కరోనా మహమ్మారి సృష్టి ద్వారా అన్ని దేశాలకూ దూరం అవుతున్న చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తమ దేశ ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టను కాపాడుకోడానికి ఏదైనా ఒక విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు హాంకాంగ్‌ ‌మీద పెత్తన్నాన్ని చాటుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొస్తోంది. ఇంకోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్‌ ‌మీద పోరాటం చేస్తున్న భారత్‌ను చికాకు పరిచేందుకు ఒకవైపు పాకిస్తాన్‌, ‌మరోవైపు నేపాల్‌తో నాటకాలు ఆడిస్తూ స్వయంగా తన సైన్యాన్ని సరిహద్ధుల్లో మొహరించింది. యుద్ధానికి సిద్ధంకమ్మని తమ దేశ సైన్యానికి పిలుపునిచ్చాడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. అసలేం జరుగుతోంది? ప్రతి భారతీయుడు అప్రమత్తమై చైనా కుట్రలను తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.

ప్రపంచ వ్యాప్తంగా చైనా ప్రతిష్ట మసకబారి పోతోంది. ఇందుకు కారణం కరోనా మహమ్మారి. వూహాన్‌ ‌నగరంలో పుట్టిన ఈ వైరస్‌ ‌బీజింగ్‌ ‌సహా ఇతర నగరాలను తాకలేదు. కానీ అమెరికా సహా ఇతర అగ్రరాజ్యాలకు వేగంగా వెళ్లిపోయింది. అన్ని ఖండాలనూ దేశాలను ఉక్కికిబిక్కిరి చేస్తోంది. చైనా కుట్రలు ప్రపంచానికి అర్థమైపోయాయి. ఆ దేశంతో తమ సంబంధాలను క్రమంగా తెంచుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. కరోనా పుట్టుక, దాని వ్యాప్తి కారణాలపై దర్యాప్తును కోరుతూ ఇటీవల దాదాపు 120కిపైగా దేశాలు కలిసి ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి.

అంతర్జాతీయ సమాజం ఇప్పుడు చైనాను దోషిగా నిలబెడుతోంది. మరో వైపున చైనా ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. ఆ దేశంలో కోట్లాది మంది ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌ ‌పింగ్‌ ‌విచక్షణ కోల్పోయారు. ఇన్నేళ్లుగా చైనీయులపై కనబర్చిన విశ్వసనీయతకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే అటు చైనా ప్రజలకు ఇటు ప్రపంచ దేశాలకూ తానంటే ఏమిటో ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే చైనా ఇప్పుడు యుద్ధోన్మాదంతో వెర్రితలలు వేస్తోంది. అందుకే చైనా తన ఇరుగు పొరుగు దేశాలపై యుద్దోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమైపోతోంది. ముఖ్యంగా ఇటు భారత్‌ను అటు హాంకాంగ్‌, ‌తైవాన్‌లను లక్ష్యంగా చేసుకుంది.

మావో హయంలో చైనాలో హరిత విప్లవ వైఫల్యం కారణంగా భయంకరమైన కరువును ఎదుర్కొంది. ఆ కరువు నుంచి ప్రజల ద ృష్టి మళ్లించేందుకు 1962లో భారత్‌తో యుద్ధం చేసింది. తాజాగా చైనాలో దేశీయ ఆర్థిక వైఫల్యాలు, అంతర్జాతీయంగా కరోనా వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరోసారి సామ్రాజ్య విస్తరణను ప్రయోగిస్తోంది.
భారత్‌ ‌మీద ప్రతీకారానికి సిద్ధం

2049 నాటికి అమెరికా కంటే శక్తిమంత మైన దేశంగా తయారవ్వాలని చైనా వ్యూహం. ఇలాంటి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోతున్న భారతదేశ ప్రతిష్టను చూసి ఓర్వలేక పోతున్నారు చైనా కమ్యూనిస్టు పాలకులు. భారత్‌ ఆర్థికంగా, సైనికంగా ఎదగడం తమ ప్రయోజనా లకు ఇబ్బందికరంగా భావిస్తున్నారు. అందుకే భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇందుకోసం అన్ని రకాల మార్గాలనూ ఉపయోగించు కుంటోంది. కరోనా వైరస్‌ ‌సంక్షోభాన్ని ఎదుర్కొ నేందుకు దృష్టి పెట్టిన మన దేశానికి ఒక్కసారిగా సరిహద్దుల్లో సమస్యలు పెరగడానికి కారణం ఇదే. జమ్మూ కశ్మీర్‌ ‌సరిహద్దుల్లో ఇటీవల తిరిగి ఉగ్రవాద కదలికలు, పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు అధిక మయ్యాయి. ఇదే సమయంలో నేపాల్‌ ‌సరిహద్దుల విషయంలో మనతో పేచీ పెట్టుకుంది. మరోవైపు చైనా మన సరిహద్ధుల్లో కదలికలను తీవ్రం చేసింది. ఇవన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నా ప్రణాళిక వేసింది మాత్రం చైనాయే అని స్పష్టంగా అర్థమైపోతోంది.

భారత్‌ ‌సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించా లని తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చాడు చైనా అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌. ‌జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం చైనాకు ఇష్టంలేదు. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్లో భారత్‌ ‌పట్టు పెంచుకోవడం వల్ల పాక్‌-‌చైనా మధ్య వాణిజ్యానికి ఇబ్బందులు తప్పవని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌, ‌సిక్కింలో భారత్‌, ‌చైనా సైనికులు పరస్పరం తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. గాల్వాన్‌ ‌లోయ, దెమ్‌చోక్‌, ‌దౌలత్‌ ‌బేగ్‌ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. సరిహద్దులను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు దీటుగా బలగాలను మోహరించింది.

భారత్‌తో చైనాకు 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు సమస్యలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1950 ప్రాంతంలోనే చైనా జింజియాంగ్‌ ‌నుంచి పశ్చిమ టిబెట్‌ ‌దాకా 1,200 కి.మీ. రోడ్డు నిర్మించింది. అందులో 179 కి.మీ. రోడ్డు భారత్‌ ‌భూభాగమైన ఆక్సాయ్‌ ‌చిన్‌ ‌గుండా వెళ్తుంది. 1958లో చైనా ముద్రించిన మ్యాప్స్ ‌చూసే దాకా అక్కడ చైనా రోడ్డు నిర్మించిన విషయాన్ని భారత్‌ ‌గుర్తించలేక పోయింది. అప్పటి నుంచి కూడా ఆక్సాయ్‌ ‌చిన్‌ ‌వివాదం కొనసాగుతూనే ఉంది. 1962లో చైనా-భారత్‌ ‌యుద్ధం తరువాత కొన్ని చిన్న చిన్న వివాదాలు వచ్చినా అవి పెద్దగా ఆందోళనకు దారి తీయలేదు.. సమీప చరిత్రను గమనిస్తే 2013 లో లద్దాఖ్‌లో దౌలత్‌ ‌బేగ్‌ ఓల్ది సెక్టార్‌ ‌లో వివాదం చోటు చేసుకుంది. 2014లో లద్దాఖ్‌ ‌ప్రాంతంలోనే దెమ్‌ ‌చోక్‌ ‌గ్రామం వద్ద మరో వివాదం చోటు చేసుకుంది. 2015 సెప్టెంబర్‌లో ఉత్తర లద్దాఖ్‌ ‌ప్రాంతంలో భారత్‌ ‌బలగాలతో చైనా బలగాలు తలపడ్డాయి. 2017లో భూటాన్‌ ‌సరిహద్దుల్లో భారత్‌ – ‌చైనా మధ్య డోక్లామ్‌ ‌వివాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల పాటు ఈ వివాదం కొనసాగింది. 2018లో దెమ్‌చోక్‌ ‌వద్ద చైనా బలగాలు సుమారు 400 మీటర్ల మేర భారత్‌ ‌భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి.

భారత్‌ ‌భూభాగాలను ఆక్రమించుకోవడంలో చైనా అనేక రకాల వ్యూహాలను అనుసరించింది. మొదటగా చైనా గ్రామీణ ప్రాంత ప్రజలు భారత్‌ ‌భూభాగాన్ని ఆక్రమించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఆ తరువాత వారికి అండగా రంగంలోకి దిగుతుంది. మరో రకం వ్యూహంలో భాగంగా భారత్‌ ‌సైన్యం గస్తీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోకి క్రమంగా చొచ్చుకువస్తుంటుంది. ఇలా సరిహద్దుల్లో వీలు దొరికినప్పుడల్లా ఒక్కో మైలు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వచ్చింది. గత పదేళ్లలో చైనా ఈ విధంగా 2 వేల చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించినట్లు ఒక అంచనా. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రం కూడా తనదే అని చైనా అంటోంది. భారత్‌ ‌పై ఒత్తిడి తేవాలనుకున్నప్పుడల్లా అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ అం‌శం తెరపైకి వస్తుంటుంది.
సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చైనాతో సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతోంది భారత్‌. అయినా పొరుగు దేశం మాత్రం దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, పోరాట ఆయుధాలను సమకూర్చు తోంది.

సైనిక, దౌత్యాధికారులు ఇప్పటి వరకు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా బలగాలు ఒక్క అంగుళం కూడా వెనక్కి కదల్లేదని, పలు చోట్ల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నట్లు స్పష్టం చేశాయి.

నేపాల్‌ ‌మ్యాప్‌ ‌వార్‌ ‌వెనుక చైనా

భారత్‌తో పాటుగా నేపాల్‌ ‌కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఐక్యంగా పోరాడే బదులు సరిహద్దు వివాదాన్ని తెరమీదకు తెచ్చింది నేపాల్‌. ఇం‌డియాలో లిపులేఖ్‌, ‌లింపియధుర, కాలాపానీ ప్రాంతాలు నేపాల్‌ ‌భూభాగంలో ఉన్నట్లు రూపొందించిన మ్యాప్‌ ‌విషయంలో నేపాల్‌ ‌వెనక్కి తగ్గటం లేదు. ఈ విషయంలో మనదేశం తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ అక్కడి ప్రభుత్వం లెక్క చేయటం లేదు. కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలిపేందుకు అధికార నేపాల్‌ ‌కమ్యూనిస్ట్ ‌పార్టీ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్‌ ‌సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించటంతో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌ ‌లో ప్రవేశ పెట్టారు. కొత్త మ్యాప్‌ ‌కు ఆమోదం తెలుపాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ప్రధాని కేపీ శర్మ ఓలి అభ్యర్థనతో నేపాలీ కాంగ్రెస్‌ ‌సహా సమాజ్‌ ‌వాదీ పార్టీ నేపాల్‌, ‌రాష్ట్రీయ జనతా పార్టీ నేపాల్‌ ‌కూడా బిల్లుకు మద్దతు పలికాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత అధ్యక్షురాలి ఉత్తర్వుతో కొత్త మ్యాప్‌ ‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌రానుంది.
భారత్‌-‌నేపాల్‌ ‌సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించేది లేదని భారత్‌ ఇప్పటికే స్పష్టంగా తేల్చిచెప్పింది. నేపాల్‌ ‌రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని గుర్తు చేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్‌ ‌చర్యలున్నాయని మండిపడింది భారత్‌.

‌కరోనా ఎవరి సృష్టో యావత్‌ ‌ప్రపంచానికి తెలుసు. కానీ నేపాల్‌ ‌ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మాత్రం భారత్‌ను నిందించడానికి కారణం సుస్పష్టం. ఆయన చైనా కీలుబొమ్మగా వ్యవహ రిస్తున్నారనేది అందరికీ తెలుసు. నేపాల్‌ ‌కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) ‌పార్టీని తెరవెనుక ఉండి నడిపించేది చైనా కమ్యూనిస్టు పాలకులే. నేపాల్‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ మొదటి నుంచి భారత్‌ ‌వ్యతిరేకతనే ప్రదర్శిస్తోంది. నేపాల్‌ ‌కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) అ‌గ్రనేత ప్రచండతో పాటు కేపీ ఓలి కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. కొద్ది నెలల క్రితం నేపాల్‌ ‌కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)‌లో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రధాని ఓలి పదవికి ముప్పు వచ్చిపడింది.. దీంతో బీజింగ్‌ ‌చైనా పాలకులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిం చారు. ఈ కృతజ్ఞతా భావంతో నేపాల్‌ ‌ప్రధాని బీజింగ్‌ ఆదేశాలకు లోబడి వారు ఆడించినట్లు ఆడుతున్నారు. ఇందులో భాగంగానే భారత్‌తో మ్యాప్‌ ‌వార్‌కు తెరతీశారు. ఎవరెస్ట్ ‌పర్వతం ఎక్కడుందని ఎవరిని అడిగినా నేపాల్‌ అని చెబుతారు. అయితే ఇటీవల చైనా తన భూభాగం (టిబెట్‌) ‌వైపు నుంచి ఎవరెస్టు పర్వతాన్ని తిరిగి కొలిచింది. ఇందుకు నేపాల్‌ ‌పాలకులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ భారత్‌తో మాత్రం సరిహద్దు కయ్యం పెట్టుకున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకో అర్థం చేసుకోవచ్చు.

ఈశాన్యంలో వేర్పాటువాదానికి ఆజ్యం

భారత ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న వేర్పాటువాద, తిరుగుబాటు దళాలు ఇటీవలి కాలంలో పూర్తిగా బలహీనపడ్డాయి. వీటికి తోడ్పాటునందిచేందుకు చైనా సిద్దమైనట్లు తెలుస్తోంది. అసోం, మణిపూర్‌, ‌నాగాలాండ్‌ ‌రాష్ట్రాల్లోని శక్తులకు సహకారం అందించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. నాగా తిరుగు బాటుదారులు, అసోంకు చెందిన యూఎల్‌ఎఫ్‌ఏ, ‌మణిపూర్‌ ‌చెందిన మెయితెయి తిరుగుబాటుదారులకు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయి. యూఎల్‌ఎఫ్‌ఏ ‌చీఫ్‌ ‌కమాండర్‌ ‌పరేష్‌ ‌బారువా చైనా యున్నాన్‌ ‌రాష్ట్రంలోని సరిహద్దు పట్టణమైన ‘రుయిలి’ అనే ప్రాంతంలో పరేష్‌ ‌తలదాచుకుంటున్నట్లు భావిస్తున్నారు. అక్కడి నుంచి తరచుగా మయన్మార్‌ అటవీ ప్రాంతంలో ఉన్న తమ ప్రధాన కార్యాలయా నికి వెళ్తున్నట్లు సమాచారం.

భారత్‌లో ప్రత్యక్షంగా తలపడటంకన్నా పరోక్షంగా వేర్పాటువాదులకు అందించడం ద్వారా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో నిరసనలు వినిపించాయి. చైనా అధికారిక మీడియా ఇలాంటి ఘటనలను భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేసింది. సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఈ వివక్షలకు ఆజ్యం పోసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 2 వేల మంది నాగా వేర్పాటువాదులు మణిపూర్‌లోని ఉఖ్రుల్లో చైనాకు మద్దతుగా పాటలు పాడారు.

భారత్‌తో ఉన్న సరిహద్దు వెంట వీలైనన్ని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు చైనా వ్యూహాత్మక రచనలు చేస్తోంది. తద్వారా భారత సైన్యం అన్ని వైపులా విస్తరించి బలహీనపడుతుందని పన్నాగాలు పన్నుతోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌, ‌సిక్కిం రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న ఈ ఘర్షణలు అరుణాచల్‌ ‌ప్రదేశ్‌కు వ్యాపించే అవకాశం లేకపోలేదు. భారత్‌ ‌సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూనే సైన్యాన్ని, రక్షణ సామగ్రిని తరలిస్తోంది. ఉత్తర సరిహద్దులో ఉన్న కొద్దిపాటి సైనికులకు సహాయంగా మరింత సైన్యాన్ని మోహరిస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలో దూకుడు

ఒక్క భారత్‌ ‌విషయంలో మాత్రమే కాదు. ఇతర ఇరుగు పొరుగు దేశాలతో కూడా చైనాకు గిల్లికజ్జాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం అంతా తనదేనని వాదిస్తోంది. అక్కడి ద్వీపాలపై పట్టు సాధించి సైనిక స్థావరాలను ఏర్పటు చేసుకుంటోంది. ముఖ్యంగా దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, ‌స్ప్రాట్లిస్‌లపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా వివాదం నెలకొంది. ఈ ప్రాంతం మీద సార్వభౌమాధికారంపై చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, ‌తైవాన్‌, ‌మలేషియా, బ్రూనై దేశాల మధ్య వివాదం ఉంది. కానీ ఇవి తమవేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది. అక్కడ పెద్ద మొత్తంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉండటంతో పాటు అపార మత్స్య సంపద ఉంది. ఈ ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైంది. అందుకు ఈ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకొనేందుకు చైనా ఇక్కడ సైనికపరమైన చర్యలు చేపడుతోందని ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఈ వివాదాస్పద ప్రాంతంలో చైనా బాంబర్ల మోహరింపుపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది.

తాజాగా దక్షిణ చైనా సముద్రంలో చైనా కోస్ట్ ‌గార్డ్ ‌నౌకలు చేస్తున్న విన్యాసాలు వివాదానికి దారి తీశాయి. ఇక్కడి దేశాలన్నీ కరోనాను ఎదర్కోవడంపై ద ృష్టి పెడితే చైనా మాత్రం చొరబాట్ల మీద దృష్టి పెట్టింది. ఈ ఏడాది జనవరిలో చైనా కోస్ట్ ‌గార్డ్ ‌నౌక ఇండోనేషియా పరిధిలోని నాటునా ద్వీపాలకు సమీపంలోకి వెళ్లింది. అక్కడ చేపల వేట సాగించే ఆ దేశ మత్స్యకారులను ఇబ్బంది పెట్టడంతో ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇండోనేషియా తన నావికాదళ రక్షణను పెంచుకోవాల్సి వచ్చింది. మార్చి 16 వ తేదీన దాదాపు 10 చైనా స్పీడ్‌ ‌బోట్లు తైవాన్‌ ‌ప్రాదేశీక జలాల్లోకి దూసుకెళ్లాయి. దీనిపై తైవానీస్‌ ‌కోస్ట్ ‌గార్డ్ అభ్యంతం వ్యక్తం చేసింది. అదే విధంగా మార్చి 30న తూర్పు చైనా సముద్రంతో అక్రమంగా వేసిన చైనీస్‌ ‌ఫిషింగ్‌ ‌నెట్స్‌ను తొలగిస్తు జపాన్‌ ‌నౌకాదళ పెట్రోలింగ్‌ ‌నౌకపై దాడి జరిగింది. మార్చి 30 న తూర్పు చైనా సముద్రంలో సంభవించిన జపనీస్‌ ‌నావికాదళ ఓడను లక్ష్యంగా చేసుకుని అక్రమ చైనా ఫిషింగ్‌ ‌వలలను క్లియర్‌ ‌చేస్తున్న పెట్రోలింగ్‌ ‌నౌకపై వారు దాడి చేశారు. పైగా జపాన్‌ ‌నాకాదళమే దాడికి దిగిందని చైనా బుకాయించింది.

ఏప్రిల్‌ 2 ‌న పారాసెల్‌ ‌దీవుల సమీపంలో చైనా కోస్ట్ ‌గార్డ్ ‌నౌక వియత్నామీస్‌ ‌ఫిషింగ్‌ ‌బోట్‌ను ఢీకొట్టాయి. ఆ బోట్‌ ‌మునిగిపోతుండగా అందులోని 8 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నందునే అదుపులోకి తీసుకున్నా మని చెబుతోంది చైనా. ఏప్రిల్‌ 11‌వ తేదీన చైనా ఫైటర్‌ ‌జెట్‌లు తైవాన్‌కు కొద్ది మైళ్ల దూరంలో కసరత్తులు నిర్వహించాయి. ఆ రోజున తైవాన్‌ ‌జలసంధి ప్రాంతంలో అమెరికా విధ్వంసక నౌక ప్రయాణం చేసింది. తైవాన్‌ ‌సార్వభౌమత్వానికి అమెరికా మద్దతు ఇవ్వడంపై చైనా అభ్యంతం వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే ఏప్రిల్‌ 13‌న మియాకో జలసంధిలో చైనా విమాన వాహక నౌక మొహరించింది. వాస్తవానికి ఈ ప్రాంతం ఎవరికీ చెందని వ్యూహాత్మక అంతర్జాతీయ జలమార్గం. ఈ ప్రాంతంపై తన ఆధిక్యత ప్రదర్శించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది.
ఏప్రిల్‌ 16‌వ తేదీన మలేసియా సమీపంలోని జలాల్లో చైనాకు చెందిన ఓ సర్వే నౌక ప్రవేశించింది. వాస్తవానికి ఈ ప్రాతంలో మలేసియాకు చెందిన ఎకానమిక్‌ ‌జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న 25 ద్వీపాలకు చైనీస్‌ ‌పేర్లతో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించింది. ఇక్కడి ప్రాదేశిక జలాల్లో మెరుగైన పాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చైనాకు చెందిన గ్లోబల్‌ ‌టైమ్స్ ‌వార్తా సంస్థ ప్రకటించింది. చైనా పాలకుల తీరుపై ఇక్కడి దేశాలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

భారత్‌ను చుట్టుముట్టే ప్రయత్నం

వన్‌ ‌బెల్ట్ ‌వన్‌ ‌రోడ్డు ప్రాజెక్టు ద్వారా ఆసియా, యూరోప్‌ ‌దేశాలను కలిపి తన వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు సముద్ర మార్గంలో ‘ముత్యాల హారం’ పేరుతో భారత్‌ ‌ను చుట్టుముట్టే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్‌ ‌పరిధిలోని ‘క్యాప్ప్యూ’లో ఓడరేవు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. శ్రీలంకలోని హంబన్‌ ‌తోట హార్బర్‌ ‌ప్రాజెక్టు తో ఇప్పటికే ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి దింపి తన గుప్పిట పెట్టుకుంది. మాల్దీవ్స్ ‌లో కూడా స్థావరం ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్‌లో గద్వార్‌ ‌నౌకాశ్రయాన్ని విస్తరిస్తోంది. ఇందు కోసం చైనా ‘పాకిస్తాన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌’ ‌పేరుతో టిబెట్‌, ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌నేరుగా గద్వార్‌ ‌కు రోడ్డు మార్గం నిర్మిస్తోంది. బంగ్లా దేశ్‌ ‌ను కూడా తన ఉచ్చులోకి లాగుతోంది. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రాల మీరుగా నిర్మిస్తున్న ఈ ‘ముత్యాల హారం’ పేరుకు వాణిజ్యం. కానీ ఇదంతా వ్యూహాత్మకంగా భారత్‌ను రక్షణ పరంగా ఇబ్బందులకు గురి చేసేందుకు చైనా పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్థం అవుతోంది.

హాంకాంగ్‌ ‌మీద డ్రాగన్‌ ఉక్కుపాదం

తాజాగా హాంకాంగ్‌ ‌స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ మరో వివాదాస్పద చర్యకు ఉపక్ర మించింది చైనా. ‘‘ఒక దేశం.. రెండు వ్యవస్థలు’’ అనే ఒప్పందానికి విరుద్ధంగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 1997 జూలై 1 బ్రిటీష్‌ ‌పాలకులు హాంకాంగ్‌ను చైనాకు అప్పగించిన సందర్భంలో ప్రత్యేక రాజ్యాంగాన్ని, ‘వన్‌ ‌కంట్రీ, టూ సిస్టమ్స్’ ‌పేరుతో ఒప్పందాన్ని రూపొందించారు. వాటి ప్రకారం హాంకాంగ్‌ ‌ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ప్రజాస్వామిక హక్కులు లభించాయి. 50 ఏళ్ల వరకు ఈ ఒప్పందాలు కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. హాంకాంగ్‌ ‌స్వయంప్రతిపత్తిని ఎత్తేసి, హాంకాంగ్‌ను పూర్తిగా తనలో కలుపు కునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. జాతీయ భద్రతా చట్టం అమలులోకి వస్తే ఇకపై చైనా మెయిన్‌ ‌లాండ్‌లో అమలయ్యే కఠిన చట్టాలనే హాంకాంగ్‌ ‌వాసులు పాటించాల్సి ఉంటుంది. చైనా జాతీయ గీతాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తారు.

బ్రిటిష్‌ ‌కాలనీగా ఉన్నప్పటి నుంచే హాంకాంగ్‌. ‌భౌగోళిక అనుకూలత కారణంగా సంపన్న నగరంగా ఎదిగింది. భిన్నసంస్కృతుల నిలయంగా, ప్రజాస్వామిక, పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో అమెరికా, యూరప్‌ ‌దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. చైనా సంస్థలు సైతం హాంకాంగ్‌ ‌గుండానే ప్రపంచ దేశాలకు విస్తరించగలిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో కొన్నింటి ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌ ‌లోనే పనిచేస్తున్నాయి. అందుకే బంగారు బాతు హాంకాంగ్‌ను పూర్తిగా వశం చేసుకోడానికి చైనా సిద్ధమైంది.

చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌ ‌వాసులు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. చైనా పార్లమెంటులో హాంకాంగ్‌ ‌జాతీయ భద్రతా చట్టం డ్రాప్టు బిల్లుకు ఆమోదం లభించినట్లు వార్తలు రాగానే వేలది ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు. స్థానిక పార్లమెంట్‌, ‌ప్రభుత్వ భవంతుల ముందు నిలబడి ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేశారు. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాను బూచిగా చూపించి హాంకాంగ్‌లో కొనసాగుతోన్న ప్రజాస్వామిక ఉద్యమాలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. హాంకాంగ్‌ ‌విషయంలో చైనా తీరును తప్పు పట్టిన అమెరికా ఆ దేశంపై మరిన్ని ఆంక్షలను విధించింది
భారత్‌ ‌మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి!

కరోనాను కట్టడి చేయడంలో సరిగా వ్యవహరించనందుకు చైనా తమకు పరిహారాలు చెల్లించాలని అమెరికా సహా పలు దేశాలు కోరుతున్నాయి. అంతే కాదు వివిధ రకాల ఆంక్షలు విధించేందుకు కూడా అవి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాల సరసన చేరకుండా భారత్‌ను నిరోధించేందుకు కూడా సరిహద్దు వివాదాలను చైనా ఓ అస్త్రంగా చేసుకుంటోంది. కాంగ్‌, ‌తైవాన్‌ ‌వివాదాల నుంచి చైనీయుల దృష్టి మళ్లించేందుకు ఈ సరిహద్దు వివాదాలను చైనా ఉపయోగించుకుంటోంది. అంతేగాకుండా పాకిస్థాన్‌, ‌నేపాల్‌ ‌లతో భారత్‌ ‌వ్యహరిస్తున్న తీరును చెడుగా చిత్రీకరించేందుకు కూడా చైనా ప్రయత్నిస్తోంది.

చైనా కమ్యూనిస్టు పాలకులు భారత్‌తో మాత్రమే కాకుండా అనేక ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత్‌ ‌మీద అప్రకటిత యుద్దం చేస్తున్న చైనా విషయంలో మనం కూడా అదే రీతితో సమాధానం ఇవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానం పూర్తి స్థాయిలో ‘యాక్ట్ ఈస్ట్’ ‌గా మారాలి. ఇందులో భాగంగా తూర్పు ఆసియా దేశాలతో మన సంబంధాలు మరింతగా పెరగాలి.

ఇన్నేళ్లుగా చైనా దురాగతాలను భారత్‌ ‌సహించింది. ఇక సహించలేని పరిస్థితి వచ్చింది. చైనాకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. అందుకు అవసరమైతే హాంకాంగ్‌, ‌తైవాన్‌ అం‌శాలను వాడుకోవాలి. టిబెట్‌ అం‌శాన్ని మరోసారి తెరపైకి తేవాలి. భారత్‌ – ‌చైనాల మధ్య టిబెట్‌ అం‌శం మరోసారి తెరపైకి రావడం కూడా చైనాకు మింగుడు పడని అంశం. భారత్‌లో ప్రవాస ప్రభుత్వం నిర్వహిస్తున్న టిబెటన్ల ఆధ్మాత్మిక నాయకుడు దలైలామా వయస్సు ఇప్పుడు 84 ఏళ్లు. తన వారసుడిని ఆయన ఇప్పటి వరకూ ప్రకటించ లేదు. పాతికేళ్ల క్రితం ఆయన ఎంపిక చేసిన పంచెన్‌ ‌లామాను చైనా అపహరించింది. అది జరిగి పాతికేళ్లు గడిచాయి. ఇప్పటికీ చైనా ఆయన ఉనికిని బయటపెట్టలేదు. టిబెట్‌ అం‌శం నేటికీ ప్రపంచవ్యాప్తంగా నివురు గప్పిన నిప్పులా ఉంది. దానికి తోడు హాంకాంగ్‌, ‌తైవాన్‌ ‌లాంటి అంశాలను వివాదాలుగా చేయడం ద్వారా చైనా పై ప్రపంచ ఒత్తిడి పెరిగేలా చేయాలన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌, ‌సింగపూర్‌లతో కలసి సైనిక కార్య కలాపాలను అమెరికా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. లేదంటే.. చైనాతో అనవసర వివాదం ఎందుకనుకుంటే మాత్రం అమెరికా తన సైనిక కార్యకలాపాలను తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. అమెరికాలో ఎన్నికలకు ముందు అంతర్జాతీయంగా తనకొక బలమైన విజయం కావాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ ‌విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.
చైనాతో మనకు ఉన్న సమస్య పరిష్కారానికి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కూడా దేశం సిద్ధంగా ఉండాలి. ఇలాంటి సందర్భం ఇప్పుడు మనకు రానే వచ్చింది.

– క్రాంతిదేవ్‌ ‌మిత

About Author

By editor

Twitter
YOUTUBE