ఒక వ్యక్తి మీద, లేదా రాజకీయ పార్టీ మీద, ఇంకా, కాల పరీక్షకు నిలువలేకపోయిక ఓ విధానం మీద అంధ విశ్వాసం కొనసాగించడం సరికాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకునే విజ్ఞత ఆ అంధ విశ్వాసం వల్ల నిర్దాక్షిణ్యంగా చచ్చిపోకూడదు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ చేసిన తప్పిదాలను సరిదిద్దాలన్న బీజేపీ ఆశయం, అందుకు తగ్గట్టుగానే పడుతున్న ఆ పార్టీ ప్రభుత్వం అడుగులు ఈ సూత్రాన్నే ప్రతిబింబిస్తాయి. మధ్య యుగాల విస్తరణవాదాన్నీ, సామ్రాజ్యవాద కాంక్షనీ నిలువెల్లా నింపుకున్న చైనా వంటి దేశం చేతిలో పదే పదే మోసపోవడం చరిత్రను గమనించే వారూ, దేశ హితాన్ని కోరే వారూ ఏ విధంగానూ సహించరు. మన ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3వ తేదీన జరిపిన ఆకస్మిక లద్ధాఖ్‌ ‌పర్యటన, భద్రతా బలగాలను ఉద్దేశించి చేసిన ఉద్విగ్న భరిత ప్రసంగం గత నేతల అవాస్తవిక ధోరణికి జవాబు వంటిది.

సామ్రాజ్యవాదం ప్రపంచానికే నష్టమని లద్ధాఖ్‌లోని నిము అనే చోట జూలై 3న భారత జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు నరేంద్ర మోదీ నిష్కర్షగా చెప్పారు. చిన్న మాటే. కానీ ఇది చాలా అర్థాన్నీ, విస్తృతినీ కలిగి ఉన్నది. అలాంటి వారిని ప్రపంచమే ఉపేక్షించదని ఆయన భావం. విస్తరణ వాదం ఇవాళ ప్రపంచ శత్రువు. సామ్రాజ్యవాద కాంక్షనే విదేశ విధానంగా చెలామణీ చేయదలుచు కున్న చైనాను ప్రపంచమే ఈసడించుకుంటున్న సంగతినీ చెప్పారు మోదీ. ఇలాంటి వాస్తవాన్ని ఆ దేశం దృష్టికి తీసుకువచ్చే మాధ్యమాలు ఏవీ చైనాలో ఉండవు. కాబట్టి ఒక కృతక వాతావరణంలో ఆ దేశ నేతలు ఉంటారనిపిస్తుంది. కాబట్టే మోదీ ఆ సంగతి గుర్తు చేయవలసి వచ్చింది. నిము అంటే సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తున ఉన్న కొండ ప్రదేశం. సింధు ఒడ్డున ఉన్న నిములో కఠిన భౌగోళిక పరిస్థితులు సహజం. అక్కడ ఉన్న సైనిక శిబిరానికి వెళ్లి మోదీ ధైర్యం చెప్పి వచ్చారు. భారత జాతి మీ వెంట ఉందని భరోసా ఇచ్చారు. మీ త్యాగం, సాహసం అద్భుతమని చెప్పడంలోని ఉద్దేశం అదే. చైనాను ఉలికిపాటుకు గురి చేసింది కూడా ఇదే. పేరు ప్రస్తావించకపోయినా మన సరిహద్దులలో గడచిన ఏడు దశాబ్దాల నుంచి కుయుక్తులు పన్నుతున్న పొరుగు దేశం నిజరూపాన్ని మోదీ మరొకసారి బహిర్గతం చేశారు. చైనా ఒక ఆర్థికశక్తిగా ఎదిగి ఉండవచ్చు. సాంకేతికంగా ముందంజ వేసి ఉండవచ్చు. కానీ అడుగడుగునా ఆ దేశం పాటిస్తున్నది మాత్రం మధ్యయుగాల మౌఢ్యాన్నే. దీనికి మూలం కమ్యూనిజం. అయితే ఇప్పుడు చైనాలో కమ్యూనిజం ఎంత అంటే, నేతి బీరలో నేయి ఉనికి అంత నిజమని బల్ల గుద్ది చెప్పేవారే ఎక్కువ. కాబట్టి అక్కడ మిగిలి ఉన్నదల్లా విస్తరణవాదమే.

మోదీ ప్రసంగం క్లుప్తంగా ఇది. పిరికివాళ్లు, బలహీనులు శాంతిని సాధించలేరు. శాంతిని నెలకొల్పేందుకు ముందుగా ధైర్యసాహసాలు అవసరం. అలాంటి ధైర్యసాహసాలు భారత జవాన్ల వద్ద విశేషంగా ఉన్నాయి. భారత సాయుధ దళాల శక్తిసామర్థ్యాలను ప్రపంచం గమనించింది. విస్తరణవాదానికి కాలం చెల్లింది. ఇది ప్రగతివాద యుగమని, ప్రపంచమంతా అటే సాగుతున్నదన్నదని అర్థం చేసుకోవడం అవసరం. విస్తరణ కాంక్షను నమ్ముకున్న శక్తులు పరాజయం పాలవుతాయని లేదా పలాయనం చిత్తగిస్తాయని చరిత్ర చెబుతున్నది. అసలు సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికే ముప్పు తెస్తుంది. గల్వాన్‌ ‌లోయ వద్ద చైనా సైనికులతో మన సైనికులు ఘర్షణ పడి ప్రాణ త్యాగం చేయడం చరిత్ర గుర్తుంచుకుంటుంది. వారి త్యాగాలు వృథా కావు. ఆ వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా గర్వంగా చెప్పుకుంటున్నది. భరతమాత శత్రువులకు 14 కార్పస్ ‌సైనికులు భారతీయుల ఆగ్రహావేశాలు ఎలాంటివో రుచి చూపించారు. మీ ధైర్య సాహసాలు మీరు కాపలాగా ఉన్న ఈ పర్వతాల కంటే సమున్నతమైనవి. దేశరక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్న భరోసా నాకే కాదు, దేశ ప్రజలలోను ఉంది. మీరంతా మాకు గర్వకారణం. లే, లద్ధాఖ్‌, ‌కార్గిల్‌, ‌సియాచిన్‌ ‌సరిహద్దులలోని ఎత్తయిన మంచు పర్వతాలు, అక్కడి నదులలో ప్రవహించే చల్లని నీరు, భారతీయ జవాన్ల వీరత్వానికి మౌన సాక్షులుగా నిలుస్తాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో కాని, శాంతి సమయంలో కాని మీ సేవలను ప్రపంచం ఏనాడో గుర్తించింది. వేణువు ఊదే కృష్ణుడినే కాదు, శత్రువు మీద సుదర్శన చక్రం ప్రయోగించిన కృష్ణుడిని కూడా మనం ఆరాధిస్తాం. శాంతి, సౌభాత్రం, స్నేహం, ధైర్యం శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగమై ఉన్నాయి. భారత్‌ అం‌దిరితో శాంతి పూర్వక బంధాలనే కోరుకుంటుంది. కానీ దీనిని బలహీనతగా భావించరాదు. మన శక్తిసామర్థ్యాలు, దేశ రక్షణ కోసం మనం చేసే ప్రతిజ్ఞ హిమాలయాలంత సమున్నతమైనవి. మన దేశం ఇంతవరకు ఏ ప్రపంచ శక్తి ముందు తలొంచలేదు. ఇక ముందు కూడా తల వంచదు. అందుకు మీ ధైర్యసాహసాలే కారణమని నేను నిస్సందేహంగా చెబుతాను… దాదాపు అరగంట పాటు ఇలా సాగిందీ ఉపన్యాసం. ప్రాణవాయువు కూడా సరిగా అందని ఆ కొండలలో మోదీ భద్రతా దళాలను ఉద్దేశించి ప్రసంగించడం, భరోసా ఇవ్వడం, వారి త్యాగాలకు విలువ ఉందని చెప్పడం మంచి నాయకుడి లక్షణం.

గల్వాన్‌ ‌లోయలో జూన్‌ 15‌న జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు ప్రధాని మరొకసారి ఘనంగా నివాళి ఘటించారు. గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను కూడా ఆయన పరామర్శించారు. మీ త్యాగాలు మరుగున పడవని జాతి తరఫున మోదీ సైనికులకు చెప్పి వచ్చారు. లద్ధాఖ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌పర్యటన వాయిదా పడింది. ప్రధాని ఆకస్మికంగా పర్యటించారు. ఇదే చైనాకు పెద్ద హెచ్చరిక. పైగా ప్రధాని వెంట చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎంఎం ‌నరవణె కూడా ఉన్నారు. గల్వాన్‌ ‌ఘర్షణలో చనిపోయిన చైనా సైనికుల గురించి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‌నోట ఏ వ్యాఖ్యా, సానుభూతి వ్యాక్యం రాని సమయంలో మోదీ తన సైనికుల సాహసాన్నీ, త్యాగాన్ని శ్లాఘించడానికి ఆ మంచుకొండలలో పర్యటించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మృతి చెందిన చైనా సైనికుల గురించి ఆ దేశ విదేశాంగ వ్యవహారాలశాఖ అబద్దాలు చెప్పడం, భారతీయ సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులకు నివాళి ఘటించలేదన్న బాధ, ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు దక్కలేదన్న వ్యథ ఆ దేశ పౌరులలో రేకెత్తుతున్న కాలంలో మోదీ జరిపిన ఈ పర్యటన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక దేశ ప్రధాని సరిహద్దులకు వెళ్లి సైనికులను కలుసుకోవడం చరిత్రలో అపురూపమే కూడా. నిజానికి 12 ఆగస్టు 2014లో మోదీ కార్గిల్‌ను సందర్శించి సైనికులను ఆలింగనం చేసుకున్నారు. దేశ సరిహద్దుల పట్ల, అక్కడ తీవ్ర పరిస్థితుల మధ్య గస్తీ తిరుగుతున్న జవాన్ల పట్ల మోదీ శ్రద్ధ ఇప్పటిది కాదు. జూలై 3 వేకువనే ప్రధాని లద్ధాఖ్‌కు చేరుకున్నారు. సైన్యం, వాయుసేన, ఇండో టిబెటన్‌ ‌బోర్డర్‌ ‌పోలీస్‌ (ఐటిబిపి) సిబ్బందితో మాటామంతీ జరిపారు. తరువాత జన్‌స్కర్‌ ‌పర్వత శ్రేణులలో ఉన్న నిముకు వెళ్లారు. ఆ ముందురోజు సాయంత్రమే ఈ పర్యటన ఖరారు కావడం, అత్యంత రహస్యంగా సాగడం విశేషం. ఈ విషయం బయటకు పొక్కితే చైనా చేసే గగ్గోలు ఎలాంటిదో భారత్‌కు తెలియనిది కాదు.

————————————————————————————————————————————-

బలగాలు వెనక్కి…
ప్రధాని మోదీ లద్దాక్‌ ‌పర్యటన, చైనా విదేశాంగ మంత్రితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ ‌రెండున్నర గంటలు జరిపిన చర్చలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న చీదరింపులు చైనాను వెనకడుగు వేయించాయి. గల్వాన్‌ ‌లోయ, గస్తీ కేంద్రం 14, హాట్‌ ‌స్ప్రింగ్స్ (‌తూర్పు లద్దాక్‌) ‌నుంచి డ్రాగన్‌ ‌సేనలు 2 – 2.25 కిలోమీటర్లు (జూలై 10 నాటికి) వెనక్కి వెళ్లాయి. చర్చల నిర్ణయం మేరకు భారత సేనలు కూడా వెనక్కి వచ్చాయి. 14వ గస్తీ కేంద్రం దగ్గర చైనా నిర్మించిన శిబిరాన్ని పూర్తిగా తొలగించడం జరిగిందని మన సైనికాధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిర నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలోనే జూన్‌ 15‌న మన సైనికులు 20 మంది అమరులయ్యారు. ఈ ప్రదేశం నుంచి కూడా ఇరుదేశాల సైనికులు వెనక్కి తగ్గారు. దాదాపు నలభయ్‌ ‌రోజుల నుంచి గల్వాన్‌ ‌లోయ వద్ద ఉన్న ఉద్రిక్తతలు తగ్గాయి.

—————————————————————————————————————————————

చైనా చేతులలో భారత ప్రథమ ప్రధాని దారుణంగా మోసపోయారు. ఆయన అలీనవాదం, పునాదీ, తాత్వికతా లేని అంతర్జాతీయ శాంతికాముకత ఆయననే వెక్కిరించాయి. ఆయన హఠాన్మరణం వీటి ఫలితమే కూడా. ప్రచ్ఛన్నయుద్ధం ముమ్మరంగా ఉన్న కాలంలో నెహ్రూ అంతర్జాతీయ శాంతి కల కన్నారు. ఇది ఎంతమాత్రమూ తప్పుకాదు. శాంతిని కాంక్షించడం నాగరికతకు చిహ్నం. అలాంటి కలకు అది సరైన సమయమే కూడా. కానీ వాస్తవికత మాటేమిటి? కమ్యూనిస్టు రాజ్యాలకు నాయకత్వం వహిస్తూ, ఆ సిద్ధాంతాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలని చూస్తున్న సోవియెట్‌ ‌రష్యా వైపున ఉన్న మన పొరుగు దేశంతో, మధ్య యుగాల మంగోలుల విస్తరణ కాంక్షకు వారసుల వంటి నాయకులు నడిపిస్తున్న ఆ దేశంతో శాంతి మంత్రం పఠించడం వాస్తవికత అనిపించుకోలేదు. అక్కడ నుంచి దాడి జరగదని కళ్లు మూసుకోవడం జవాబుదారీతనం కాలేదు. దీనినే 1962 యుద్ధం ద్వారా చరిత్ర రుజువు చేసింది.

చైనాతోనే కాదు, ఏ ఇరుగు పొరుగుతోను భారత్‌ ఏనాడూ యుద్ధం కోరుకోలేదు. కానీ శాంతి కాముకతను అలుసుగా తీసుకుంటే ప్రతిఘటించక మానలేదు. 1950లోనే ఇండో-చైనా ఆధునిక దౌత్య సంబంధాలు ఆరంభమైనాయి. తొలి అడుగు నుంచే చైనా సరిహద్దులను, వాటి మీద పొరుగు వాదనలను పట్టించుకునే ఉద్దేశంలో లేదని స్పష్టమైంది. ఈ విషయాన్ని సర్దార్‌ ‌పటేల్‌ ‌నెహ్రూ దృష్టికి తీసుకు వెళ్లారు. నెహ్రూకు అది తెలుసునని పార్లమెంటులో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలూ, చైనాలో ఇచ్చిన ప్రసంగాలూ కూడా సాక్ష్యం చెబుతున్నాయి. కానీ ఈ వాస్తవాలను ఇప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ గుర్తించడానికి సిద్ధంగా లేదు. అందుకే బలమైన భారత్‌కు బలహీన ప్రధాని అంటూ మోదీ మీద యాభయ్‌ ఒక్క ఏళ్ల మధ్య వయసు బాలుడు (అర్ణబ్‌ ‌గోస్వామి వ్యాఖ్య) రాహుల్‌ ‌గాంధీ విమర్శలకు తెగబడ్డారు. చైనా నేత జిన్‌పింగ్‌ ‌మీదనే మోదీకి ఎక్కువ విశ్వాసం అంటూ పిచ్చి ప్రేలాపన కూడా ఆయన చేశారు. ఆయన ముత్తాత చైనాతో నెరపిన సంబంధాలు, వాటి ఫలితాల గురించి కొంచెం తెలిసినా రాహుల్‌ ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్య చేసేవారు కాదు. దాదాపు తొమ్మిది పర్యాయాలు మోదీ చైనాను సందర్శించి ఉండవచ్చు. కానీ ఆయనకు చైనా గతం మీద స్పష్టత ఉంది. చైనాతో మీ విధానం లోపభూయిష్టమైనదని సర్దార్‌ ‌పటేల్‌ ‌హెచ్చరించినా నెహ్రూ గుడ్డిగా ఆ దేశాన్ని నమ్మినట్టు మోదీ నమ్మలేదు. ఇరుగు పొరుగుతో సఖ్యత అనివార్యం. అందుకే 2019 అక్టోబర్‌లో మహాబలిపురానికి జిన్‌పింగ్‌ను ఆహ్వానించి మోదీ చర్చలు జరిపారు. మహాబలిపురం సమావేశం భవిష్యత్తులో రెండు దేశాల బంధాలను బలోపేతం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు మన ప్రధాని. కానీ, సరిహద్దులలో ఇప్పుడు ఏం జరుగుతున్నదో, గతంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. దాని ఫలితమే జూలై 3న ఆయన లద్ధాఖ్‌లో చైనా విస్తరణవాదాన్ని గట్టిగా ఖండించగలిగారు. బీజేపీ కార్యకర్తగా, ఆ పార్టీ విదేశాంగ విధానం లోతులు తెలిసిన వ్యక్తిగా మోదీ చైనాకు సంబంధించి ఏనాడూ కలల ప్రపంచంలో విహరించలేదు. ఆయన 2014లో ప్రధాని అయ్యారు. ఆ సెప్టెంబర్‌లోనే జపాన్‌లో పర్యటించారు. అప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తల సదస్సులో మోదీ ప్రసంగం ఏ తీరున సాగిందో ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. విస్తరణ కాంక్షతో ఒక దేశం సముద్ర జలాల్లోకి చొరబడాలని ఒకసారి, భూభాగాలను ఆక్రమించాలని ఒకసారి యత్నిస్తున్నది. 21వ శతాబ్దంలో విస్తరణ కాంక్ష మానవాళికి మంచిదికాదన్న సత్యాన్ని ఆ దేశం గుర్తించాలి. విస్తరణవాదం, విజ్ఞానం అనే రెండు దారులు కనిపిస్తున్నాయి. ఇందులో విజ్ఞానమనే బాటదే భవిష్యత్తు. ఈ శతాబ్దంలో అభివృద్ధిదే ప్రధాన పాత్ర అని ఆయన అన్నారు. కాబట్టి విస్తరణవాదానికీ, అభివృద్ధికీ ఒకే సమయంలో చోటు ఉండదన్నదే మోదీ అభిప్రాయంగా కనిపిస్తుంది.
ఇప్పుడు అమెరికా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా స్వీకరించాయి. వివాదం ఉన్న సరిహద్దు ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చే ఏ ఏకపక్ష చర్యనయినా జపాన్‌ ‌వ్యతిరేకిస్తుందని ఆ దేశ భారత రాయబారి ప్రధాని పర్యటన సమయంలోనే హామీ ఇచ్చారు. గల్వాన్‌ ‌లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను కోల్పోవడం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ అమెరికా ప్రముఖ సెనేటర్‌ ‌రిక్‌ ‌స్కాట్‌ ‌జూలై రెండో తేదీన మోదీకి లేఖ రాశారు. కమ్యూనిస్టు చైనాతో భారత్‌ ‌జరిపే పోరాటానికి అమెరికా మద్దతు ఉంటుందని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా పరిస్థితులలో జిన్‌పింగ్‌ ‌పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తిని ఆ దేశాలు విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించగలవా? చైనా విస్తరణవాదంతో 21 దేశాలు బాధపడుతున్న సంగతి ఈ దేశాలకు తెలియనిది కాదు. మోదీ మీద విమర్శలు చేసే పార్టీలకీ, వాటిని నడిపే నాయకులకీ ఆ మాత్రం ఇంగితం కూడా లేదు. శక్తిమంతులు మాత్రమే శాంతి ప్రియులు కాగలరన్న మోదీ సందేశం కూడా లోతయినది. ఇందులోని శాంతి సందేశం కాంగ్రెస్‌ ‌నేతల బుర్రకు అందేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌నాయకుల అజ్ఞానం, చిత్త చాంచల్యం చైనాలో కూడా కనిపిస్తున్నది. వాస్తవాధీన రేఖ వద్ద నుంచి బలగాలను ఉపసంహరించుకోవడం గురించి చర్చలు జరుగుతూ ఉంటే, తన పని తనదే అన్నట్టు సరిహద్దులలో శిబిరాలు నిర్మించిన ద్వంద్వ వైఖరి ప్రదర్శించిన ఆ దేశం, మోదీ పర్యటన గురించి అత్యంత చౌకబారు వ్యాఖ్యలు చేసి తన బుద్ధిని చాటుకుంది. సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు రెచ్చగొట్టే చర్యలు ఇరు దేశాలు పాల్పడరాదని సుద్దులు చెబుతోంది. సరిహద్దు వివాదాలు సంఘర్షణల వరకు వెళ్లకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని పదిరోజుల క్రితం చెప్పిన దేశం నిర్వాకమే ఇదంతా. ఇప్పుడు కూడా చర్చల ద్వారా అన్నీ పరిష్కరించు కోవాలని అంటున్నది. కానీ ఆనాడు సర్దార్‌ ‌పటేల్‌ ‌చెప్పినదే ఇప్పుడూ నిజం. చైనా నమ్మదగిన పొరుగు కాదు. గల్వాన్‌ ‌ప్రాంతమంతా తమదేనని ప్రకటిస్తూ సరికొత్త వివాదాన్ని లేవదీసిన దేశమే చైనా. దీనితో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సరిహద్దులలో పర్యటించి, వాటి పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ గురించి చైనాకు తెలిసేలా చేశారు. చైనా మైండ్‌ ‌గేమ్‌కు మోదీ ఈ విధంగా ఓ శక్తిమంతమైన సమాధానం ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE