తెలుగు మాసాల్లో ఆషాడానికి ప్రత్యేక స్థానముంది. చంద్రుడి గమనాన్ని బట్టి నెలల పేర్లు నిర్ణయించారు. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాల వద్దకు ప్రవేశించినప్పుడు ఆ నెలను ఆషాడం అంటారు. తెలుగు మాసాల్లో ఇది నాలుగో నెల. ఆషాడంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ మాసంలోనే వర్ష రుతువు ప్రారంభమవుతోంది. సాధారణంగా ఆషాడాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఎలాంటి శుభకార్యాలు, వేడుకలు తలపెట్టరు. అయినప్పటికి ఆషాడం పూజలు వ్రతాలకు అత్యంత శ్రేష్ఠమైందని నమ్మకం. ముఖ్యంగా అమ్మవారినీ, ఈశ్వరుడినీ, విష్ణుమూర్తిని అర్చించాలని చెబుతుంటారు.
ఈ నెలల్లోనే హిందువుల మొదటి పండుగ తొలిఏకాదశితో పర్వదినాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడనీ, కనుకనే దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. నాలుగు నెలల తర్వాత వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు మహావిష్ణువు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడు. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుంది. ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపాసించి, విష్ణు సాయుజ్యం పొందాడు. దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించాడు. ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం, ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని స్మృతి పురాణాన్ని బట్టి తెలుస్తోంది.
ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఇక ఏకాదశి రోజున వరి అన్నం తినరాదని తెలిపేందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు, బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వరి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు. కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్లే తొలి ఏకాదశినాడు ఉపవాసం ఉంటే ఎంతో శ్రేష్ఠమని విశ్వాసం. ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ చేసి, విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు. గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి, ఒంటిపూట భోజనం చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేథయాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు నాలుగు నెలల పాటు మహావిష్ణువు జల శయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం (నాలుగు నెలలు) చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది. నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానం ఆచరించి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఇంకా చాతుర్మాస్య ప్రారంభం, సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా భక్తులు సత్ఫలితాలు పొందు తారని పురాణాలు వివరిస్తున్నాయి.