మన ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, సంస్థలు, ముఖ్యంగా అసంఘటిత రంగంలోని సంస్థలు (MSME) ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. మన స్థూల జాతీయోత్పత్తిలో 35 శాతం ఈ సంస్థలే సృష్టిస్తున్నాయి. మనదేశం నుంచి విదేశాలకు చేసే ఎగుమతుల్లో మూడోవంతు ఈ సంస్థల ఉత్పత్తులే. అందుకే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీలో వీటికి ప్రాధాన్యమిచ్చింది. ఈ సంస్థలు సమర్థవంతంగా నడవటానికి ఆర్థిక చేయూతనిచ్చింది. ఈ సంస్థలకు రూ.3 లక్షల కోట్లు పూచీకత్తు లేని రుణాల రూపంలో అందించనున్నట్లు చెప్పారు. అలాగే వీటిలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ గతంలో బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్న సంస్థలకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించే ఏర్పాటు చేశారు. అప్పుల రూపంలో కాకుండా సంస్థలలో పెట్టుబడుల రూపంలో పెట్టి లాభాలలో భాగస్వామ్యం పొందే పద్ధతిలో సాయం అందించటానికి రూ.50 వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేశారు.
అంతేకాదు, ఈ సంస్థలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల నుంచి రావలసిన మొత్తాలను 45 రోజులలో చెల్లించే విధంగా చర్యలు తీసుకు న్నారు. అలాగే కాంట్రాక్టులు, ఒప్పందాల అమలు, కాలపరిమితిని 6 మాసాలు పొడిగించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలకు నిబంధనల ప్రకారం ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయటానికి చర్యలు కూడా తీసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్యతరహా సంస్థల ఆర్థిక పరిమితులను పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది.
రూ.10 కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలను చిన్నతరహా సంస్థలుగా గుర్తిస్తారు. అంతేకాదు టర్నోవర్‌ను గణించేటప్పుడు ఆయా సంస్థలు చేసే ఎగుమతుల విలువను పరిగణలోనికి తీసుకోరు. అలాగే 50 కోట్ల రూపాయల పెట్టుబడి, 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థలను మధ్య తరహా సంస్థలు/పరిశ్రమలుగా గుర్తిస్తారు. దాదాపు 14 సంవత్సరాల అనంతరం ఈ పరిమితులను పెంచారు. 14 సంవత్సరాల పూర్వం ఉన్న పరిమితులు ఇంకా కొనసాగాలనుకుంటే అలా అనుకునేవారి ఆలోచనా లోపంగా భావించాలి.
మారుతున్న కాలంలో సంస్థల పెట్టుబడి అవసరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పెంచిన పరిమితి ఒకరకంగా హేతుబద్ధంగా ఉన్నదని చెప్పాలి. ప్యాకేజీలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే దానిని చిన్న తరహా సంస్థగా భావించటానికి వీలు లేదు. వర్తమాన పరిస్థితుల్లో నెలకు 50 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థను పెద్ద లేక మధ్య తరహా పరిశ్రమగా భావించటం అసమంజసం. వస్తువుల ధరలు బాగా పెరిగినందువల్ల ఒక మోస్తరు సంస్థలు కూడా నిబద్ధతతో పనిచేస్తే నెలకు 50 లక్షల రూపాయల అమ్మకాలు జరపడం పెద్ద విషయమేమి కాదు. అలా అని ఆ సంస్థను చిన్నతరహా సంస్థ కాదని, చిన్నతరహా సంస్థలకు కల్పించే సౌకర్యాలను దూరం చేయటంవల్ల అటువంటి ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నిరుత్సాహానికి గురవుతారు. కొందరు ఒక అడుగు ముందుకేసి మరో సంస్థను స్థాపించి ఒక సంస్థ టర్నోవర్‌ను వేరొక సంస్థ టర్నోవర్‌గా చూపించే ప్రయత్నం కూడా చేసే వీలుంది. ఇది మంచిది కాదు. అందుకే ఈ పరిమితులను పెంచమని పెద్ద ఎత్తున విన్నపాలు అందాయి. వాటి ఆధారంగా ఈ పరిమితులు పెంచారు. అయితే ఇంతగా పరిమితులు పెంచటం వల్ల MSME రుణాలు కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న సంస్థలకు మాత్రమే అందుతాయి. అతి చిన్న సంస్థలు ప్రైవేటు అప్పులపై ఆధారపడవలసి వస్తుందనే వాదన ఒకటి ఉంది. ఈ వాదనను పూర్తిగా కొట్టి పారేయలేం. అప్పుల వితరణలో బ్యాంకులు తమ నిర్ణయాలను తీసుకోవటంలో సంస్థ ఆర్థిక స్థితి ప్రముఖ పాత్ర పోషిస్తుందనే అంశం చాలావరకు వాస్తవం. అయితే రుణాల మంజూరులో బ్యాంకు శాఖలవారిగా కూడా లక్ష్యాలు ఉంటాయి కాబట్టి చిన్న సంస్థలకు అసలు అప్పులే ఇవ్వరు అని నిరాశపడవలసిన పనిలేదు. మన ఆర్థిక వ్యవస్థలో MSME రంగం అత్యంత కీలకమైనది. పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ రంగం 45 శాతం వాటా కలిగి ఉంది. అంతేకాదు మన ఎగుమతులలో కూడా 40 శాతం వాటా కలిగి ఉంది. కాబట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీ•వీజు యూనిట్లను తేలికగా తీసుకోలేవు.
కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలు వేగంగా వృద్ధి చెందటానికి గతంలో 12 పాయింట్ల ఎజెండాను రూపొందించి, అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగానే వీ•వీజు సంస్థలు సులభంగా అప్పు పొందటానికి ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు అప్పును త్వరితగతిన పొందే అవకాశం ఉంది. దీనికి సామాన్య ప్రజల్లో అంతగా అవగాహన లేనప్పటికీ స్వల్పకాలంలోనే ఈ పోర్టల్ ద్వారా దాదాపు 2 లక్షల పైచిలుకు సంస్థలు 53,921 కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని పొందాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 94 లక్షలకు పైగా MSMEలు మనదేశంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు 2 లక్షల సంస్థలు చాలా తక్కువ అని వాదించేవారు ఒక ముఖ్య విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ 94 లక్షల పైచిలుకు సంస్థలు అనేక సంవత్సరాలుగా రిజిస్టర్ అయిన సంస్థలు. అందులో పోర్టల్ ద్వారా అప్పుకోసం దరఖాస్తు చేసుకున్న సంస్థలు కేవలం 2.18 లక్షలే. వచ్చిన దరఖాస్తులలో రెండు లక్షల సంస్థలకు త్వరితగతిన అప్పు మంజూరు చేసి 53 వేల కోట్లకుపైగా వితరణ పూర్తి చేయడం విజయంగా భావించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అప్పు అవసరమున్న సంస్థలు ఈ సదుపాయాన్ని వాడుకొని అభివృద్ధి చెందాలి. అంతేగాని, నిర్వచనం మార్చారు, ఇక అప్పు లభ్యత మరింత కఠినంగా మారుతుందేమో నని అపోహలతో అసలు ప్రయత్నం కూడా చేయకుండా నీరసించటం మంచిది కాదు.
ప్రతి సంవత్సరం రాష్ట్రాలవారీగా పరపతి ప్రణాళికను రూపొందించి, దానిని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆమోదిస్తారు. ఆ పరపతి ప్రణాళికలో వివిధ రంగాలకు ఆ రాష్ట్రంలోని బ్యాంకులు వితరణ చేయవలసిన రుణాల లక్ష్యాలను పొందుపరుస్తారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో MSME రంగానికి 21 వేల కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటి అమలును ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సమీక్షిస్తారు. ఈ సొమ్మంతా కేవలం సంపన్న సంస్థలు, పెద్ద సంస్థలకు మాత్రమే అందిందని చెప్పలేరు. ఒక్క తెలంగాణలోనే ఇంత సొమ్మును బ్యాంకులు MSME యూనిట్లకు అప్పుగా ఇస్తే దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది కదా! అటువంటప్పుడు వీ•వీజు సంస్థలు తమ పెట్టుబడి అవసరాలకు ఎందుకు అవస్థ పడుతు న్నాయి. వాటిలో చాలా సంస్థలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి, చిట్‌ఫండ్స్ నుంచి ఎందుకు డబ్బు తీసుకుంటున్నారు? అని అడగవచ్చు. బ్యాంకులు తమ నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువ డబ్బును ఈ సంస్థలకు అప్పుగా ఇచ్చినా, అదీ చాలక మరింత అప్పును నిబంధనలకు లోబడి పొందలేక వారు ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతున్నారు.
MSME యూనిట్లు ఎక్కువగా సాంప్రదాయ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. వారు వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా పాతదే. ఆధునిక పద్ధతులు, మెరుగైన సాంకేతికత వాడటానికి అలవాటు పడని సంస్థలు ఎక్కువగా ఉంటున్నాయి. దానికి అనేక కారణాలున్నాయి. వారు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్‌లో కూడా అనేక సమ్యలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల వేగానికి తగ్గట్టుగా చాలావరకు MSME యూనిట్లు మారలేక పోతున్నాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల వారి ఉత్పత్తుల నాణ్యత అంతర్జాతీయ ప్రమాణా లకు దీటుగా ఉండటం లేదు. అందుకని మన ఉత్పత్తులు నాసిరకం ఉత్పత్తులనే భావన వినియోగ దారులలో పెరుగుతున్నది. MSMEలలో పనిచేసే వారిలో కొద్దిమందికి మాత్రమే మంచి నైపుణ్యం ఉంటున్నది. మిగిలినవారికి అంతగా నైపుణ్యం లేకపోయినా ఆయా సంస్థలు ఇవ్వగలిగే జీతాలు, భద్రతకు అంతకంటే మెరుగైనవారు లభించే అవకాశం లేక ఉన్నవారితోనే పనిచేయిస్తున్నారు. వీటికి తోడు ఈ మధ్య అద్దెల భారం కూడా గణనీయంగా పెరిగింది. ఇలా ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నా, దానికి తగ్గట్టు ఉత్పత్తుల ధరలు పెంచే సాహసం చేయలేక ఉత్పత్తి ఖర్చులలో రాజీపడే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కూడా ఈ సంస్థల ఉత్పత్తుల నాణ్యత గొప్పగా ఉండటం లేదు.
వస్తువు నాణ్యతను బట్టి ధర ఉంటుంది. కాబట్టి ఈ ఉత్పత్తులకు సరైన ధర కూడా లభించదు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చు పెరిగి, మరోవైపు ధరలు అంతగా పెరగక, అమ్మకాల వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేక ఈ సంస్థల సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. లాభాలు ఆశించిన స్థాయిలో లేనప్పుడు ప్రభుత్వాలు ఎంతగా చెప్పినప్పటికి బ్యాంకులు, ఆర్థికసంస్థలు అప్పులు ఇవ్వటంలో కాస్త వెనకడుగు వేస్తాయి. దీనివల్ల ఈ సంస్థలకు పెట్టుబడి లోపం సాధారణం అయిపో యింది. అంతేకాదు వీటి ముడిసరుకు కొనుగోలు, లభ్యతలో కూడా అనేక సమస్యలున్నాయి. ఒక చిన్న పరిశ్రమ నడిపే వ్యక్తి కొద్దిపాటి పెట్టుబడితో సర్దుకు పోయి, ముడిసరుకు తెచ్చుకోవటంలో సమస్యలు ఎదుర్కొని, అరకొర సాంకేతికతతో, పెద్దగా నైపుణ్యం లేని కార్మికులతో ఉత్పత్తి చేసే వస్తువుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది కదా!
ప్రస్తుతం మనకు అవసరమైన అన్ని వస్తువులు మన సంస్థలే ఉత్పత్తి చేయాలని, వినియోగదారులు విదేశీ వస్తువులను బహిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ సంకల్ప సిద్ధికి కేవలం ప్రచార ఆర్భాటం సరిపోదు. మన ఉత్పత్తిరంగం మెరుగుపడాలి. నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభ్యమయ్యే దిశలో వాస్తవికతకు దగ్గరగా విధానాలు ఉండాలి. చిన్న సంస్థలకు, స్వల్పమైన పెట్టుబడులకు నిధులు సమకూర్చే పద్ధతిలో మార్పురావాలి.
ప్రభుత్వం విధానపరంగా, నిజాయితీ, నిబద్ధతతో తీసుకునే నిర్ణయాల ప్రభావం వెంటనే కనపడక పోవచ్చు కానీ సరైన దిశలో తీసుకునే నిర్ణయాలు మార్పుకు పునాదులు అవుతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో మొత్తం వీ•వీజు సెక్టార్ సమూలంగా మారి, దేశంలో నూతన ఒరవడి వేగంగా వస్తుందని ఆశించవలసిన పనిలేదు. పాలకుల ఆదేశాలను అమలుచేసే యంత్రాంగం, బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కసారిగా మారతాయనుకుంటే పొరపాటే. అయితే ఒక ప్రయత్నం జరిగితే దాని ఫలితం మాత్రం తప్పక వస్తుంది. ఈ విపత్తు సమయంలో నిరాశకు గురికాకుండా దీనిని అవకాశంగా మలచుకోవడానికి, అభివృద్ధి పథంలో వేగంగా పయనించటానికి ప్రభుత్వ చర్యలు ఉపయోగ పడతాయనే విశ్వాసాన్ని పారిశ్రామిక, వ్యాపార వర్గాలకి కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇది ఒక ఉద్యమం, దీనిలో విజయం అనివార్యం. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. వీ•వీజులు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తక్కువదేమీ కాదని గ్రహించాలి. పెట్టుబడి కోసం అప్పు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పు ఇచ్చే సౌకర్యం కల్పించారు. సాంకేతికతను మెరుగు పరచుకోవడానికి ఎన్నో పథకాలున్నాయి. నైపుణ్యం పెంచుకోవడానికి కూడా మార్గాలున్నాయి. మౌలిక సదుపాయాలను పెంచటా నికి తగినంత కృషి జరుగుతున్నది. ముడిసరుకు లభ్యత విషయంలో సమస్యలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. మార్కెటింగ్‌కు తమవంతు సహకారం అందిస్తున్నారు. నిబంధనలను సరళతరం చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం తనవంతు కృషి చేస్తున్నది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వదేశీ విధానం అమలుకు తోడ్పడాలి.
– సాయిప్రసాద్, ఆర్థిక నిపుణులు