మానవాళి చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తును సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆధునిక నాగరికత స్వరూపాన్నే మార్చివేయనున్నది. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలు, సమాజంలో కల్లోలం రేపుతున్న పలు పరిస్థితులను సైతం మార్చి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మహమ్మారి తర్వాత మానవ జీవనమే అనూహ్యమైన మలుపు తీసుకొంటుందని సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సమాజంలో ఎటువంటి అంతరాలకు అవకాశం లేకుండా ఈ మహమ్మారి అన్ని వర్గాల వారిని ఆవహించడం, అందరి జీవనాల్లో కల్లోలం సృష్టించడం గమనిస్తే పకృతి వైపరీత్యం ముందు అందరం ఒక్కటే అనే అంశం స్పష్టమైంది. మానవు లుగా మనం సంతోషంగా జీవనం సాగించాలంటే సామాజిక సమతుల్యత అనివార్యమని ఇప్పుడు వెల్లడైనది. ఈ సందేశం గ్రహించనిదే సమాజంలో ప్రశాంతత, సమగ్రాభివృద్ధి సాధ్యంకాదని అర్ధం చేసుకోవలసి వస్తున్నది.
ఈ వైరస్ సోకడానికి అంతరాలు లేవని ఒకవైపు స్పష్టం అవుతుండగా, సమాజంలో సమరసత నెలకొనని పక్షంలో ఎటువంటి కల్లోల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో వలస కార్మికుల ఉదంతం మరోవైపు స్పష్టం చేస్తుంది. భారతీయ సామజిక జీవనంలో, ఆర్థిక ప్రగతిలో వారెంతటి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారో ‘మమ్ములను ఇళ్లకు తిరిగి వెళ్లనివ్వండి’ అంటూ వారు వీధులలోకి వచ్చి, వందలమైళ్ల దూరం చంటిబిడ్డలను ఎత్తుకొని, మండు టెండలను సహితం లెక్కచేయకుండా నడుచుకొంటూ వెళుతుంటే గాని అర్థంకాలేదు.
అప్పటికిగాని వారిగురించి ప్రభుత్వాలు ఆలోచించడం ప్రారంభించలేదు. ఉన్నత న్యాయ స్థానాలకు సహితం వారి గురించి స్పందించడానికి రెండు నెలలు పట్టింది. లాక్‌డౌన్ కారణంగా సొంత ఊళ్లకు ఎంతో దూరంగా ఉపాధి లేక, తిండి తిప్పలు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే; వారు వీధులలోకి వచ్చే వరకు వారి గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకో లేదు? ఈ దేశంలో రాజకీయపక్షాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వారి గురించి ఇప్పటి వరకు ఎందుకు ఆలోచించలేదు?
అసలు ఎక్కడెక్కడ ఎంతమంది వలస కార్మికులు ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 11 కోట్ల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయ కార్యక్రమంలో 8 కోట్ల మందికి లెక్క వేశారు. వీరంతా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లిన వారే. రాష్ట్రాల లోపల ఒక చోట నుండి మరోచోటకు వెళ్లినవారు అంతకు రెండు రెట్ల మంది అయినా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద 30 కోట్ల మంది వరకు ఉన్నారు. వీరిలో కొన్ని లక్షల మంది రోడ్ల మీదకు వస్తేనే ఇంతటి అలజడి చెలరేగింది. మరింత భారీ సంఖ్యలో వస్తే దేశం ఏమై ఉండేది?
ఆర్థిక వ్యవస్థలో వీరేమి చేస్తున్నారో ఎవ్వరి దగ్గర అంచనాలు లేవు. ఒక దశాబ్దం క్రితం ఒక విశ్వవిద్యా లయం జరిపిన అధ్యయనంలో జీడీపీలో వీరు 10 శాతం వరకు సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఈ శాతం కనీసం 15 శాతం వరకైనా పెరిగే అవకాశం ఉంది. దేశంలో మన ప్రభుత్వాలు పెట్టుబడులు అంటూ ఎన్నో రాయితీలు కల్పించడం కోసం ముందుకు వస్తున్న కార్పొరేట్ ప్రపంచం సమకూరుస్తున్న మొత్తం కన్నా మూడు రెట్లకు పైగా వీరు సమకూరుస్తున్నారు.
మన దేశంలో పట్టణ జీవనం గణనీయంగా పెరుగుతున్నది. పట్టణాల జీవనం అంతా వీరి మీదనే ఆధారపడి ఉంది. అక్కడ జరిగే నిర్మాణ కార్యక్రమా లలో ఎక్కువగా వీరే పనిచేస్తున్నారు. గతంలో పురపాలక, నగర పాలక సంఘాలు పారిశుద్ధ్య పనుల కోసం కార్మికులను ఉద్యోగులుగా నియమించుకునేవి. కానీ ఇప్పుడు కాంట్రాక్టులకు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లు వలస కార్మికులతోనే ఈ పనులు చేయిస్తున్నారు. చివరకు పెద్ద పెద్ద కర్మాగారాలలో సైతం వీరే ఎక్కువగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ప్రారంభమైన తర్వాత వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లిపోతామంటూ బయలుదేరుతూ ఉంటే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందాయి. వారెళ్లిపోతే తమ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా పునరుద్ధరణ జరుగుతాయని అంటూ ముఖ్యమంత్రులే కలత చెందారు. వారిని తిరిగి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
లాక్‌డౌన్ ప్రారంభ సమయంలోనే వలస కార్మి కుల సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణన లోనికి తీసుకొని ఉంటే నేడు ఇంతటి అశాంతి, అలజడి ఉండేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా వారిప్పుడు స్వగ్రామాలకు వెళతూ ఉండడం వలన కరోనా వైరస్ గ్రామాలకు సైతం వ్యాపిస్తున్నదని ప్రభుత్వాలు ఆందోళన చెందే పరిస్థితులు ఏర్పడేవి కావు. తమ గ్రామాలలో వారికి తగిన ఉపాధి లేకనే పొట్ట చేతపట్టుకొని, కుటుంబ సభ్యులతో సుదూర ప్రాంతాలకు పనులకోసం వెళతున్నారు.
భారత రైల్వేకు వస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం వీరి నుండే వస్తున్నట్లు చెప్పవచ్చు. అటువంటి వారు పనులు ప్రారంభం అవుతున్నాయని చెబుతున్నా ఎందుకు తిరిగి వెళ్లిపోవాలి అనుకుంటు న్నారు? ఈ సందర్భంగా ఈ ప్రశ్న ప్రాధాన్యం సంతరింపచేసుకుంది. ఈ సమస్యను సామజిక కోణం నుండి పరిశీలించవలసి ఉంది. వృద్ధులైన తల్లిదండ్రు లను ఇళ్ల వద్ద కాపలాకు వదిలివేసి, పట్టణాలకు పిల్లలతో వస్తూ వారికి చదువు, సంధ్యలు లేకుండా చేస్తున్నారు. పైగా వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు.
స్థానిక కార్మికులైతే 8 గంటలకు మించి పని చేయరని, వీళ్లయితే 10 నుండి 14 గంటల వరకు పని చేస్తారని వీరిని తీసుకువస్తున్నారు. అంటే ఒక విధంగా వీరితో ‘వెట్టి చాకిరీ’ చేయిస్తున్నారు. వీరికి రక్షణ కల్పించే విధంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు పరచే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యడం లేదు. వారి దుస్థితికి చట్టాలను అమలు పరచని వారిని కూడా బాధ్యులుగా చేయవలసిన అవసరం లేదా? వారిని పనుల కోసం తీసుకువచ్చిన యాజమాన్యాలు అన్నీ సంపన్నమైనవే. రెండు నెలల పాటు పనులు లేక ఉన్నప్పుడు వారిని ఆదుకొనే బాధ్యత వారికి లేదా? వారిపై ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకొనే ప్రయత్నం కూడా చేయడం లేదు.
వలస కార్మికులలో అత్యధికులు దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారు. ఆ తర్వాత ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిని ఇప్పుడు తమ స్వస్థలాల నుండి తిరిగి వెళ్లకుండా, అక్కడ ఉపాధి అవకాశాలు కలిపిస్తామని యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటే ఉపాధి అవకాశాల కోసం కదలికలు సహితం సహజంగానే ఉంటాయి. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకొని వారి నుండి శ్రమ దోపిడీకి అవకాశం లేని వ్యవస్థలను ఏర్పాటు చేయడమే మనం ఇప్పుడు చేయవలసింది.
లాక్‌డౌన్ సందర్భంగా వలస కార్మికుల దుస్థితులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వాల కన్నా అనేక సామజిక, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి వారికి భోజనం, తాగునీరు, వసతి వంటి సదుపాయాలు కల్పించడం చాలా హర్షణీయం. ఇటు వంటి సహాయం విపత్కర పరిస్థితులలో తాత్కాలిక ఉపశమనం కలిగించడం కోసమే దోహదపడగలదు. ప్రస్తుత పరిస్థితులలో వారికి బాసటగా నిలబడటం ఎంతో ఉదాత్తమైన అంశమే అయినప్పటికీ ఇది పరిష్కారం కాబోదు.
దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముకగా నిలుస్తున్న వలస కార్మికులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం సామజిక బాధ్యత. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన చొరవ చూపించాలి. వారి శ్రమకు తగిన ఆదాయం లభించే విధంగా చూడాలి. వారికి వసతి, ఆరోగ్యం, పిల్లలకు చదువు వంటి సదుపాయాలు కల్పించడం కోసం చట్టబద్ధమైన ఏర్పాట్లు చేయాలి.
ప్రభుత్వాలే నేడు ఉద్యోగ నియామకాలను దాదాపు నిలిపి వేసి కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడుతున్న సమయంలో వలస కార్మికుల సాధికారికతకు ఏ మాత్రం ఆసక్తి చూపుతాయన్నది సందేహమే. నేడు నగరాలలో సుమారు 60 నుండి 80 శాతం మంది ప్రజలు మురికివాడలలో నివసిస్తున్నారు. అక్కడ కనీస జీవన సదుపాయాలు ఉండడం లేదు. మురిగివాడలలో జీవన పరిస్థితులను మెరుగు పరచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదని స్పష్టం అవుతున్నది.
భారతీయ సమాజంలో సమరసత సాధనలో వలస కార్మికుల సాధికారికత నిర్ణయాత్మకం కానున్నదని కరోనా మనకు తెలియచెబుతున్నది. ఆ దిశలో మనం ఆలోచింపవలసి ఉంది. వారిపట్ల సానుభూతి చూపడం, వారికి తాత్కాలిక సహాయం చేయడం కాకుండా మన సామాజిక నిర్మాణంలో అన్ని రకాల హక్కులు గల భాగస్వాములుగా వారిని గుర్తించాలి. వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని కల్పించాలి. వారి జీవనాలలో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా మన సామాజిక జీవనంలో సమరసత తీసుకు రాగలమని గ్రహించాలి. వారి నుండి శ్రమ దోపిడీ కోసం ప్రయత్నించడాన్ని నేరంగా పరిగణించాలి. కేవలం చట్టబద్ధమైన వ్యవస్థలు కల్పించడమే కాకుండా ఆచరణలో వారికి సమాజం అండగా నిలబడాలి. వారిని మిగిలిన సమాజంతో సంబంధం లేనివారిగా చూడరాదు. ఇదే నేటి విపత్కర పరిస్థితులు మనకు అందిస్తున్న మంచి సందేశం అని చెప్పవచ్చు.
– డా।। దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి