చైనా వస్తువుల బహిష్కరణను సమర్ధించిన ప్రముఖ డైరీ సంస్థ అమూల్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ జూన్ 4న బ్లాక్ చేశారు. భారత, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమూల్ ప్రకటనలో అమ్మాయి చైనా దురుద్దేశాలను బయట పెట్టింది. తమ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ట్విట్టర్‌ను మిగిలిన దేశాల్లో మాత్రం విషప్రచారానికి ఉపయోగిస్తూనే ఉంటుంది చైనా. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా చైనాకు చెడ్డపేరు వచ్చింది. పోయిన పరువు మళ్లీ కూడగట్టుకునే ప్రయత్నంలో ఆ దేశం ట్విట్టర్ సహా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం మొదలుపెట్టింది.
‘హింసను ప్రశంసిస్తున్నట్లు’ ఉన్నదంటూ మే 29న ట్విట్టర్ అధ్యక్షుడి ట్వీట్‌నే ఆపివేసింది. అంతకు ముందు కూడా ట్రంప్ ఎన్నికల ప్రచార వీడియోను కూడా నిలిపివేసింది. కానీ విచిత్రంగా చైనా రాయబారి అసంబద్ధ, దురుద్దేశపూరితమైన ట్వీట్‌లను మాత్రం తాకలేదు. ట్విట్టర్ ప్రదర్శిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిపై సర్వత్ర చర్చ ప్రారంభమైంది. భావప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్ అడ్డుకుంటోందనే విమర్శలు వచ్చాయి. చైనా దినపత్రిక ఒకటి బయటపెట్టిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో చైనా ఆధిపత్యాన్ని మరింత బయటపెట్టాయి.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార విభాగంలో భాగమైన చైనా డైలీ అనే పత్రిక విదేశీ ఏజెంట్‌ల రిజిస్ట్రేషన్ చట్టం (FARA)కింద అమెరికా న్యాయ శాఖకు సమర్పించిన పత్రాల ప్రకారం గత నాలుగేళ్లలో వివిధ అమెరికా వార్తా పత్రికలకు 19 మిలియన్ డాలర్ల పైనే ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా నిధులు అందుకున్న సంస్థల జాబితా లో ట్విట్టర్ కూడా ఉండడం గమనార్హం.
నవంబర్ 2016 నుంచి 4.6 మిలియన్ డాలర్లు పుచ్చుకుని వాషింగ్టన్ పోస్ట్, 6 మిలియన్ డాలర్ల సొమ్ము అందుకుని వాల్ స్ట్రీట్ జర్నల్‌లు చైనా గుణగానం చేస్తూ ‘ద చైనా వాచ్’ అనే అనుబంధాన్ని ప్రచురిస్తూ వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, ఫారిన్ పాలసీ, డెస్ మొయినెస్ రిజిస్టర్, సి క్యూ రోల్ కాల్ వంటివి కూడా ప్రకటనల కోసం భారీగా చైనా సొమ్ము అందుకున్నాయి. చైనా నిధులు పొందిన పత్రికల జాబితాలో లాస్ ఏంజెల్స్ టైమ్స్, ద సీటేల్ టైమ్స్, ద అట్లాంటా జర్నల్ కానిస్టిట్యూషన్, ద చికాగో ట్రిబ్యూన్, ద హౌస్టన్ క్రానికల్, ద బోస్టన్ గ్లోబ్ వంటి పత్రికలు కూడా ఉన్నాయి. చైనా వక్రమార్గాల గురించి తెలిసినవారికి ఈ సమాచారం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చును. కానీ చైనా చర్యలవల్ల పత్రికా స్వేచ్చకు, గౌరవానికి భంగం వాటిల్లుతోందన్నది మాత్రం నిజం.
కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనా, దానివల్ల వచ్చిన చెడ్డపేరును తుడిచేసుకునేందుకు ప్రచార యుద్ధం మొదలుపెట్టింది. చైనా ముట్టచెప్పిన భారీ నిధులను అందుకున్న అమెరికా పత్రికలు ఆ దేశానికి అనుకూల కథనాలు పుంఖానుపుంఖాలుగా ప్రచురిస్తున్నాయి. దీనితో పాశ్చాత్య మీడియా పూర్తిగా చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది.
అమెరికా మీడియా ద్వారా తన అనుకూల ప్రచారానికి చైనా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోందని ఫ్రీడం హౌస్, హూవర్ సంస్థ వంటి ప్రజాస్వామ్య అనుకూల సమూహాలు ముందునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా సాగిన ప్రచ్ఛన్న యుద్ధం మూలంగా అమెరికా మీడియాలో రష్యా జోక్యం గురించి భయాలు, సందేహాలు కలిగాయి. అయితే అవి అక్కడ అలవాటైపోయాయి. కానీ ఇప్పుడు కొత్తగా చైనా చొరబాటు అమెరికాకు పూర్తిగా కొత్త, ఊహించనిది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి తరువాత చైనా నుంచి అమెరికా వార్తా సంస్థలకు నిధులు క్రమంగా తగ్గినా, ఇటీవల బయటపడ్డ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ప్రచార యుద్ధాన్ని గురించి లోతుగా పరిశోధించాలని నిపుణులు కోరుతున్నారు.
పాశ్చాత్య సిద్ధాంతాల నుండి ప్రేరణ పొందిన చైనా తన ‘కలలు’ నిజం చేసుకునేందుకు వివిధ విధానాలు రూపొందించుకుంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యాలు పైచేయి సాధించడం కోసం రకరకాల వ్యూహాలు అమలు చేసేవి. సోవియట్ యూనియన్ పతనం అయిన తరువాత అమెరికా తన వ్యూహాలతో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసింది. 1991లో ‘డెసర్ట్ స్టార్మ్’ (కువైట్ నుంచి ఇరాక్ దళాలను తరిమివేసేందుకు అమెరికా చేపట్టిన సైనిక చర్య)లో అమెరికా త్రివిధ దళాలతోపాటు అంతరిక్ష, ఎలక్ట్రానిక్ (సమాచార) రంగాలను కూడా ఉపయోగించింది. అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన చైనా ఇప్పుడు అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలని ప్రయత్నిస్తోంది.
అమెరికా సైనిక విధానాన్ని 10 ఏళ్లపాటు అధ్యయనం చేసిన చైనా 2004లో తన సైనిక వ్యవహారాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అవసరమైన చర్యలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తన సైన్యాన్ని (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA) ఆధునికరించడంతోపాటు చైనా సమాచార యుద్ధానికి (information Warfare) కూడా తెరతీసింది. ఈ సమాచార యుద్ధంలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయి. అవి శత్రువు సమాచార కేంద్రాలను ధ్వంసం చేయడం, సమాచార సేకరణ, గూఢచారి కేంద్రాలను ఎలక్ట్రానిక్ దాడి ద్వారా నిర్వీర్యం చేయడం, టీవి ద్వారా పరోక్ష, మానసిక దాడికి పాల్పడటం. వీటికి తోడు యుద్ధ భూమిలో అనుసరించాల్సిన 10 రకాల సమాచార పక్రియలను కూడా చైనా రూపొందించుకుంది. (అమెరికా సమాచార యుద్ధంలో ఆరు భాగాలు ఉంటాయి- ఎలక్ట్రానిక్ దాడి, తెలివిగా మోసపుచ్చడం, వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం, ప్రచార యుద్ధం, మానసిక యుద్ధం, కంప్యూటర్, కమాండ్, కంట్రోల్ యుద్ధం).
2004 నుంచి చైనా తన ప్రత్యర్ధులను లొంగదీసుకునేందుకు ఈ పద్ధతుల్లో ఏదో ఒకటి లేదా కొన్ని కలిపి ఉపయోగిస్తోంది. ఇ-మెయిల్‌లు దొంగిలించడం, మాల్‌వేర్ ప్రవేశపెట్టడం, కొత్తరకాల వైరస్‌లు సృష్టించడం వంటివి చైనా వ్యూహంలో భాగం. ‘తక్కువ సామర్ధ్యంతోనే బలమైన ప్రత్యర్ధిని జయించడం’ అనే మావో సూత్రాన్ని, ‘పోరాడకుండానే యుద్ధం గెలవడం’ అనే సున్ జి సూత్రాన్ని చైనా అనుసరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంలో తన లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక సాంకేతికేతర మార్గాలను అనుసరిస్తోంది.
మానసిక యుద్ధం చైనా వ్యూహంలో ప్రధాన అంశం. చైనా తన ‘అద్భుత గాధను’ ప్రపంచానికి వినిపించడానికి అధునాతన వ్యూహాన్ని రూపొందించు కుంది. ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించేందుకు రాజకీయ సంస్కరణలు చేపట్టడానికి ఏమాత్రం సుముఖంగా లేని చైనా విపరీతమైన ప్రచారం ద్వారా తన పని సాధించుకోవాలనుకుంటోంది.
కేంద్ర ప్రచార విభాగం (CPD) 1924లో ప్రారంభమైంది. ఇది చైనా రాజకీయ వ్యవస్థలో అంతర్భాగం. తమ ప్రజలపై విదేశీ ప్రచార ప్రభావం ఏమాత్రం పడకుండా చైనా ప్రభుత్వం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుంది. విదేశీ ఛానళ్లను, విదేశీ పత్రికా విలేకరులను పూర్తిగా నిషేధించింది. ముఖ్యంగా టిబెట్, తైవాన్, స్క్వేర్ సంఘటనలకు సంబంధించిన సమాచారం ఏమాత్రం బయటకు పొక్కకుండా ఈ చర్యలు తీసుకుంది.
ప్రపంచ ఆధిపత్యం కోసం పాకులాడుతున్న చైనా అందుకు అనేక మార్గాలు కనిపెట్టి అమలు చేస్తోంది. ప్రపంచంలో చైనా పట్ల దృష్టిని మార్చడానికి, పరపతి పెంచడానికి గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్ (CGTN)ను ప్రారంభించింది. తమ దగ్గర ఎలాంటి పత్రికా స్వేచ్ఛను అనుమతించని చైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న పత్రిక స్వేచ్ఛను మాత్రం ఉపయోగించుకుని అక్కడ తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఫెలోషిప్‌లు, ఉచిత డిగ్రీలు, అద్భుతమైన జీతభత్యాలు, ఉచిత విదేశీ పర్యటనలు మొదలైన వాటితో ప్రపంచంలో ‘చైనా గురించి మంచిగా, బాగా చెప్పేందుకు’ జర్నలిస్ట్‌లను ఆకర్షిస్తోంది.
చైనా రేడియో ఇంటర్నేషనల్ (CRI) ప్రసారం చేసే విషయాలను ఇతర దేశాల రేడియో ప్రసారాల్లో చొప్పిస్తోంది. ‘మూడవ పక్షం ప్రతినిధులు’ పేరుతో వివిధ దేశాల్లో చైనా ప్రయోజనాలను పరిరక్షించే మద్దతుదారులను తయారుచేస్తోంది. 1941లో ప్రారంభమైన చైనా రేడియో ఇప్పుడు 65 భాషల్లో తన ప్రసారాలను అందిస్తోంది.
టిబెట్ దురాక్రమణ తరువాత 2008 బీజింగ్ ఒలింపిక్స్ వరకు చైనాపై వచ్చిన మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కునేందుకు చైనా 6.6 బిలియన్ డాలర్ల నిధితో ప్రపంచ ప్రచారం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగంలో బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. డిజిటల్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికాలో ప్రవేశించిన చైనా డిజిటల్ సిల్క్ రోడ్ పేరుతో ప్రాబల్యం పెంచుకుంది. ఫైబర్ కేబుల్ వేయడం, టెలివిజన్ ఉపగ్రహ సేవలు అందించడం, జర్నలిస్ట్‌లకు భారీ జీతాలు మొదలైన చర్యలతో ఆఫ్రికాలో మీడియా రంగాన్ని పూర్తిగా చేజిక్కించు కుంది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని తక్కువ, మధ్య ఆదాయ ఆసియా దేశాల్లో కూడా అమలు చేయాలని చూస్తోంది.
తమ బెల్ట్, రోడ్ ప్రాజెక్ట్ వల్ల అందరికీ లాభం కలుగుతుంది తప్ప ఎవరికీ నష్టం లేదని చైనా పదేపదే చెపుతున్నప్పటికి ఆ ప్రాజెక్ట్ పట్ల అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ చెడ్డపేరును తుడిచేసుకునేందుకు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా దేశాలతోపాటు మొత్తం 100 దేశాల్లో 10 నెలలపాటు వివిధ ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు వ్రాయించింది. జర్నలిస్ట్‌లను ఆకర్షించడానికి భాషా శిక్షణా తరగతులు, విలాసవంతమైన సదుపాయాలు, ఫెలోషిప్‌లు, చైనాలో ఉచిత పర్యటన వంటివి అందించింది. దానితో ఈ సదుపాయాలు, సొమ్ములు అందుకున్న పత్రికా సంస్థలన్నీ సహజంగానే చైనాను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాసాలు వ్రాసాయి. అంతేకాని ఎక్కడ తమకు అందిన ఫెలోషిప్‌ల సంగతి బయట పెట్టలేదు. మన దేశం నుంచి (IANS), జనసత్తా, ఇండియన్ ఎక్స్ ప్రెస్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఫెలోషిప్ సొమ్ము పూర్తిగా పొందా లంటే దక్షిణ చైనా సముద్రంలో వివాదాలగురించి ఏమాత్రం ప్రస్తావించడానికి వీలులేదని కేవలం చైనా గురించి మంచిని మాత్రమే చెప్పాలని నిబంధన విధించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు బయటపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా తన పరపతిని పెంచుకు నేందుకు చైనా ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు ఉపయోగించిన విధానాలనే అనుకరిస్తున్నా ఆ దేశాల్లో ఉన్న స్వేచ్ఛ, సహనం మాత్రం చైనాలో కనిపించవు. చైనా మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న విదేశీ జర్నలిస్ట్‌లను తమ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేస్తోంది. అలా వాళ్లు చైనా ప్రభుత్వపు గూఢచారులుగా కూడా మారుతున్నారు.
ప్రభుత్వ మీడియా సంస్థలను ప్రపంచవ్యాప్త ప్రచారం నుంచి తప్పించడానికి చైనా ప్రభుత్వం పేరుపొందిన విదేశీ ప్రచార సంస్థలను కొనుగోలు చేయాల్సిందిగా ధనికులైన వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోంది. 115 ఏళ్ల హాంగ్ కాంగ్ దినపత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP)ను జాక్ మా కొనుగోలు చేయడం ఈ వ్యూహంలో భాగమే. ఒకప్పుడు నిర్భయమైన, స్వేచ్ఛా వార్తా కథనాల ప్రచురణకు పేరుపొందిన ఈ పత్రిక ఇప్పుడు చైనా అనుకూల వ్యాసాలు మాత్రమే ప్రచురిస్తోంది.
ఆస్ట్రేలియాలో కూడా చైనా ప్రచార ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. అక్కడ వ్యాపారస్తులను తనవైపు ఆకర్షించడం చైనా వ్యూహంలో ఒక భాగం. ప్రముఖ వ్యాపారి హుయాంగ్ జింగ్ మో కోట్లాది డాలర్లు ఖర్చుపెట్టి ఆస్ట్రేలియా చైనా సంస్థను (ACRI) స్థాపించి, దాని ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు దోహదపడుతుందని చెపుతున్నారు. కానీ ఈ సంస్థ ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌లను ఆకర్షించి చైనా పర్యటన ఏర్పాటు చేసింది. అలా విలాసవంత మైన పర్యటనలో పాల్గొన్న జర్నలిస్ట్‌లు చైనాను పొగడుతూ వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు. వివాదాస్పద ‘BRI ప్రాజెక్ట్’ గురించి మాట్లాడటం మానేశారు.
చైనా ప్రచార విభాగంతో సన్నిహిత సంబంధాలు కలిగిన హాంగ్ కాంగ్ వ్యాపార వేత్త తుంగ్ ఛీ హువా చైనా, అమెరికా ఫౌండేషన్ స్థాపించాడు. ఈ సంస్థ అమెరికా జర్నలిస్ట్‌లకు చైనా గురించి ఎప్పటికప్పుడు చెపుతూ ఉంటుంది. అమెరికా పత్రికల్లో ప్రతివారం మూడు చైనా అనుకూల వ్యాసాలు ప్రచురించడానికి నెలకి 20వేల డాలర్లు చెల్లిస్తోంది. ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ సూచీ ప్రకారం మొత్తం 180 దేశాల్లో చైనా 176వ స్థానంలో ఉంది (రిపోర్టర్స్ విథౌట్ బోర్డర్స్ ప్రకారం). ఒక పక్క దేశంలో కఠినమైన సెన్సార్ నిబంధనలు అమలు చేస్తున్న చైనా ప్రపంచవ్యాప్తంగా మాత్రం అనుకూల వార్తలు, ప్రచారం జరిగేట్లు చూసుకుంటోంది. దీని కోసం ప్రతి ఏటా 1.3 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది.
నిరంకుశ ప్రభుత్వాలు తమ ప్రచారానికి ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణమైన విషయమే. కానీ చైనా సాగిస్తున్న ప్రచారం చాలా భారీగా, అనేక మార్గాల్లో, ఎంతో పెట్టుబడితో సాగుతోంది. పాశ్చాత్య దేశాలు మేలుకుని, గుర్తించే లోగానే చైనా ధన బలం, బెదిరింపులతో ప్రపంచ మీడియా రంగంలోకి చొచ్చుకుపోయింది.
– రామహరిత