పెరట్లో గుంటనక్కలా మన దేశ సరిహద్దుల్లో పదే పదే చొరబడుతూ చికాకు కలిగిస్తున్న డ్రాగన్‌కు ఒక్కసారి షాక్‌ ‌తగిలింది. తమ దేశానికి అప్పనంగా వస్తున్న వేలాది కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడటంతో విలవిల్లాడింది. ఒక్కపూటలో భారీ నష్టం జరిగిపోయింది. ఎక్కడా ఆ దేశం పేరు చెప్పకుండా 59 మొబైల్‌ ‌యాప్స్‌ని నిషేధించింది భారత ప్రభుత్వం. ఈ యాప్‌ల వల్ల భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతలకు ముప్పు పొంచి ఉండడంతో నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్స్ ఆవిష్కించే ఔత్సాహికుల కోసం ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌యాప్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌ను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. చైనా యాప్స్ ‌బహిష్కరణ విషయంలో ప్రధాని తీసుకున్న సాహసోపేత మైన ఈ నిర్ణయాన్ని భారత పారిశ్రామిక వేత్తలతో పాటు, అమెరికా తదితర దేశాల నాయకులు కూడా ప్రశంసిస్తున్నారు.

నేరుగా పోరాడొద్దు.. కానీ నిరంతం ఘర్షణ వాతావరణం కొనసాగిస్తూ అవతలివాళ్లతో మానసిక యుద్ధం చేయాలి. వాళ్ల దృష్టిని మరల్చి మన పని మనం చేసుకుపోవాలి. చైనా ఎత్తుగడ ఇది. ఎత్తుగడ అనడం కన్నా కుటిల నీతి అనడం సబబు. పొరుగు దేశాల సరిహద్దులపై కన్నేసి, అవి తమవేనని వాదించడం, క్రమంగా కలిపేసుకు పోవడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. వాస్తవానికి మనం ఇప్పుడు చూస్తున్న చైనాలో 40 శాతానికి పైగా భూభాగాలు ఆక్రమించుకున్నవే. చారిత్రికంగా చైనాతో మనకు ఎలాంటి సరిహద్దు లేదు. టిబెట్‌, ఉయిగర్‌లను ఆక్రమించుకున్న తర్వాతే చైనా మన సరిహద్ధుల్లోకి వచ్చింది. మన దేశ భూభాగాలను దశాబ్దాలుగా ఆక్రమించుకొని తమవేనని వాదిస్తోంది. చైనాకు భారత్‌తో మాత్రమే కాదు. ఏ ఒక్క పొరుగు దేశంతోనూ సఖ్యత లేదు.

చైనా మన దేశంతో పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. ఆ దేశం నుంచి కారు చౌకగా వస్తున్న వస్తువుల కారణంగా భారతీయ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కమ్యూనిస్టు చైనాలో ఎక్కువ పని గంటలు, తక్కువ జీతాలు, సహజ సంపదను తేలిగ్గా కొల్లగొట్టడం బయటి ప్రపంచానికి కనిపించదు. మన దేశంలో అలాంటి విధానాలకు చట్టాలు అంగీకరించవు. ఈ కారణంగానే చైనాతో మన దేశ వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు.

చైనీస్‌ ‌యాప్స్ ‌మీద వేటు
కొద్దిరోజుల క్రితం లద్ధాక్‌లోని గల్వాన్‌లో చైనా అకారణ చొరబాటు, ఘర్షణ కారణంగా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ప్రపంచానికి కరోనాను అంటించి వినోదం చూస్తున్న చైనా, మరోవైపు సామ్రాజ్యవాద విస్తరణ ధోరణితో పొరుగు దేశాలపై కన్నేయడాన్ని నిశితంగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు ఒక్కసారిగా గళం విప్పాయి. చైనా దుందుడుకు ధోరణిపై విమర్శలు గప్పించాయి. ఇదే సమయంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు కదలింది. చైనా ఆర్థిక మూలాలకు గండి కొట్టడంతో ఇది తొలి అడుగు.మన దేశంలో సోషల్‌ ‌మీడియాలో ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ ‌సహా 59 ప్రధాన మొబైల్‌ ‌యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఎ ‌కింద వీటిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ 59 సోషల్‌ ‌మీడియా యాప్‌లను నిలిపేయా ల్సిందిగా టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే యాప్స్ ‌స్టోర్‌, ‌గూగుల్‌ ‌ప్లేలలో ఈ యాప్స్ ‌కనిపించకుండా పోయాయి. ఇప్పటికే డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకున్న యాప్స్ ‌పని చేయడం లేదు. భారత ప్రభుత్వం నిషేధిత యాప్స్ ‌కు సంబంధించిన ఉత్తర్వుల్లో ఎక్కడా చైనా పేరు వాడలేదు. కానీ ఆ యాప్స్ ఏ ‌దేశానివో అందరికీ తెలుసు. ప్రధాని మోదీ నాయకత్వంలో తాము రెండు యుద్ధాల్లోనూ గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన మరుసటిరోజే ఈ కీలక నిర్ణయం వెలువడింది.

నిషేధంతో ప్రభావం?
చైనా ఒకవైపు భౌగోళికంగా మన సరిహద్దుల్లోకి చొరబడుతూనే, మరోవైపు డిజిటల్‌ ‌మార్గంలో ఏకంగా దేశంలోకే చొరబడింది. ఈ అతితెలివికి భారత ప్రభుత్వం బ్రేకులు వేసింది. చైనా దుందుడుకు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న వస్తువులను నిషేధించాల్సిందేనని చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే వస్తువులను నిషేధించడం కన్నా సోషల్‌ ‌మీడియా యాప్‌లను నిషేధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు అని కొంతమంది నిపుణులు సూచించారు. వస్తువులను నిషేధిస్తే మన ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. యాప్‌లను నిషేధిస్తే సమాచార తస్కరణ ఆగిపోవడంతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది.
మన దేశం నుంచి ముఖ్యంగా నాలుగు రకాల చైనా యాప్‌లు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటు న్నాయి. ఎకనమిక్‌ ‌యాప్‌లు, వ్యానిటీ యాప్‌లు, న్యూసెన్స్ ‌యాప్‌లు, చైనా గురించి ఊదరగొట్టే యాప్‌లు.. ఈ నాలుగు రకాల్లో కనీసం మూడు రకాలను నిషేధించాలని కొంత మంది నిపుణులు కొన్నాళ్లుగా చెబుతున్నారు. బైదూ లాంటి యాప్‌లు.. చైనాకు డిజిటల్‌ ‌సిల్క్ ‌రూట్‌లాంటివి. భారత మార్కెట్‌లో వాటిపై ఎలాంటి ప్రభావం పడినా ఆ కంపెనీల విలువపై ప్రభావం పడుతుంది.
టిక్‌టాక్‌ ‌యాప్‌ను భారత్‌లో 20 కోట్ల మంది, యూసీ బ్రౌజర్‌ ‌ను 1.30 కోట్ల మంది వాడుతున్నారు. టిక్‌టాక్‌ ‌యాప్‌ ‌కు 30శాతం పైగా వినియోగదారులు భారత్‌నుంచే ఉన్నారు. దానికి పదిశాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ఆదాయమంతా టిక్‌టాక్‌ ‌కోల్పోయినట్లే. ఇదే తరహా నిషేధాన్ని ఇతర దేశాలు కూడా ఆచరిస్తే చైనాకు మరింత నష్టం కలగక తప్పదు. మరోవైపు టిక్‌టాక్‌ ‌నిషేధంపై సోషల్‌ ‌మీడియాలో ఆర్‌ఐపీ టిక్‌టాక్‌ ‌హ్యాష్‌ ‌ట్యాగ్‌ ‌ట్రెండింగ్‌ ‌లో ఉంది. యూజర్లు మీమ్స్, ‌వీడియోలతో సందడి చేస్తున్నారు.

చైనా ఆందోళన
59 యాప్‌లను భారత్‌ ‌నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ ‌మాట్లాడుతూ, ‘భారత్‌ ఇచ్చిన నోటీసుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తాజా పరిస్థితిని పరిశీలిస్తున్నాం. విదేశాల్లో వ్యాపారాలు చేసే చైనా సంస్థలు అంతర్జా తీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని మేం సూచిస్తుంటాం. చైనావాసులు సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టబద్ధ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. ఆచరణాత్మక సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగిస్తుంది. దీన్ని భారత్‌ ‌విస్మరిస్తోంది. ఇది ఆ దేశ ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చదు’ అన్నారు.

చైనా ద్వంద్వ వైఖరి
అంతర్జాతీయ వ్యాపారాల్లో ఆచరణాత్మక సహకారం అంటూ ఇతర దేశాలకు సుద్దులు చెప్పే చైనా ఆచరణలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. భారత్‌ ‌సహా ప్రపంచ వ్యాప్తంగా కనిపించే ఫేస్‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌సోషల్‌ ‌మీడియా వేదికలు చైనాలో కనిపించవు. అక్కడ వి చాట్‌, ‌సినా విబో మాత్రమే కనిపిస్తాయి. చైనాలో విదేశీ సోషల్‌ ‌మీడియా యాప్స్ ‌మీద మొదటి నుంచి నిర్భంధం ఉంది. దేశీయ సోషల్‌ ‌మీడియా యాప్స్, ‌న్యూస్‌ ‌పోర్టల్స్ ‌మాత్రమే ఉపయోగించాలి. ఈ కారణంగా చైనీయులకు బయటి ప్రపంచ వార్తలు పెద్దగా తెలియవు. కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం నడిపే పత్రికలు, చానల్స్ ‌మాత్రమే చూడాలి. ఎవరైనా అక్రమంగా విదేశీ వెబ్‌సైట్ల ద్వారా వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కఠినంగా శిక్షిస్తారు.
విదేశీ యాప్స్, ‌న్యూస్‌ ‌పోర్టల్స్‌కు అనుమతి ఇవ్వని చైనా, భారత్‌ ‌తమ యాప్స్‌ను నిషేధిస్తే గగ్గోలు పెడుతోంది. తాజాగా చైనా భారత పత్రికలు, వెబ్‌సైట్ల మీద నిషేధం విధించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో భారత ఆన్‌లైన్‌ ‌పత్రికలు, వెబ్‌సైట్లు చైనాలో కనిపించడంలేదు. భారత మీడియా వెబ్‌సైట్లను వర్చువల్‌ ‌ప్రైవేటు నెట్‌వర్క్ (‌వీపీఎన్‌) ‌ద్వారానే ఇప్పటి వరకూ చైనావాసులు చూసేవారు. భారత టీవీ ఛానళ్లను కూడా ఐపీ టీవీ ద్వారా చూస్తారు. అయితే రెండురోజులుగా చైనాలో ఎక్స్‌ప్రెస్‌ ‌వీపీఎన్‌ ‌పనిచేయడంలేదు. వీపీఎన్‌లనూ అడ్డుకునే అధునాతన ఫైర్‌వాల్‌ను ఆ దేశం సృష్టించింది.
అయితే చైనా పత్రికలు, వెబ్‌సైట్లను భారత్‌లో వీక్షించే వీలుంది. ఈ నేపథ్యంలో భారతీయ వార్తా వెబ్‌సైట్లను చైనా అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిం చాలని ‘డిజిటల్‌ ‌న్యూస్‌ ‌పబ్లిషర్స్ అసోసియేషన్‌’ (‌డీఎన్‌పీఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనా లేదా ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టిన అన్ని న్యూస్‌ ‌యాప్‌లు, వెబ్‌సైట్లను నిషేధించాలని విజ్ఞప్తి చేసింది.

భారతీయ యాప్స్ ‌దూకుడు
చైనాకు చెందిన 59 యాప్స్ ‌నిషేధం.. గూగుల్‌, ఆపిల్‌ ‌సంస్థలు తమ యాప్స్ ‌స్టోర్ల నుంచి వాటిని తొలగించడంతో ఇప్పటికే వాటిని ఉపయోగిస్తున్న వారు నిరుత్సాహపడ్డారు. అయితే ఈ యాప్స్ ‌నిషేధం వెనుక అసలు కారణాన్ని తెలుసుకొని ప్రత్యామ్నాయ యాప్స్ ‌మీద దృష్టి సారించారు. అవి కూడా భారతీయం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. దీంతో స్వదేశీ యాప్‌లకు అనూహ్యంగా డిమాండ్‌ ‌పెరిగింది. షేర్‌చాట్‌, ‌రొపొసో, చింగారి లాంటి స్వదేశీ యాప్‌లను గంటల వ్యవధిలోనే లక్షలాది మంది డౌన్‌లోడ్‌ ‌చేసుకుంటు న్నారు. 15 ప్రాంతీయ భాషల్లో వినియోగదారులను ఆకట్టుకుంటున్న షేర్‌చాట్‌ను రెండు రోజుల్లోనే 1.5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ యాప్‌లో 15 కోట్ల మంది వినియోగదారులు నమోదై ఉన్నారు.
ఇక టిక్‌టాక్‌ ‌నిషేధం తర్వాత ఆ యాప్‌ ‌వినియోగదారులు 12 భారతీయ భాషల్లో సేవలు అందిస్తున్న రొపొసో వైపు ఎక్కువగా మొగ్గుచూపు తున్నారు. టిక్‌టాక్‌లో 95 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రేమ్‌ ‌వత్స్, 90 ‌లక్షల ఫాలోవర్స్ ఉన్న నూర్‌ అఫ్సాన్‌ ‌వంటి ఎంతో మంది ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు రొపొసోను ఎంచుకున్నారని ఆ సంస్థ తెలిపింది. టిక్‌టాక్‌కు గట్టి పోటీగా గుర్తింపున్న చింగారి యాప్‌ అనూహ్యంగా ఆదరణ పొందుతోంది. 10 రోజుల క్రితం 5 లక్షలకు పైగా ఉన్న డౌన్‌లోడ్‌ల సంఖ్య ఇప్పుడు 25 లక్షలు దాటేసింది.
మహీంద్రా సంస్థ నిర్వహిస్తున్న గోసోషియల్‌కు ఈ కొద్దిరోజుల్లోనే 20 శాతం వినియోగదారులు పెరిగారు. లాక్‌డౌన్‌లో ప్రారంభమైన వీడియో షేరింగ్‌ ‌వెబ్‌సైట్‌ ‌బాక్స్ఎం‌గేజ్‌ ‌డాట్‌ ‌కామ్‌కు ఇప్పుడు వినియోగదారుల తాకిడి పది రెట్లు పెరిగిందని ఆ సంస్థ తెలిపింది. చైనా యాప్‌లపై నిషేధం ప్రకటించిన 24 గంటల్లోనే లక్ష మంది తమ వెబ్‌సైట్‌ను వినియోగించారని వెల్లడించింది. చైనా యాప్‌లపై నిషేధం భారత సంస్థలకు ఊహించని అవకాశం తెచ్చిందని, వినియోగదారులను ఆకట్టుకో గలిగితే అవి విజయం సాధించడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టిక్‌టాక్‌ ‌ద్వారా సోషల్‌ ‌మీడియాలో బహుళ ఆదరణ పొందిన వారంతా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. తమ అనుచరులను ఇన్‌స్టాగ్రామ్‌, ‌యూట్యూబ్‌లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలతో ఇన్‌స్టాలో హల్‌ ‌చల్‌ ‌చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌, ‌యూట్యూబ్‌కు క్రేజ్‌ ‌క్రమంగా పుంజుకోనుంది. టిక్‌టాక్‌ ‌ప్రొఫైల్‌లలో వారి ఇన్‌స్టాగ్రామ్‌ ‌ఖాతా వివరాలను అందిస్తున్నారు. ఇన్‌స్టా ఎలా ఉపయో గించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్‌ ‌చేస్తున్నారు.

_______________________________________________________________________________

నిషేధించిన యాప్‌లు ఇవే
1. టిక్‌టాక్‌ 2. ‌షేర్‌ఇట్‌ 3. ‌క్వాయి 4. యూసీ బ్రౌజర్‌ 5. ‌బైడుమ్యాప్‌ 6. ‌షెయిన్‌ 7. ‌క్లాష్‌ ఆఫ్‌ ‌కింగ్స్ 8. ‌డియూ బ్యాటరీ సేవర్‌ 9. ‌హెలో 10. లైకీ 11. యూక్యామ్‌ ‌మేకప్‌ 12. ఎంఐ ‌కమ్యూనిటీ 13. సీఎం బ్రౌజర్‌ 14. ‌వైరస్‌ ‌క్లీనర్‌ 15. ఏపీయూఎస్‌ ‌బ్రౌజర్‌ 16. ‌రోమ్వే 17. క్లబ్‌ ‌ఫ్యాక్టరీ 18. న్యూస్‌డాగ్‌ 19. ‌బ్యూటీ ప్లస్‌ 20. ‌వీచాట్‌ 21. ‌యూసీ న్యూస్‌ 22. ‌క్యూక్యూ మెయిల్‌ 23. ‌వెయిబో 24. జెండర్‌ 25. ‌క్యూక్యూ మ్యూజిక్‌ 26. ‌క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌ 27. ‌బిగో లైవ్‌ 28. ‌సెల్ఫీసిటీ 29. మెయిల్‌ ‌మాస్టర్‌ 30. ‌ప్యార్‌లల్‌ ‌స్పేస్‌ 31. ‌షియామీ ఎంఐ వీడియోకాల్‌ 32. ‌వియ్‌సింక్‌ 33. ఈఎస్‌ ‌ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ 34. ‌వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్‌ 35. ‌మీటు 36. విగో వీడియో 37. న్యూ వీడియో స్టేటస్‌ 38. ‌వాల్ట్-‌హైడ్‌ 39. ‌కెచె క్లీనర్‌ ‌డీయూ యాప్‌ ‌స్టూడియో 41. డీయూ క్లీనర్‌ 42. ‌డీయూ బ్రౌజర్‌ 43. ‌హగో ప్లే విత్‌ ‌న్యూ ఫ్రెండ్స్ 44. ‌క్యామ్‌ ‌స్కానర్‌ 45. ‌క్లీన్‌ ‌మాస్టర్‌-‌చీటా మొబైల్‌ 46. ‌వండర్‌ ‌కెమెరా 47. ఫోటో వండర్‌ 48. ‌క్యూక్యూ ప్లేయర్‌ 49. ‌వియ్‌ ‌మూట్‌ 50. ‌స్వీట్‌ ‌సెలీ 51. బైడు ట్రాన్స్‌లేట్‌ 52. ‌విమేట్‌ 53. ‌క్యూక్యూ ఇంటర్నేషనల్‌ 54. ‌క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌ 55. ‌క్యూక్యూ లాంచర్‌ 56. ‌యూ వీడియో 57. వీ ఫ్లయ్‌ ‌స్టేటస్‌ ‌వీడియో 58. మొబైల్‌ ‌లెజెండ్స్ 59. ‌డీయూ ప్రైవసీ.

________________________________________________________________________________

అమెరికాలో కూడా నిషేధించాలని డిమాండ్‌
‌చైనా యాప్స్‌ను భారత్‌ ‌నిషేధించడంపై అమెరికా చట్టసభ ప్రతినిధుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దేశ భద్రతకు ప్రమాదముందనీ, భారత్‌ ‌తరహాలోనే అమెరికా కూడా టిక్‌టాక్‌ను నిషేధించా లనీ వారు కోరుతున్నారు. అమెరికాలో ప్రభుత్వ అధికారులు తమ ఫోన్లలో టిక్‌టాక్‌ ‌వాడకుండా నిషేధించాలని ప్రతిపాదించే రెండు బిల్లులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రముఖ రచయిత గొర్డాన్‌ ‌చాంగ్‌ ‌చైనా యాప్‌ల నిషేధాన్ని ప్రస్తావిస్తూ ‘అమెరికా ఎందుకు ఆ పని చేయదు’ అని ప్రశ్నించారు. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయం తర్వాత వీటిపై మళ్లీ చర్చ జరగొచ్చని భావిస్తున్నారు.
చైనా ధోరణిపై భారత్‌ ‌వెనకడుగు వేయనందుకు భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ ‌పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. భారత్‌ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్‌టాక్‌తో సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం ఆనందంగా ఉందన్నారు. చైనా దూకుడు విషయంలోనూ భారత్‌ ‌వెనకడుగు వేయకుండా నిలిచిందని శ్లాఘించారు నిక్కీ.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ ‌పాంపియో కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ‘చైనా కమ్యూనిస్ట్ ‌పార్టీ ఆధీనంలో నడుస్తున్న మొబైల్‌ ‌యాప్‌లను భారత్‌ ‌నిషేధించడాన్ని స్వాగతిస్తున్నా’ అని పాంపియో పేర్కొన్నారు. అది వారి జాతి భద్రతకు ఉపయోకరమని తెలిపారు.
‘ప్రమాదకరమైన ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో భారత్‌ ‌టిక్‌టాక్‌తో పాటు డజన్ల కొద్దీ చైనా యాప్‌లను నిషేధించింది’ అని రిపబ్లికన్‌ ‌సెనేటర్‌ ‌జాన్‌ ‌కొర్నిన్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ‘టిక్‌టాక్‌ ‌వెళ్లిపోవాలి. అది గతంలోనే వెళ్లిపోయుండాల్సింది’ అని రిపబ్లికన్‌ ‌పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రిక్‌ ‌క్రాఫోర్డ్ ‌ట్వీట్‌లో పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ను తన సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒ‌బ్రెయిన్‌ ‌గతవారం ఆరోపించారు. ‘అమెరికాలో 4 కోట్ల వినియోగదారు• ఉన్న టిక్‌టాక్‌ ‌చైనా కమ్యూనిస్ట్ ‌పార్టీకి, బీజింగ్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా పెట్టే పోస్టులను తొలగిస్తోంది’ అని ఒబ్రెయిన్‌ ‌వ్యాఖ్యానించారు.
చైనా యాప్‌ ‌నుంచి వైదొలగిన మోదీ
చైనా యాప్‌ల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగానూ పాటించారు. చైనీస్‌ ‌సోషల్‌ ‌మీడియా వీబో నుంచి బయటకు వచ్చారు. 2015లో చైనా పర్యటన వీబోలో ఖాతా ప్రారంభిం చినన మోదీ, ఇప్పటివరకూ 115 పోస్టులు చేశారు. అయితే వీబోలో వీఐపీలు తమ ఖాతాలను మూసివేయాలంటే ఆ సంస్థ అనుమతి కావాలి. అయితే ప్రధాని మోదీ ఖాతాను మూసివేయడానికి ఇప్పటికే అధికారిక చర్యలు ప్రారంభించారు. ఈ విషయంలో ఆ సంస్థ అధికారులు ఆలస్యం చేస్తే వ్యక్తిగతంగా పోస్టులన్నీ తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు.

_______________________________________________________________________________

భారతీయ ఔత్సాహికులకు ప్రధాని సవాల్‌
‌చైనా యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో ఆ లోటు తీర్చేందుకు, ప్రపంచ స్థాయిలో భారత్‌ ‌యాప్‌లను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారు. ఇందులో డిజిటల్‌ ఇం‌డియన్‌ ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌యాప్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌ను ఆవిష్కరించారు. ‘నేడు ప్రపంచస్థాయి భారత యాప్‌లను రూపొందించాలన్న ఉత్సాహం సాంకేతిక, అంకుర వర్గాల్లో కనిపిస్తోందని, వారి ఆలోచనలు, ఉత్పత్తులకు సముచిత రూపం ఇచ్చేందుకు నీతిఆయోగ్‌, ‌సమాచార సాంకేతిక శాఖలు సంయుక్తంగా ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌యాప్‌ ఇన్నోవేషన్‌ ‌చాలెంజ్‌ను ఆవిష్కరిస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ ‌చేశారు.
ఇప్పటికే ఉన్న యాప్‌లు, కొత్త యాప్‌లను ప్రోత్సహించేందుకు ఈ సవాల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ట్రాక్‌-1 ‌ఛాలెంజ్‌లో ఇప్పటికే భారతీయులు వినియోగిస్తున్న, ప్రపంచ స్థాయికి చేరుకోగల యాప్‌లను గుర్తిస్తామని ప్రభుత్వం తెలిపింది. ట్రాక్‌-2‌లో దేశం కోసం యాప్‌లను రూపొందించగల వ్యాపారులను గుర్తించనున్నారు. ఈ దశ సుదీర్ఘంగా ఉంటుంది. ఆఫీస్‌ ‌ప్రొడక్టివిటీ, ఇంటి నుంచి పని, సామాజిక మాధ్యమాలు, ఈ-లెర్నింగ్‌, ఎం‌టర్‌టైన్‌మెంట్‌, ఆరోగ్యం, అగ్రిటెక్‌, ‌ఫిన్‌టెక్‌, ‌వార్తలు, ఆటలకు సంబంధించిన విభాగాల్లో ట్రాక్‌-1 ‌పోటీలు ఉంటాయి.
జూలై 4వ తేదీ నుంచే ఈ చాలెంజ్‌ ‌మొదలవు తుందని, ఈ నెల 18వ తేదీ లోపు వివరాలు ఆన్‌లైన్‌ ‌ద్వారా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం పరిశీలించిన తర్వాత ప్రతి విభాగంలో మొదటి, రెండు, మూడో స్థానంలో నిలిచిన యాప్‌లకు రూ.20 లక్షలు, రూ.15 లక్షలు, రూ.10లక్షల చొప్పున అందజేయనున్నారు. ఉప విభాగాల్లో రూ. 5 లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు ఇస్తారు. ఇక ఈ ఛాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in ను సందర్శించవచ్చు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలను కునేవారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి.

______________________________________________________________________________

ఇతర ప్రాజెక్టుల్లోనూ చైనాపై నిషేధం
సరిహద్దుల్లో దౌర్జన్యంగా వ్యవహరించి భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వం ఇతర మార్గాల్లో కూడా గట్టి చర్యలు తీసుకుంటోంది. మొబైల్‌ ‌యాప్‌లను నిషేధించిన ప్రభుత్వం, తదుపరి హైవే నిర్మాణం, పారిశ్రామిక, టెలికాం, రైల్వే రంగాల్లోనూ చైనాను బహిష్కరించడానికి సన్నద్ధమైంది. జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలను బహిష్కరించనున్నట్లు కేంద్ర రహదారులు, హైవే శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలతో పాటు, ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలనుకూడా అనుమతించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాంకేతికత, పరిశోధన, కన్సల్టెన్సీ లాంటి రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూనే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, అయితే చైనా సంస్థల పెట్టుబడు లను మాత్రం అనుమతించబోమని గడ్కరీ పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4‌జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టు కోసం ఇప్పటికే విడుదల చేసిన టెండర్లను తాజాగా రద్దు చేసింది. చైనా సంస్థలను ఈ ప్రాజెక్టు నుంచి దూరం పెట్టేందుకే టెలికాం శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 4జీ ప్రాజెక్టులో చైనా సంస్థల ఉత్పత్తులను వాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం రెండు వారాల్లో మళ్లీ కొత్త టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అందులో మేక్‌ ఇన్‌ ఇం‌డియా విధానాన్ని ప్రోత్సహించేలా స్వదేశీ సంస్థలకే ప్రాధాన్యమివ్వ నున్నారు. ఇప్పటివరకూ భారత టెలికాం వ్యాపారంలో సుమారు 75 శాతం చైనాకు చెందిన హవేయ్‌ ‌టెక్నాలజీస్‌, ‌జెడ్‌టీఈ కార్పొరేషన్‌ ‌సంస్థలదే. ఈ నిర్ణయంతో వాటి ఆధిపత్యానికి గండి పడనుంది.
భారత్‌లో త్వరలో ప్రారంభించాలని చూస్తున్న 5 జీ సాంకేతిక పరిజ్ఞాన ప్రాజెక్టుల నుంచి కూడా చైనాను దూరం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. చైనీస్‌ ‌యాప్‌ల నిషేధానికి సంబంధించి జరిగిన మంత్రుల ఉన్నతస్థాయి సమావేశంలో వావే 5జీ సేవల నిలిపివేతపై చర్చించినట్టు తెలుస్తోంది. మన దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ ‌కేటాయింపులే ఇంతవరకూ జరగలేదు. ఈ ఏడాది చివర్లో 5జీ స్పెక్ట్రమ్‌ ‌కేటాయింపులు జరపనున్నారు.
ఇక చైనా సంస్థకు ప్రయోజనం కల్పించేలా ఉందన్న కారణంతో రైల్వే ఓ టెండరును రద్దు చేసింది. వ్యక్తుల శరీర ఉష్ణోగత్రను కొలవడంతో పాటు మాస్కు ధరించని వ్యక్తులను కృత్రిమ మేధ ఆధారంగా కనిపెట్టే సామర్థ్యమున్న 800 థర్మల్‌ ‌కెమెరాల కోసం గత నెలలో రైల్వే టెండర్లను ఆహ్వానించింది. అయితే అందులో పేర్కొన్న ఒక నిబంధన చైనాకు చెందిన ప్రముఖ సీసీ కెమెరాల సంస్థ హిక్‌విజన్‌కు అనుకూలంగా ఉందంటూ కొన్ని సంస్థలు రైల్వేకు ఫిర్యాదు చేశాయి. అందుకే ఆ టెండరును రద్దు చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ కొత్త టెండర్లను ఆహ్వానించనున్నారు.
వావే కంపెనీ 5జీ నెట్‌వర్కస్‌పై నిషేధం విధించాలని దాదాపు ఏడాదిన్నరగా అమెరికా ప్రపంచంలోని పలు దేశాలను కోరుతోంది. ఆ నెట్‌వర్క్ ‌సాయంతో చైనా ఆయా దేశాల్లోని విదేశీయులపై నిఘా వేస్తోందన్నది అమెరికా ఆరోపణ. అమెరికా సూచనలను ఆస్ట్రేలియా, జపాన్‌, ‌న్యూజిలాండ్‌ ‌వంటి దేశాలు పాటించగా, యూకే తదితర యూరోపియన్‌ ‌దేశాలు మాత్రం ఇంకా ఆయా సంస్థలకు అవకాశం ఇస్తున్నాయి.

చైనాతో ఒప్పందం రద్దు చేసుకున్న హీరో
భారత్‌-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, చైనా వస్తువులు బహిష్కరించాలంటూ సోషల్‌ ‌మీడియాలో ఉద్యమం నేపథ్యంలో అనేక కంపెనీలు ఆ దేశంతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్‌లో 72 శాతం మార్కెట్‌ ‌వాటాను కలిగి ఉన్న హీరో సైకిల్స్ ‌చైనాతో కుదుర్చుకున్న రూ. 900 కోట్ల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 3 నెలల్లో చైనాతో రూ.900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని హీరో సైకిల్స్ ‌సంస్థ చైర్మన్‌ ‌పంకజ్‌ ‌ముంజల్‌ ‌సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, చైనా వస్తువుల బహిష్కరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనంగా చెప్పుకొచ్చారు. చైనాతో ఒప్పందాలు రద్దుచేసుకుని కొత్త మార్కెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. హీరో సైకిల్స్ ‌స్వావలంబన వైపు పయనిస్తోందని, ఎలక్ట్రో ఇ-సైకిల్‌ను ప్రారంభిస్తున్నా మని వెల్లడించారు పంజక్‌ ‌ముంజల్‌.

_____________________________________________________________________________

తొలి స్వదేశీ సోషల్‌ ‌మీడియా వేదిక ‘ఎలిమెంట్స్
‌సోషల్‌ ‌మీడియాలో ప్రస్తుతం ఉన్న విదేశీ యాప్స్‌కు దీటుగా ఆవిర్భవించింది ‘ఎలిమెంట్స్’.. ‌తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషల్లో అభివృద్ధి చేసిన ‘ఎలిమెంట్స్’ ‌యాప్‌ ‌ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉచిత ఆడియో, వీడియో కాల్స్ ‌చేసుకోవడంతో పాటు చాటింగ్‌ ‌ద్వారా సంభాషించు కునే సౌలభ్యం ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ తొలి స్వదేశీ తొలి సోషల్‌ ‌మీడియా యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకరణకు దూరంగా దేశీయంగా మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశ యువత, ఐటీ నిపుణుల్లో దాగున్న సృజనాత్మకతను మరింత ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం నిర్మించుకోవాలన్నారు. తద్వారా ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’ ‌లక్ష్యాలను చేరుకొనేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. వీరిని ప్రోత్సహిస్తూ మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయడానికి సాంకేతిక రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, ‌రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ‌రామోజీరావు, ప్రముఖ యోగా గురువు బాబారాందేవ్‌, ‌జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి సురేశ్‌‌ప్రభు, పారిశ్రామికవేత్త అనంత్‌ ‌గోయెంకా, విద్యావేత్త టీవీ మోహన్‌దాస్‌ ‌పాయ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

_________________________________________________________________________

‌జూమ్‌ను ఎందుకు నిషేధించలేదు?
దేశ సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా భద్రత ద ృష్ట్యా 59 చైనీస్‌ ‌యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ కొనసాగుతోంది చైనాకు బాగా బుద్ధి చెప్పారని కొంతమంది ప్రశంసిస్తుండగా… మరికొంత మంది కేవలం చైనా యాప్‌లను నిషేధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పెదవి విరుస్తున్నారు. ప్రజల గోప్యత హక్కును పరిరక్షించాలంటే వీడియో కాలింగ్‌ ‌యాప్‌ ‌జూమ్‌ను బ్యాన్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు
జూమ్‌ ‌వీడియో కమ్యూనికేషన్స్ ‌సంస్థ అమెరికా కేంద్రంగా పని చేస్తోంది. అమెరికా పౌరసత్వం కలిగిన చైనా జాతీయుడు ఎరిక్‌ ‌యువాన్‌ ‌దీనిని స్థాపించారు. అయితే చైనాతో లింక్‌ ఉన్న యాప్‌ ‌లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని భారత నిఘా విభాగం అధికారులు గతంలో హెచ్చరించారు. ఇందులో జూమ్‌ ‌యాప్‌ ‌పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ కేంద్రం స్పష్టం చేసిన విషయం విదితమే. అంతేకాదు జర్మనీలోనూ ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా.. తైవాన్‌లో పూర్తిస్థాయిలో దీనిని నిషేధించడంతో జూమ్‌ ‌భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జూమ్‌ ‌విశ్వసనీయతపై చర్చ లేవనెత్తిన వాళ్లు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు.ఒకవైపు సరిహద్దు విషయంలో నిరంతరం ఘర్షణ పడుతూనే, మరోవైపు భారత మార్కెట్‌లో తన వాణిజ్య వాటాను పెంచుకుంటోంది చైనా. దీన్ని అదుపు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఇది స్వేచ్ఛావాణిజ్య నిబంధనలకు వ్యతిరేకమంటూ వాదిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ అదను చూసి కొట్టిన దెబ్బకు డ్రాగన్‌ ‌విలవిలలాడిపోతోంది.

–  క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE