– డా. రామహరిత

‌ప్రపంచ రాజకీయాల నుంచి అమెరికా క్రమంగా వైదొలుగుతోందనే చర్చకు మరింత బలం చేకూరుస్తూ తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ట్రంప్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. చైనా వైరస్‌ను అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిం దన్న ఆరోపణలను మళ్లీ చేసిన ట్రంప్‌ ఆ ‌సంస్థ నుండి తప్పుకోవడం ఖాయమని ప్రకటించారు. చైనా వైరస్‌ ‌పుట్టుపూర్వోత్తరాలు, వ్యాప్తికి కారకులు ఎవరో విచారణ జరపాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి సమావేశాలలో 116 దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి చర్చ జరగకుండా చూడటంలో చైనా సఫలీక ృతమైన తరువాత ట్రంప్‌ ఈ ‌ప్రకటన చేశారు. ‘పారదర్శకత’, ‘జవాబుదారీతనం’ వంటివి తుంగలో తొక్కుతూ చైనా ఆ తీర్మానంలో ముఖ్య మైన వాక్యాలను తన ఇష్టం వచ్చినట్లు మార్చేసింది. ‘అవసరమైనంత మేరకు’ అంటూ వైరస్‌ ‌వ్యాప్తికి కారణాలు కనుగొనాల్సిన నైతిక బాధ్యత నుంచి తెలివిగా తప్పించుకుంది.

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతుంటే, చైనాను వేలెత్తి చూపుతూ ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ దేశం తప్పేమీ లేదన్నట్లు వ్యవహరించింది. ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడినా తన తప్పులను కప్పిపుచ్చుకోవడంలో చైనా దౌత్యపరంగా విజయాన్ని సాధించిందనే చెప్పాలి. మరోవైపు పరపతి, ప్రభావం కోల్పోతున్న ఐక్యరాజ్యసమితి సంస్థల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డా. టేడ్రోస్‌ ‘‌తరచూ చేసిన తప్పిదాలు’, ‘నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ’ లేకపోవడం వల్ల ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందంటూ విమర్శించిన ట్రంప్‌ ‌ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అందించే నిధులను నిలిపివేశారు. ఆరోగ్య సంస్థ 4.8 బిలియన్‌ ‌వార్షిక బడ్జెట్‌లో అమెరికా ప్రతి ఏడాది 400 మిలియన్‌ ‌డాలర్లు అందజేస్తుంది.

ఆరోగ్య సంస్థకు అందే నిధుల లెక్కలు చూస్తే శాశ్వత సభ్యత్వం కింద అమెరికా 2020లో 58 మిలియన్‌ ‌డాలర్లు అందజేస్తే, చైనా కేవలం 29 మిలియన్‌ ‌డాలర్లే ఇచ్చింది. ఇక దానికి అదనంగా 2018లో అమెరికా 281 మిలియన్‌ ‌డాలర్లు ఇస్తే, చైనా 6 మిలియన్‌ ‌డాలర్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్న ట్రంప్‌ ‌నిర్ణయాన్ని పలు జాతీయ ఆరోగ్య సంస్థలు విమర్శించాయి. ఈ విషయమై పునరాలోచన చేయాలని కోరాయి. కోవిడ్‌ ‌మహమ్మారిపై యుద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఇలా అమెరికా అర్ధాంతరంగా ఆరోగ్య సంస్థను వదిలిపెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ట్రంప్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించవలసి ఉంది. అయితే అమెరికా పక్కకు తప్పుకోవడానికి ఎంతకాలం పడుతుందన్నది ఒక ప్రశ్న. వివిధ అంతర్జాతీయ సంస్థల్లో చైనా జోక్యం, కరోనా వైరస్‌ ‌విషయంలో ఆరోగ్య సంస్థ చైనాను వెనకేసుకు వచ్చిన పద్ధతి చూస్తే చైనా ఆలోచన, లక్ష్యాలు పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కొమ్ముకాయడం అనేది అతిపెద్ద సమస్యలో చిన్న అంశం మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ సంస్థలపై పట్టుసాధించేందుకు చైనా చాలా ప్రయత్నమే చేసింది. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో తన ప్రాబల్యం పెంచుకోవాలనుకుంది.
అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాలను సాధించుకునేందుకు ఐక్యరాజ్యసమితిని సాధనంగా ఉపయోగించుకుంటోందని 1970లో తీవ్రంగా విమర్శించిన చైనా ఆ తరువాత క్రమంగా ఆ పని తాను చేయడానికి పూనుకుంది. పాశ్చాత్య విలువలు, ఉదారవాద సూత్రాల అనుగుణంగా రూపొందిన ఐరాస సంస్థల్లో తన ప్రభావాన్ని పెంచుకుంది.

ఐరాసలో చైనా ప్రారంభ దినాలు

భద్రతామండలి శాశ్వత సభ్యత్వంతో చైనా 1971 అక్టోబర్‌ 26‌న ఐక్యరాజ్యసమితిలో అడుగుపెట్టింది. ఐరాస తీర్మానం 2758 ద్వారా చైనా రిపబ్లిక్‌ ‌స్థానాన్ని పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ‌చైనాకు బదిలీ చేశారు. దీనితో చైనా అజ్ఞాతవాసం (1976లో మావో మరణించేవరకు చైనా ప్రపంచ బ్యాంక్‌, అం‌తర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదలైనవాటిలో సభ్యత్వం స్వీకరించలేదు) ముగిసింది. 1946 నుంచి 70 వరకు ఒంటరైన చైనా ‘వ్యవస్థలను రూపొందించుకునే ధోరణి’ అవలంబించిందని, ఆ తరువాత ‘వ్యవస్థలను సంస్కరించుకుందని’, ఆ తదుపరి ‘వ్యవస్థలను స్థిరపరచుకుని, వాడుకునే’ ధోరణి అవలంబించిందని శామ్యూల్‌ ‌కిమ్‌ ‌వ్యాఖ్యానించారు.

చైనా వ్యూహాత్మకంగా తన బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. భద్రతామండలిలో శాశ్వత సభత్వాన్ని, వీటో అధికారాన్ని ఉపయోగించుకుని ఐక్యరాజ్య సమితి పైనే పట్టు సంపాదించింది. ఐక్యరాజ్యసమితికి అమెరికా 25శాతం నిధులు, జపాన్‌, ఇతర దేశాలు 19.9శాతం నిధులు అందిస్తుంటే చైనా మాత్రం తన వాటాను 5.5 శాతం నుంచి ఇంకా తగ్గించి 0.79 శాతం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అంతకంటే ఇవ్వలేమంటూ వాదించడమేకాక ఐక్యరాజ్యసమితి మెడలు వంచి ఆ మేరకు ప్రకటన చేయించింది.

‘‘ఏ దేశపు అంతర్గత వ్యవహారాల్లోనూ ఐరాస కల్పించుకోదు’’ అన్న అధికరణం 2.7 ను చైనా ఉపయోగించుకున్నంతగా మరే దేశం వాడుకోలేదు. ఈ పేరు చెప్పి చైనా అంతర్జాతీయ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించింది. టిబెట్‌, ‌జిన్‌ ‌జియాంగ్‌, ‌తైవాన్‌లు తమవంటూ వాదించింది.
చైనా ఎప్పుడూ మావో విధానాలను వదిలిపెట్టలేదు. ప్రపంచమంతటా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని తాను అంతర్జాతీ యంగా బలపడింది. సున్నితమైన, ప్రమాదకరమైన విషయాల్లో దేశ ఆమోదాన్ని పొందడం కోసం చైనా ప్రభుత్వాలు ప్రజల్ని భయపెట్టాయి. గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల్ని ఏకరవు పెట్టాయి. చైనా రాజకీయ సంస్కృతి, చట్టాలే ఆ దేశపు అంతర్జాతీయ వ్యవహారాన్ని కూడా ప్రభావితం చేశాయి.

చైనా ద్వంద్వ వైఖరి

‘ఒకే చైనా’ విధానాన్ని సాకుగా చూపుతూ తైవాన్‌ ఎలాంటి రక్షణ, పర్యావరణ, మానవహక్కుల ఒప్పందాలు, సంస్థల్లో చేరకుండా చైనా అడ్డుకుంది. అయితే ఆర్ధిక, వాణిజ్య సంస్థల్లో సభ్యత్వం పొందడాన్ని మాత్రం అనిష్టంగానే అంగీకరించేది. తైవాన్‌ ఆసియా ‘పసిఫిక్‌ ఆర్ధిక సహకార సంస్థ (APEC), ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (‌ADB), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లలో సభ్యత్వం పొందింది. ‘తైవాన్‌, ‌పెంఘు, కిన్మెన్‌, ‌మత్సు(చైనా తైపి)’ పేరుతో 2002లో తైవాన్‌ ‌ప్రపంచ వాణిజ్య సంస్థలో స్థానం సంపాదించగలిగింది. హాంగ్‌కాంగ్‌ ‌కూడాAPEC లో సభ్యత్వం పొందింది. అయితే తైవాన్‌ ‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేర్చుకోరా దంటూ చైనా అభ్యంతరం తెలపడం ఆ దేశపు మొండి వైఖరికి తార్కాణం.

ద్వంద్వ వైఖరికి పెట్టింది పేరు చైనా. స్వయంగా రూపొందించిన తీర్మానాలను కూడా ఆమోదించక పోవడం ఆ దేశానికి అలవాటు. ‘హింసకు వ్యతిరేకంగా’ తీర్మానాన్ని రూపొందించడంలో చురుకుగా పాల్గొన్న చైనా ఆ తరువాత దానిని ఆమోదించలేదు, అమలును పట్టించుకోలేదు. 1998లో ప్రపంచ కార్మిక సంస్థ రూపొందించిన ‘పని స్థలంలో హక్కులు, ప్రాధమిక సూత్రాల’ తీర్మానాన్ని కూడా చైనా ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాగే కారాగారాలు, ఖైదీలకు సంబంధించి ఐరాస తీర్మానాన్ని కూడా జాతీయ చట్టాలకు లోబడే అమలు చేస్తామంటూ నీరుగార్చింది. చైనా వాదనకు క్యూబా వంతపాడింది.

మానవ హక్కుల కంటే సార్వభౌమత్వం ఎక్కువంటూ చైనా వాదించింది. మానవ హక్కులపై పాశ్చాత్య దేశాల నిర్వచనాన్ని కాదన్న చైనా మరికొన్ని దేశాలను కలుపుకుని తన ధిక్కారస్వరాన్ని తరచూ వినిపించేది. అలాగే అంతర్జాతీయ మానవహక్కుల నిబంధనల అమలును వ్యతిరేకించింది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు రాకుండా అడ్డుకుంది. మానవహక్కుల ఉల్లంఘనలో చైనా కొత్త రికార్డులు నెలకొల్పింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిని మాయం చేయడం, అన్యాయంగా నిర్బంధించడం వంటి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం అక్కడి కమ్యూనిస్ట్ ‌ప్రభుత్వానికి సర్వసాధారణం. కానీ మరోపక్క ఐరాస సంస్థలను ఉపయోగించుకుని ఆర్ధికంగా బాగా బలపడింది. ప్రపంచ బ్యాంక్‌ ‌నుంచి అత్యధిక రుణం పొందింది.

ఉయిఘర్‌ ‌ముస్లింలపై సాగుతున్న అత్యా చారాలు, అరాచకాలను ఖండిస్తూ అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియా సహా 23 దేశాలు 2019 అక్టోబర్‌లో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే అవి తీవ్రవాద వ్యతిరేక చర్యలంటూ చైనాకు మద్దతుగా బెలారస్‌, ‌రష్యా, ఈజిప్ట్, ‌బొలీవియా, సెర్బియాలతో సహా 54 దేశాలు మరో ప్రకటన విడుదల చేశాయి.

చైనా 2006 నుంచి 2019 వరకు ఐరాస మానవహక్కుల కమిషన్‌ ‌సభ్యదేశంగా కొనసాగింది. అయినా కరోనా వైరస్‌ ‌వ్యాప్తి గురించి ప్రపంచానికి నిజాలు చెప్పాలని ప్రయత్నించిన డా. లీ వెంలియాంగ్‌ ‌ప్రాధమిక హక్కులని హరించడంలో ఏమాత్రం వెనుకాడలేదు. తన ‘చట్ట విరుద్ధమైన ప్రవర్తన’కు సంజాయిషీ ఇచ్చుకోవాలను డా. లీని నిర్బంధించింది. అయినా విచిత్రంగా జెనీవాలో చైనా ప్రతినిధి జియాంగ్‌ ‌డ్యూయాన్‌ ఐరాస మానవ హక్కుల సలహా సంఘ సభ్యుడిగా నియమితు లయ్యారు.

అంతర్జాతీయ ఎదుగుదలకు ఐరాస

‘ప్రపంచ సంస్థలో సంస్కరణలు తెచ్చేందుకు చొరవ తీసుకోవడం’ తన భవిష్యత్‌ ‌కార్యాచరణలో ఒక భాగమంటూ అధ్యక్షుడు జి పింగ్‌ ‌చైనా కమ్యూనిస్ట్ ‌పార్టీ 19వ కాంగ్రెస్‌ ‌సమావేశాలలో ప్రకటించారు. దీని అర్ధం ఈ సంస్థలలోకి• చొచ్చుకుపోవాలనుకుంటున్నట్లు జి పింగ్‌ ‌చెప్పక చెప్పారన్నమాట.

ఈ వ్యూహంలో భాగంగా చైనా మూడు విభాగాల్లో బాగా నిధులు కుమ్మరించడం ప్రారంభించింది. ఐరాస శాంతి పరిరక్షణ దళం, వాతావరణ మార్పులు, సమీకృత అభివృద్ధి లక్ష్యాలు (•ణ+). ఒకప్పుడు 1971లో శాంతి పరిరక్షణ దళాలకు ఎలాంటి నిధులు, బలగాలను సమకూర్చమని తెగేసి చెప్పిన చైనా, ఇప్పుడు మాత్రమే అత్యధిక నిధులు అందిస్తోంది. చైనా ఏది చేసినా, వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశించే చేస్తుంది. తమ చమురు ఎగుమతులు, పెట్టుబడులకు కీలకమైన ఆఫ్రికాలో 80శాతానికి పైగా తమ బలగాలను శాంతి పరిరక్షణ పేరుతో మోహరించి వ్యూహాత్మక ఆస్తులను కాపాడుకుంటోంది.

అలాగే 1997లో క్యోటో, 2009 పర్యావరణ మార్పు సమావేశాల తీర్మానాలను వ్యతిరేకించిన చైనా 2015లో మాత్రం తన ధోరణి హఠాత్తుగా మార్చుకుని పారిస్‌ ఒప్పందంపై స్వచ్ఛందంగా సంతకం చేసింది. జాతీయ నిర్ధారిత వాటా (SDG)ని 60 -65 శాతం తగ్గించుకుంటామని హామీ ఇచ్చింది కూడా.

అమెరికా వీడ్కోలు

ఒక పక్క చైనా ఐరాస మానవహక్కుల కమిషన్‌లో ప్రముఖ స్థానం పొందితే, అమెరికా మాత్రం ఆ సంస్థతో పాటు ఐరాస సాంస్కృతిక సంస్థ నుంచి వైదొలగింది. యునెస్కో ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి ఆ సంస్థ మొత్తం బడ్జెట్‌లో 22శాతం నిధులు అందించిన అమెరికా, 2011 నుంచి నిధుల కేటాయింపును పూర్తిగా నిలిపేసింది. జెరూసలేం పూర్తిగా పాలస్తీనాకు చెందినదని యునెస్కో ప్రకటించడంతో ఇజ్రాయెల్‌ ‌కూడా ఆ సంస్థ నుండి తప్పుకుంది. సంస్థలో నిధుల దుర్వినియోగం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు 1984లో రీగన్‌ ‌హయాంలో ఒకసారి అమెరికా యునెస్కోకు వీడ్కోలు చెప్పింది. కానీ 2003లో మళ్లీ ప్రవేశించింది. ఇప్పుడు 2017 అక్టోబర్‌లో మరోసారి తప్పుకుంటున్నట్లు ట్రంప్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది.
ఐరాస మానవహక్కుల కమిషన్‌లో ఇజ్రాయెల్‌ ఒక్కటే ప్రశ్నించే ధోరణి ఉండడం మంచిది కాదంటూ అమెరికా అనేకసార్లు పేర్కొన్నది.
అమెరికా 11 బహుళ స్థాయిల ఒప్పందాల నుంచి వైదొలగింది. అందులో ప్యారిస్‌ ఒప్పందం, మధ్యంతర శ్రేణి అణు శక్తులు (INF) ఒప్పందం, ఇరాన్‌ అణు ఒప్పందం వంటివి ఉన్నాయి.

అంతర్జాతీయ సంస్థలను స్థాపించడంలో, నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా వైదొలగడం వల్ల వాటిని ఆక్రమించుకునేందుకు ఇప్పుడు చైనాకు మంచి అవకాశం లభిస్తోంది.

ఒకప్పుడు ప్రచ్చన్న యుద్ధం సాగుతున్న రోజుల్లో అమెరికా ‘ప్రపంచంపై నిరంకుశ అధికారాన్ని’ సాధించడానికి అనవసరంగా ప్రయత్నిస్తోందని, అందుకోసం ఐరాస సంస్థలను ఉపయోగించు కుంటోందని అప్పటి చైనా అధ్యక్షుడు డెంగ్‌ ‌జీ పింగ్‌ ‌విమర్శించారు. కానీ నాలుగు దశాబ్దాల తరువాత చైనా సరిగ్గా అదే పని చేస్తోంది. ఇన్నేళ్లు తన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు అమెరికా ఐరాసను వాడుకుంది. ఇప్పుడు అదే పని చైనా చేయాలనుకుంటోంది.

About Author

By editor

Twitter
YOUTUBE