్తిగత ప్రయోజనాలను నష్టపోయారు.
పాతికేళ్ల వయసుకే ‘మహాకవి’ అనిపించుకున్నా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వానికి నిలువెత్తు నిదర్శనం దాశరథి. అందుకే తనను ఆదరించిన వారిని, మూలాలను మరువలేదు. చిన్నపాటి సహాయం చేసిన వారినీ విస్మరించకపోవడం, వారితో స్నేహసంబంధాలు కొనసాగించడం,సందర్భం వచ్చినప్పుడల్లా వారిని గుర్తు చేసుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం.
నచ్చిన రచనను మెచ్చి ప్రోత్సహించడం, అభినందించడం ఆయన నైజం. వర్థమాన కవులను ప్రోత్సహించడంలో ముందుంటూ వారి రచనలకు ‘ముందుమాట’ రాసేవారు. ‘మనం చేయవలసిందల్లా రచయితను,ఆయన రచనను ఆస్వాదించడం, ఆస్వాదించిననప్పుడు దానిని నాలుగు వాక్యాల్లో వ్రాసి పంపడం. దానికి వారెంతో సంతోషిస్తారు గదా?నేనేదో మహాకవిని, ఆస్థానకవినని మిగతా వారిని అభినందించకూడదని లేదుగా’ అనేవారని ఆయనతో తొలిపలుకులు రాయించుకున్నవారు మననం చేసుకోవడం తెలుసు.
ఇతరుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు తనలోని లోపాలను గుర్తించి చక్కదిద్దుకొనే వ్యక్తిత్వం ఆయన సొంతం. ‘స్వీయలోపంబు నెరుగుట పెద్ద విద్య’ అనే గాలిబ్ రచన అనువాదాన్ని తమకే తామే అన్వయించుకున్న వ్యక్తిత్వం. వృత్తిపరంగా ఇతరుల సలహా సహకారాలు తీసుకోవడంలో భేషజాలకు పోని వినయశీలి.
స్నేహమంటే మక్కువ. ‘చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ. అదే చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహం’అన్నారు దాశరథి. స్నేహం గురించి విస్పష్టంగా నిర్వచించిన ఆయన వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ దానిని ఆచరించి చూపారు. అందరికీ ఆయన మిత్రులే. ఆయనకు అందరూ మిత్రులే. వారిలోనూ మరికొందరు అత్యంత ఆప్తులు. ‘మా అన్నయ్య కల్లా కపటం ఎరుగనివాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయనకి వేల సంఖ్యలో మిత్రులున్నారు.ఆయనకు హెచ్చు తగ్గులు లేవు. ప్రధానమంత్రితోను, పసిపాపతోనూ ఒకేలా మాట్లాడేవాడు. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. అసలు… ఆయనకు మిత్రులు కాని వారెవరు? ఒక్క నిజాం ప్రభువు తప్ప’అన్నారు ఆయన సోదరులు డాక్టర్ రంగా చార్యులు. ఒక సోదరుడిగా అయన అలా కితాబుఇవ్వడం సహజమను కున్నా…‘స్నేహం కోసం,తను అభిమానించే వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి దాశరథి. అలాంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు’అని ఆయనకు అత్యంత సన్నిహితుడు, రచయిత, నటుడు, ఇటీవల దివంగతులైన గొల్లపూడి మారుతీరావు అనేవారు. ‘ఆయన సాహిత్యం ఎంత సరళమో అంత ఆవేశపూరితం. మనిషి, మనసు అంత మృదులం. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. తనను తాను రక్షించకోవడం తెలియని అమాయకుడు. కనిపించిన ప్రతి ఒక్కరిని నిండు మనసుతో ఆహ్వానించి హృదయానికి హత్తుకునే అద్భుత స్నేహితుడు.ఆయన చల్లటి స్నేహహస్తం అందుకున్నవారికి ఆయన వ్యక్త్తిత్వంలోని విశాలత్వం కనిపిస్తుంది. ఒక నిజాన్ని నమ్మడమే తప్ప ఇచ్చకాలు,ముఖప్రీతి మాటలు తెలీని మనిషి. ఎంత మృదుభాషో అంత కటువుగా ఉండేవారు. చాలా మందితో కటువుగా తగదాపడేవారు. అది ఆయన లోపమనుకోను. ఎదుటి వారి స్పందన బట్టి ఇవతలి వారి ప్రతిస్పందన ఉంటుందని గ•మనించాలి. ఆ నిక్కచ్చితనంతోనే డబ్బును అంతగా కూడబెట్టలేకపోయాడు. జీవితంలో వెనక్కి తిరిగి చూడ్దం అలవాటులేని కారణంగా చాలా నష్టపోయిన మనీషి’ అని వ్యాఖ్యానించారు.’
‘స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ముందుండే అరుదైన కవి దాశరథి’ అన్నారు ప్రఖ్యాత గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి.
‘కవితాశరథికి నవయువ
కవి దాశరథి నిత్య కళ్యాణమగున్
రవికుల దాశరథికి వలె మా
కవికుల దాశరథి పరిధి కడలు కొను నిలన్’ అని వేటూరి చెప్పిన పద్యానికి బదులుగా…
‘ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరట సాహితుల్ హితుల్
చందురు వంటి చల్లనయ సాహిత సౌహితి గుత్తకొన్నవా
రెందరు అందరన్ దిగిచి ఈ కవి డెందము హత్తుకొన్న మా
సుందరరామమూర్తికి వసుంధరలో నుపమానమున్నదే’ అని ప్రత్యుత్తరమిచ్చిన సరసకవి.
దాశరథి వ్యక్తిత్వాన్ని వేటూరి వారి మాటల్లోనే చెప్పాలంటే ‘తాను సమగ్రాంధ్ర సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచినా పట్టుకొమ్మల పట్టు చిక్కించుకుని ప్రభుత్వ కరుణా కటాక్షాలకై ప్రాకులాడలేదు. సినిమా రంగంలో ‘గ్లామర్’ కోసం వాలనూ లేదు. ‘పట్టు’ పరిశ్రమలో పట్టా పుచ్చుకున్నవాడు కాదు. కడుపులో కల్మషం లేకుండా ఘటం వాయించినట్లు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే స్వభావం. కొన్ని తరాల ప్రతిభా పాటవాలకు,అవి పొందవలసిన అవకాశాలకు అడ్డుతగిలి దొరవారి సత్రపు వారసత్వ దూలాలకు,పొగచూరిన చూరులకు వ్రేలాడిన దివాంధాల జాబితాలో అతను చేరలేదు. కాని యోగ్యత ఉంది. ఆ విధంగానే ఆస్థానకవి కాగలిగాడు’. అయితే అలా అందివచ్చిన ‘ఆస్థానకవి’ పదవి అప్పటి ప్రభుత్వ విధానంతో దూరమైంది. ఆ పదవి అస్తిత్వానికే ముప్పు ఏర్పడింది. అది ఆయనను తీవ్రంగా కలచి వేసింది. పేదరికాన్ని ,నిజాం నిరంకుశత్వాన్ని సయితం ధైర్యంగా ఎదిరించి నిలిచిన ఆయన మనసు ఆ చేదు అనుభవాన్ని తట్టుకోలేక పోయింది. ‘నేనిక్కడ ఆస్థానకవిగా నియమింపబడిన కొద్ది రోజులకే నా మిత్రుడు కణ్ణదాసన్ అక్కడ (తమిళనాడు) ఆస్థానకవి అయ్యాడు. ఇప్పుడతను చనిపోయాడు…ఆస్థానపదవి అక్కడ ఉంది. వాట్ యాన్ ఐరనీ’ అనే మాటలు ఆయన కలత పడిన తీరును వివరిస్తాయి. ఈ ఆవేదన వెనుక సాహిత్యాభిమానమే కానీ పదవీ వ్యామోహం అనిపించదు.
‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది. అతను నాటు తెలుగు గూటిలో గుట్టుగా దాగి ఒక్కపెట్టున గుక్కపట్టి గొంతువిప్పిన కవితల గిజిగాడు…రాక్షసత్వపు రజాకారులకు మానవత్వపు ప్రజాకారుడై తిరగబడ్డ తెలుగుబిడ్డ. కవిగా పుట్టి కవిగా ఎదిగి కవిగా కన్నుమూసిన తెలుగుజాతి వైతాళికుడు. మరపురాని మధురమూర్తి’అన్నారు వేటూరి.
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి