తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపి స్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులోనూ రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌లో కరోనా పాజిటివ్‌ ‌కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్‌ ‌కొవిడ్‌-19‌కు హాట్‌స్పాట్‌గా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి విమర్శలకు దారితీస్తున్నాయి.
కరోనా వెలుగుచూసిన మొదట్లో దూకుడుగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలను అందుకుంది. కానీ, కాలక్రమంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎన్ని నిర్వహిస్తున్నారన్న సమాచారం విషయంలో గోప్యత పాటించడం అందులో ప్రధానంగా విమర్శలకు తావిస్తోంది. హెల్త్ ‌బులెటిన్‌లో లెక్కలకు, క్షేత్రస్థాయిలో లెక్కలకు పొంతన ఉండటంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అంతే కాదు.. నిత్యం హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల విషయంలో కూడా సీరియస్‌గా దృష్టి సారించడం లేదని చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న క్రమంలో రాష్టప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదంటున్నారు. సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చేస్తే.. తీవ్రత అందరికీ అర్థమవుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు.. జనం స్వచ్ఛందంగా ఎలా వ్యవహరించాలో కూడా తెలుస్తుంది. కానీ, ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అతితక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వం.. కనీసం వాటి లెక్కలు బయటపెట్టడం లేదు. ఇప్పటిదాకా మొత్తం ఎన్ని పరీక్షలు చేశారు? రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తే, ఎన్ని పాజిటివ్‌ ‌రిజల్టస్ ‌వచ్చాయి? అన్న వివరాలు కూడా హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొనడం లేదు. అరకొర సమాచారమే ఇస్తున్నారు.

ప్రతిరోజు రాత్రి కరోనా హెల్త్ ‌బులెటిన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ రిపోర్టులో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య, ఆ రోజు కొత్తగా నమోదైన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య, చికిత్స పొందుతున్న యాక్టివ్‌ ‌కేసులు, మరణాల వివరాలు మాత్రమే ఇస్తున్నారు. రోజూ రెండు పేజీలతో కూడిన హెల్త్ ‌బులెటిన్‌ను వెలువరిస్తోంది. అందులోనూ ఒకపేజీలోనే కరోనా కేసుల వివరాలు ఉంటున్నాయి. రెండోపేజీలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. మొదటిపేజీని అదే ఫార్మాట్‌లోనే కేవలం అంకెలు మార్చి రోజూ వెలువరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతనెలలో ఒకరోజు వెలువరించిన హెల్త్ ‌బులెటిన్‌లో క్రితంరోజు తేదీ ఉండటం.. అది సర్క్యులేట్‌ ‌కావడం జరిగిపోయింది. కాసేపటికి ఎవరో జర్నలిస్టు దాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు తేదీ మార్చి మరో హెల్త్ ‌బులెటిన్‌ను రిలీజ్‌ ‌చేశారు.
మన పొరుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని అనేక రాష్ట్రాలు వెలువరిస్తున్న హెల్త్ ‌బులెటిన్‌లో చాలా వివరాలు ఇస్తున్నారు. మరణించిన వారిలో పురుషులు ఎందరు, స్త్రీలు ఎంతమంది, వాళ్ల వయసు, ఎలాంటి సమస్యతో మరణించారన్న వివరాలు కూడా ఆయా రాష్ట్రాలు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఏ రోజు వివరాలు ఆ రోజు, మొత్తం వివరాల గ్రాఫ్‌లు కూడా అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల హెల్త్ ‌బులెటిన్‌లు 20 పేజీలకు పైగా ఉంటుండటం సమగ్ర వివరాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇక.. రాష్ట్రంలో కరోనా స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మొదట్లో ప్రెస్‌మీట్‌లు పెట్టిన సమయంలో రాష్ట్రంలో కరోనా సోకిన ఎవరికైనా గాంధీ ఆస్పత్రిలోనే సూపర్‌ ‌స్పెషాలిటీ చికిత్స అందిస్తామని ప్రకటించారు. డబ్బున్న వాళ్లయినా, డబ్బు లేని వాళ్లయినా వైరస్‌కు ఒకటే అని, అలాగే గాంధీలో చికిత్స కూడా అందరికీ సమానంగా అందిస్తామని, మరణాలు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కానీ, ఇప్పుడు నిత్యం గాంధీ ఆస్పత్రి నుంచి వస్తున్న లీకులు, అక్కడ చికిత్స పొందుతున్న వాళ్లు భయంతో, నైరాశ్యంతో, బతుకుమీద ఆశతో ఫోన్లలో అయినవాళ్లకు చెబుతున్న వివరాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఇటీవల కరోనాతో మరణించిన ఒక టీవీ చానల్‌కు చెందిన క్రైం జర్నలిస్ట్ అక్కడ చికిత్సకు సంబంధించి స్నేహితులతో చేసిన వాట్సప్‌ ‌చాటింగ్‌, ‌మరో జర్నలిస్టు కరోనా పాజిటివ్‌తో గాంధీలో చేరినప్పటినుంచి 24 గంటలు దాటినా కనీసం టిఫిన్‌ ‌కూడా పెట్టకపోవడంపై తన సన్నిహితులతో సెల్‌ఫోన్‌లో మొరపెట్టుకున్న ఆడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారాయి. గాంధీ బండారాన్ని బట్టబయలు చేశాయి. అంతేకాదు, తమపై జరిగిన దాడిని నిరసిస్తూ జూనియర్‌ ‌డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సైతం గాంధీలో చికిత్స జరుగుతున్న తీరును కొంతమంది జూనియర్‌ ‌డాక్టర్లు బహిరంగం గానే విమర్శించారు.

ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ ‌మనోజ్‌ ‌కుమార్‌ ‌కరోనాతో మృతిచెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్‌ ‌కుమార్‌ ‌సరైన చికిత్స అందక, వైద్యులు పట్టించుకోకపోవడంవల్లనే మరణించాడని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. మనోజ్‌కుమార్‌ ‌గాంధీలో చేరిన సమయంలో తన మిత్రులతో చేసిన వాట్సప్‌ ‌చాటింగ్‌ ‌వివరాలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. మనోజ్‌కుమార్‌ను గాంధీ ఆస్పత్రిలో చేర్చిన అతని సోదరుడు సాయి.. బయటపెట్టిన వివరాలు ఈ వాదనకు బలం చేకూర్చాయి. జర్నలిస్టు మనోజ్‌ ‌కుమార్‌ ‌కరోనా పాజిటివ్‌ ‌నిర్ధారణ అయ్యాక.. గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. కానీ, అతని పరిస్థితి విషమించినా వైద్యులు ఏమాత్రం పట్టించుకోలేదట. మనోజ్‌ ‌సోదరుడు సూపరింటెండెంట్‌తో గొడవ పెట్టాక గానీ, అతన్ని ఐసీయూలోకి షిఫ్ట్ ‌చేయలేదట. అంతేకాదు.. ఐసీయూలోకి షిఫ్ట్ ‌చేశాక కూడా బెడ్‌ ‌లేదన్న సాకుతో గంటన్నరపాటు స్ట్రెచర్‌లోనే కూర్చోబెట్టారట. గాంధీలో పరిస్థితి బాగాలేదని వేరే ఏదైనా ఆస్పత్రికి వెళ్దామని మనోజ్‌ ‌వాట్సప్‌ ‌చాటింగ్‌లో ప్రాధేయపడ్డాడు. గాంధీకి రావడం కన్నా.. స్మశానానికి వెళ్లడం మేలు అనికూడా మనోజ్‌ ‌వ్యాఖ్యానించాడని సోషల్‌ ‌మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో చివరకు చికిత్స తీరుతో బెంగపడి మనోజ్‌కుమార్‌ ‌చనిపోయాడని, మనోజ్‌ ‌కరోనాతో చనిపోలేదని, గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీరును స్వయంగా చూసి బెంగతో కన్నుమూశాడని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
మనోజ్‌ ‌చనిపోయిన ఐదు రోజులకే శివ అనే మరో జర్నలిస్టు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి కూడా తన సన్నిహితుడితో సెల్‌ఫోన్‌లో చెప్పుకున్నాడు. క్రితం రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరినా… మరుసటిరోజు మధ్యాహ్నం దాకా కనీసం టిఫిన్‌ ‌కూడా పెట్టలేదని గాంధీ ఆసుపత్రిలో పరిస్థితిని తేటతెల్లం చేశాడు.

ఇదే గాంధీ ఆస్పత్రిలో రెండు నెలలక్రితం పరిస్థితిని గమనిస్తే వీటికి విరుద్ధమైన ప్రకటనలు వచ్చాయి. ప్రధానంగా రంజాన్‌ ‌సమయంలో ఒక వర్గానికి చెందినవాళ్ల కోసం ప్రత్యేక భోజనం మెనూ నిర్ణయించారు. ఆ వర్గం వాళ్లు కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందితే హైఫై చికిత్స అందించడంతో పాటు.. భోజనం విషయంలో కూడా ప్రత్యేక మెనూ అమలు చేశారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు రంజాన్‌ ‌మాసం ముగిసిపోయింది. తిండి సంగతి దేవుడెరుగు.. కనీసం ఆస్పత్రిలో చేర్చుకున్న రోగులకు చికిత్స కూడా ప్రారంభించడం లేదన్న వ్యవహారం పైరెండు సంఘటనల్లో రుజువయ్యింది. కానీ, అధికారులుగానీ, ప్రభుత్వం గానీ ఈ విషయాన్ని బయటకు రానివ్వడం లేదని విపక్షాలు కన్నెర్ర జేస్తున్నాయి.

– సుజాత గోపగోని,  సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE