అజయ్‌ ‌పండిట్‌…

‌గత శతాబ్దపు కశ్మీర్‌ ‌చరిత్రను చూశాడు.

కొత్త చరిత్ర లిఖించడానికి అక్షరాలను రాశిపోశాడు.

కశ్మీర్‌ ‌చరిత్రలో ముఖ్యమైన పేజీగా మారిపోయాడు.

కానీ అపరిష్కృతంగా ఆగిపోయింది అజయ్‌ ‌ప్రయత్నం.

ఇప్పుడు…

దేశంలోని పండిట్‌లందరూ ఆ పనికి పూనుకున్నారు.

కశ్మీర్‌ ‌బాట పట్టడానికి కొత్త దారులు వేస్తున్నారు.

అజయ్‌ను అజేయంగా నిలపడానికి కంకణం కట్టుకున్నారు.

అజయ్‌ ‌పండిట్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యుడు. కశ్మీర్‌, అనంతనాగ్‌ ‌జిల్లా, హల్కా లోక్నావాన్‌ ‌గ్రామ సర్పంచ్‌. 08-06-2020 ‌సాయంత్రం ఆరు గంటల సమయంలో ఉగ్రవాదులు అతడిని హతమార్చారు. అజయ్‌ ‌పండిట్‌ ‌సొంతూరిలోనే ఆయన మీద దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడిన వాళ్లు పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులని స్థానికులు చెబుతున్నారు.
త్రివర్ణ పతాకంలో చుట్టిన అజయ్‌ ‌పార్థివ దేహాన్ని కశ్మీర్‌ ‌నుంచి జమ్మూలోని అతడి ఇంటికి తీసుకెళ్లారు. ఈ దుర్ఘటన పట్ల కశ్మీరీ పండిట్‌లు ఆందోళనకు దిగారు. అజయ్‌ ‌పండిట్‌ అం‌తిమయాత్రలో పాల్గొని నినాదాలిచ్చారు. ఉగ్రవాదం పట్ల తమ నిరసనను బాహాటంగా వ్యక్తంచేశారు. అజయ్‌ ‌పండిట్‌కు నివాళులర్పించడానికి కాంగ్రెస్‌, ‌బీజేపీ అనే భేదాలు పాటించకుండా కశ్మీరీ పండిట్‌లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిలో భావోద్వేగాలు ఒక్కసారిగా పెల్లుబికాయి.

పదహారేళ్ల తర్వాత..

కశ్మీర్‌ ‌లోయలో మైనారిటీలైన పండిట్‌ల మీద ఉగ్రదాడులు జరగడం సమస్త భారతావనికీ తెలిసిన విషయమే. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఇది తొలి దురాగతం అని, పండిట్‌ల కుటుంబాలను భయోత్పాతాలకు గురి చేయడమే ఈ ఉగ్రదాడి ప్రధాన ఉద్దేశమని పండిట్‌ ‌కుటుంబాల పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ముప్ఫై ఏళ్ల కిందట 1990లో ముస్లింలు సృష్టించిన భయోత్పాతంతో పండిట్‌ ‌కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. నివసిస్తున్న ఇళ్లను, ఆస్తులను వదిలేసి ఉన్నపళంగా పిల్లలను వెంటబెట్టుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ప్రయాణం చేయలేని వృద్ధులు కొందరు ఏదయితే అదవుతుందని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని అక్కడే ఉండి పోయారు. వయసులో ఉన్న మహిళలు చెప్పుకోలేని అవమానాలను ఎదుర్కొన్నారు. మానాల్ని కాపాడు కోవడానికి ప్రాణాలు తీసుకున్నారు. ఆ కాళరాత్రిని తలుచుకుంటూ కశ్మీరీ పండిట్‌ ‌కుటుంబాలు ఇప్పటికీ పోరాటం చేస్తున్నాయి. కశ్మీర్‌ ‌నుంచి పారిపోయిన నాటికి పిల్లలుగా ఉన్న వాళ్లు పెద్దయ్యారు. దేశంలో నలుమూలలా విస్తరించి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. పండిట్‌ ‌కుటుంబాలు తాము నివసిస్తున్న ప్రతి చోటా తమ వాళ్ల కుటుంబాలను సంఘటితం చేసుకుంటూ తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. తిరిగి తమ ప్రాంతానికి వెళ్లగలుగుతామా లేదా అని ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న పండిట్‌ ‌కుటుంబాల్లో గత ఏడాది ఆగస్టులో భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత మైన ఆర్టికల్‌ 370 ‌రద్దు నిర్ణయం కొత్త ఆశ చిగురింపచేసింది. ఆ సందర్భంగా పండిట్‌లు ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియచేస్తూ వార్తా పత్రికలు, చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. హైదరాబాద్‌ ‌నగరంలో వందకుపైగా కశ్మీరీ పండిట్‌ ‌కుటుంబాలున్నాయనే సంగతి తెలిసింది కూడా అప్పుడే.

మానవత్వానికి శత్రువులు

ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత దేశం నలుమూలలా ఉన్న పండిట్‌లలో తిరిగి స్వస్థలాలకు వెళ్లాలనే ఆలోచన బలం పుంజుకుంటోంది. కశ్మీర్‌ను వదిలి వచ్చినప్పటికి పదేళ్లలోపు పిల్లలుగా ఉన్న చాలా మందికి తమది కశ్మీర్‌ అని మాత్రమే తెలుసు, సొంతూరు ఏదో కూడా తెలియదు. ఈ కారణంతో జిల్లా పేరు, ఊరు పేరు తెలియని వాళ్లు కొత్తగా ఒక భద్రతతో కూడిన టౌన్‌షిప్‌ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకు వస్తున్నారు. ఈ సమయంలో మరొక సారి వారిని భయబ్రాంతులను చేస్తే పండిట్‌లు కశ్మీర్‌లో అడుగు పెట్టే సాహసం చేయకుండా ఉంటారనే దులోచనతోనే ఇస్లాం తీవ్రవాదులు అజయ్‌ ‌పండిట్‌ ‌ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారనేది… ఆల్‌ ‌స్టేట్‌ ‌కశ్మీరీ పండిట్‌ ‌కాన్ఫరెన్స్ (ఏఎస్‌కేపీసీ) జనరల్‌ ‌సెక్రటరీ టీకే భట్‌ అభిప్రాయం. మానవత్వం మీద దాడి చేసే శత్రువులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా సరే… సభ్య సమాజం ఆదమరిచిన చోట ఉగ్రవాదం పంజా విసురుతూనే ఉంది. మానవత్వం మీద దాడులకు పాల్పడుతున్న వాళ్లు పండిట్‌లను చెల్లాచెదురు చేయడానికే కంకణం కట్టుకున్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా పండిట్‌ ‌కుటుంబాలు అత్యంత గోప్యంగా ఎక్కడికక్కడ సంఘటితమవుతూనే ఉన్నారు. పైన చెప్పుకున్న ‘ఆల్‌ ‌స్టేట్‌ ‌కశ్మీరీ పండిట్‌ ‌కాన్ఫరెన్స్, ఆల్‌ ‌పార్టీ మైగ్రెంట్‌ ‌కో ఆపరేషన్‌ ‌కమిటీ, ఆల్‌ ‌జమ్ము అండ్‌ ‌కశ్మీర్‌ ‌పంచాయత్‌ ‌కాన్ఫరెన్స్’‌తో పాటు అనేక సంస్థలు నిశ్శబ్దంగా కార్యాచరణకు పూనుకొని ఉన్నాయి. అజయ్‌ ‌పండిట్‌ ‌మరణంతో ఆ సంస్థలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా తెరమీదకు వచ్చేశాయి. తమ సమైక్యతను చెప్పకనే చాటుకున్నట్లు అయింది. ఉగ్రవాదులు ఏదైతే ఆశించారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కశ్మీర్‌లో నివసిస్తున్న వాళ్లు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పండిట్‌ల అభ్యున్నతి కోసం ఏర్పడిన పండిట్‌ల సమాఖ్యలు, సంస్థలు కూడా మరోసారి సమావేశమయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న ‘కశ్మీరీ హిందూ సభ, తెలంగాణ’ జూన్‌ ‌పదవ తేదీన సమావేశమై అజయ్‌ ‌పండిట్‌ ‌హత్యను ఖండించింది. ‘1990లో కశ్మీర్‌ని వదలిన కుటుంబాల్లో అజయ్‌ ‌కుటుంబం కూడా ఉంది. ఆ తర్వాత ఏడేళ్లకు అజయ్‌ ‌పండిట్‌ ‌తిరిగి కశ్మీర్‌లో అడుగుపెట్టి 23 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. ధైర్యవంతుడు, దేశభక్తి కలిగిన వ్యక్తి, మానవత్వ పరిరక్షణ కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. స్థానిక ముస్లింల మన్ననలు చూరగొన్నాడు, ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. మైనారిటీలుగా ఉన్న కశ్మీరీ పండిట్‌ల గొంతుక అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు. కశ్మీరీ హిందువుల మధ్య పరస్పర అనుబంధం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం పండిట్‌ల కుటుంబాలన్నీ ప్రత్యేకమైన శ్రద్ధవహిస్తున్నాయి. ఈ సందర్భంగా భరత్‌ ‌భూషణ్‌ ‌ధర్‌ ‌తమ కుటుంబం కశ్మీర్‌ను వదిలి పారిపోయి వచ్చిన 1990 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

కుప్వారా జిల్లాలోని పాజీపోరా గ్రామానికి చెందిన భరత్‌ ‌భూషణ్‌ ‌ధర్‌ 1990 ‌సంఘటన నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పాజీపోరా భారత్‌- ‌పాకిస్తాన్‌ ‌సరిహద్దులో ఉంటుంది. అత్యంత సున్నితమైన వాతావరణం ఉండేది. ‘ఆ దురంతానికి కొద్దిగా ముందు నుంచే ఉగ్రదాడులు మొదలయ్యాయి. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగేవి. ఒక జడ్జీ, మరికొన్నాళ్లకు దూరదర్శన్‌ ‌డైరెక్టర్‌, ‌మరికొన్ని రోజుల తర్వాత హెచ్‌ఎమ్‌టీ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌… ఉ‌గ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలు ఉగ్రవాద తీవ్రతను కశ్మీరీ పండిట్‌ ‌సమాజానికి జారీ చేసిన సంకేతాలు. ఇక 1990, జనవరి 19వ తేదీ రాత్రి మైకుల ద్వారా ప్రకటనలు జారీ అయ్యాయి. మా పండిట్‌లకు ఇస్లాం ఉగ్రవాద మూకలు మూడే మూడు అవకాశాలనిచ్చాయి. ‘కశ్మీర్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలనుకుంటున్నాం. హిందువులందరూ ఇస్లాంలోకి మారిపోవాలి’… అనేది తొలి ప్రతిపాదన. ఇక రెండోది ‘కశ్మీర్‌ను వదిలి వెళ్లి పోవాలి’. మూడవ మాట ‘పై రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోకపోతే వాళ్లను చంపేయడమే, ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అని ప్రకటించారు. ఆ దుర్భరమైన పరిస్థితిలో మా పెద్దవాళ్లు రెండవ ఆప్షన్‌కే మొగ్గు చూపారు. కశ్మీర్‌ ‌నుంచి బయటపడడానికి ఇల్లూ వాకిళ్లు, పొలాలను వదిలేసి పెట్టే బేడా సర్దుకుని రోడ్డు మీదకొచ్చాం. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే… ఉగ్రదాడి నీడ పడని చోటకు వెళ్లి తలదాచుకుంటే చాలు. ఎంతగా అన్నీ వదిలి వెళ్లినప్పటికీ ఎక్కడో ఓ ఆశ… పరిస్థితులు చక్కబడి నప్పుడు తిరిగి రావచ్చనే ఆశ బలంగా ఉండింది. ఆ ఆశతోనే ఎదురు చూసి చూసి ఒక తరం అసువులు బాసింది. ఆ కుటుంబాల్లో రెండవ తరం మాది. మేము మాత్రం మా మూలాలను మర్చి పోకుండా మా పిల్లలకు తెలియచేస్తున్నాం’ అన్నారు భరత్‌ ‌భూషణ్‌ ‌ధర్‌.
ఎక్కడ జీవిస్తున్నప్పటికీ తమ సంస్కృతిని కొనసాగిస్తూ సాంస్కృతిక వారధులుగా ఉన్నారు పండిట్‌లు. ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ కశ్మీర్‌లో పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. కశ్మీర్‌లో మంచి జరిగినప్పుడు సమావేశమై సంతోషాలు పంచుకుంటున్నారు. చెడు జరిగినప్పుడు అందరూ కలిసి ఖండిస్తున్నారు. కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఇది వారి కోరిక మాత్రమే కాదు. భారతీయులందరి కోరిక.

  • మంజీర

About Author

By editor

Twitter
YOUTUBE