ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల మీద ఉన్న ఏకైక కర్తవ్యం- కొవిడ్‌ 19‌ను తక్షణం కట్టడి చేసే వ్యాక్సిన్‌ను మానవాళికి అందించడం. గంటగంటకు మృతుల సంఖ్యను వందలకూ వేలకూ పెంచుతున్న కరోనా వైరస్‌ను గెలవడం మీదే వారి దృష్టి, శక్తియుక్తులు కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంతో పాటు, పలు ప్రపంచ దేశాలు, సంస్థలు ఇందుకు అహరహం శ్రమిస్తున్నాయి. వీరి యుద్ధం హ్యూమన్‌ ‌ట్రయిల్స్ ‌వరకు వచ్చింది. మరొక ఐదు మాసాలలో వ్యాక్సిన్‌ ఆవిష్కరణ తథ్యమని ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. కానీ, విశ్వమానవుడిని కొవిడ్‌ 19 ‌తరుముతున్నంత వేగంగా వ్యాక్సిన్‌ ‌కోసం పరిశోధకులను తరమడం సాధ్యమా? వందేళ్లుగా మానవాళిని వెంటాడుతున్న వైరస్‌ల లక్షణాలూ, వాటిని అరికట్టిన తీరుతెన్నులూ ఇప్పుడు తలుచుకోవాలా? నిన్నటి శాస్త్రవేత్తల అనుభవాలను ఆకళింపు చేసుకోవాలా? ఒకవేళ వ్యాక్సిన్‌ ‌కనుగొన్నా వెంటనే వినియోగించడానికి గతంలో ఎదురైనట్టు ప్రతిబంధకాలు తప్పవా? ఒక్కొక్క వైరస్‌కు ఒక్కొక్క వ్యాక్సిన్‌ ‌వచ్చింది. ఈ మధ్యలో తాత్కాలికంగా ఉపయోగపడే ప్లాజ్మా వంటి వైద్య విధానం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నది? అసలు వైరస్‌లతో విశ్వమానవాళి ఇలా సహజీవనం చేస్తూనే ఉండాలా? తరం తరవాత తరం మహమ్మారిని చూడక తప్పదా? ఈ విషయాలను ప్రముఖ న్యూరో సర్జన్‌ ‌డాక్టర్‌ ‌డి. రాజారెడ్డి (హైదరాబాద్‌) ‌జాగృతితో ముఖాముఖీ చర్చించారు. పాఠకుల కోసం ఆ ముఖాముఖీ ఈ వారం అందిస్తున్నాం.

కొవిడ్‌ 19 ‌నిరోధక వ్యాక్సిన్‌ ‌గురించి ఇప్పుడు ఎక్కువ వార్తలూ, ఊహాగానాలూ వస్తున్నాయి. రోజుకు వేలల్లో జనం మరణిస్తుంటే మానవాళిలో ఆ వ్యాక్సిన్‌ ‌రాక కోసం ఈ ఆతృత సహజం. కానీ శాస్త్ర పరిశోధన ఆ ఆత్రానికి తగ్గట్టు వేగంగా సాగుతోందా?
త్వరలోనే వ్యాక్సిన్‌ ‌ప్రపంచానికి అందే అవకాశాలు చాలా వరకు మెరుగుపడ్డాయి. గతంలోను వైరస్‌, ‌బాక్టీరియాలు ప్రపంచానికి తెలుసు. అప్పుడు వ్యాక్సిన్‌ ‌కనుగొనడానికి ఆలస్యం జరిగింది. చరిత్రలో బాగా ప్రసిద్ధమైన స్పానిష్‌ ‌ఫ్లూ, లేదా స్పానిష్‌ ఇన్‌ఫ్లుయొంజా వైరస్‌కు దాదాపు పాతికేళ్ల తరువాత వ్యాక్సిన్‌ ‌వచ్చింది. అయితే తొలిదశలో ఆ వైరస్‌ ‌ప్రపంచాన్ని చుట్టుముడుతున్న సమయంలో, రోజుకు వేలల్లో జనం చనిపోతున్నప్పుడు కనీసం పెన్సిలిన్‌ ‌కూడా లేదు. పెన్సిలిన్‌ 1928‌లో వచ్చింది. వైరస్‌-‌బాక్టీరియాల ప్రస్థానం, వైద్య ఆరోగ్య చరిత్ర, ఆధునిక ప్రపంచంలో దాదాపు వందేళ్ల వాటి ఉనికి, అన్నింటికి మించి వ్యాధులు, వైరస్‌ ‌దాడులను తట్టుకుని నిలబడి, మానవాళి సాధించిన అనుభవం వంటి అంశాలు ఇప్పుడు కొవిడ్‌ 19‌కి వేగంగానే వ్యాక్సిన్‌ ‌కనుగొనడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి.
కొవిడ్‌ 19 ‌వ్యాక్సిన్‌ ‌పరిశోధన విషయంలో ఇంగ్లండ్‌ ‌ముందంజలో ఉందని కొన్ని వార్తలు చెబుతున్నాయి. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?
మొదట గమనించవలసిన అంశం- కొవిడ్‌ 19 ఇప్పటికే బ్రిటన్‌కు అపారమైన విషాదాన్ని మిగిల్చింది. ఆ విషాదం ఇంకా అంతం కాలేదు. ఈ వైరస్‌ అణగారిపోయిందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఒక్క ఇంగ్లండ్‌ ‌కాదు, ప్రపంచమంతా కూడా దీని అంతం ఎప్పుడో అంచనా వేయలేకపోతోంది. ఇప్పటి సమాచారం ప్రకారం 26,000 మంది బ్రిటిష్‌ ‌జాతీయులు ఈ వైరస్‌కు బలయ్యారు. వారి జనాభా మొత్తం 5.6 కోట్లు. అంటే దాదాపు ఆంధప్రదేశ్‌ ‌జనాభా. ఇందులో 26,000 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. అందుకే చాలా వేగంగా స్పందించింది ఇంగ్లండ్‌. ‌ప్రపంచం మొత్తానికి ఈ వైరస్‌ ‌తీవ్రత అవగాహనకు వచ్చింది, 2019 చివరిలో కదా! ఈ కొద్ది సమయంలోనే ఇంగ్లండ్‌ ఈ ‌మహమ్మారి నివారణకు చర్యలు తీసుకుంది. గతంలో వైరస్‌లకీ, బాక్టీరియాకీ వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడానికి జరిగిన ఆలస్యాన్ని ఇప్పుడు నివారించాలని కూడా ఆశిస్తున్నది. పరిశో ధనలో, విద్యా ప్రమాణాలలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయానికి ఈ కీలక బాధ్యతను అప్పగించింది. 39 బిలియన్‌ ‌డాలర్లు వెంటనే మంజూరు చేసింది. ఆరు వేల మంది స్వచ్ఛంద సేవకులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌కూడా మొదలయినాయి. ఇలా ఏ దేశమూ చేయలేదు. ఈ పనికి ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వ విద్యాలయాన్ని ఎంచుకోవడం నూటికి నూరు పాళ్లు సరైన అడుగు. కాబట్టి వచ్చే సెప్టెంబర్‌ ‌మాసానికల్లా వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వస్తుందనే ఇప్పుడు ప్రపంచం విశ్వసిస్తున్నది.
ఇంత అభివృద్ధి సాధించిన తరువాత వ్యాక్సిన్‌ ‌కనుగొనడంలో జాప్యం ఎందుకు జరుగుతున్నది? చాలా దేశాలు వైద్యరంగంలో ఆసాధారణమైన ముందడుగు వేశాయి. అయినా ఎందుకు ఈ వెనుకపాటు?
కారణం కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌పరిమాణం. ఇది 400 మైక్రాన్స్ ‌కంటే చిన్నది. బాక్టీరియా మీద పరిశోధన చేసినంత సులువు కాదు. వైరస్‌ ‌లైవ్‌ ‌టిష్యూలోనే జీవించగలుగుతుంది. అసలు వైరస్‌ అనే దానిని 1940లలో వచ్చిన ఎలక్ట్రాన్‌ ‌మైక్రోస్కోప్‌ అం‌దుబాటులోకి వచ్చిన తరువాతనే లైవ్‌ ‌మీడియంలో చూడగలిగారు. పరిశోధన కూడా సులభతరమైంది. వైరస్‌ ఆర్గానిజం పెంపొందించి యాంటీబాడీస్‌కు చేర్చాలి. ఇదీ పక్రియ. అంటే ప్రతి వైరస్‌ ‌వైద్యశాస్త్రానికి సవాలుగానే వస్తోంది.
ఈ వ్యాక్సిన్‌ ఇప్పుడు ప్రపంచ అవసరం. ఈ పరిశోధన కోసం ఇంకా ఏఏ దేశాలు పాటు పడుతున్నాయి?
చాలా దేశాలలో, చాలా సంస్థలు వ్యాక్సిన్‌ను అందించడానికి పరిశోధనలు సాగిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ‌కనుగొనడం మినహా ఇప్పుడు ప్రపంచా నికి అత్యవసరమైన కర్తవ్యం మరొకటేదీ లేదు. అమెరికా, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇజ్రాయెల్‌తో కలసి ఇండియా, ఇంకా అనేక సంస్థలు కృషిచేస్తున్నాయి. కానీ ఈ వివరాలు పెద్దగా బయటకురావు. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక పోటీయే.
పోటీ అంటున్నారు. పైగా ప్రపంచానికి అత్యవ సరం. గత చరిత్రను బట్టి ఇంగ్లండ్‌ ‌కనుక మొదట వ్యాక్సిన్‌ను కనుగొంటే ఆ దేశం దానిని ప్రపంచానికి సజావుగా చేరనిచ్చే అవకాశం ఉందా?
ఈ అనుమానం కొట్టిపారవేయలేనిదే. కానీ అన్ని విషయాలలోను ఆ దేశం అలా లేదు. ఎందుకంటే టీవీ, జెట్‌ ఇం‌జన్‌, ‌రాడార్‌, ‌సీటీ స్కాన్‌, ఏటీఎమ్‌- ఇవన్నీ ఇంగ్లండ్‌ ‌వాళ్లవే. వాళ్లు శాస్త్ర ఆవిష్కరణలు చేస్తారు. పేటెంట్‌ ‌ప్రకటించుకోవడం కనిపించదు. ఈ వ్యాక్సిన్‌ ‌విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తుందని అనుకుందాం. ఇదంతా ఎలా ఉన్నా వెంటనే స్పందించి అంత పెద్ద మొత్తంలో పరిశోధనకు నిధులు కేటాయించినందుకు ఆ దేశాన్ని అభినందించవలసిందే.
కొవిడ్‌ 19 ‌నిరోధానికి వ్యాక్సిన్‌ ‌తక్షణావసరమే. కానీ అవసరం ఒక్కటే పరిశోధనకి చోదకశక్తి కాలేదనిపిస్తున్నది. ఇంకా ఏ ఏ వాస్తవాలు ఈ పరిశోధనను శాసించే అవకాశం ఉంది?
నిజమే. తక్షణావసరమే వ్యాక్సిన్‌ ‌కనుగొన డానికి చోదకశక్తి కాబోదు. గతంలో వైరస్‌లకి వ్యాక్సిన్‌ ‌కనుగొనే విషయంలో ఎలాంటి సోపానాలను శాస్త్రవేత్తలు ఏ విధంగా ఒక్కొక్కటీ అధిరోహిస్తూ వెళ్లారు అనేది ఇక్కడ కీలకమే. అంటే వ్యాక్సిన్‌ ‌పరిశోధనల చరిత్ర. స్థాయిలలో తేడా ఉంది కానీ, 1918 నాటి స్పానిష్‌ ‌ఫ్లూకీ, 2019 కొవిడ్‌ ‌వైరస్‌కీ భేదం తక్కువ. స్పానిష్‌ ‌ఫ్లూకు మూడు దశలు కనిపిస్తాయి. ఈ రెండింటి మధ్యలో వచ్చిన వైరస్‌లూ, బాక్టీరియాలను కూడా పరిశీలించి రాసిన కొన్ని పుస్తకాలు వచ్చాయి. ‘ఇన్‌ఫ్లుయొంజా 1918- ది వరస్ట్ ఎపిడమిక్‌ ఇన్‌ అమెరికన్‌ ‌హిస్టరీ’ (లెనెట్టె లెజోని, 1999, న్యూయార్క్), ‘‌ది గ్రేట్‌ ఇన్‌ఫ్లుయెంజా – ది ఎపిక్‌ ‌స్టోరీ ఆఫ్‌ ‌డెడ్లీయెస్ట్ ‌ప్లేగ్‌ ఇన్‌ ‌హిస్టరీ’ (జె ఎం బ్యారీ, 1999), ‘ది డెవిల్స్ ఇన్‌ఫ్లుయొంజా’ (పీట్‌ ‌డెవిస్‌, 2000) అలాంటి పుస్తకాలలో ప్రముఖమైనవి. అలాగే నియాల్‌ ‌జాన్సన్‌, ‌ముల్లర్‌ అనే శాస్త్రవేత్తలు బులెటిన్‌ ఆఫ్‌ ‌హిస్టరీ ఆఫ్‌ ‌ది మెడిసిన్‌ (2002) ‌ప్రచురించిన పరిశోధక పత్రం ‘ఫిఫ్టీ మిలియన్‌ ‌డెత్‌’ ‌చాలా సమాచారం ఇచ్చింది. వైరస్‌ ‌మీద జరిగే పరిశోధనలో దాని ప్రస్థానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవడం అనివార్యమని వీటిలోని సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది.
స్పానిష్‌ ‌ఫ్లూ మూడు దశల గురించి కొంచెం వివరించగలరా?
స్పానిష్‌ ‌ఫ్లూ నిజానికి స్పెయిన్‌లో మొదల యినది కాదు. అప్పుడు స్పెయిన్‌లో పత్రికా స్వాతంత్య్రం ఉండేది. మిగిలిన దేశాలలో ఉండేది కాదు. అందుకే అక్కడి పత్రికలు స్పానిష్‌ ‌ఫ్లూ అని రాశాయంటారు. అదే పేరు స్థిరపడిం దని అంటారు. నిజానికి అమెరికాలోనే కాన్సాస్‌ ‌రాష్ట్రంలో మార్చి, 1918లో అది మొదల యింది. ఒక సైనిక శిబిరమే దీని పుట్టిల్లు. అక్కడ నుంచి పశ్చిమ యూరప్‌కి వెళ్లింది. 1918 వసంతమాసంలో మొదటి, రెండో దశలు కనిపిస్తాయి. పోలెండ్‌కి ఆ సంవత్సరమే వెళ్లింది. 1918 శీతాకాలం నుంచి జనవరి 1919 వరకు మూడో దశ. ఆ తరువాతే ఆ వైరస్‌ ‌తీవ్రత చల్లారింది. ఈ మూడు దశలలో రెండో దశే అత్యంత వినాశకారిగా చరిత్రలో నమోదయింది. ఈ దశలోనే మెసాచుసెట్స్‌లో మొదటి కేసు నమోదైన ఆరు రోజులకు 6,674 మంది కన్నుమూశారు. మూడో దశ మొదటి, రెండో దశ అంత విధ్వంసాన్ని సృష్టించలేదు. అయినా రెండు, మూడు దశలలో 20-40 మధ్య వయస్కులు కూడా ఎక్కువ సంఖ్యలోనే చనిపోయారు. ఐదు నుంచి పది కోట్ల మరణాలు సంభవించాయి. ఈ దశలను వైద్య చరిత్రలో వేవ్‌లని అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మొదలైన స్పానిష్‌ ‌ఫ్లూ వ్యాధికి, రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న సమయంలో అంటే 1945లో వ్యాక్సిన్‌ ‌వెలువడింది.
భారత్‌ ‌మీద స్పానిష్‌ ‌ఫ్లూ ప్రభావం ఏ విధంగా ఉంది?
భారత్‌ ‌కూడా ఇవే దశలను చూసింది. 1918 మే-ఆగస్టులలో మొదటి దశ మొదలై అక్టోబర్‌కు విశ్వరూపం దాల్చింది. రెండో దశలో మరింత ఉధృతి కనిపిస్తుంది. దీనికి కారణం రైళ్లలో ప్రయాణం. బొంబాయి ఆ సంవత్సరం మార్చిలో స్పానిష్‌ ‌ఫ్లూతో అతలా కుతలమైంది. అక్టోబర్‌ ‌నాటికి దేశమంతా తీవ్రంగా ఉంది. నవంబర్‌ ‌నాటికి మధ్య భారతానికి చేరుకుంది. డిసెంబర్‌లో బెంగాల్‌ను తాకింది. ఇంగ్లిష్‌ ‌వాళ్లు శ్రద్ధలేమీ తీసుకోలేదు. తెల్లజాతీయుల రక్షణకు మాత్రం చర్యలు తీసుకున్నారు.
కానీ ఇప్పుడు తెల్లవాళ్ల దేశాలు ఇంగ్లండ్‌, అమెరికాలలోనే కొవిడ్‌ 19 ‌మరణాలు విపరీతంగా నమోదైనాయి. ఇప్పుడు వాళ్లని వాళ్లు కూడా రక్షించుకోలేకపోతున్నారు.
అందుకు కారణం- పరిస్థితులు. అయి నప్పటికి స్పానిష్‌ ‌ఫ్లూకీ, కొవిడ్‌ 19‌కీ ఉన్నట్టే, వైరస్‌ ‌విజృంభిస్తున్న తీరులో భారత్‌కీ, అమెరికాకీ మధ్య కొద్దిపాటి సామ్యాలు ఉన్నాయి. కొవిడ్‌ 19 ‌విషయంలో న్యూయా ర్క్‌నీ, ముంబైనీ పోల్చి చూస్తున్నారు. న్యూయార్క్‌లో ఒక చదరపు మైలు విస్తీర్ణంలో 27,000 మంది ఉంటున్నారు. ముంబైలో అదే విస్తీర్ణంలో 70 వేల నుంచి 80 వేల మంది ఉంటున్నారు. న్యూయార్క్ ‌సబ్‌ ‌వేలను ఐదు మిలియన్‌ ‌ప్రజలు ఉపయోగిస్తారు. ముంబైలో సబ్‌ ‌వేలను ఎనిమిది మిలియన్లు ఉపయోగి స్తారు. పైగా నిబంధనలు అమలు కావడానికి అవకాశాలు తక్కువ. అక్కడ, ఇక్కడ మరణాలు ఎక్కువై, వ్యాధి అదుపులోకి రాకపోవడానికి కారణాలు ఇవేనని భావిస్తున్నారు. విపరీతమైన జనాభా. చాలామందిలో అందుకే ఒక భయం కూడా ఉంది. న్యూయార్క్ అం‌తటి ఉత్పాతాన్ని ముంబై చూడబోతోందా? అన్నదే ఆ భయం.
స్పానిష్‌ ‌ఫ్లూ, కొవిడ్‌ 19‌కి చాలా పోలికలు ఉన్నా యంటున్నారు. అంటే కొవిడ్‌ 19 ‌కూడా ప్రపంచానికి రెండు, మూడు దశలను కూడా చూపించే అవకాశం ఉందా?
అలాంటి అవకాశం లేదని మాత్రం అనలేం. కొవిడ్‌ 19 ‌తిరగబెట్టడం గురించి చాలా దేశాలలో భయాందోళనలు ఉన్నాయి కూడా. అది రెండో దశను కూడా రుచి చూపిస్తుందా? లేదా అనేది నిజంగానే కోట్ల డాలర్ల విలువైన ప్రశ్న. ఒకవేళ వస్తే చావులు ఎన్ని ఉంటా యన్నది ఇంకా పెద్ద ప్రశ్న. వ్యాక్సిన్‌ను త్వరిత గతిన సిద్ధం చేయాలన్న తపన వెనుక కూడా ఈ వాస్తవం ఉంది. చైనాలోనే ఒకసారి తగ్గి ఇంటికి వెళ్లినవారిలో ఆ వ్యాధి లక్షణాలు మళ్లీ కనిపించాయని వార్తలు వచ్చాయి కూడా.
కాబట్టి వైరస్‌ల తీరుతెన్నులను బట్టి, లక్షణాలను చూసి వ్యాక్సిన్లు కనుగొనే యత్నం ఆరంభం అవుతుందని భావించవచ్చా?
ఒక వైరస్‌ ఒక సమయంలో దాడి చేస్తుంది. దాని నివారణకు ఒక వ్యాక్సిన్‌ ‌సిద్ధమవుతుంది. ఆ వ్యాక్సిన్‌ ‌పాత్ర అక్కడితో అయిపోతుంది. మరో రకం వైరస్‌ ‌మీద అది పని చేయదు. వైరస్‌ ‌మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుంది. ఇది స్వతంత్రంగా బతకలేదు. మనిషి, జంతువు, చెట్టు మీదనే జీవశక్తితో ఉంటుంది.
వ్యాక్సిన్‌ ‌కనుగొనే క్రమం ఎలా ఉంటుంది? శాస్త్రీయ విధానం ఏమిటి?
వైరస్‌ అం‌టే ఏమిటి? యాంటిజన్‌. ‌దీనిని తన సహజ గుణంతో శరీరం నిరోధిస్తుంది. అందుకు యాంటీబాడీస్‌ను తయారుచేస్తుంది. యాంటీబాడీస్‌ ‌తయారయితే ఆ శరీరానికి శక్తి ఉన్నట్టు లెక్క. ఇది వృద్ధులలో సాధారణంగా ఉండదు. కాబట్టే వైరస్‌లు వచ్చినప్పుడు మరణాలలో ఎక్కువ వయసు మళ్లినవారివే ఉంటాయి. పోలియో వ్యాక్సిన్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చుక్కల రూపంలో నోటి ద్వారా అందించేది (దీనిని కనుగొన్న శాస్త్రవేత్త సాబిన్‌ : 1906-1990) ఒకటి. ఇంజక్షన్‌ (‌శాస్త్రవేత్త, సాక్‌: 1914-1995) ‌ద్వారా ఇచ్చేది ఒకటి. నోటి ద్వారా ఇచ్చే మందు పోలియో లైవ్‌ ‌వైరస్సే. యటానిమేటెడ్‌ అం‌టారు. ఇంజక్షన్‌ ‌ద్వారా ఇచ్చేది ఇన్‌ ‌యాక్టివేటెడ్‌. ఇది కిల్డ్ ‌వైరస్‌. ‌పోలియో వైరస్‌ను సేకరించి రెసెస్‌ ‌కోతి మూత్రపిండాలలో జీవించి ఉండేటట్టు చేస్తారు. ఎందుకంటే వైరస్‌ ‌వేరొక జీవి మీద మాత్రమే సజీవంగా ఉండగలుగుతుంది కదా! రెండు విధాలుగా వ్యాక్సిన్‌ ఇవ్వడం ఎందుకంటే, పోలియో రకాలను బట్టే. అవి మూడు రకాలు. ఒకదానికే వ్యాక్సిన్‌ ‌వేసి ఊరుకుంటే మరొక రూపంలో రావచ్చు. కాబట్టి మూడు రకాల పోలియోలలో ఏదీ రాకూడదు. ఒక రకం పోలియోలో ఊపిరి తీసుకోలేరు. పోలియో వైరస్‌ ‌నరాల మీద ప్రభావం చూపడం వల్ల ఇది జరుగుతుంది. వీరి కోసం ఐరెన్‌ ‌లంగ్‌ అనే వైద్య విధానం ప్రవేశపెట్టారు. ఒక ఇనుప గొట్టమది. అందులోనే వారు ఉండాలి. ఇలానే చాలా కాలం బతుకుతారు. దీనిని అమెరికాలో చూశాం. ఇంతకాలం బాధపడుతూ బతకడం సరికాదు. కాబట్టి పోలియో నిర్మూలన అంటే, ఏ రకమైన పోలియో కూడా రాకుండా వ్యాక్సిన్‌లతో నిర్మూలించడమే. కొవిడ్‌ 19 ‌కూడా అంతే. ఇది ఎన్ని రకాలుగా దాడి చేస్తుందో తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు వ్యాక్సిన్‌ ‌తయారుకావాలి.

ప్లాజ్మా వైద్య విధానం మాటేమిటి?
రోగం నయమైన వ్యక్తి నుంచి ప్లాజ్మా సేకరిస్తారు. వైరస్‌ను నిరోధించే యాంటీబాడీస్‌ ఇం‌దులో ఉంటాయి. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగికి ఆ ప్లాజ్మా ఇస్తారు. ఇది అత్యవసర పరిస్థితులలో, మరొక మార్గమేదీ లేని స్థితిలోనే ఇస్తారు. కానీ ఇది తాత్కాలిక విధానమే. కొంతమందికే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ప్లాజ్మాలో పూర్తి స్థాయి యాంటీబాడీస్‌ ఉం‌డకపోవచ్చు. లేదంటే వైద్యం చేయించుకుంటున్న రోగికి చాలిన మోతాదులో యాంటీబాడీస్‌ ‌ప్లాజ్మాలో లేకపోయినా ఫలితాన్ని ఇవ్వలేదు. యాంటీబాడీస్‌ ‌సరైన మోతాదులో ఉండడం చాలా కీలకం. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని చూస్తున్నారు. వాస్తవిక పరిస్థితులను బట్టి చూస్తే ప్లాజ్మా సేకరణ అంత సులభం కాదు. అప్పుడే నయమైన వ్యక్తి ప్లాజ్మా తీయడానికి అవసరమైనంత రక్తం ఇవ్వగలడా? దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ ప్రయత్నం మంచిదే. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ప్లాజ్మా ప్రయోగం విఫలమైనట్టు మే 1వ తేదీన ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలియచేసింది. ఇలాంటివి గమనంలోకి తీసుకుని కారణాలు పరిశోధించాలి.
చాలా అభివృద్ధి చెందాం అనుకుంటున్న ఈ కాలంలో కూడా కొవిడ్‌ 19‌కు వైద్యం చేయించు కోమని రోగులను చైతన్య పరచవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైరస్‌, ‌వైద్యం కంటే తమ విశ్వాసాలే శక్తిమంతమైనవని బాహాటంగా చెబుతున్నవారు కనిపిస్తున్నారు. రేపు కొత్త వ్యాక్సిన్‌ ‌తీసుకోమని చెప్పడం, ఇవ్వడంలో కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవంటారా? ప్రపంచంలో ఎక్కడైనా ఆ వైరస్‌తో ఒకరు మిగిలి ఉన్నా మళ్లీ ప్రమాదమే కదా!
ఇప్పుడు వైద్య విజ్ఞానం మీద, వైద్యం మీద నమ్మకం పెరిగింది. మూఢత్వానికీ, శాస్త్రానికీ ఘర్షణ ఇప్పటిది కాదన్న సంగతిని కూడా విస్మరించలేం. కానీ మొత్తం పరిస్థితినీ, వ్యవస్థనీ దృష్టిలో పెట్టుకుని చూడగలిగితే, పెద్ద ప్రయత్నం లేకుండానే ప్రజలు వ్యాక్సిన్‌ ‌తీసుకుంటారన్న నమ్మకమే కలుగుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం సంగతి వేరు. మీజిల్స్‌కు 1963లో వ్యాక్సిన్‌ ‌కనుగొన్నారు. పోలియోకు 1956లో కనుగొన్నారు. ఈ రెండింటిని ఇప్పటికి పూర్తిగా నిర్మూలించగలిగారు. కానీ వీటిని జనం స్వీకరించడానికి కూడా సమయం పట్టింది. స్మాల్‌పాక్స్ ‌వైరస్‌ ‌చూడండి! క్రీస్తు పూర్వమే దీని ఉనికి ఉంది. ఈజిప్ట్ ‌వ్యాపారులతో భారతదేశంలో ప్రవేశించింది. 1796లోనే ఎడ్వర్డ్ ‌జెన్నర్‌ ‌దీనికి వ్యాక్సిన్‌ ‌కనుగొన్నాడు. కాని తీసుకున్నవారేరి? జర్మనీలో ఏటా 50,000 మంది స్మాల్‌పాక్స్ ‌వైరస్‌తో చనిపోయేవారు. బ్రిటన్‌లో ఏటా 5 లక్షల మంది వరకు పౌరులు చనిపోయేవారు. అయినా జనం వ్యాక్సిన్‌ ‌దరిదాపులకు కూడా రాలేదు. చివరికి 1840లో ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం అనివార్యం చేశాయి ప్రభుత్వాలు. ఇందుకు నిరసనగా ఇంగ్లండ్‌లోని గ్లాస్టోలో లక్షమంది ప్రదర్శన నిర్వహించారు. మన దేశంలో షమ్మీ కపూర్‌ ‌భార్య, నటి గీతాబాలి జనవరి 21, 1965లో స్మాల్‌పాక్స్ ‌సోకి మరణించారు. 1967లో కూడా మన దేశంలో రెండు లక్షలమంది, ప్రపంచ వ్యాప్తంగా ఇరవై లక్షల మంది బలయ్యారు. ప్రభుత్వ నిర్బంధం, జరిగిన పరిణామాల తరువాతనే విధిగా తీసుకోవడం మొదలుపెట్టారు. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశమని చెబుతాం. అక్కడ మీజిల్స్‌కు వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడానికి ఆదిలో నిరాకరించేవారు. ఈ కొవిడ్‌ 19 ‌కూడా ఒక ఇన్‌ఫ్లుయొంజా. కరోనా కుటుంబంలోనిది. ఆ వైరస్‌ 1918‌లో, 1956లో, 1963లో వచ్చింది. స్పానిష్‌ ‌ఫ్లూ తరువాత వచ్చిన ఇన్‌ఫ్లుయొంజాలు తిరగబెట్టలేదు. తిరగబెట్టినా తీవ్రత తక్కువ. అసలు ఇన్‌ఫ్లుయొంజాను నివారించే వ్యాక్సిన్‌ ఇం‌కా ప్రపంచానికి అందలేదు. అదే విషాదం.

విశ్వాన్ని కూడా కుదిపేసే వైరస్‌లతో మనిషి ఇలా కలసి ప్రయాణిస్తూ ఉండవలసిందేనా?
మనకి బాగా తెలిసిన వైరస్‌ ‌స్పానిష్‌ ‌ఫ్లూ. ఇది కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. అంతకు ముందు ఇలాంటివి సంభవించాయా, లేదా అనేది తేలవలసిన ప్రశ్న. పేర్లు పెట్టి ఉండకపోవచ్చు కానీ, జీవరాశులను సమూలంగా తుడిచిపెట్టేసిన పరిణామాలైతే ఉన్నాయి. డైనోసార్ల సంగతే చూడండి. అవి మిలియన్లలో ఉండేవని సైన్స్ ‌చెబుతుంది. ఇండియా, చైనా సహా ప్రపంచమంతా సంచరించిన జంతువులవి. మన ఆదిలాబాద్‌లో కూడా అవి తిరిగాయని కనుగొన్నారు. అవన్నీ ఏమైనాయి? వాటి అదృశ్యం మీద కొన్ని సిద్ధాంతాలు ఉన్నా, ఇలాంటిదే ఏదో వైరస్‌ ‌వచ్చి మరణించి ఉంటాయని కూడా అనుకోవచ్చు. యుద్ధాల కోసం జనసమూహాలు ఆది నుంచి అంతమై పోతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో ఇలాంటి వైరస్‌లు తోడవుతూ ఉన్నాయి. వైరస్‌ ‌తరువాత వైరస్‌ ‌తన లక్షణాన్ని మార్చుకుంటూ, శక్తిని పెంచుకుంటూ దాడి చేస్తున్నాయి. వైద్యరంగాన్ని కకావికలు చేస్తూనే ఉన్నాయి. కొత్త జీవనశైలి కూడా ఇందుకు దోహద పడుతూనే ఉంది. ఈ వలయంలో దేనిని ఆపగలం? కాబట్టి ఈ పోరాటం కొనసాగు తూనే ఉండొచ్చు.
——————————————————————————————————————–

వ్యాక్సిన్ కోసం విశ్వవ్యాప్తంగా కృషి

ప్రపంచ వ్యాప్తంగా 214 దేశాలు నిరీ క్షిస్తున్న వ్యాక్సిన్‌ అది. కొవిడ్‌ 19 ఇన్ని దేశాలలో వ్యాపించి ఉంది. దీని వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్‌ను కనుగొనడం ఒక్కటే మార్గం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ఏడుగురు మానవుల మీద ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశారు. ఏ వ్యాక్సిన్‌ అయినా మూడుదశల పరీక్షల తరువాత వినియోగం లోకి అనుమతిస్తారు. వాటిని క్లినికల్‌ ‌లేదా మానవుల మీద జరిపే పరీక్షలు అంటారు. అయితే కరోనా వైరస్‌ ‌తీవ్రతను బట్టి శాస్త్ర వేత్తలు కొంత అడ్డదారిని ఆశ్రయించిక తప్పడం లేదు. భారత్‌లో ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ ‌కనుగొనే పనిలో ఉన్నాయి. ఇందులో కొన్ని స్వంతంగా చేస్తున్నవి, మరికొన్ని ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలసి చేస్తున్నవి. వ్యాక్సిన్‌ ‌కోసం పని చేస్తున్న సంస్థలు, పురోగతి గురించి…
ఎడి5-ఎన్‌సిఒవి
ఈ వ్యాక్సిన్‌ ‌చైనాలోని క్యాన్‌సినో బయోటెక్‌ ‌పరిశోధక సంస్థ, పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ సంయుక్తంగా రూపొందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మనుషుల మీద ప్రయోగించే దశకు వచ్చిన వ్యాక్సిన్‌గా దీనిని పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం రెండోదశ క్లినికల్‌ ‌ప్రయోగాలలో ఉంది. అయితే ఇది వచ్చే ఏడాదికే ప్రపంచ ప్రజలకు అందుతుందని అంచనా.
పికోవాక్‌
‌దీనిని సినోవాక్‌ అనే చైనా ప్రైవేటు సంస్థ రూపొందిస్తున్నది. ఇది ఒకటి, రెండు దశల ప్రయోగాల స్థాయిలోనే ఉంది. అయితే నాలుగు మాసాలలోనే అందుబాటులోకి రావచ్చునని అంచనా.

చాడోక్స్ 1
‌దీనిని బ్రిటిష్‌ ‌శాస్త్రవేత్తలు రూపొందింస్తు న్నారు. ఇది కూడా చైనాలో తయారవుతున్న ఎడి5-ఎన్‌సిఒవి తరహాలోనిదే. ఇది కూడా 1/2 ప్రయోగ దశలలో ఉంది. ఈ వ్యాక్సిన్‌ ‌తయారీ వెనుక ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం ఉంది. అయితే వీరు వ్యాక్సిన్‌ను పెద్ద సంఖ్యలో తయారు చేయడానికి ఆర్డర్లు ఇచ్చారు. ఇలా ఆర్డర్లు ఇచ్చిన సంస్థలలో పుణేకు చెందిన సిరం ఇన్‌స్టిట్యూట్‌ ‌కూడా ఉంది. సెప్టెంబర్‌ ‌నాటికి పది లక్షల డోస్‌లు తయారు చేయాలని సంకల్పం. అయితే క్లినికల్‌ ‌పరీక్షలలో ఇది విఫలమైతే ఆ డోస్‌లన్నీ వ్యర్థం. అయినా నమ్మ కంతో ఆర్డర్‌ ఇచ్చారు. పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ ‌వచ్చే సంవత్సరం మేకి మాత్రమే సాధ్యమన్న వాదన ఉంది. కానీ అంతకు ముందే అత్యవసర వినియోగం కోసం వ్యాక్సిన్‌కు ఒక రూపం రావచ్చునని అంచనా.
ఇనో-4800
దీనిని అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ ‌రూపొందించింది. ప్రయోగాలకు సంబంధించి తొలి దశలోనే ఈ వ్యాక్సిన్‌ ఉం‌ది.
ఎంఆర్‌ఎన్‌ఎ-1273
‌దీనిని అమెరికాకు చెందిన మోడర్నా తయారు చేస్తున్నది. ఇది కూడా ఇనో – 4800 తరహా లోనిదే. ఈ వ్యాక్సిన్‌ ‌రెండో దశ ప్రయోగాలు రెండు మూడు మాసాలలో మొదలుకానున్నాయి.
బిఎన్‌టి 162
జర్మన్‌ ‌సంస్థ బయో ఎన్‌టెక్‌, అమెరికా సంస్థ పిఫిజర్‌ ‌సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ ‌కోసం కృషి చేస్తున్నాయి. ఇది నాలుగు వ్యాక్సిన్ల సమాహారం. ప్రస్తుతం జర్మనీలో ఒకటి, రెండు దశ పరీక్షలు జరుపుతున్నారు. కొన్ని పరీక్షలు అమెరికాలో కూడా జరుపుతారు. ఇది అందుబాటులోకి రావడానికి ఒక ఏడాది కాలం పడుతుందని అంచనా.

———————————————————————————————————————————

ఐదు మాసాలలో పుణేలోనే వ్యాక్సిన్‌
‘‌కొవిడ్‌ 19 ‌నిరోధక వ్యాక్సిన్‌ ‌వచ్చే సెప్టెంబర్‌, అక్టోబర్‌ ‌కల్లా సిద్ధమవుతుంది. అప్పుడే పుణేలోని సిరం ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుంది’ అన్నారు చంద్ర దత్తా. ముప్పయ్‌ ‌నాలుగు సంవత్సరాల చంద్ర దత్తా భారతీయ మహిళ. ప్రస్తుతం ఈమె ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ ఎస్యూరెన్స్ ‌మేనేజర్‌గా పని చేస్తున్నారు. అంటే ఆక్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కొవిడ్‌ 19 ‌నిరోధక వ్యాక్సిన్‌ ‌కనుగొనే యజ్ఞంలో ఆమె కూడా పని చేస్తున్నారు. ఏప్రిల్‌ 22 ‌ప్రాంతంలో వ్యాక్సిన్‌కు హ్యూమన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్‌ ‌పూర్తి చేసుకున్న సంగతిని కూడా ఆమె చెప్పారు. చంద్ర కోల్‌కతాలోనే బయో టెక్నాలజీలో బీటెక్‌ ‌చదివారు. తరువాత ఎంఎస్‌సి బయో సైన్స్ ‌కోసం 2009లో ఇంగ్లండ్‌ ‌వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ ఎస్యూరెన్స్ అధికారిగా చేరారు. పరిశోధనలలో నాణ్యత గురించి ఆమె శ్రద్ధ వహిస్తారు. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ ‌తయారు చేయడానికి నాలుగేళ్ల వరకు పడుతుంది. కానీ కరోనాకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్‌ను సిద్ధం చేయగలిగామని ఆమె చెప్పారు. కరోనా మీద ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు అక్కడ తయారు చేశారు. మరొక వేయి వ్యాక్సిన్లు కూడా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ తరువాత భారీ ఉత్పత్తి ఆరంభిస్తారు.

About Author

By editor

Twitter
YOUTUBE