– టిఎస్ వెంకటేశన్
త్యాగరాజస్వామి రాముడు పేరు చెప్పి అడుక్కుతినేవాడంటూ ఈ మధ్య ఓ సినీనటుడు చెత్త వాగుడు వాగాడు. ఎప్పుడో పుట్టిన త్యాగరాజస్వామి మీద కూడా ఇలాంటి నీచమైన వ్యాఖ్య చేయాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం, మనం అన్నమే తింటున్నామన్న స్పృహ మనుషులుకు ఉండవద్దా? ఆ నటుడికి సంగీతం, దాని గొప్పతనం తెలియక కాదు. కానీ ఈ మధ్య రాజకీయాలలో చేరిన ఫలితంగా, ఓట్లు దండుకోవడానికి ఇలాంటి క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలి ఒక ఉపఎన్నికలో కలిక్కానిక్కూడా రాని ఫలితంతో మరింత గంగవెర్రలెత్తిన మనిషిలా ఇతడు కనిపిస్తున్నాడు. ఇలాంటి వైఖరికి కారణం- ద్రవిడ ఉద్యమ ప్రభావం. అది మిగిల్చిన కుళ్లు. ఐదేళ్ల అధికారం కోసం వేల ఏళ్ల ధర్మాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడని విధ్వంసక ధోరణిని కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో ఆచారంగా మార్చుకున్నాయి. ఇందులో అగ్రస్థానం ద్రవిడ పార్టీలదే. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇదే బాటలో నడుస్తున్నాయి.
నిజానికి ద్రవిడ నీచ రాజకీయాల కారణంగా తమిళనాడులో హిందూత్వం ఎన్ని అవమానాల పాలైందో చరిత్ర చూస్తే తెలుస్తుంది. రామసేతు ఆనవాళ్లు తుడిచి వేయడానికి డీఎంకే చేయని ప్రయత్నం లేదు. ద్రవిడ పార్టీలు, అందులోను కరుణానిధి అనే అధమ రాజకీయవేత్త, ఆయన కుమారుడు స్టాలిన్ బుజ్జగింపు, నేరపూరిత రాజకీయాలు, కమ్యూనిస్టులు, వీరికి తోడు క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మతోన్మాదులు కుమ్మక్కయ్యి అక్కడ హిందుత్వకు కువ్యాఖ్యానాలు చెప్పడం, వాళ్ల జుగుప్సాకరమైన మనస్తత్వాన్ని బయటపెట్టు కోవడం కొత్త కాదు. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న. వీళ్లంతా హిందుత్వను అడ్డు పెట్టుకుని భారతదేశాన్ని అవమానించదలుచుకున్నారా? ప్రతిష్టను దిగజార్చడమే ధ్యేయంగా నడుస్తు న్నారా? ఈ దేశ సమైక్యతకు భంగం కలిగించ దలుచుకున్నారా? ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలను అవమానించడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే అందుకు ఔననే సమాధానం వస్తోంది. కన్యాకుమారిలో భారతమాత ప్రతిమను పోలీసులతో కలసి ఈ దుష్ట రాజకీయ మూకలు అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. పులియూర్ అనే గ్రామంలో ఒక ఆలయ ప్రాంగణంలో ఉన్న భారతమాత ప్రతిమ తమ మనోభావాలను గాయపరిచేటట్టు ఉన్నదనీ, కాబట్టి తొలగించాలనీ కొన్ని మిషనరీలు ఉసిగొల్పడంతో కొందరు క్రైస్తవులు గగ్గోగోలు చేశారు. మరొకమాట లేకుండా పోలీసులు ఠంచనుగా భారతమాత విగ్రహాన్ని ఒక గుడ్డతో మూసేశారు. అక్కడ నుంచి తొలగించాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆలయ కమిటీకి హుకుం జారీ చేశారు.
కన్యాకుమారిలోని అగతీశ్వరం తాలూకా పులియూర్ గ్రామంలో ఇస్సాకి అమ్మణ్ ఆలయానికి రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. త్రివర్ణ పతాకం నమూనాతో కూడిన చీర ధరించినట్టు నిర్మించిన భారతమాత విగ్రహం ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఆలయం, ప్రాంగణం వ్యక్తుల సొంత ఆస్తి. ఈ విగ్రహాన్ని ఇటీవలనే ఒక కుటుంబం అక్కడ ప్రతిష్టించింది. ఆ కుటుంబమే కాకుండా, గ్రామ ప్రజలు కూడా భారతమాతను పూజించుకుంటున్నారు. హఠాత్తుగా పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ భాస్కరన్ ఆ విగ్రహం గుడ్డతో కప్పవలసిందని ఆదేశాలు ఇచ్చాడు. మే 21వ తేదీన అదే చేశారు. స్థానిక ఎస్‌ఐ రంగంలోకి దిగి ఆ విగ్రహాన్ని కప్పించి, అక్కడ నుంచి తొలగించా లని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిం చాడు. ఆ ప్రాంతంలోనే ఉండే క్రైస్తవులు కొందరు మిషనరీలు రెచ్చగొట్టడంతో, ఆ విగ్రహం అక్కడ ఉండడం తమ మనోభావాలకు భంగకరమని భావించారు. అంతే. దీనికి పటిష్టమైన ఫిర్యాదు, పద్ధతి ఏదీ లేదు.
ఈ సంగతి తెలుసుకున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మున్నని కార్యకర్తలు మే 22న అక్కడికి చేరుకున్నారు. మొదట భారత మాత విగ్రహాన్ని కప్పిన గుడ్డను తొలగించారు. విగ్రహానికి దండ వేసి, పూజలు చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధర్మరాజ్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. హిందూ మున్నని జిల్లా నాయకుడు మిసా సోమన్ ఈ దుశ్చర్య పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం గురించి గ్రామాధికారి, లేదా ఇతరులు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే ఒక చిన్న క్రైస్తవ ముఠా కోరగానే భారతమాత విగ్రహాన్ని ఇలా అవమానించడం దారణమని ఆయన అన్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారో చెప్పాలని వీరంతా గట్టిగా అడిగినప్పుడు పోలీసులు మౌనం దాల్చవలసి వచ్చింది. ఈ సంస్థల సభ్యులంతా జిల్లాలో 18 చోట్ల ఈ దుశ్చర్యకు నిరసన కూడా తెలియచేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ‘మా పట్టా భూమిలో విగ్రహం ఉంది. ఈ విగ్రహంతో ఎలాంటి అశాంతి చెలరేగలేదు. శాంతిభద్రత లకు విఘాతం కలగలేదు. ఎలాంటి మతఘర్షణలు కూడా జరగలేదు. ఆ ఆలయాన్ని మా పూర్వీకులు నిర్మించారు. మేం ఇప్పుడు బాగోగులు చూసుకుంటున్నాం’ అని వివరిస్తూ ఆలయ నిర్వహణలో ఉన్న కుటుంబానికి చెందిన టి. ముత్తుకుమార్ జిల్లా కలెక్టర్‌కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను పొందు పరిచారు కూడా. భారతమాత విగ్రహాన్ని ఇంత ఘోరంగా అవమానించిన ఆ డీఎస్పీ మీద మేం కేసు పెడతామని హిందూ మున్నని మరొక నాయకుడు ఆనంద్ తెలియచేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు అక్కడి పోలీసులు ఎంత పక్షపాత వైఖరితో ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ పోలీసులు క్రైస్తవ మిషనరీల కోసం పని చేస్తున్నారా? లేకుంటే సాధారణ ప్రజల కోసమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ లంచగొండి పోలీసుల వల్ల గతంలో ఇక్కడ పని చేసిన విల్సన్ అనే మంచి ఎస్‌ఐని ముస్లిం ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని కూడా వారు చెబుతున్నారు. ఆ ఊరి చెక్‌పోస్ట్ దగ్గరే ఎస్‌ఐ దుర్ఘటన జరిగింది.
తమిళనాడులో హిందూ దేవుళ్లను, ఆలయాలను, ఆచారాలను అవహేళన చేసే వికృత చేష్టలు కొన్ని దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వీటికే పురోగమన వాదమనీ, శాస్త్రీయ దృక్పథమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేర్లు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా ఏవీ ఇందుకు మినహాయింపు కాదు. ఇక ద్రవిడవాదంతో పిచ్చి ముదిరిన నాయకుల వాగుడుకు అంతే ఉండదు. అయితే ఏనాడూ కూడా ఈ దుష్ట సంస్కృతి మీద పోలీసులు కేసు పెట్టిన పాపాన పోలేదు. ఎవరైనా హిందువు ఇలాంటివి సహించలేక గొంతు విప్పితే, ఏ మైనారిటీ వాడో ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణం స్పందించి కేసు పెట్టడం కూడా రివాజు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ‘తమిళనాడులో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో ఉంది. ఇక్కడ సంఘ్ లేదా బీజేపీ వారి భావ ప్రకటన స్వేచ్ఛకు విలువే లేదు’ అని వ్యాఖ్యానించారు హిందూ మున్నాని నాయకుడు కె. కంత్రలాంథన్. కరోనా సమయంలో ముస్లింలు, క్రైస్తవులు నిబంధనలకు విరుద్ధంగా సామూహిక మత ప్రార్థనలు చేశారు. సామాజిక దూరం మాటే లేదు. అదే సమయంలో హిందూ ఆలయాలలో మాత్రం పూజాపునస్కారాలకు అనుమతి ఇవ్వడం లేదు. లాక్‌డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న హిందువులకు జావ పంచిపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీశ్‌ను హిందు నాయకులు కోరారు. కానీ ఆ విజ్ఞాపనను అందుకోవడానికి ఆమె వారిని అనుమతించ లేదు. సామాజిక దూరం పాటించవలసి ఉన్నందుకు వీరిని కలుసుకోవడం లేదని ఆమె ప్రకటించారు. కానీ మే నెల 12న కాలక్కాడ్ జమాత్ సభ్యులు వస్తే ఆమె లోపలికి అనుమతించారు. రంజాన్ సందర్భగా ప్రజలకు ఏవో వస్తువులు పంచడం గురించి అనుమతి కోసమే ఆ వర్గం కూడా వచ్చింది. ఇది మన సెక్యులరిజం. వీళ్లూ మన సెక్యులర్ అధికారులు.
తబ్లిఘి జమాత్‌తో జరిగిన కరోనా వ్యాప్తి మీద వ్యాఖ్యలు, పోస్టులు పెట్టిన 1500 మంది మీద ఇప్పటికే కేసులు నమోదైనాయి. వీరిని లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత అదుపులోకి తీసుకుంటారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా కూడా సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ లేదా సంఘ్ అనుబంధ సంస్థల వారే. అయితే భారత ప్రధాని మీద, హోం మంత్రి మీద పలువురు ముస్లింలు చేసిన వ్యాఖ్యలు, చంపుతామంటూ చేసిన హెచ్చరికల గురించి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. వీటి గురించి మాత్రం ఎలాంటి నిర్ణయం జరగ లేదు. తాజా వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న కన్యాకుమారి జిల్లాలో ప్రస్తుతం క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. తరువాత ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. 1980లో ఈ జిల్లాలోనే అత్యంత హేయంగా మందైకాడు అనే గ్రామంలో సామూహిక మతాంతరీకరణలు జరిగాయి. దీనికి అనేక హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. రోజురోజుకీ ఒక అంశం తిరుగులేకుండా రుజువు అవుతున్నది. ఈ దేశంలో హిందుత్వ మీద వ్యతిరేకత పేరుతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరగుతున్నాయి. ఇవి బాహాటంగా సాగించే రోజులు ప్రాప్తిస్తున్నాయి.
(ఆర్గనైజర్ సౌజన్యంతో)