అలారం పెట్టుకుని లేచినట్టు, ఓ టైంటేబుల్‌ ఏర్పాటు చేసుకున్నట్టు, వేదిక మీదకొచ్చి డైలాగులు అప్పచెప్పేసి నిష్క్రమించినట్టు ఉంటున్నాయి రాహుల్‌ ‌గాంధీ ప్రకటనలు. విషయం ఏమిటి? కొవిడ్‌ 19. ‌మహా మహమ్మారి. భలే భలే హావభావాలతో, దట్టంగా గాంభీర్యం అద్ది, ఆవేదనకు అదే చిరునామా అన్నట్టు ముఖం పెట్టి ప్రధాని నరేంద్ర మోదీనే లక్ష్యంగా విమర్శలు లంఘించుకుంటున్నారాయన. లాక్‌డౌన్‌ ‌యుగం గురించి ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ మన లెఫ్ట్ ‌చరిత్రకారుల పరిశోధనలకి ఏమీ తీసిపోవు. వాస్తవాలు ఎక్కడ దాక్కున్నాయో కాగడా వేసి వెతుక్కోవాలి.

రాహుల్‌ ఒలకబోసే గాంభీర్యానికీ, విరివిగా చిందించే ఆ ఆవేదనకీ ఎక్కడా పొంతన కుదరనట్టే, ఆయన విమర్శలకి శుద్ధీ శ్రుతీ ఉండవు. మే 26 తరువాత 28వ తేదీలలో మీడియాతో, మరో ఇద్దరు శాస్త్రవేత్త లతో సాగించిన సమావేశాలూ, చేసిన విమర్శలే చూడండి! నాలుగుసార్లు విధించారు లాక్‌డౌన్‌, అన్నీ విఫలమే అని ఒక్కమాటతో తేల్చేశారు కాంగ్రెస్‌ ‌పార్టీ నేత కాని నేత రాహుల్‌. ఎం‌దుకట! వైరస్‌ ‌వీర విహారం చేస్తున్న సమయంలో నిబంధనలు ఎత్తేయడమంటే విఫలం కావడం కాక మరేమిటి అని లెక్క తేల్చా రాయన. వైరస్‌ ‌విజృంభిస్తున్న సమయంలో ఆంక్షలు ఎత్తివేసిన దేశం బహుశా ప్రపంచంలో భారత్‌ ఒక్కటే అంటూ ఎలాంటి శషభిషలు లేకుండా ఢంకా బజాయించారు. ఈ ప్రకటనకి జాతి యావత్తుకు మూర్చ వచ్చినంత పనయింది. కాబట్టి, మే 31 వరకు దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందన్న సంగతి యువరాజుగారికి తెలియదని అనుకోవాలి. అప్పటికే మరొకసారి, అంటే, ఐదోసారి కూడా కేంద్రం లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చేశాయి. వాటి సంగతీ ఆయనకు తెలియదేమో! లాక్‌డౌన్‌ ‌ద్వారా ఏం సాధించాలని మోదీ అనుకున్నారో అది సాధ్యం కాలేదని కూడా రాహుల్‌ ‌తీర్పు ఇచ్చారు.
ఆన్‌లైన్‌ ‌మీడియా సమావేశం కాబట్టి, ప్రశ్నలతో పెద్దగా గొడవ ఉండదు కాబట్టి, తాను ఏది చెబితే అది, ఎంతసేపు చెబితే అంతసేపు వినడమే అవతలి వారికి ప్రాప్తిస్తుంది కాబట్టి రాహుల్‌ ‌గారు జాతిని తన అభిప్రాయాలతో మరొకసారి చావగొట్టేశారు. అజ్ఞానంతో దిమ్మెరపోయేటట్టు చేశారు. వైరస్‌ ‌వీర విహారం చేస్తే మోదీ గారి ప్లాన్‌ ‌బి ఏమిటి? కేంద్రం వలస కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలని అనుకుంటున్నది? అంటూ యావత్‌ ‌జాతి డంగైపోయేటట్టు ప్రశ్నల వర్షం కురిపించేశారు. అసలు వైరస్‌ ‌గురించి రాహుల్‌ అవగాహనే పెద్ద ప్రశ్నార్థకమని ఆయన నోరెత్తిన ప్రతిసారి రుజువవుతూనే ఉంది. అంటే ఒక్క ప్లాన్‌ ‌కూడా ఏదీ లేని కాంగ్రెస్‌ ‌పార్టీ, ఆ పార్టీలో నేత కాని నేత రాహుల్‌ ‌ప్లాన్‌ ‌బి గురించి నిలదీయడం వింత కాదూ మరి! ప్రతి పేదవాని చేతులోను, ప్రతి వలస కార్మికుడి చేతులోను, పేద రైతన్న చేతులోను తక్షణమే, నేరుగా రూకలు కుమ్మరించాలని కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తహతహలాడిపోతున్నారట. కానీ ఏం లాభం? మోదీగారు రూకైనా రాలిస్తే కదా అని ఆడిపోసుకున్నారు రాహుల్‌. అత్త సొమ్ము అల్లుడు దానం చేసే పక్రియ అంటే కాంగ్రెస్‌కు ఆది నుంచి ఆసక్తి ఎక్కువే. ప్రజల చేతికి నేరుగా డబ్బు ఇవ్వకుంటే, ఉత్పాతాలు వస్తాయని శాపనార్థాలు సంధించారు. ప్రజలకీ, పరిశ్రమలకీ నేరుగా డబ్బులు అందివ్వని పక్షంలో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని జోస్యం కూడా చెప్పారు. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మరింత ప్రమాదకరంగా రెండో దశ వైరస్‌ ‌వచ్చేస్తుంది అన్న నిగూఢ రహస్యాన్ని, ఇంతవరకు ఏ నరమానవుడూ పసిగట్టలేకపోయిన సంగతిని ఈ జాతికి చెప్పి తరింపచేశారు. మరి, మహారాష్ట్రలో కొవిడ్‌ 19 అరేబియా సముద్రంలా ఎగసిపడుతోంది కదా అంటే, అక్కడ మేమేమీ నిర్ణయాధికారులం కాదు కదా అని చల్లగా జారుకున్నారు రాహుల్‌. ఇక శరద్‌పవార్‌ అనే నాలుగు జిల్లాల జాతీయ మహానేత ఈ లాక్‌డౌన్‌ ఎత్తేస్తావా లేదా అంటూ నిత్యం ఒక కత్తి పట్టుకొచ్చి ఉద్ధవ్‌ ‌పీక మీద పెడుతూనే ఉన్నారట. యాభయ్‌ ఐదు వేల కేసులు, నిత్య కేసుల ఖాతా కూడా వేయికి సమీపిస్తున్న తరుణం. అయినా ఆ పెద్దాయన లాక్‌డౌన్‌ను ఎత్తేయవలసిందేనని పీక మీద నుంచి కత్తి తీయడం లేదు.
కరోనా కంటే కఠినమైన లాక్‌డౌన్‌ ‌వల్లే ఎక్కువ చావులు సంభవించే అవకాశం ఉందని స్వీడన్‌లో ఉండే యూరోపియన్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌ప్రివెన్షన్‌ అం‌డ్‌ ‌కంట్రోల్‌ ‌మాజీ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ‌జాన్‌ ‌గినెక్‌ ‌వ్యాఖ్యానించాట్ట. ఆయన సంగతి ఇక్కడెందుకు అన్న సందేహం ఇక్కడే రావాలి. వస్తుంది కూడా. జాతి శ్రేయస్సును ఆకాంక్షించి రాహుల్‌ ఆయనతో మాట్లాడాడు. అందువల్ల జాతికి మహోపకారం ఒకటి జరిగింది. అది ప్రధానం. రాహుల్‌, ‌గినెక్‌ ‌మాట్లాడుకోవడంతోటే కొవిడ్‌ 19 ‌పత్తా లేకుండా పోయిందని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. మరి ఏమిటా మహోపకారం? ‘యూరప్‌లో ఏ ఒక్క దేశం కూడా ముందస్తు కసరత్తు చేసి లాక్‌డౌన్‌ ‌ప్రకటించినట్టు కనిపించడం లేదు. దీని నుంచి బయటపడడం ఎలాగ అని ఇప్పుడు అందరూ అడుగు తున్నారు. భారత్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే ప్రమాదముంది’ అని కుండబద్దలు కొట్టేశారు. కాబట్టి లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంలో తొందరపడిపోయారని మోదీని ఆడిపోసుకోవడం ఎంత అవివేకమో పనిలో పనిగా జాతికి తేటతెల్లమైంది. అప్పటికి ప్రపంచం ఏం చేసిందో మోదీ అదే అనుసరిం చారు. ఇంతకీ ఈ బంగారపు పలుకులు రాహుల్‌కీ, ఈ దేశ మేధావులకీ చేరాయో లేదో?
ఇంత చక్కని వాగ్దాటి, ఇంతటి జ్ఞానతృష్ణ రాహుల్‌ ‌ప్రదర్శించిన తరువాత బీజేపీ వారికి ప్రేరణ కలగకుండా ఉంటుందా? ఈ జ్ఞానధార బీజేపీ మేధావులకు మేల్కొలుపు పాడకుండా ఉండగలదా? అందుకే కీలెరిగి వాత పెట్టేసిందా పార్టీ. లాక్‌డౌన్‌ ‌విఫల ప్రయోగమే అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు జరుపుతున్నట్టు? నేత కాని నేత కాబట్టి రాహుల్‌ ‌మాటంటే ముఖ్య మంత్రులు మరీ పూచికపుల్లతో జమ కడుతున్నారా? ఆయన అభిప్రాయం ప్రకారం లాక్‌డౌన్‌ ‌విఫలమైంది. సరైన సమయంలో విధించలేదు. రాహుల్‌ ‌గాంధీ గారి ఈ విమర్శలు విన్న తరువాత పై రెండు ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి. అలాంటిది సుప్రీంకోర్టులో న్యాయవాది, కేంద్రంలో న్యాయశాఖ మంత్రి, రాహుల్‌ ‌వలె రాజకీయాలను హాబీగా స్వీకరించ కుండా, పూర్తి సమయం రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌వంటి వారు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని భావించడంలో ఆశ్చర్యం లేదు. సరైన సమాధా నాలు ఇవ్వడానికి రాహుల్‌ ‌సరైన వ్యక్తి అవుతాడు కాబట్టి, ఆయననే అడిగి తెలుసుకోవాలనుకోవడం కూడా సబబే. అందుకే ఏం చేయాలో తమరే సెలవివ్వండని రాహుల్‌ను కోరారు, రవిశంకర్‌. ‌మహారాష్ట్రలో తాము విధాన నిర్ణేతలం కాదు కదా అంటూ అత్యంత హేయమైన తీరులో రాహుల్‌ ‌గాంధీ ముఖం చాటేశారు. ఆ కేసులూ చావులూ భాగస్వామికే సంబంధం తప్ప మాకేం సంబంధం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించి నట్టయింది. పాజిటివ్‌ ‌కేసులు యాభయ్‌ అయిదు వేలు దాటిపోయిన రాష్ట్రం గురించి నేత కాని నేతే కావచ్చు, కానీ గాంధీ నెహ్రూ వారసుడు కదా! ఇలాగేనా సమాధానం ఇవ్వడం? లేకపోతే సొంత రాష్ట్రాల ముఖ్య మంత్రులే ఖాతరు చేయనప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో విలువెక్కడ ఉంటుందని పరోక్షంగా నిజమే చెప్పారా?
ప్రపంచ అనుభవం, శాస్త్రవేత్తల అభిప్రాయం ఎలా ఉంటేనేం. ఏదైనా మోదీ మీద బురద జల్లడానికి పనికొస్తే చాలు కదా! కొవిడ్‌ 19‌కి లాక్‌డౌన్‌ అసలు పరిష్కారమే కాదు అని ఎంతో మేధోమథనం తరువాత ఓ కొత్త సత్యాన్ని కూడా జాతి ఎదుట ఆవిష్క రించారు రాహుల్‌. ‌కానీ ఆయన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌, ‌రాజస్తాన్‌ ‌కూడా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి మరి! పైగా మొదటిగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన రాష్ట్రాలు ఆ రెండేనట. కాబట్టి ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులంతా కూడా రాహుల్‌ ‌మాటంటే అట్టే ఖాతరు చేయడం లేదన్న మహోన్నత సత్యం వెల్లడి కావడం లేదా అంటున్నారు రవిశంకర్‌. ‌లాక్‌డౌన్‌ ‌తర్వాత లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నారు. కానీ ఏదీ ప్రయోజనం? ఎక్కడ? కేసులు పెరిగి పోతూనే ఉన్నాయి అని రాహుల్‌ ‌గారు చిరాకు పడుతున్నారు. తన నానమ్మ ఇందిర మాదిరిగా బాహ్య అత్యవసర పరిస్థితి ఉండగానే, అంతరం గిక అత్యవసర పరిస్థితి విధించినట్టు మోదీ ముందు చూపుతో డబ్లీ లాక్‌డౌన్‌ను రుద్దేస్తే బాగుండేదని రాహుల్‌ అం‌తరంగం కాబోలు.
సరే, లాక్‌డౌన్‌ ‌కాకుండా వైరస్‌ ‌కట్టడికి ప్రత్యామ్నాయం మరేదైనా ఉంటే దాని గురించి కేంద్ర ప్రభుత్వానికీ, పనిలో పనిగా వారి పార్టీ ముఖ్యమంత్రులకీ కూడా తెలియచేస్తే కృతజ్ఞులం అంటున్నారు రవిశంకర్‌. ‌రాహుల్‌ ‌గారూ! కొవిడ్‌ ‌వైరస్‌ 15 ‌దేశాలకి నిద్ర లేకుండా చేస్తోంది. ఆ దేశాలలో 142 కోట్ల మంది ఉన్నారు. అక్కడ ఈ వ్యాధికి బలైన వారు 3.43 లక్షలు. కానీ భారత్‌ 136 ‌కోట్ల జనాభాలో 4,345 మంది మాత్రమే మరణించారని కూడా గుర్తు చేశారు రవిశంకర్‌. ‌రాహుల్‌ ‌ముద్దు ముద్దు రాజకీయ ప్రలాపనలతో ఉద్ధవ్‌ ‌ఠాక్రే గారికి ఎక్కడో కాలుతున్నట్టే ఉంది. సంకీర్ణ భాగస్వాములతో సమావేశం కూడా పెట్టారు. ఇంతలోనే టీవీ తెరల మీద ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ విషాదాంతం’ అంటూ సంకీర్ణపు మరణయాతన బాపతు సంకేతాలతో స్క్రోలింగులు కూడా పాకేశాయి. ఏది జరిగినా బీజేపీకి అంటగట్టాలని చూస్తే చానళ్లు ‘మహారాష్ట్రలో ఆపరేషన్‌ ‌కమల్‌’ అం‌టూ రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తున్నాయి.
కొవిడ్‌ 19 ‌కేసులని లిప్తకాలంలో లక్షలాదిగా విరగపూయించిన సూపర్‌ ‌ప్ప్రెడర్లు ఉన్నాయి ప్రపంచంలో. మన దేశంలో మర్కజ్‌, ‌కొయంబేడ్‌ అలాంటివే. జనం గుర్తించడం లేదు కానీ, కొవిడ్‌ 19 ‌మీద మోదీ ప్రభుత్వ వైఖరి మీద దుష్ప్రచారం కోసం ఆ సమయంలోనే సూపర్‌ ‌ప్ప్రెడర్లు తయారవుతున్నాయి. అందులో వాద్రా కాంగ్రెస్‌ ఒకటి. అహమ్మదాబాద్‌ ‌ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ 19 ‌సోకిన వారి పట్ల వివక్ష చూపుతున్నారంటూ రాహుల్‌ ‌సహోదరి ఒక నకిలీ ట్వీట్‌ ‌వదిలి అపఖ్యాతి పాలయ్యారు. తరువాత ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికుల కోసమంటూ బొక్కి బస్సులు రంగంలోకి దింపి వెన్నుచూపిన వైనం మరొకటి. కేసులు పెరిగిపోతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తేయడం దారుణం అంటూ గుండెలు బాదుకున్నారు రాహుల్‌. అయితే వాస్తవం ఏమిటి? నాలుగో దశ లాక్‌డౌన్‌ ‌మే 31న ముగుస్తుంది. ఈ దశలో లాక్‌డౌన్‌ను అలా ఉంచి, కొన్ని సడలింపులు చేశారని మాత్రమే ఈ అమాయక జనానికి తెలుసు. మరొకసారి, అంటే ఐదోసారి లాక్‌డౌన్‌ ‌విధించాలన్న యోచనలో కేంద్రం ఉందన్న వార్తలు వెల్లువెత్తు తున్నాయి. కరోనా సూపర్‌ ‌ప్ప్రెడర్ల సంగతి డాక్టర్లు, పోలీసులూ చూసుకుంటారు. దుష్ప్రచార సూపర్‌ ‌ప్ప్రెడర్ల సంగతి దేశమే చూడాలి.

About Author

By editor

Twitter
YOUTUBE