సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ వికారి ఆషాడ బహుళ పాడ్యమి – 06 జూలై 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌
—————————————————————————————————————————————–

‌ప్రపంచమంతటా ప్రజలలో నిర్లక్ష్యం, చాలా ప్రభుత్వాలలో నిస్సహాయత పెరిగాయే తప్ప కొవిడ్‌ 19 ‌తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. కొన్ని దేశాలలో ఆ వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొన్నిచోట్ల శాంతించినట్టు కనిపిస్తున్నది. జూన్‌ 29 ‌నాటికి అందిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ 19 ‌వైరస్‌ 1,01,86,375 (ఒక కోటి మీద ఒక లక్షకు పైగా) మందిని కాటు వేసింది. 5,02,984 మంది చనిపోయారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సంఖ్య మరింత పెరుగు తుందనే చెప్పాలి తప్ప, మరొక మాటకు అవకాశమే లేదు. భారత్‌ ఇప్పుడు కొవిడ్‌ 19 ‌బాధిత దేశాలలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 5,49,197 మందికి వైరస్‌ ‌సోకింది. 16,487 మంది చనిపోయారు. ఇక మన రాష్ట్రాలలో మహారాష్ట్ర 1,59,138 కేసులతో (మరణాలు 7,2773) ప్రథమ స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో ఢిల్లీ (బాధితుల సంఖ్య 83,188; మృతులు 2,623), తమిళనాడు (బాధితులు 78,335, మృతులు 1,025) ఉన్నాయి. భారత రాజధానిలో కంటైన్మెంట్‌ ‌జోన్ల సంఖ్య 315 నుంచి 417కు పెరిగింది. ఎక్కడ చూసినా పెరుగుదలే. జూన్‌ 28, 29 ‌తేదీలలో వరసగా దేశంలో నమోదైన కేసుల సంఖ్య పదో పదిహేనో తక్కువగా ఇరవై వేలు. 410 మంది ఒక్కరోజులో చనిపోయారు. దేశ పాలనా రాజధానీ, ఆర్థిక రాజధానీ రెండూ కరోనా వైరస్‌తో మంచం పట్టడం పెద్ద విషాదం. జూన్‌ 29‌వ తేదీకి ముందు ఐదు రోజుల నుంచి ఏ రోజూ 15 వేలకు కేసులు తగ్గడం లేదు. ఇలా అంకెలు చెప్పుకుంటూ పోతే మనసు వికలమవుతుంది. కానీ వాస్తవాలు చూడక తప్పదు.
జూన్‌ 29 ఉదయానికి అందిన సమాచారం ప్రకారం అమెరికా 26,37,007, మృతులు 1,28,437/ బ్రెజిల్‌ 13,45,254, ‌మృతులు 57,658/ రష్యా 6,34,437, మృతులు 9,078 మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. భారత్‌ ‌నాలుగో స్థానంలో ఉంది. తరువాతి స్థానం యూకే (3,11,151, మృతులు 43,550)కి దక్కింది. స్పెయిన్‌ (2,95,850, ‌మృతులు 28,343) కూడా ఇంకా గట్టిగానే పోరాడుతోంది.
కేసులు పెరుగుతున్న స్థాయిలో మరణాల రేటు పెరగకపోవడమే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి గొప్ప ఊరట. ఈ ఊరటతోనే కాబోలు అనేక ప్రభుత్వాలు వైరస్‌ ‌దానికదే తగ్గాలి తప్ప, మానవ ప్రయత్నం అల్పమన్న భావనలోకి వచ్చినట్టే కనిపిస్తున్నది. లేదా వ్యాక్సిన్‌ ‌వచ్చేదాకా ఇంతే సంగతులు అన్న అభిప్రాయానికి వచ్చాయని అనుకోవాలి. వ్యాక్సిన్‌ ‌రాక ఎప్పుడో ఇప్పటికీ స్పష్టం కాలేదు. ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధన ముందంజలో ఉన్నదన్న వార్తలు వచ్చాయి. ఇది ఆశాజనకంగానే ఉన్నా, మనదేశంలో కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌నివారణకు ఉపయోగించవచ్చునని మొదట అనుకున్న మందులేవీ తగిన ఫలితాలనిచ్చేవి కాదని నిపుణులు చెప్పడం అశనిపాతం వంటిదే.
కొవిడ్‌ 19 ‌తీవ్రత పెరిగిపోతున్నట్టే, దాని లక్షణాలు కూడా మారుతు న్నాయి. దాని అవతారాల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ క్షణం వరకు కూడా దీనికి మందు సామాజిక దూరమే. అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా లాక్‌డౌన్‌ ‌మళ్లీ విధించాలన్న యోచనకి రాక తప్పడం లేదు. కొవిడ్‌ 19 అం‌టే ప్రపంచ ప్రజలలో, ప్రభుత్వాలలో ఎందుకింత అలక్ష్యం? మిగిలిన ప్రపంచం సంగతేమో కానీ, మనదేశం లోపల, ఇరుగు పొరుగు దేశాలు చేస్తున్న రాజకీయాలు కరోనా కంటే భయానకంగా ఉండడం వల్ల కావచ్చు. కరోనా సూక్ష్మజీవి కంటే జుగుప్సాకరంగా ఉండడం వల్ల కావచ్చు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ‌మహారాష్ట్ర, కేరళ వంటి బీజేపీయేతర రాష్ట్రాలు కరోనాతో ప్రజానీకం ఏమైనా పరవాలేదన్నట్టే వ్యవహరిస్తున్నాయి. ప్రజారోగ్యం కంటే కేంద్రం సూచనలను బేఖాతరు చేయడమే ముఖ్యమన్న విధానంలో నడుస్తున్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక చైనా, పాకిస్తాన్‌, ‌నేపాల్‌ ‌దేశాల ధోరణి రోత పుట్టిస్తున్నది. తనను పదవీచ్యుతుని చేయాలని భారత్‌ ‌పన్నాగం పన్నుతున్నదంటూ నేపాల్‌ ‌ప్రధాని శర్మ ఓలీ ప్రకటించడం వింతల్లో కల్లా వింత. ఆయన పీఠానికి సొంత కమ్యూనిస్టు కూటమి నుంచే సెగ తగులుతుంటే భారత్‌ ‌మీద నెపం పెట్టడం ఓ వికృత క్రీడ. కరోనాను అడ్డం పెట్టుకుని కశ్మీర్‌లో చొరబాటుకు పాకిస్తాన్‌ ‌కిరాయి మూకలను ప్రోత్సహిస్తూనే ఉన్నది. ఇక చైనా వైఖరి మరీ ఘోరం. కొవిడ్‌ 19 ‌గొడవలో పీకల్లోతు ఆరోపణలలో మునిగి ఉన్న ఆ దేశం, వాటి నుంచి చైనీయుల దృష్టిని మళ్లించడానికి భారత్‌కు సమస్యలు సృష్టించే పనిలో పడింది. లద్ధాఖ్‌ ‌వద్ద రగడ దాని ఫలితమే. ఇటు సొంత రాష్ట్రాలతో గొడవ, అటు ఇరుగు పొరుగుతో వివాదం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర సమస్యలుగా పరిణ మిస్తున్న సంగతి నిజం. ఇలాంటి ఒక మహా విపత్తును కూడా రాజకీయాలు చేయడానికి, సమస్యను గాలికొదిలి రాజకీయ ప్రత్యర్థుల బలాన్ని తగ్గించడా నికి ఉపయోగించాలనుకోవడం ప్రజాద్రోహం తప్ప మరొకటి కాదు. దేశవాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడిన సమయంలో దేశ సరిహద్దులలో సైన్యాన్ని మోహరించే అవసరం రావడం దారుణమే. ఇలాంటి సమయంలో విజ్ఞత చూపవలసిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ బాధ్యత కంటే, ప్రజల పాత్ర కీలకంగా ఉన్న సంగతిని గుర్తించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE