– సాయిప్రసాద్
కొవిడ్ 19 ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దివాళా తీసే స్థితికి చేరుకున్నారు. బ్యాంకుల్లో మొండిబాకీలు పెరిగిపోయాయి. నిరుద్యోగం, పేదరికం గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కార్మికులు, కర్షకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశాలున్నాయి.. ప్రస్తుతం ఏ చానల్ పెట్టినా, ఏ పత్రిక చదివినా ఇటువంటి కథనాలే మనకు దర్శనమిస్తున్నాయి.
అంతేకాదు, ఆర్థిక అంశాలపై నిత్యం ఎన్నో చర్చలు సైతం జరుగుతున్నాయి. లాక్‌డౌన్ మన ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేశంలో దాదాపు యాభై రోజులుగా కార్యకలాపాలన్నీ నిలిచిపోయినప్పుడు ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. అంతమాత్రాన ఇది నిరాశ, నిస్పృహలకు గురి చేసే పరిస్థితిగా మనం భావించరాదు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న కొంతమంది నాయకులు, మేధావులు ఈ విషయంలో అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ సామాన్యులను ఆందోళనలకు గురిచేస్తున్నారన్నది వాస్తవం.
2020-21 తొలి త్రైమాసికంలో భారత ఉత్పాదక రంగం 40 మాసాల కనిష్ఠానికి పడిపోయిందని కొందరు పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో మన ఉత్పత్తి రంగం మామూలు స్థితికి చేరుకునేందుకు అనేక సంవత్సరాలు పడుతుందని మరికొందరు చెబుతున్నారు. దేశంలోని దాదాపు 19 రంగాలు పూర్వస్థితికి చేరుకోవడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఉత్పత్తి రంగంలో కార్మికుల కొరత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల పరిశ్రమలు మూతపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొంతమంది నిపుణులు, మేధావులు కావాలనే ఇటువంటి నివేదికలు రూపొందించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాదనలు వినిపించేవారు పొంతనలేని గణాంకాలను, తమకు అనుకూలమైన గణాంకాలను వల్లిస్తూ తాము చాలా పరిశోధన చేసి, ఆ తరువాతనే తమ అభిప్రాయాలు చెబుతున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వమని, ఆర్థిక సాయం అందించమని కోరే వారికి కొదువే లేదు. ఎవరికి తోచినది వారు కోరటం, ప్రసార మాధ్యమాలు వారికి ప్రచారం కల్పించటం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అంతగా ప్రచారం కల్పించని మాధ్యమాలు చేయని ప్రకటనల గురించి, ప్యాకేజీలు కోరే వారి గురించి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. వీటిని ఎవరు చేయిస్తున్నారో, ఆ మాధ్యమాల వెనుక ఎవరున్నారో కొందరికి తెలిసినా వర్తమాన పరిస్థితులలో వారు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు.
ప్రభుత్వం రెండో విడత ఉద్దీపన ప్యాకేజీపై కసరత్తు చేస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని రంగాల వారు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఎఫ్‌ఐసిసిఐ అధ్యక్షులు డా. సంగీతారెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలతో ప్యాకేజీని కోరారు. ఈ మధ్య వార్తలలో నిలిచిన జెఎన్‌యుకి చెందిన ఆర్థిక ప్రణాళికా విభాగానికి చెందిన ప్రొఫెసర్ భిశ్వజిత్‌ధర్ ఏకంగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించాలని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పూర్వ కార్యదర్శి ఎస్.సి.గర్గ్ 10 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని అంచనా వేశారు. జెఎన్‌యుకే చెందిన సెంటర్ ఫర్ రీజినల్ డెవలప్‌మెంట్ పూర్వ అధ్యక్షులు రవి శ్రీవాస్తవ ఏకంగా 111 లక్షల కోట్లతో వచ్చే అయిదు సంవత్సరాలకు ప్రణాళిక రూపొందించి ఖర్చు చేయాలన్నారు. అసోచామ్ అధ్యక్షులు నిరంజన్ హిరనందని 13 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కోరారు. భారత పర్యాటక ఆతిథ్య సంఘాల సమాఖ్య ఒక్క పర్యాటక రంగం నష్టాన్నే 10 లక్షల కోట్లుగా అంచనా వేసి ఈ రంగానికి తగిన ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఏకంగా నూతన బడ్జెట్‌ను రూపొందించి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. అంతేకాదు రక్షణ రంగ కేటాయింపులపై పునఃసమీక్షించాలని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ఇది తగిన సమయం కాదని, వలస కార్మికుల సమస్యే ప్రస్తుతం ప్రధానమని.. వారిని ఆదుకోవటమే లక్ష్యంగా నూతన బడ్జెట్ రూపొందించాలని కోరారు. మరొక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ప్రభుత్వం అదనపు పన్నులు వసూలు చేయకుండా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాలని పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త ఒకరు ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి విరాళాలు తీసుకోకుండా పన్ను రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరారు. ఇలా అనేక మంది ప్రముఖులు, ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ప్రభుత్వం వారి అభిప్రాయాలను ఎంత వరకు స్వీకరిస్తుందో చెప్పలేం. అయితే ఇటువంటి ఉద్దీపనలు సాధ్యమా? ఒకవేళ సాధ్యమైతే ఆ భారం ఎవరిపై పడుతుంది? ఈ ప్రభావం మున్ముందు మన ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్న సంగతి ఆ ప్యాకేజీలు కోరే వారికి తెలియదని అపోహ పడవలసిన అవసరం లేదు. ఆ డిమాండ్లు సాధ్యంకావన్న సంగతి వారికీ తెలుసు. అయినా కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే వారు ఇదంతా చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి వాదనలలో వాస్తవాలను ముందుగా తెలుసుకుంటే వీరి అంతరంగం అర్థమవుతుంది. ఇన్ని రోజుల లాక్‌డౌన్ వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని, ఆకలి చావులు గణనీయంగా ఉండబోతున్నాయని ఇటువంటి మేధావులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది అవాస్తవమని వారికి కూడా తెలిసే ఉంటుంది. మనదేశంలో లాక్‌డౌన్ విధించే సమయానికి అనేక రాష్ట్రాల్లో రబీ పంట కోత దశలో ఉంది. కాబట్టి వ్యవసాయ పనులకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా లాక్‌డౌన్ అమలు చేసిన విషయం గుర్తించాలి.
2019-20లో మన ఆహార ఉత్పత్తి 298.3 మిలియన్ టన్నులకు చేరుకుని రికార్డు సృష్టించినట్లు అంచనా. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 14 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి అదనంగా వచ్చింది. ముఖ్యంగా వరి, గోధుమ వంటి ప్రధాన ఆహార పంటల్లో రికార్డు స్థాయి ఉత్పత్తులు వచ్చాయి. ఈ విషయం అందరికీ తెలిసినప్పుడు ఆ మేధావులకు, నిపుణులకు తెలియకుండా ఉండదు.
అంతేకాదు ఈ సంవత్సరం ఖరీఫ్ పంట కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి ఇంత పుష్కలంగా ఉన్నా కూడా ఆహార కొరత ఏర్పడబోతున్నదని మరి వారు ఎందుకు హెచ్చరిస్తున్నారో వారికే తెలియాలి. రబీలో 99 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా తాజా అంచనాల ప్రకారం 106 మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. అలాగే వరి కూడా అంచనాలకు మించి 117.5 మిలియన్ టన్నులు పండింది. పప్పులు, నూనె గింజల ఉత్పత్తి కూడా బాగానే వచ్చింది. మొత్తంమీద రబీలో ఆహార ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంది. దీనితో లాక్‌డౌన్ ప్రభావం ప్రధాన ఆహార పంటల ఉత్పత్తిపై పడలేదని స్పష్టంగా అర్థమవుతున్నది. పంటలను కొనడానికి అన్ని చోట్లా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌లో కూడా వ్యవసాయానికి ప్రత్యేక సడలింపులు ఇవ్వడం వల్ల 2020-21 ఖరీఫ్ పంటపై ఆ ప్రభావం ఏమాత్రం పడే అవకాశం లేదు. ఆహార ఉత్పత్తి బాగా ఉంటే ఆహార భద్రతా ఉన్నట్టే భావించాలి. అలాగే ఆకలిచావులు పెరిగిపోతున్నాయని ఈ మేధావులు చేస్తున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, ధార్మిక సంస్థలు చేస్తున్న సేవాకార్యక్రమాల వల్ల ఆకలి మరణాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి.
ఆహార ఉత్పత్తి జరిగితే సరిపోతుందా? దానిని సక్రమంగా వితరణ చేయగలగాలి. ప్రజలలో కొనుగోలు శక్తి ఉన్నప్పుడే ఆకలి చావులు ఉండవు కదా? అని ఎవరైనా వాదించవచ్చు. నిజమే, కానీ గతంలో కంటే మన వితరణ వ్యవస్థ మెరుగుపడింది కాబట్టి ఆహారం విషయంలో ఆందోళన చెందవలసిన పని లేదు. ప్రజలు తమ కొనుగోలు శక్తిని క్రమంగా పెంచుకుంటున్నారన్నది వాస్తవం. మనదేశంలో ఎక్కువ శాతం ప్రజలు అసంఘటిత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి, వారు చేస్తున్న వృత్తుల గురించి, ఆదాయ, వ్యయాల గురించి సమగ్రమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదనే విషయం ఈ మేధావులకి తెలుసు. సమగ్ర సమాచారం లేదు కాబట్టి గృహస్థుల సర్వేలు నిర్వహించి వారి స్థితిగతులను ప్రభుత్వ శాఖలు అంచనా వేస్తాయి. అయితే ఈ సర్వేలు నిర్వహించనీయకుండా గత కొంతకాలంగా ఎవరు అడ్డుపడుతున్నారో ఒకసారి ఈ మేధావులు, నిపుణులు ఆలోచించాలి. అసంఘటిత రంగానికి సంబంధించి తాజా సమాచారం ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి గోరంతను కొండంతలు చేస్తూ ప్రచారాలు సాగిస్తున్నారు. మనదేశంలో నిరుద్యోగం గత సంవత్సరానికే రికార్డు స్థాయికి పెరిగిందని, లాక్‌డౌన్ వల్ల అసంఘటిత రంగంలోని కార్మికులు నిరుద్యోగులుగా మారారని, దీంతో ఆకలిచావులు పెరిగాయని ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నారు.
అసంఘటిత రంగం లాక్‌డౌన్ వల్ల నష్టపోవటం వాస్తవం. ఎందుకంటే వారిలో చాలా మంది లాక్‌డౌన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. అంతమాత్రాన వాళ్లు పూర్తిగా దివాళ తీశారని, నిరుద్యోగులుగా మారిపోయారనడం అతిశయోక్తిగానే భావించాలి. మనదేశంలో అసంఘటిత రంగంలో ఉన్నవారికి అపారమైన శక్తియుక్తులున్నాయి. ఆ విషయాన్ని విస్మరించరాదు. ఇలాంటి ఒడిదుడుకులు వారు అనేకం చూశారు. వారిలో తిరిగి తమ కార్యకలాపాలను త్వరితంగా కొనసాగించే సత్తా ఉంది. క్లిష్ట సమయాల్లో అవకాశాలను వెతుక్కొనే నేర్పు ఉంది. ఓటమిని అంగీకరించకుండా సమస్యలతో పోరాడే పటిమ ఉంది. మార్కెట్‌పై అవగాహన ఉంది. ఇలా చెబుతూ పోతే వారి శక్తియుక్తులు వర్ణనాతీతం. కష్టనష్టాలకు ఏమాత్రం భయపడకుండా మనుగడ కొనసాగించే వీరి నైజం గురించి అవగాహన లేని వారే అపోహలు సృష్టిస్తూ వారి శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. వాస్తవానికి లాక్‌డౌన్ తరువాత వేగంగా పుంజుకొనే రంగాల్లో అసంఘటిత రంగమే ముందుంటుందన్నది ఒక అంచనా.
(సశేషం)
వ్యాసకర్త: ప్రముఖ ఆర్థిక నిపుణులు